[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]
[జగన్నాథుని దక్షిణదేశ పర్యటన ప్రారంభమైంది. ముందుగా విజయవాటికలో కృష్ణానదీలో స్నానం చేసి – కనకదుర్గ అమ్మవారిని, మల్లికార్జున స్వామిని దర్శించుకుంటాడు. నగరం మధ్యగా వున్న బౌద్ధగుహల్ని సందర్శించాడు. ఉండవిల్లి గుహలనూ చూస్తాడు. నాలుగు రోజులు అక్కడ ఉండి ఎందరో కవిపండితులను కలుస్తాడు. అక్కడ్నించి అమరావతి వెళ్తాడు. అక్కడ నదిలో ప్రమాదంలో చిక్కుకున్న ఓ యువకుడిని కాపాడుతాడు. అతని పేరు రంగనాథ మిశ్రా అని, కాశీక్షేత్రం వాడని తెలుస్తుది. రాజేశ్వరశర్మ అనే వారి ఇంట బస చేసి – రంగనాథ మిశ్రా ద్వారా కాశీ వివరాలు తెలుసుకుంటాడు. అక్కడ్నించి బయల్దేరి గర్తపురి మీదుగా విక్రమసింహపురి చేరి స్థానిక రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకుంటాడు. తరువాత వెలుగోటి రాయుడప్పనాయని గారి పాలనలో ఉన్న వెంకటగిరి సంస్థానానికి వెళ్తాడు. ప్రభువుల దర్శనం అయ్యాకా, ఆయన ఆజ్ఞ మేరకు కొత్తిమీరపై ఓ అద్భుతమైన శ్లోకం చెప్తాడు. అభినందనలు పొందుతాడు. అనంతరం తిరుపతి చేరి తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తాడు. ఆపై తిరుపతిలో గోవిందరాజస్వామి, అలమేలు మంగాదేవి, సీతారామస్వామి ఆలయాలను దర్శించుకుంటాడు. చంద్రగిరి చేరి రామదేవరాయల ప్రభువును సందర్శిస్తాడు. అక్కడ పండితులు అసూయ ప్రదర్శిస్తారు. అక్కడ్నించి తంజావూరు చేరుతాడు జగన్నాథుడు. అక్కడ ఖ్యాతి గాంచిన అప్పయ్య దీక్షితుల వారి తమ్ముడు ఆచార్య దీక్షితుల వారి ప్రసంగానికి అడ్డు తగిలి – ధర్మం చెబుతాడు. స్థానిక పండితులు కొందరు హేళన చేస్తారు. మహారాజు రఘునాథ నాయకుని దర్శనం లభించదు. కొన్నాళ్ళు చూసి ముంగండకు తిరుగు ప్రయాణమైనాడు జగన్నాథుడు. ఇక చదవండి.]
అధ్యాయం-4
[dropcap]ముం[/dropcap]గండకు తిరిగి వచ్చాడు జగన్నాథుడు.
జరిగిన వృత్తాంతాలన్నిటినీ తల్లిదండ్రులతోనూ, తమ్మునితోనూ పంచుకున్నాడు. గ్రాయకం తెలుస్తున్నది కొడుక్కి. వింటూ ఉన్నాడు.
దక్షిణాపథంలో తాను ఆశించిన స్థాయిలో గౌరవాదరాలు దక్కలేదనే నిరుత్సాహ స్వనాన్ని జగన్నాథుని మాటల్లో పనిగట్టాడు పేరుభట్టు.
పనిపాటల్లో వున్నా పతిధ్యాసలోనే వున్నది కామేశ్వరి మనసు.
ఆ రాత్రి – పడకటింట్లో – “జరిగింది మీరెలా చెప్పినా సరే గానీ, జగన్నాథస్వామి జగన్నాథస్వామే” అంటూ గర్వంగా భర్తవైపు చూసింది కామేశ్వరి.
ఆ వెంటనే మరో మాటా అన్నది. “ఏనుగులు తుమ్మెదల్ని తరిమేస్తే వాటి శోభే వెలవెలబోతుంది. తుమ్మెదల్ని నెత్తిమీద పెట్టుకునే పద్మవనాలు వుండనే వుంటై” భార్య మాటలకు ఆశ్చర్యపోయాడు జగన్నాథుడు.
కామేశ్వరిలోని భావుకతకీ, ప్రతిభా స్వరానికి ముగ్ధుడయ్యాడు. పట్టరాని సంతోషంతో ఆమె భావానికి “దానార్థినో మధుకరా యది కరతాళై..” అని శ్లోకరూపాన్నిచ్చాడు.
అభినందనీయంగా, తమకంగా భర్తని అల్లుకుంది లతాతన్వి!
***
తెల్లవారింది.
