[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]
[శరత్కాలం ప్రారంభవుతుంది. జగన్నాథునికి పనుల ఒత్తిడి ఎక్కువవుతుంది. ఎర్రకోట నిర్మాణం పర్యవేక్షించడం, దారా యోగవాశిష్ఠ అధ్యయనం, శాస్త్రి సంగీతాభ్యాసం, నాగేశునితో రసగంగాధర చర్చ అన్నీ ఆహ్లాదజనకంగానే సాగుతుంటాయి. పదిహేను రోజులు గడిచిపోతాయి. ఒకరోజు నాగేశుడు తానికి కాశీకి బయల్దేరుతానని అంటాడు. తొందరేముంది అని జగన్నాథుడు అడిగితే శృంగబేరపురం రాజస్థానంలో చేరవలసి ఉన్నదని, దానికన్నా ముందు గురువుగారిని దర్శించుకోడానికి వచ్చానని చెప్తాడు. నాగేశుడికి ఎర్రకోట, కొత్త నగర నిర్మాణాలని చూపించి పంపుతాడు జగన్నాథుడు. 1644 ఏప్రిల్ నెలలో ఒకరోజు పొద్దున్నే కబురు పెడతాడు దారా. తాను ఆగ్రా వెళ్ళి వచ్చినట్టు చెప్తాడు దారా. అక్కడ జహనారాకి అగ్నిప్రమాదం జరిగిందని, పాదుషా ఆమె సేవలోనే ఉన్నాడని చెప్తాడు. తనని పాదుషా అలహాబాద్ సుబేదార్‍ని నియమించాడని చెప్పి, ఆ వారంలోనే అక్కడికి వెళ్లాల్సి ఉందని చెప్తాడు. దారా పూర్తి చేయాల్సిన అనువాదాల గురించి మాట్లాడుకుంటారు గురుశిష్యులు. 1648 ఏప్రిల్ నెలలో ఎర్రకోట, షాజహాన్‌పుర నిర్మాణాలు పూర్తవుతాయి. షాజహాన్ గొప్ప సభ చేసి అందరినీ గౌరవిస్తాడు. దారా తను అనువదించిన భగవద్గీత నుండి శ్లోకాలు చదివి సభికులకు వినిపిస్తాడు. తరువాత దారా అలహాబాద్ వెళ్ళిపోతాడు. యుద్ధాలలోనూ, పరిపాలనలోనూ ఔరంగజేబుకి అవమానాలు జరుగుతాయి. తండ్రీకొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. షాజహాన్ అనారోగ్యానికి గురవుతాడు. పాదుషా కుమారుల మధ్య రాజ్యాధికారం కోసం యుద్ధం జరుగుతుంది. దారా ఓడిపోతాడు. ఔరంగజేబు షాజహాన్‍ని ఆగ్రా కోటలో బంధిస్తాడు. దారా పారిపోయి మాలిక్ జివాన్ ఆశ్రయం కోరగా, అతను మోసం చేసి దారాని ఔరంగజేబు సైన్యానికి పట్టిస్తాడు. తను పాదుషాగా పట్టాభిషిక్తుడైన కొన్ని నెలలకి ఔరంగజేబు దారాని దారుణంగా చంపిస్తాడు. జగన్నాథుని మనసు వికలమైపోతుంది. ఇక చదవండి.]
అధ్యాయం-3
[dropcap]పా[/dropcap]దుషాగా ఆరవ మొగలాయీ చక్రవర్తిగా తన పరిపాలన ప్రారంభించాడు ఔరంగజేబు.
ఏ విలాస జీవనం లేకుండా వ్యక్తిగత ఖర్చుకి కూడా ఖురాన్ వ్రాతప్రతుల్ని అమ్మి తన సొంత ఆదాయంతో జీవనం గడపసాగాడు. ఇస్లాం మత విలువలు, ఖురాన్ ఆరాధన, అతనికి నరనరాన జీర్ణించిన విశ్వాసాలూ, అవిశ్వాసాల ప్రాతిపదికగా ఆవిర్భవించిన విధానాలూ నిర్ణయాలూ.. ఇవే ఆయన దైనందిన చర్యల్నీ, పరిపాలన కార్యక్రమాల్ని నడిపించసాగాయి.
నెలలు కర్మసాక్షులై వెనక్కుపోతున్నై. షాజహాన్ పాలనని అనుభవించిన వారందరికీ ప్రస్తుత పాలనలో తేడాలు తెలిసి వస్తున్నాయి.
