అమాయక ఆదివాసుల దేహాలపై పోలీసులాఠీ కరాళ తాండవం….. ‘జై భీమ్’

13
2

ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫారంలో విడుదలయి సంచలనం సృష్టిస్తున్న జై భీం సినిమా పట్ల తన స్పందనను తెలియచేస్తున్నారు సీహెచ్ సుశీలమ్మ.

                                                                                                       ***

[dropcap]త[/dropcap]మ పేరున గజం స్థలమైనా లేని వాళ్ళు, ఓటర్ కార్డు గానీ ఆధార్ కార్డు గానీ లేనివారు, కనీసం ఒక ‘ఊరి’ వారిగా కూడా పరిగణింపబడని, సంచార జాతులుగా, దిక్కులేని వారుగా, శారీరక కష్టాన్ని నమ్ముకున్న అడవి తల్లి బిడ్డలు వారు. ఆధిపత్య కులాల వారి పొలాల్లో, ఇళ్ళల్లో ఎలుకలు, పాములు ఉంటే మాత్రం గుర్తుకు వచ్చేవారు, అక్కరకు వచ్చేవారు. వారిలో ఒక రాజన్, ఒక సిన్తల్లి (చిన్నతల్లి) హృదయ విదారక గాథ ‘జై భీమ్’.

నిజానికిది కల్పిత కథ కాదు. పాతికేళ్ల క్రితం కడలూరు జిల్లా కమ్మాపురంలో లాకప్ డెత్‌కు గురైన రాజాకన్ను అనే ఇరులార్ తెగకు చెందిన గిరిజనుడి దేహాన్ని తిరుచ్చి జిల్లా సరిహద్దులో దహనం చేసారు పోలీసులు. అతని భార్య పార్వతి చేత లాయర్ ‘చంద్రు’ చెన్నై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయించి, న్యాయం జరిగే వరకు పోరాడారు. పేదల వద్ద ఫీజు రూపాయి కూడా తీసుకోకుండా, 96,000 పైన కేసులు పరిష్కరించారాయన. అలాంటి మానవతావాది, మానవ హక్కుల కోసం పోరాడిన లాయర్ ‘చంద్రు’, ‘రాజాకన్ను’ యదార్థ గాధనే ‘జై భీమ్’ చిత్రంగా సమర్పించారు సూర్య, జ్యోతిక.

అడవుల్లో దృఢంగా, బలమైన ఆటవిక రాజులుగా యుద్ధ విన్యాసాలు నేర్చి, బాణాలు పట్టి క్షత్రియ రాజులకే యుద్ధాలలో సాయం చేసిన గిరిజన వీరులు ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో హీనమైన దీనమైన స్ధితి లోకి ఎందుకు జారిపోయారో, వివక్షతకు ఎందుకు గురయ్యారో నిజాయితీగా అధ్యయనం చేయాల్సిన తరుణం ఇది.

ఎవరికీ పట్టని వారు, ఎవరూ పట్టించుకోని వారు, కష్టం చేసుకుంటూ, తినీ తినక, అయినా ప్రకృతిలోని అందాలలో ఆనందంగా, నిజాయితీతో బ్రతుకుతూ, తమపై దొంగతనం మోపబడితే, ప్రాణం పోతున్నా ‘తప్పు చేయలేదు’ అని మొత్తుకునే రాజన్, చిన్నతల్లి వ్యధార్థ జీవితం చిత్రణ ఇది. పోలీసులకు ఉన్న పెండింగ్ కేసులు క్లోజ్ చేయడానికి ఎవర్నో ఒకర్ని అక్యూజ్డ్‌గా చూపించడానికి, దిక్కులేని గిరిజనుల్ని స్టేషన్‌కి లాక్కెళ్ళడం అక్కడ చాలా మామూలే. కస్టడీ లోకి తీసుకొని, కుళ్ళబొడిస్తే, దెబ్బలకి తట్టుకోలేక తప్పు ఒప్పుకుంటే కోర్టుకి అప్పగించి చేతులు దులుపుకుంటారు. ఒక కేసు నుండి విడుదల అయిన వెంటనే క్షణాల్లో వెంటనే కనీసం మనుషుల్లా కూడా పరిగణించక ‘మాకు కావాలి’ అని మరో కేసులో బుక్ చేయడానికి ‘తోలుకెళ్ళడం’ ఎంత అన్యాయం! వాళ్ల కోసం ఎవరు రారు, లేరు అనే ధైర్యం కదా! గిరిజనుల్ని మనుషులు గానే గుర్తించక పోవడం 75 ఏట అడుగుపెట్టిన ‘స్వాతంత్ర్య’ భారతం లోని ఈ విషాదపర్వానికి కారకులెవ్వరు!!