‘శుభమస్తు’ని పునర్వచిస్తున్నదా అన్నట్టు ప్రకృతి కొత్త రంగుని అద్దుకుంటోంది.
పేరుభట్టు జగన్నాథుని కూర్చోబెట్టుకుని చెప్పసాగేడు.
“నువ్వు దక్షిణ దేశానికి పోవటానికి ముందుకూడా ఒకమాట చెప్పాను గుర్తుందా! మన ఊరి పరిస్థితి బాగాలేదు. మనుషుల్లో చాలా అవాంఛనీయమైన పోకడలు తలెత్తుతున్నై. నువ్విక్కడ ఉండగానే ఖండవిల్లి వారమ్మాయిని పరిటివారి అబ్బాయి తన స్నేహితులతో అల్లరిపెట్టాడు. ఆ తర్వాత యాళ్ళ వారి తాలూకు వాళ్ళు మన ఉపద్రష్ట శేఖరం గారి పిల్లని గేలిచేశారు. అటు ఖండవిల్లివారూ ఇటు ఉపద్రష్టవారూ కలిసి రాజమహేంద్రిలో రుస్తుంఖాన్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ జరుగుతోంది” అని ఆగి,
క్షణం తర్వాత “ఇంతకీ నా మనసులో మాట చెప్తాను. ఇక్కడ వుండి నువ్వీ లంపటాన్ని పట్టించుకోకుండా వుండలేవు. పట్టించుకుంటే నీ మేధ, పాండిత్యధిషణ, ధీశక్తీ-అన్నీ నిరర్థకమైపోతాయి. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను”.
కొద్ది సేపు మౌనం వహించాడు పేరుభట్టు. ఆలోచనల సుడిలో జగన్నాథుడుండిపోయాడు.
కొంత తడవు తర్వాత మళ్ళీ మొదలెట్టాడాయన. “జగన్నాథా! భారతీయ ఆత్మ అంతా కాశీలోనూ, కాశీ చుట్టూ తిరుగుతుంది. ఆధ్యాత్మిక, సాహిత్య కళా వైజ్ఞానిక విషయాలన్నిటా జిజ్ఞాసువులకు అది తుదిమెట్టు. అక్కడ మనకు ఆత్మీయులు చాలామంది వున్నారు. అందులో మా గురువుగారు శేష శ్రీకృష్ణుల వారి కుమారుడు శేషవీరేశ్వరుడు నా సహాధ్యాయి. నా ప్రియతమ నేస్తం. తమ్ముని వంటివాడు. ఇంతా కవీంద్రాచార్య సరస్వతి, రాయముకుందుడు వంటివారు నీకు అండగా వుంటారు. నీ ప్రతిభ రాణించటానికి తగిన ప్రదేశం అది. కోడల్నీ, మాధవునీ తీసుకుని కాశీకి బయలుదేరు”.
తలెత్తి తండ్రివైపు చూశాడు జగన్నాథుడు. ఆ తర్వాత పక్కకి చూపు మరల్చాడు. తమ్ముడూ, మంచి నిర్ణయమంటూ సంతోషించాడు. తల్లినీ గమనించాడు. ఆమె వదనంలో కొడుకు అంత దూరం వెళ్తున్నందుకు ఒకింత దిగులు, రాణించే అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నందుకు ఆశతో కూడిన సంతోషం-ద్వైదీభావనలు గోచరించాయి జగన్నాథుడికి. మాధవుడు ముభావంగా ఉండిపోయాడు.
కామేశ్వరి మనసు అవ్యక్తమాధుర్యంతో మురిసిపోయింది. ఆమె చిరునవ్వుతో ముఖంలో, చూపుల మెరుపులో భావి సౌభాగ్యాన్ని చదువుకున్నాడు జగన్నాథుడు.
తీరా జగన్నాథ దంపతుల కాశీ ప్రయాణం రేపనగా, ఈవేళ మధ్యాహ్నం తాను తల్లిదండ్రులతో వెళ్లనని తేల్చి చెప్పేశాడు మాధవ.
ఇంటిల్లిపాదీ ఆశ్చర్యపోయారు. అందరూ – ఆరు ప్రశ్నలూ, అరవై హితోక్తులుగా నచ్చజెప్పారు.
మాధవది ఒకటేమాట, “ఇంకా పంచకావ్యాల్లో రెండు కాలేదు. వేదం పనస సంగతి సరేసరి. వ్యాకరణ సూత్రాలు వస్తే చాలా? వ్యాఖ్యానం తెలియదూ, ఇంతా మీమాంస ‘ఓం’ అనలేదు. తాతగారు నాన్నగారి మహాగురువు. కనుక నేను ఇక్కడేవుండి వారిదగ్గరే చదువుకుంటాను” అని.
చాలా తర్జన భర్జనల మీదట పేరుభట్టు అన్నాడు, “సరే ఉండనీయండి, మాకూ చేతికింద పిల్లవాడుంటాడు. కానీయండి”.