ఒకరోజు – కవి పండిత విద్వాంసుల్ని తన మందిరానికి పిలిపించాడు పాదుషా. జగన్నాథుడికీ పిలుపు వచ్చింది. దారా మరణ దుఃఖం నుంచీ ఇంకా కోలుకోలేదు. జగన్నాథుడు. అయినా పాదుషా ఆజ్ఞ!.. వెళ్లాడు.
చాలామంది కవులూ, పండితులూ చేరారు. పాదుషా గురువు ముల్లా సలేహ్ కూడా ఉన్నాడు. సంక్లిప్తంగా పరిచయాలు అయినై.
ఔరంగజేబు తన గురువు ముల్లా సలేహ్‍పై చాలా అభియోగాల్ని తీవ్రమైన పదజాలంతో చెప్పాడు. “మీరు నాకు ప్రపంచంలోని ఇతర దేశాల గురించీ, వారి బలాలూ బలహీనతల గురించీ, వారి యుద్ధ సామర్థ్యం వ్యూహాల పద్ధతుల గురించీ, ఏమి చెప్పారు? చరిత్ర అధ్యయనాన్ని చేశారా మీరు? లేదు. నాకేం చెబుతారు? ఇతర దేశాల మత విధానం, దాని వనరులు, ప్రభుత్వ రూపం వంటి విషయాల్ని బోధించారా? లేదు. అంతెందుకూ మన దేశంలో ఏఏ సంస్థానాలూ, రాజ్యాలూ ఏఏ రీతుల్లో పాలింపబడుతున్నాయో, తెలిపారా? లేదు. అక్కడి ప్రజల జీవన విధానం గురించి కొంచెమైనా తెలిపారూ? లేదు. భౌగోళిక శాస్త్రం తెలియని రాజు రాజ్యపాలనేం చేస్తాడు?” అని ఆగి తలవంచి, ఓరకంటితో పండితరాయల వంక చూస్తూ “ఏమి పండితరాయల వారూ చెప్పండి. మీ దారాకి మీరేం నేర్పారు? ఉపనిషత్తులూ, యోగవాశిష్ఠమూ, భగవద్గీతా? దేనికి అవన్నీ? వారు తమ కొత్త మతాన్ని కనిపెట్టుకోవటానికా? చివరికేం జరిగింది? సమూఘర్ చేరే సైన్యానికి ఆయన సరియైన పథనిర్దేశం చేయలేకపోయాడు. అక్కడే గదా మీరు గురుకులం పెట్టించింది?” అని ఆగాడు.
మందిరమంతా గాలి బిగదీసినట్లున్నది. కూర్చున్నవారు స్తంభీభూతులైనారు. జగన్నాథుడు నేలచూపులతో నిస్సహాయ శ్రోత అయినాడు. దుఃఖపు కన్నీళ్లని రెప్పల మాటున బిగబట్టాడు పండితరాయలు!
కొద్ది విరామం తర్వాత మళ్లీ అందుకున్నాడు పాదుషా, “పండిట్‌జీ.. మీరు చెప్పండి.. ఖురాన్‌లో నాలుగు పంక్తులు వచ్చా.. దారా వారికి, షాజహాన్ వారు కళాపోషకులు కావచ్చు. కానీ, వారు చేసిన సన్మానాలూ, సత్కారాల ఖర్చు ఎంత? – ఒక్కరి కోసం అందరి సొమ్మూనా; అందరి కోసం అందరి సొమ్మూనా? పాలకుడు ఏ విధానాన్ని అనుసరించాలి” అని “ఒక్కటే మాట. ఇకనుంచీ ఇవేమీ సాగనివ్వము. అయితే మా కారుణ్యం వలన మీకందరికీ ఒక హామీ ఇస్తున్నాము. మీకు జీవనభృతి ఇస్తున్నాము. లోటు చేయము. ఇక నుంచీ – భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యల్ని మీ శిష్యులకు బోధించటం ప్రారంభించండి” అంటూ దివాన్ రఘునాథరాయ్ వైపు చూశాడు. ఆయన అందరికీ సెలవు చెప్పాడు.
సమావేశం ముగిసింది.
జగన్నాథుడికి గుండె బరువెక్కింది. అడుగులు భారంగా పడుతున్నాయి. బయట శాస్త్రి ఎదురువచ్చాడు. తూలి నడుస్తున్న జగన్నాథుని చేయిపట్టుకుని శకటంలోకి ఎక్కించాడు. తానూ ఎక్కాడు. దీర్ఘంగా నిట్టూర్చాడు జగన్నాథుడు.
