Site icon Sanchika

జగన్నాథ రథయాత్ర – పూరీ

[కొన్నేళ్ళ క్రితం దర్శించిన కోణార్క్ ఆలయాన్ని, పూరీ లోని జగన్నాథ స్వామి ఆలయాన్ని గుర్తుచేసుకుంటూ, అలనాటి ఆ మధుర స్మృతులను పాఠకులతో పంచుకుంటున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

[dropcap]ఇ[/dropcap]వి 2008 నాటి విశేషాలు!

~

కోణార్క్ అందచందాలను నెమరు వేసుకుంటూ పూరీ చేరేసరికి మధ్యాహ్నం మూడు గంటలయింది. దారిలో ‘ఆంధ్రామీల్స్’ అని ఓ హోటల్ కనిపించేసరికి మేం భోజనం చేయలేదన్న విషయం గుర్తొచ్చి కారాపి అందులోకి వెళ్ళిపోయాం. అదో చిన్నహోటల్. ఏడెనిమిది టేబుల్స్ మాత్రమే ఉన్నాయి. అందరూ టేబుల్స్ ముందు కూర్చున్నారు. కానీ మీల్స్ మాత్రం రావట్లేదు ఇదిగో తెస్తున్నాం. అదుగో తెస్తున్నాం. అంటూ గంట తర్వాత భోజనాలు తెచ్చారు. వచ్చీ రాగానే వాటిమీద దాడిచేశారు అందరూ. అసలు సంగతేంటంటే అందరూ వచ్చి కూర్చున్న తర్వాతే వాళ్ళు వంట మొదలు పెట్టారు. భోజనం కానిచ్చి ఊళ్లోకి వెళ్ళాం. దేవాలయం కిలోమీటరు ఉండగానే వాహనాలు ఆపేశారు. వాహనాలు ఇక్కడ పార్కింగ్‌లో పెట్టుకొని అక్కడ ఉండే రిక్షాలలో మాత్రమే గుడి దగ్గరకు వెళ్ళాలి. ఇక్కడ నుంచే మొబైల్ ఫోన్లూ, కెమెరాలూ తీసుకెళ్ళగూడదు. ఒక్కొక్క రిక్షాలో ఇద్దరు ఎక్కవచ్చు రెండు రిక్షాలలో మేం నలుగురు ఎక్కి దేవాలయ ప్రధాన ద్వారం దగ్గర దిగాం. ఆలయం బయటే విపరీతమైన రద్దీ ఉంది. ఆ రద్దీలో జేబుదొంగలూ ఎక్కువే. సర్వం మరచి మైమరచి మనసారా దేవుడికి దణ్ణం పెట్టుకునేలోపు జేబులూ, మెడలూ ఖాళీ అవుతాయట. ఎంత జాగ్రత్తగా ఉన్నా మా ప్రక్కనున్న డాక్టరుగారి పర్సు కొట్టేశారు. మెటల్ డిటెక్టర్ ద్వారాల గుండా గుడి లోపలకు ప్రవేశించాము. గుడి లోపల వందల సంఖ్యలో పూజార్లు ఉన్నారు. ‘మేం పూజ చేయిస్తాం, మేం పూ జచేయిస్తాం’ అంటూ వెంటపడి అడుగుతున్నారు. ఇది మనకు మాములుగా అనుభవంలో లేని విషయం. వాళ్ళను తప్పించుకొని గుడిని చూద్దుము కదా! 214 అడుగుల ఎత్తుతో, అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో, గోపురంపై రెపరెపలాడే జెండాతో, విరాజిల్లుతూ శోభాయమానంగా కనిపిస్తుంది.

హిందువులు భారతదేశంలో పవిత్రమైన ధామాలుగా భావించే నాలుగింటిలో పూరీ జగన్నాథుని మందిరం కూడా ఒకటి. ఈ పుణ్యక్షేత్రం బంగాళాఖాతం తీరంలో కొలువై ఉన్నది. పూరీని ‘పురుషోత్తమ క్షేత్ర’ అనీ, ‘శంఖక్షేత్ర’ అనీ కూడా పిలుస్తారు. చోడగంగ దేవుడు అనే రాజు 12వ శతాబ్దంలో ఈ దేవాలయ నిర్మాణం మొదలు పెట్టాడు. గంగ వంశీయుడైన పరాక్రమశాలి అనంగ భీమ దేవుడనే రాజు కాలంలో దీని నిర్మాణం పూర్తి అయింది. సుమారు 800 ఏళ్ళ చరిత్ర కల్గిన ఈ దేవాలయం కళింగ శిల్పుల చాతుర్యానికి ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ మందిరం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ 660 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తులో ఉన్నది.