మహాలక్ష్మమ్మ “ఆయన సంగతేమోనీ, నాకు ఏ బెంగా లేకుండా వుంటుంది” అన్నది.
రామచంద్రుడేమో, “ఉండనీ అన్నయ్యా, నా బ్రాహ్మణ వ్యవసాయంలో కలుపుతీస్తూ వుంటాడు” అన్నాడు. అందరూ నవ్వుకున్నారు.
మాధవని వదిలి జగన్నాథుడూ, కామేశ్వరీ కాశీ ప్రయాణమైనారు.
అధ్యాయం-5
జగన్నాథ, కామేశ్వరీ దంపతులు కాశీ చేరుకున్నారు. శేషవీరేశ్వరుడు ఆదర స్వాగతం పలికి, తన ఇంట్లోనే వసతినిచ్చాడు.
శేషవీరేశ్వరుని భార్య పర్వతవర్థని. కామేశ్వరికి ఆమె అత్త అయిపోయింది. “అత్తయ్యా!’ అంటూ పర్వతవర్థనిని చుట్టుకు చుట్టుకు తిరుగుతుంది. పనిపాటల్లో చేదోడువాదోడు అయింది.
పనులు చేసుకుంటూనే కామేశ్వరిని గమనిస్తూ(నే) వుందావిడ. సామాన్య గృహిణి గానే వున్నా మాటల్లో మార్దవం, చూపులో చురుకుతనం, నడవడిలో మర్యాదా, స్వభావ సిద్ధంగా వ్యక్తమవుతున్న ఆత్మీయతా – నిండుగా, నిష్కల్మషంగా వున్న కామేశ్వరిని ఎంతో ఆప్యాయంగా కన్నబిడ్డలా భావించింది.
శేషవీరేశ్వరుని ఆనందానికి అవధిలేదు. తన తండ్రి శిష్యుని కొడుకు ఇతడు. తన తెలుగువాడు. ఇప్పుడు ఇద్దరూ ప్రవాసాంధ్రులు. దేశంకాని దేశంలో తనకు మరో పట్టుకొమ్మ దొరికింది. అంతేకాదు, జగన్నాథుడు పుంభావ సరస్వతిగా వెలిగిపోతున్నాడు. అతని ప్రతిభ దుర్నిరీక్ష్యంగా వుంది. స్ఫురద్రూపి కూడా అవటంతో ఆ వదనంలోని తేజస్సు అందరినీ ఆకట్టుకుంటోంది. వీటన్నిటితో శేషవీరేశ్వరునికి అదనపు బలం అంది వచ్చినట్లయింది. ఇప్పుడతనికి అభిమానం అనేకంటే ఆరాధనా భావమే మిన్న అయినదనటం సముచితంగా వుంటుంది.
జగన్నాథుడు మహాభాష్యంలో దిట్టగా తయారైనాడు. ఆశువు అంటే నల్లేరుమీది బండి నడకలా వున్నది. తండ్రి శిష్యరికంలో సాధించుకున్న వేదాంత విద్య, న్యాయవైశేషిక దర్శన పటిమ ఉండనే ఉన్నాయి. మీమాంసని నిష్యంద సుధగా గ్రోలి తేజోవంతుడైనాడు. ఇక శేషవీరేశ్వరుడంటే జగన్నాథుడికి కూడా అంతకంత గౌరవం, భక్తీ. బాబాయి వరస కుదిరింది. ఆయన్ని గుర్తించి చెప్పేటప్పుడల్లా ‘అస్మత్ గురు పండిత వీరేశ్వరాణాం’ అనే ప్రశంసిస్తున్నాడు.
వీరేశ్వరుడు జగన్నాథుడికి అప్పటికే కాశీ గురించి చాలా వివరాలు చెప్పేశాడు.
***
సాయంత్రం సమయం నాలుగ్గంటలు దాటింది.
వ్యాకరణ పాఠం జరుగుతోంది.
శేషవీరేశ్వరుని తండ్రి శేషశ్రీ కృష్ణులవారి ‘ప్రక్రియాకౌముది’లోని సూత్రాల్ని చర్చిస్తున్నారు. శేష శ్రీకృష్ణులు – జగన్నాథుడి తండ్రి పేరుభట్టుకి గురువులు కదా!
ప్రసక్తానుప్రసక్తంగా భట్టోజీ పేరు వచ్చింది. భట్టోజీ కూడా శేష శ్రీకృష్ణుల వారి శిష్యుడే. పేరుభట్టు సహాధ్యాయి.
