జగన్నాథ పండితరాయలు-5

10
1

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[ముంగండకు తిరిగి వస్తాడు జగన్నాథుడు. జరిగిన వివరాలను కుటుంబసభ్యులకు తెలుపుతాడు. కొడుకులోని నిరుత్సాహాన్ని పేరుభట్టు గమనిస్తాడు. ఆ రాత్రి పడకటింట కామేశ్వరి మాత్రం భర్తను పొగుడుతుంది, ఒక చక్కని శ్లోకం చెబుతుంది. మర్నాడు తండ్రి జగన్నాథునితో ముచ్చటిస్తూ మనుషుల్లో తలెత్తుతున్న అవాంఛనీయ పోకడలను ప్రస్తావిస్తాడు. ఇక్కడే ఉంటే జగన్నాథుని పాండిత్యం వ్యర్థమైపోతుందని, భార్యా పిల్లలతో కాశీకి వెళ్ళమని, అక్కడ తన గురువుగారి కుమారుడు ఆశ్రయం ఇస్తాడని అంటాడు. కుటుంబ సభ్యులందరి ఉద్దేశం అదేనని గ్రహించిన జగన్నాథుడు సరేనంటాడు. అయితే మాధవుడు మాత్రం కాశీకి రానని, తాతగారి వద్దే ఉంటూ చదువు కొనసాగిస్తానని అంటాడు. జగన్నాథ, కామేశ్వరీ దంపతులు కాశీ చేరుకుంటారు. అక్కడ శేషవీరేశ్వరుడు ఆదర స్వాగతం పలికి, తన ఇంట్లోనే వసతినిస్తాడు. జగన్నాథుడు తన విద్యా వినమ్రతలలోనూ, కామేశ్వరి తన ప్రవర్తనతోనూ వారిని ఆకట్టుకుంటారు. కాశీలో జగన్నాథుడు శేషవీరేశ్వరుడు వద్ద అధ్యయనం కొనసాగిస్తూ పండిత సభలలో పాల్గొనడం ప్రారంభిస్తాడు. ఒకరోజు కటకం నుంచి వచ్చిన సహదేవభట్టు అనే పండితుడు కాశీవాసులతో తలపడతాడనే వార్త అందుతుంది.  ఇక చదవండి.]

అధ్యాయం-6

[dropcap]స[/dropcap]హదేవభట్టు సభ మొదలైంది. కవి, పండితవర్యులు చేరారక్కడికి. శంకరశాస్త్రి కూడా తన గురువులతో వచ్చి చేరాడు. పూర్వమీమాంసనీ, ఉత్తర మీమాంసనీ కలగాపులగం చేసి మాట్లాడుతున్నాడు సహదేవభట్టు.. స్పష్టత లేదు – విన్నాడు జగన్నాథుడు.

కొందరు పక్కకు జరిగిపోవడంతో శంకర శాస్త్రి అక్కడికి జరిగి కూర్చున్నాడు. జగన్నాథుడు సైగ చేశాడు. శంకరశాస్త్రి జగన్నాథుడు చెప్పమన్న శ్లోకాన్ని చెప్పాడు.

“‘అథాతోధర్మ జిజ్ఞాస’తో మొదలు పెట్టక్కర్లేదు స్వామీ. కర్మజ్ఞానాల్లో జ్ఞానంకే పెద్ద పీట” అని జ్ఞానప్రాధాన్యాన్ని నాలుగు మాటల్లో చెప్పి చివరికి ‘ఆత్మానమేవలోకముపానీత’ అని దాన్ని విశదం చేశాడు.

సహదేవభట్టు ముఖం నల్లబారింది.

వెనక్కి జరిగినవారు హర్షాన్ని వ్యక్తం చేశారు. కొందరు చప్పట్లు చరిచారు. కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కోపం వచ్చిన సహదేవభట్టు విసవిసా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. నవ్వుల మధ్య సభ ముగిసింది.