ప్రెసిడెంట్ గారి ఇంట్లో పామును పట్టడానికి వెళ్లిన రాజన్న అక్కడ బంగారపు ఉంగరం దొరికితే నిజాయితీగా తీసి ఇచ్చి, పాముని పట్టి, చంపకుండా అడివిలో వదిలేసే మనస్తత్వం ఉన్నవాడు. తర్వాత అదే ఇంట్లో దొంగతనం జరిగితే రాజన్నని అనుమానించి, అతను వేరే ఊరు పనికి వెళ్లడంతో, పోలీసులు గర్భిణి అయిన అతని భార్యని అక్కని, బావని, తమ్ముడిని తీసుకెళ్ళి చావబాదుతారు. అంతలో ఊళ్లోకి వచ్చిన రాజన్‌ని పట్టుకుని స్టేషన్‌కి లాక్కెళ్తారు.

అక్కడ జరిగే మారణహోమం వర్ణించలేం. మనుషుల్ని మనుషులే ఇంతలా కూడా హింసిస్తారా అని దిమ్మెర పోతాం. కానీ ఇదంతా మాకు మామూలే అన్నట్టు పోలీసులు ఒక దాని తర్వాత ఒకటి తప్పులు చేసుకుంటూనే పోతుంటారు. చిన్నతల్లి (లిజోమోల్ జోస్) ఎందరు లాయర్లను ప్రాధేయపడినా సహాయం చేయరు. టీచరమ్మ, ఎర్రజెండాల నాయకులు ద్వారా ‘చంద్రు’ అనే లాయర్‌ని కలుస్తుంది సిన్తల్లి. పేదల పక్షపాతి అయిన ఆ లాయర్ జైలులో జరిగిన మారణకాండను చిన్నతల్లి వివరిస్తుంటే చలించిపోతాడు. భర్తను తన కళ్ళ ముందే స్టేషన్లోకి లాక్కెళ్లి, తర్వాత ‘ముగ్గురూ పారిపోయారు’ అంటున్నారు అని బావురుమంటుంది. చంద్రు ఆమె చేత హెబియస్ కార్పస్ పిటిషన్ వేయిస్తాడు.

సంతకం చేయమంటే ‘రాదు’ అన్న చిన్నతల్లి వైపు సూర్య చూసిన చూపు, పోలీసుల అరాచకాలు వింటున్నప్పుడు అతని కళ్ళల్లో ఆవేదన, పెదాలు బిగించడం, గూడెం లోని వారందరి దైన్య జీవితాలకి జాలి పడటం, ఒక స్కూల్ కార్యక్రమంలో చిన్నపిల్లలు రాజకీయ నాయకుల వేషాలు ధరించినప్పుడు “గాంధీ నెహ్రూ ఉన్నారు. అంబేద్కర్ ఎక్కడ” అని ఆవేదనతో ప్రశ్నిస్తున్నప్పుడు – సూర్య ముఖంలో పలికిన భావాలకి ‘హేట్సాఫ్’ అనకుండా ఉండలేం.

లాయర్ హీరోగా చాలా సినిమాలు వచ్చాయి. గిరిపుత్రుల జీవితాలపై, లాకప్ లోని అరాచకాలు అకృత్యాలపైనా సినిమాలు వచ్చాయి. కానీ ఈ డైరెక్టర్ జ్ఞానవేల్ చాలా జాగ్రత్తగా, ఎక్కడా అతి లేకుండా, ట్రైబల్స్ జీవన దృశ్యాల్ని ప్రేక్షకుల కళ్లముందు సహజంగా ఉంచటంలో చూపిన నేర్పు మెచ్చుకోవాలి. నిజాయితీ గల సభ్యులు ఉంటే ఈ చిత్రానికి ఎన్నో జాతీయ అవార్డులు వస్తాయి.

ఆడవారిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్ళడం, మగవాళ్ళని కాళ్లతో తన్నడం, లాఠీలతో చావబాదడం, పూరి గుడిసెలో వారు దాచుకున్న కొద్దిపాటి డబ్బును కూడా దోచుకోవడం, చేసిన తప్పును చివరి వరకు దాచడానికి విశ్వ ప్రయత్నాలు చేయటం… పోలీసు వ్యవస్థ పైన నమ్మకం పోయేలా చూపించారు దర్శకుడు.

“పోలీసులు అందరూ చెడ్డవాళ్ళు కాదు” అని ఆఫీసర్ అంటే, చంద్రు “పోలీసులు అందరూ మంచి వాళ్ళు కూడా కాదు” అంటాడు కూల్‌గా, షార్ప్‌గా.

ఇక ఐ.జి.గా ప్రకాష్ రాజ్‌ని తప్ప మరెవ్వరినీ ఊహించలేం. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే, పై అధికారి మాటలకు విలువనిస్తూనే, ‘మనిషి’గా తన ధర్మాన్ని మర్చిపోకపోవటం, పోలీసులు తమని ఎన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారో గిరిజనులు వివరిస్తుంటే చలించిపోవడం – ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు ప్రకాష్ రాజ్.