శకటం ఇంటిదారి పట్టింది.
అధ్యాయం-54
రాత్రి రెండవ జాము జరుగుతోంది.
శాస్త్రి ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా జగన్నాథుని గది చీకటిగా వుంది. వెళ్లాడు. అతని వెనగ్గా వచ్చింది సుభాషిణి. నడవాలోని దీపం తెచ్చి జగన్నాథుని గదిలో మలిగిన దీపాన్ని వెలిగించింది.
జగన్నాథుడు గది పైకప్పుని చూస్తూ పడుకుని ఉన్నాడు. కళ్ళు ఎఱ్ఱబడి విచ్చుకుని అగ్ని గోళాల్లా ఉన్నై. సుభాషిణి భర్తకి కనుసైగతో గోడవారనున్న ముక్కాలిపీటని చూపింది. వెళ్లి దానిమీదున్న పాత్ర మూత తీసాడు. రాత్రి ఆయన తినడానికి ఉంచిన పాల అటుకులు నానిపోయి అలాగే వున్నాయి.
భార్యాభర్త లిద్దరికీ మనసులో చాలా బాధనిపించింది.
జగన్నాథుడు మానసికంగా నిరీహలో ఉన్నాడు. ఈవేళ పాదుషా సమావేశం ఆయనకి ఒక ఆశనిపాతం. శాస్త్రికి తెలుసు – పాదుషా మాటలు గురువుగారికి శూలాల్లా గుచ్చుకున్నాయి!
సుభాషిణి పెదవి కదల్చబోయేటంతలో జగన్నాథుడే – నిశ్చేష్టతతోనే – “కన్ను మూసినా, తెరచినా – దారావారి శిరస్సే కనిపిస్తున్నది శాస్త్రీ” అన్నాడు. కళ్లల్లో నీరు చిప్పిల్లి స్వరం గద్గదికమైంది.
పాదుషా మాటలకంటే ఇదే అసలైన దుఃఖమన్నమాట!!
‘ఆ ఖండిత శిరస్సు ఛిద్రమై విచ్చాయ తిరిగిన మోము, రెప్పలకింది ఉప్పెన, తెగీతెగని మెడపై వ్రాలాడుతున్న హారాలూ, పగిలి చిద్రుపలైన పగ్రీ రూపు ఎలా మరపుకు వస్తుంది?’
గొంతు పెకల్చుకుని అన్నాడు శాస్త్రి, “అవును. దారుణాఖండల శస్త్రతుల్యమైన సంభవం. ఏ మానవ మాత్రుడికీ జరుగరాని ఘోరం – మన దారా వారికి జరగటం నిజంగా దుర్భరమూ, దుస్సహమే”
సుభాషిణికి కాళ్లు చల్లబడినై. శాస్త్రికి నిలువెల్లా చెమర్చింది.
“మీరు వెళ్లి పడుకోండి” అని గోడవైపు తిరిగాడు జగన్నాథుడు.
భార్యాభర్తలిద్దరూ మొహామొహాలు చూసుకుంటూ బయటికి కదిలారు.
– కళ్లు మూసుకున్న జగన్నాథుని మనోయవనిక మీద ఇప్పుడు ఔరంగజేబు పాదుషా రూపం ప్రత్యక్షమైంది. ఆయన మాటలు చెవుల్లో గింగురు మనసాగినై.
అయితే, తాను చదివిన చదువూ, శాస్త్రాలూ, సాహిత్యం, వేదవేదాంత తర్క మీమాంస వ్యాకరణాది వాఙ్మయం-సర్వమూ అర్థరహితమైనవేనా? తాను నేర్చుకున్న దాని సంగతి సరే, శిష్యులకు నేర్పినదీ వ్యర్థపదవ్యాయామ క్రియయేనా? ప్రశ్న భూతంలా నిలిచింది!!