***

కవి పండిత సభలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రతి సభలోనూ-నిప్పు కణికలా వెలిగిపోతున్నాడు జగన్నాథుడు.

చాలా సందర్భాల్లో అతనితో వాదించటానికి ఇతర పండితులకు దమ్ము చాలటం లేదు. అటు సాంఘిక ధర్మాలవంటి వివరణల్లోనూ, ఇటు వేదశాస్త్రాల చర్చల్లోనూ, విజ్ఞాన విషయాల్లోనూ, జగన్నాథుడిదే పైచేయిగా వుంది.

జగన్నాథుడు శేషవీరేశ్వరుని గురించి చెబుతూ – పదేపదే – ‘అఖిలశాస్త్ర మహార్ణవమందాచలమాన మానసానాం అస్మద్గురు పండిత వీరేశ్వరాణాం..’ అనీ ఉగ్గడిస్తున్నాడు. ‘శేషం వీరేశ్వరుల గురించి చెప్పేదేముంది. ఎటూ వ్యాకరణ నిధులు వారు’ అని ముక్తాయింపు!

జగన్నాథుని మాటలకు శేషవీరేశ్వరుని కన్నులలో సంతోషంతో కూడిన మెరుపులు తొంగిచూశాయి. జగన్నాథుని చూస్తుంటే ఆయనకు చాలా ముచ్చటగా వుంది. అతను మాట్లాడే పద్ధతి అంతా వినసొంపుగా వుండి ఆలోచింపజేసేదిగా వుంది. అందుకే చాలామంది సభా కార్యక్రమాల్ని ఆనందిస్తున్నారు.

కానీ, మహారాష్ట్ర పండితులు ఉడికిపోతున్నారు. లోలోపల కుళ్లుకుంటున్నారు. కారణం, వారికి నాయకత్వం వహిస్తున్న భట్టోజీ దీక్షితులు ప్రస్తుతం కాశీలో లేకపోవడంతో వారి నిస్సహాయత ఇంకా ఇంకా బహిర్గతమవుతోంది.

ఆ వేళ – సంకట మోచన హనుమాన్ ఆలయానికి అలతిదూరంలో ఉన్న భవనంలో కవిపండితుల ఇష్టగోష్ఠి.

పరిచయ ప్రస్తావనలు అయిన తర్వాత ఎవరో జగన్నాథుని కవిత్వం వినాలని వుందన్నారు.

“ఆయన గారి కవిత్వాలూ, కాకరకాయలూ అఖ్ఖర్లేదు. చర్చనీయమైన శాస్త్రాంశాన్ని ప్రారంభించండి” మరో ప్రక్క నుండి ఎవరో విరసంగా అరిచారు.

వీరేశ్వరుడు జగన్నాథునివైపు చూశాడు. చిరునవ్వుతో తలపంకించి ఊరుకున్నాడు జగన్నాథుడు.

“తనకు మాలిన ధర్మాన్ని మొదలు చెడ్డ బేరంతో సమం అంటుంది ఒక నీతి. అధర్మాన్ని ఖండించకపోతే నీవూ దండనకు అర్హుడవు, నీతో చేటు అంటుంది వేరొక నీతి. అన్నీ వ్యత్యస్తాలూ, విపర్యయాలూ” అని విషయ ప్రస్తావన చేసింది ఒక విదుషీమణి.

అందరూ ఆమె వైపు చూశారు.

చర్చ మొదలయింది. పురాణేతి హాసాలూ, ఉపనిషత్తులూ ఆధారంగా ఒకొక్కరూ ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తూ వచ్చారు.

చివరికి ఎవరో శేషం వారిని మాట్లాడమన్నారు. కొన్ని ముఖాలు భంగిమలు మార్చుకుని ముడుచుకున్నై..

శేషవీరేశ్వరుడు నలుగురినీ చూస్తూ, ‘ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బృంహయేత్’ అని అభియుక్తోక్తి కదా! వాటి సమన్వయం కావాలి. ‘తత్తు సమన్వయాత్’ అని బాదరాయణ బ్రహ్మసూత్రము. అటువంటి సమన్వయాన్ని మా జగన్నాథుడు చేస్తాడు” అంటూ అతనివైపు చూశాడు.