జనాన్ని తప్పించుకుంటూ ఆలయం చుట్టూ ఉన్న శిల్పకళల్ని చూస్తూ మెల్లగా ఆలయంలోనికి ప్రవేశించాం. దేవుడు చాలా దూరంగా ఉన్నాడు. కనిపించటం లేదు. ఇక్కడ ఇంకా రద్దీ ఎక్కువగా ఉంది. ముందుకు వెళ్ళేకొద్దీ రద్దీ ఎక్కువవుతున్నది. తోపులాట పెరుగుతున్నది. అలాగే ముందుకు పోతున్నాం. ఒకర్నొకరు నెట్టుకోవటం ఎక్కువైంది. పూరీ రథయాత్ర సమయంలో తొక్కిసలాటలో ఎంతోమంది చనిపోయారు. వార్తాపత్రికల్లో వచ్చే వార్తలు గుర్తుకొచ్చి భయమేసింది. ఎలాగో దర్శనం అయిందంటే అయిందనిపించి లోపలినుంచి బయటపడ్డాం. ఓ అరుగుపై కూర్చుని ఆలయాన్నీ, శిల్పాలనూ నిశితంగా గమనించడం మొదలుపెట్టాం. దూరం నుంచి అయినా ఫోటోలు తీసుకోవడానికి వీల్లేదాయె. ఎంతసేపు చూసినా గుర్తు పెట్టుకోవడం కష్టంగానే ఉన్నది. ఆంజనేయస్వామి, భవానీమాత, విశ్వకర్మ మొదలైన వారి చిన్న చిన్న గుళ్ళు చుట్టూ చాలా ఉన్నాయి. విశ్వకర్మ గుళ్ళోకి వెళ్ళాం. పూరీ ఆలయం మొత్తం ఒక్క రాత్రిలోనే దేవశిల్పి విశ్వకర్మ చెక్కినట్లు స్థల పురాణంలో ఉన్నదని అక్కడి పూజారి చెప్పాడు. ఎంతసేపైనా దేవాలయాన్ని అలా చూస్తూ ఉండాలనిపిస్తున్నది. అప్పటికే సాయంత్రమయింది. ఇంకా గుండిచా మందిరానికి వెళ్ళాలి. శ్రీమందిరానికి ఉత్తరదిశగా రెండు కిలోమీటర్ల దూరంలో ‘గుండిచా’ మందిరం ఉంటుంది. ఈ మందిరం ఎత్తు 430 అడుగులు. వెడల్పు 320 అడుగులట. ఇంద్రమదుమ్న రాజు యొక్క భార్య మహారాణి గుండిచా పేరు మీద ఈ ఆలయం పిలవబడుతున్నది. ఈ మందిరాన్ని జగన్నాథుని అత్తవారిల్లుగా భావిస్తారట. రథయాత్రప్పుడు పూరీలోని జగన్నాథ మందిరం నుంచి ఈ గుండిచా మందిరం దాకా రథయాత్ర జరుగుతుంది.

ప్రతి సంవత్సరం ఆషాడ శుక్ల ద్వితీయ తిథినాడు జరిగే జగన్నాథుని రథయాత్ర ప్రఖ్యాతి పొందినటువంటిది. హిమాలయాలలో తపస్సు చేసుకునే సాధువులు అంతా ఈ రథయాత్రకు వస్తారట. పూరీలో జగన్నాథుడు, చెల్లెలు సుభద్ర, అన్న బలభద్రుడు కొలువై ఉన్నారు. ఈ మూడు విగ్రహాలూ వేపకలపతో చేసినటువంటివి. రథయాత్ర రోజు ఈ ముగ్గురు దేవుళ్ళ చెక్క దేవతామూర్తుల్ని మూడు వేర్వేరు రథాలలో కూర్చోబెట్టుకొని గుండిచా మందిరానికి తీసుకుపోతారట. శ్రీ జగన్నాథుని రథాన్ని ‘నందిఘోష్’ అనీ, శ్రీబలభద్రస్వామి రధాన్ని ‘తాళధ్వజ’ అనీ. శ్రీ సుభద్ర యొక్క రధాన్ని ‘దేవదళన్’ అనీ పిలుస్తారు. ఇప్పుడే ఇంత తొక్కిసలాట ఉన్నదంటే ఇక రథయాత్ర సమయంలో ఉండే జనసమ్మర్దాన్ని ఊహించుకోవచ్చు.

జగన్నాథ మందిరానికి పశ్చిమాన సుమారు 3కి.మీల దూరంలో లోకనాథ ఆలయం ఉన్నది. జగన్నాథుని ఆదాయాన్ని కాపాడేవాడుగా ఈయనకు పేరున్నది. అందుకే ఈ దేవుణ్ణి ‘భండార్ లోకనాథ్’ అని పిలుస్తారట. ఉత్తరం వైపున నరేంద్ర చెరువున్నది. ఉత్కళరాజు భానుదేవుని మంత్రి నరేంద్ర దేవుడు ఈ చెరువును తవ్వించడం వల్ల ఆ చెరువుకి ఆ పేరు వచ్చింది.

పూరీలోని సముద్రతీరంలోని బీచ్ లలో తూర్పు తీరంలోని బీచ్ ‘గోల్డెన్ బీచ్’ గా పేరుపొందింది. ఇక్కడ సముద్రాన్ని ‘మహాదధి’ అని పిలుస్తారు. మేం బీచ్‌కు వెళ్ళేసరికి చీకటి పడుతోంది. అక్కడున్న ఒంటెల మీద మా పిల్లలు ఎక్కి తిరిగారు. అక్కడ అమ్మే పీచు మిఠాయిని చిన్న పిల్లల్లా తిన్నాం అందరమూ. ఈ బీచ్‌ని చూడగానే మాకు ఉడిపిలోని బీచ్ గుర్తుకొచ్చింది. అప్పటికీ బాగా చీకటిపడింది. రాత్రికి భువనేశ్వర్ లోని ‘మేఫెయిర్ లాగూన్’ రిసార్ట్స్ లో మాకు పార్టీ ఉన్నది. దానికి హాజరు కావాలి. అందుకే ఇక పూరీ నుండి వెంటనే భువనేశ్వర్‌కు బయలుదేరాం. ‘పూరీలో మరణించిన వ్యక్తి స్వర్గలోక ప్రాప్తుడవుతాడు, మరియు ముక్తి ప్రదాతుడవుతాడు’ అని హిందువుల విశ్వాసం.

Exit mobile version