పోనీ, దీన్నీ పక్కన పెడదాం. ఇన్ని శాస్త్రాలూ, సాహిత్యమూ చదివి, సిద్ధాంత ప్రవచనాలతో సరిపెట్టుకున్నాడా తాను? లేదే. పూనిన ప్రతి పనిలోనూ సామాజికత- సమన్యాయం, వసుధైక కుటుంబ భావనల్ని ఆచరణాత్మకంగా సంలీనం చేసి మరీ కర్మిష్టిగా అంతో ఇంతో పేరు తెచ్చుకున్నాడే! పేరు సంగతి సరే, ప్రజలంతా తన సలహాల్ని సానుకూల భావనతో స్వీకరించి, సమరస భావాన్ని అంగీకరించి పాటించారే! వీటన్నింటి సంగతి ఏమిటి? –
జగన్నాథుడికి గత సంభవాల దృశ్యా దృశ్య మాలిక కళ్ల ముందు ఆవిష్కృతమైంది. జంతుబలి మూఢాచారాన్ని నిరసించటం, ముస్లిం బాలునికి వేదాలు చెప్పటం, ముస్లిం యువతీ యువకులకు స్త్రీ స్వేచ్ఛా స్వావలంబనల ప్రాధాన్యతని బోధించటం, చివరికి ప్రయాణాలల్లో కూడా మతఘర్షణల్ని వారించటం – ఇవన్నీ అందరిముందూ క్షేత్ర స్థాయిలో జరిగినవే కదా! తన ప్రమేయంతో ఇవన్నీ అంతో యింతో సాంఘిక మార్పుకి అదనపు చేర్పులూ, కూర్పులేకదా?
– అయితే, ఇలా తన మనస్సాక్షి సముదాయింపు ఉందికదా అనీ, ఆత్మతృప్తి పొందాను కదా అనీ, ఇవ్వాళ ఔరంగజేబు వారి దూషణలూ తిరస్కారాలూ తనకు వర్తించవని దులపరించుకొని వారి కొలువులో కొనసాగవచ్చునా? ఇలా సమాధానపడటం, ఏ వ్యక్తిత్వానికి చిహ్నమౌతుంది? ఏ నైతిక విలువలకి తార్కాణమవుతుంది? కడకు ఇదంతా తన ఆత్మగౌరవ దాసోహానికి నిదర్శనం కాబోదూ? –
ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు దేహమంతా కంపించింది. మొహమంతా చెమటపట్టింది. పక్కకి మరలి మళ్లీ వెల్లకిలా పడుతున్నాడు. పై పంచెతో మొహం తుడుచుకున్నాడు. వలయాలు వలయాలుగా కిరణాల్లో ధూళికణాల్లా ప్రశ్నల పరంపరలు అనుభవించిన అన్ని భోగాలూ, అందుకున్న వైభవాలూ, పొందిన బిరుదులూ, సత్కారాలూ, సన్మానాలూ – అనర్హ సంపాదనేనా? అన్యాయార్జితమేనా? అయితే- ‘కోహం?’కి భౌతికంగా తెలిసిన సమాధానం ఏమైపోయినట్టు? పంచకోశ నిర్మితమైన స్థూల శరీరంలో ఆనందమయ కోశం సంగతేమిటి?
అన్నీ ప్రశ్నలే.. అన్నీ జవాబులేని ప్రశ్నలే! కాదు. అన్నిటికీ జవాబు -పాదుషా ప్రశ్నలే! అవును. కొన్ని ప్రశ్నలకు ప్రశ్నలే జవాబులుగా మొలుస్తాయి. ములుకులై గుండెల్లో గుచ్చుకుంటాయి.
ఉన్నట్టుండి ఆగ్రా కోట కనుల ముందుకొచ్చింది. అందులో షా బురుజు. అక్కడి నుంచీ విరిగిన బాణపు తుంపుల్లా షాజహాన్ దీనపు చూపులు తాజ్‍మహల్‍ని చూస్తున్నాయి. విధి క్రూరత్వమంతా ఆ చక్రవర్తి దీనముఖంపైన పొదివినట్లు దయనీయమైన దృశ్యం!
ఏ దేవునికో చేస్తున్న విన్నపాలు.. అదృశ్యంగా కీచురాళ్ల రొద జగన్నాథుని మేధ ఒక ఉన్మత్త స్థితిలో యోచనాయోచనల సంధిలో కొట్టుమిట్టాడసాగింది.
ఎప్పటికో కన్నుమీద రెప్పవాలింది.
***
ఉదయం లేచి దైవకార్యాలు పూర్తి చేసుకున్నాడు జగన్నాథుడు.
శాస్త్రి దంపతులకి ఆయన్ని పలకరించటానికి ధైర్యం చాలటంలేదు.
భవనం ముందు ఆవరణలో తిన్నెమీద కూర్చున్నాడు. చేతిలో ఏదో గ్రంథం, పక్కన వ్రాతసామగ్రి. తేనె నిమ్మరసం కలిపిన నీళ్ల లోటాని తెచ్చి ప్రక్కన నిలబడింది సుభాషిణి.