కొన్ని గళాలు “అవును.. అవును” అన్నాయి. కొందరి నొసలు అయిష్టంతో ముడుచుకున్నాయి. ఇంకొందరు ‘వద్దు బాబో’ అన్న భావాన్ని భంగిమల్లో వ్యక్తం చేశారు.

అవన్నీ తనకు సంబంధించవన్నట్టుగా మొదలుపెట్టాడు జగన్నాథుడు.

“ధర్మం స్మృతికి కూడా అందని న్యాయ ప్రస్థానప్రక్రియ. సామాజిక జీవన నిర్మాణానికి అది వెన్నెముక. స్థల కాల ఘటనల ఆధారంగా అది ఎప్పటికప్పుడు క్రమతనీ, సమతనీ, అవిచ్ఛిన్నతనీ నెలకొల్పుకుంటూ రూపొండుతుంది. ప్రవర్ధిల్లుతుంది. లోకధారణకు ఆధారమౌతుంది.” కొంచెం ఆగాడు. “చెప్పండి..” అన్నారు. కొందరు. నొసలు చిట్లించిన వారు కూడా తమకు తెలియకుండానే వింటున్నారు.

“నిజానికి ధర్మం వ్యక్తి స్వాతంత్ర్యాన్నీ, సార్వజనీనమైన సహేతుక నియమాల్నీ నియంత్రిస్తుంది.”

“మరింతగా వివరించండి” అన్నది మొదలు పెట్టిన విదుషీమణి.

జగన్నాథుడు ఇలా చెప్పుకొచ్చాడు. “ధర్మం రూపాన్ని కూర్చుకుని ప్రవర్తిల్లే విధానం మనకందరికీ తెలుసు. మొదటగా వేదం ‘ఇదం కురు. ఇదం మాకార్షీ’ – ‘ఇది చేయుము, ఇది చేయకుము’ – అని విధి, నిషేధాల్ని తెలుపుతుంది. ఇది ఆదేశం. ఇక బ్రహ్మసూత్రాదులు కొన్ని ధర్మాల్ని తెలుపుతాయి. ఇది నిర్దేశం. తరువాత పురాణేతి హాసములు వేదోప బృంహణ మొనర్చి కొన్ని ధర్మాల్ని తెలుపుతాయి. ఇది సందేశము. చివరివి కావ్యాలు. వేదసూత్ర పురాణేతి హాసాలు చెప్పిన అర్థాలనే ఇవి రమ్యంగా చెబుతాయి. కనుక ఇది ఉపదేశము. ఆ ఉపదేశము కాంతాసమ్మితంగా ఉండాలనేది ఒక అంగీకృతి.”

ఇది విని ఆ విదుషీమణి తలయూచింది. మరొకరెవరో “కావ్యం వ్యవహార జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది” అన్నారు.

“అవును. వ్యవహారజ్ఞానమే కాదు, కొన్ని సందర్భాల్లో నిగూఢంగా వైజ్ఞానికాంశాల్ని అందిస్తుంది. ఉదాహరణకు-కాళిదాసు మేఘసందేశంలోని ‘ధూమజ్జోతి స్సలిలమరుతాం సన్నిపాతఃక్వమేఘః’ అనే శ్లోకం వలన పఠితకు మేఘం-పొగ, వెలుగు, నీరు, గాలి చేరిక వలన ఏర్పడిందని తెలుస్తున్నది కదా!”

శేషవీరేశ్వరుడు జగన్నాథుని వైపు అభినందన పూర్వకంగా చూశాడు.

ఇప్పుడు – ఆ ప్రాంగణమంతా నిశ్శబ్దం అలముకుంది. కొంతసేపటి తర్వాత-ప్రారంభంలో అడిగిన వారెవరో ఒక కవిత చెప్పమని మళ్లీ జగన్నాథుని కోరారు.