ఆయన గురించి చెప్తూ, “ప్రస్తుతం ఆయన దక్షిణ దేశం వెళ్ళాడు. అప్పయ్య దీక్షితుల వారి శిష్యరికం కూడా చేశాడు.. భట్టోజీ గొప్ప వైయాకరణుడు. సిద్ధాంతకౌముదిని వ్రాసి అనన్యమైన ఖ్యాతిని పొందాడు. శబ్దరూప నిష్పత్తికి సూత్రక్రమాన్ని మార్చి చూపినవాడు” అని వివరించాడు శేష వీరేశ్వరుడు.
‘ప్రక్రియా కౌముది’ని ఖండిస్తూ భట్టోజీ రాసిన ‘ప్రౌఢ మనోరమ’ గ్రంథం గురించి చెప్పాడు శేషవీరేశ్వరుడు.
“అదేమిటీ? గురువుగారి మీద తిరుగుబాటా?” అని విస్తుపోయాడు జగన్నాథుడు.
“అంతే అనుకో. ఆయన ఔద్ధత్యం వెనుక అప్పయ్య దీక్షితుల వారి దన్ను ఉన్నది మరి. భట్టోజీ అంటే దీక్షితుల వారి ‘అద్వైత వేదాంతసారం’ని పానకంలా సేవించిన వాడు. అందుకనే ‘అద్వైత తత్త్వ కౌస్తుభం’నీ రచించాడు. ఉన్న చిక్కల్లా ఎంతటి పండితుడో అంతటి స్వోత్కర్షా, అహంభావమూ. ఎదుటి వాడంటే అమిత చులకన భావం. అందునా మనమంటే అసలు పడదు. ఆ వెక్కిరింపులూ, ఎత్తిపొడుపులూ.. ఎలాగో భరించుకొస్తున్నాం” అని నిర్వేదంతో మాట్లాడాడు.
వెనుకటి పరిస్థితుల ఊహ కనుల ముందు మెదిలింది. కాశీలోని పండితుల్లోనూ, కవి, సాహితీపరుల్లోనూ ఒక అభిప్రాయం పాతుకుపోయి ఉన్నది. దాక్షిణాత్యులంతా-ముఖ్యంగా ఆంధ్రులు తక్కువ వారనీ, మహారాష్ట్రులంతా చక్రవర్తి వైభోగపాలితులనీ, ఇక వంగ దేశీయులంతా సింహాలనీ-ఒక విధమైన నిరసన ప్రల్లదాలూ, మూఢత్వ భావాలూ పర్యాప్తమై వున్నాయి. మనసు మల్లడిగొన్నది. అయితే, ఆలోచనలు మాత్రం ముందుకు ఉరికినై. “అహఁ.. అట్లాగయితే కాశీలో ఈర్యా, అసూయల నీడలు చాలా దట్టంగానే అలముకొని ఉన్నాయన్నమాట. సరే.. ఆయన్ని రానీయండి చూద్దాం” అని మౌనం వహించాడు.
సరిగ్గా ఇప్పుడు వచ్చాడు-శంకరశాస్త్రి. జగన్నాథుడి సంగీత శిష్యుడు. వస్తూనే లోకాభిరామాయణం మొదలెట్టాడు.
మాటల మధ్యలో అసలైన వార్తని వదిలాడు. “కటకం నుంచీ ఎవరో సహదేవభట్టుట వచ్చాడు. రేపు విద్యాలయం ప్రాంగణంలో ‘మీమాంస’ మీద మన కాశీవాసులతో తలపడతాడట”అని సన్నగా నవ్వి గురువుగారి వైపు చూశాడు. జగన్నాథుడి పెదవులపైనా చిరునవ్వు మెరుస్తుంటే అటే చూస్తూండిపోయాడు శంకరశాస్త్రి.
“నవారయామో భవతీ విశంతీం/వర్షానది!” శ్లోకం చెప్పి “రేపు నేను వచ్చినా గురువాక్యంగా ఆ వచ్చి నాయనకి దీన్ని నువ్వే చెప్పు” అన్నాడు జగన్నాథుడు.
“ఈ వరస బాగుంది” అని తలూపాడు శేషవీరేశ్వరుడు. “నీ అన్యాపదేశ కవితా ఫణితికి ఇది ఆరంభం. అంతేకాదు. ఈ కవితాకళ ఇలాగే నీ ప్రత్యేకతగా వర్ధిల్లుగాక!” అని మెచ్చుకుంటూ ఆశీర్వదించాడు. “తథాస్తు” అన్నాడు పక్కనున్న శంకరశాస్త్రి. ‘గంగలో దూకాలని ఉబలాట పడకే కొండవాగూ!’ అని భావాన్ని మననం చేసుకుని నవ్వుకున్నాడు శాస్త్రి.
“బాగా పొద్దుపోయింది. పాఠం అయిందా లేదా?” అంటూ లోపలినుంచీ పర్వతవర్థని పిలుపు వినిపించింది.
(సశేషం)