సన్నటి నవ్వు జగన్నాథుని పెదవులపై కదిలింది. సుభాషిణికి పరమానందమైంది. లోటాని అందుకున్నాడు. త్రాగి ఇచ్చాడు. ఆమె చకచకా నడుస్తూ లోపలికి క్షణాల్లో అక్కడికి చేరాడు శాస్త్రి. జగన్నాథునికి కొంచెం దూరంలో ఎదురుగా కూర్చున్నాడు.
“పరిస్థితులు తెలుస్తున్నై కదా శాస్త్రీ! మీరు తిరిగి కాశీకి వెళ్ళిపోతేనే మంచిది. త్వరగా నిర్ణయించుకోండి” అన్నాడు జగన్నాథుడు. శాస్త్రి ఆశ్చర్యపోలేదు కానీ, ఆయన వాడిన పదం ‘మీరు’ వలన మనసులో ప్రశ్నపరంపర ఏదో గునుస్తున్నది. చివరికి అడిగాడు. “మరి మీరు.. గురువుగారూ?”
“నా సంగతీ చెబుతాను..” అని ఆగి “మార్పు కూడా సహజీవికకు ఆవశ్యకమే. నాగరికతకి ప్రాణం వుంది..” అన్నాడు.
శాస్త్రి కేమీ అర్ధం కాలేదు. “అంటే స్థానచలనం గురించి చెబుతున్నారా గురువుగారు? అంటే తానూ కదులుతాననేనా..?”
జగన్నాథుడు గ్రంథాన్ని తెరిచి పఠనంలో పడ్డాడు. శాస్త్రి లోపలికి కదిలాడు.
– ఆ పగలంతా ఆలోచిస్తూనే ఉన్నాడు జగన్నాథుడు. ఢిల్లీలో ఉండే అవకాశమూ లేదు. అవసరమూ లేదు.
అప్రయత్నంగా శ్లోకం దుమికింది.
‘సముపాగతవతి దైవా, దవహేలాం కుటజ! మధుకరే మాగాః
మకరన్దతున్దిలానా, మరవిన్దానామయం మహామాన్యః’
(ఓ కుటజమా! కాలం చెడి తేనెటీగ నిన్నాశ్రయించింది కదా అని దాన్ని అవమానింపకు. మకరందంతో నిండిన అరవిందాలకు అది ఎప్పటికీ మహామాన్యమే!)
…జగత్‍సింహుడు మరణించాడు. ఆయన కుమారుడు రాజాసింగ్ ప్రస్తుత పాలకుడు. ఆయనా, జయసింహ మహారాజూ ఇద్దరూ స్ఫురణకు వచ్చారు. అంతలోనే సందేహమూ వచ్చింది. వారిరువురూ షాజహాన్‍కి కావలసినవారు. ఆ విధంగా ఔరంగజేబు – వారిని తనకు అమిత్రులుగానే చూస్తాడు. తాను పోయి వారిలో ఎవర్ని ఆశ్రయించినా-వైరివర్గంలోని వాడే అవుతాడు. అప్పుడు ఇక్కడున్న దానికంటే అధ్వాన్నస్థితిని ఎదుర్కోవాలి.
ఎప్పుడో చదరంగం ఆడే సమయంలో షాజహాన్ పాదుషావారు ప్రసక్తాను ప్రసక్తంగా ప్రాణనారాయణుని గురించి ప్రస్తావించారు. కామరూపం తలపుల్లోకి వచ్చింది. అదే తన భవిష్యత్తుకు మజిలీయా? బాగానే వుంటుందనిపించింది.
జగదాభరణం కావ్యాన్ని తీశాడు. దానిలో మార్పులూ, చేర్పులేవో చేసి, గ్రంథనామాన్ని ‘ప్రాణాభరణం’ అన్నాడు.
రాత్రికి – శాస్త్రి దంపతులతో తన ఆలోచనని పంచుకున్నాడు. వారిద్దరూ ఏమీ అనలేదు.
శాస్త్రి మనసు జగన్నాథుడికి తెలుసు. తామూ తనతో వస్తామని అడగవచ్చు. కానీ, దేశం కాని దేశంలోకి గురువుగారు ఒక్కడే ప్రవేశించాలని నిర్ణయించుకుంటే, ఆయనకు బరువుగా తామూ వెళ్లటం భావ్యంకాదని ఆలోచించే వివేకం ఉన్నవాడే శాస్త్రి. పైగా ఒకసారి గురువుగారు ఆలోచించి కాశీ వెళ్లండనే తన నిర్ణయాన్ని చెప్పిన తర్వాత మళ్లీ తానా విషయాన్ని ప్రస్తావించటం, బేరమాడటం పిల్లచేష్ట అవుతుందనీ అతనికి తెలుసు. జగన్నాథుడూ, శాస్త్రీ – ఇద్దరూ మౌనం వహించారు. సుభాషిణి – సరే – ‘ఛాయేవానుగతా.. సదా!’ బాపతు!