చిరునవ్వుతో శ్లోకాన్ని ఇలా పలికాడు.

‘కలభ! తవాన్తికమాగత/మలినమేనం మా కదాప్య వజ్ఞా నీం

అపి దాన సుందరాణాం/ద్విపధుర్యాణామయం శిరోధార్యః’

(ఓ పిల్ల ఏనుగూ! నీ దగ్గరకు వచ్చింది కదా అని తుమ్మెదను ఎన్నడూ అవమానించకు. దాన సుందరులైన ద్విపధుర్యులకు అది శిరోధార్యం!)

(‘దాననుందరాణామ్’ శబ్దంలో శ్లేష. దానం అంటే వద్యానత, మదజలం. ‘శిరోధార్యం’ పదమూ అంతే. సాధారణ నానుడి; ఏనుగుల గండస్థలాల మీదనే తుమ్మెదలు వ్రాలటం అనేది మరొకటి. ‘కలభ! అనటం వలన నువ్వింకా పిల్లవి. అనుభవంలేదు’ అని హెచ్చరిక)

సభాసదుల్లో చాలామంది తమ తమ కరతాళ ధ్వనులతో జగన్నాథుని ప్రశంసించారు.

‘శుభం. నేను ఆశించినట్లే జగన్నాథుడు అన్యాపదేశ కవితాకళని వర్ధిల్లజేస్తున్నాడు.’ అనుకుని సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు-శేషవీరేశ్వరుడు.

ఇంతలో కొందరి నుండే గుసగుసలూ, రుసరుసలూ వినవచ్చాయి.

“మా భట్టోజీ దీక్షితుల వారు రేపోమాపో వస్తారు. అప్పుడు చూడాలి ఈయన గారి పస” అని ఎవరో పెద్దగానే మాటలు రువ్వారు.

విన్నాడు జగన్నాథుడు ‘శుభం.. రానీ’ అనుకున్నాడు మనసులో.

అధ్యాయం-7

రాత్రి – నీలివర్ణంలో కులుకుతోంది.

పందిరి మంచం మీద జగన్నాథుడి పక్కన కామేశ్వరి. చూపులు తెలియనంత చీకటి. కానీ, కళ్లలోని భావాల్ని దాచటం సాధ్యమా?

“ఏమిటి కామూ?” అన్నాడు మంద్రస్వరంతో.

“మాధవుడు పదే పదే గుర్తుకొస్తున్నాడు”

“అవును. నాకూ వాడు తలపుల్లో మెదలుతూనే ఉన్నాడు. కానీ, తప్పదుకదా! అందరమూ కలిసి వాడి మంచికే గదా అక్కడ వుంచి వచ్చింది. పైగా వాడు ముందే నిర్ణయించుకున్నాడు గదా మనతో రావడం లేదని.”

చాలాసేపు ముంగండ కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు – నిదానంగా..

కామేశ్వరి భర్త దగ్గరగా జరిగి చెవిలో ఊసులాడింది. జగన్నాథుడి మనసులో శతసహస్ర ఆనందతరంగాలు.

“అంత శుభవార్తని ఇంత నిదానంగానా..?” మెత్తని స్వరంతో స్పష్టంగా అన్నాడు.

సిగ్గుపడింది కామేశ్వరి. భావోద్విగ్నంగా దంపతులు ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. కుటుంబంలోకి కొత్త సభ్యుని రాకని సూచిస్తూ అంకురం ఆవిర్భావం వార్త అది. అలసిన శరీరాలు విశ్రాంతి నందుకుంటున్నాయి.

ఉన్నట్టుండి జగన్నాథుని మనసులో ప్రశ్న మొలిచింది – ‘అమ్మా నాన్నలకు ఈ వార్త చేరవేసేదెలా?’ అని. ఈ ఆలోచనలోనే కునుకు పట్టిందతనికి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here