ఎవరికి వారు తమ తమ శయ్యలకు చేరారు.
నిద్ర పట్టించుకోవాలనే ప్రయత్నం ఫలించలేదు జగన్నాథుడికి. మంచం మీద పొర్లటమే మిగిలింది. బుర్ర అనేక రకాల ద్వంద్వాల మధ్య గిరికీలు కొడుతోంది. కామరూప దేశం. ప్రాణనారాయణుని ప్రాపుకోరటం. షాజహాన్ పేరు ఆ పాలకుని ముందు తనకు ఆపన్న ప్రసన్న హస్తం కావచ్చు. కానీ – వెన్ను జలదరించింది.
‘ఢిల్లీశ్వరోవా..!’ అంతటి దీమసాన్నీ పాతరేయటమేనా? ఆ స్పృహే జగన్నాథుని నిలువెల్లా కంపింపజేసింది. ‘ఆకాశంబున నుండి..’ గంగావతరణం దృశ్యం కళ్లకు కట్టింది!
ఎక్కడో దూరంగా తీతువు కూసింది. లేచి పడక మధ్యగా కూర్చున్నాడు. పక్కన ముక్కాలి పీట మీద నీళ్లు తీసుకుని తాగాడు.
తలగడ పక్కగా ‘ప్రాణాభరణం’ కనిపించింది. చేతిలోకి తీసుకున్నాడు.
పేరే వెక్కిరించింది. ఏమిటి తాను చేసింది? ఏమిటి తాను చేయబూనింది? ‘రసగంగాధరం’ మొదట్లో చేసిన బాస ఏమిటి? మరి ఇప్పుడు పూనుకున్న ఈ చర్య ‘కక్కుర్తి’ కాదూ? తాను ఎంగిలి చేసిన పదాలు కాదూ ఈ గ్రంథంలో కూరినవి? ఇది దిగజారుడు తనం కాదూ?
‘ఎందుకూ-మనసు వంకరగీతలు గీస్తోంది? ఎందుకూ బుద్ధి ఇంకా ఏవో భూములేలాలను కుంటున్నది? దేనికోసం? ఎవరికోసం? రేపోమాపో కాబోయే ఊపిరిలేని కట్టెకోసమా?
హఠాత్తుగా భగవానువాచ ‘అక్షర’ ప్రబోధనం పెదవులపై జాలువారింది. ‘అనన్యాశ్చింతయంతోమా’… ఆ వెంటనే ‘ధర్మోరక్షతి రక్షితః’ చెవుల్లో కువకువలాడింది. ‘సకల శాస్త్ర నిగమాగమసారం’ ఏదో దీపకళికలా కనులముందు నిలబడింది.
గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఒక్కసారిగా మనసునంతా వింత హాయి కమ్ముకుంది. ఉత్సాహం విద్యుత్ ప్రసారమై దేహాన్ని తేలిక పరచింది. గ్రంథాన్ని పక్కన పడేసి ఠక్కున లేచి గబగబా ఆవరణలోకి వచ్చేశాడు.
చల్లగాలి వీచింది. కర్తవ్య స్పృహలో ఇంతటి మహత్వం ఉన్నదా అనిపించింది. చిరునవ్వు విరిసింది.
‘శ్రీ విశ్వనాథ సం సేవితాంత రంగము
గంగా తరంగమై కదలె, కావ్య శ్రీకారమై చెలగె’
-ఎన్నడో ‘గంగాలహరి’కి ఓంకారం పెట్టినప్పుడు ముందుగా అనుకున్న గీతపంక్తి.
ఆనందంతో చుట్టూ చూశాడు.. ఎటు చూసినా ఇప్పుడు కాశీ గంగా తీర ప్రభాతరేఖలే గోచరిస్తున్నాయి!
తల విదిలించుకున్నాడు. పక్కన నిలిచి వున్నాడు శాస్త్రి!
“మనం కాశీ వెళ్దాం శాస్త్రీ” అన్నాడు. అతనూ చిరునవ్వుతో తల వూపాడు!
(ముగింపు వచ్చే వారం)