‘మా నాన్న, నా భర్త, ఇప్పుడు నా కొడుకు పోలీసుల చేతిలో హింసించబడ్డార’ని ఒక ముసలామె… చేతివేళ్ళని తాళ్లతో కట్టి పైనుండి వేలాడదీశారని ఒకతను…. పోలీసులని చూసి తప్పుకుంటే ‘దణ్ణం పెట్టలేద’ని కొట్టారని ఒకతను… ‘దణ్ణం పెట్టి నందుకు’ కొట్టారని ఒకతను చెప్తుంటే…. మీసాలు కూడా రాని కుర్రాడు “మా నాన్న దొరకక పొయేసరికి నన్ను పోలీసులు తీసుకెళ్లారు. అప్పటినుండి స్కూల్లో ఏదైనా పోతే మొదట నా బ్యాగ్ వెదికేవారు. ఆ అవమానం భరించలేక స్కూల్ మానేసాను…” అని చెప్తుంటే తన డిపార్ట్‌మెంట్లో ఎన్ని అరాచకాలు జరుగుతాయో అని షేమ్‌గా ఫీల్ అవుతాడు ఐ.జి.

అక్షరాస్యత, ఉన్నత చదువులు అందనంత లోతుగా పాతిపెట్టబడిన బతుకులు అవి. అందరూ చదువుకోవాలి అని చెప్పేవారే! కానీ చదువుకోడానికి ఎన్ని ఆటంకాలు! ఆ చదువు లేకపోబట్టేగా గిరిజనుల బతుకులిలా ఛిద్రమౌతున్నాయి!

ఆదివాసుల నుదుటిపై ఆ దైవం ఏ రాతలు రాశాడో గాని, వారి దేహాలపై లాఠీల వాతలు మాత్రం అమానుషంగా, ఈ వ్యవస్థ తీరుతెన్నులకు దర్పణంగా కనిపిస్తాయి.

అక్రమ కేసులు బనాయించి జైల్లో మగ్గిపోతున్న ఆదివాసుల గురించి ‘చంద్రు’ లాంటి కొందరు పోరాడారు. ఆయన చేపట్టిన కేసుల్లో సభ్య సమాజం సిగ్గుపడేలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. వాటిలో నాగరిక ప్రపంచం అవాక్కయ్యే ఆదివాసుల బాధలు ఉన్నాయి. ఎస్.టి. సర్టిఫికెట్ కూడా ఇవ్వని అధికారులు, లాకప్‌లో ఆడదాని వంటిపై ఉన్న స్కర్ట్ లాగేసిన పోలీసు, డిపార్ట్‌మెంట్ పరువు పోకుండా కాంపెన్సేషన్‌కి ఒప్పుకోమనే పోలీస్ అధికారి, కేసును కొట్టివేయాలని కోరే లాయర్లు, చదువు లేకపోయినా ‘డబ్బు ఆశ చూపినా లొంగని’ చిన్నతల్లి, ఎంత చిత్రహింసలు పెట్టినా “దొంగతనం చేయలేదు” అన్నమాట మీదే ఉన్న రాజన్న, అతనితోపాటు బాధలు పడ్డ మరో ఇద్దరు…. అందరూ సజీవంగా మన కళ్ల ముందు మెదిలారు, కానీ సినిమా పాత్రల్లా ఉండరు. దర్శకుడి ప్రతిభ, మాటల రచయిత బలమైన డైలాగ్స్, ముఖ్యంగా రాజన్న(మణికందన్) చిన్నతల్లి (లిజోమోల్) సహజంగా పాత్రల్లో ఇమిడిపోయారు. సూర్య అయితే పూర్తిగా లాయర్ ‘చంద్రు’ గారి ఆశయాలని ఆకళింపు చేసుకుని ఆ పాత్ర పోషించాడు. రాజన్‌ని కొట్టి కొట్టి, చివరికి తప్పు ఒప్పుకోలేదని, చివరిగా వాడి గుండె మీద ఎస్సై బలంగా తన్నడంతో గుండె ఆగి చచ్చిపోవడం చూస్తే మన ఊపిరి ఆగిపోతోందా అనిపిస్తుంది. సూర్య 40వ చిత్రంగా ‘జై భీమ్’ని సూర్య, జ్వోతిక సమర్పించటం, గిరిజన పోరాటానికి కోటి రూపాయలు ఇవ్వడం వారి సౌజన్యానికి, ధైర్యానికి, నిజాయితీకి ప్రతీక.

భయంకరమైన, నమ్మశక్యం కాని జీవిత చిత్రాన్ని జ్ఞానవేల్ మన ముందు ఉంచుతున్నప్పుడు – ఓ సందర్భంలో హిందీ మాట్లాడబోయిన ఒకతని చెంప పై కొట్టి “తెలుగు (తమిళ్)లో మాట్లాడు” అన్నందుకు ‘ప్రకాష్ రాజ్ ఉత్తర భారతానికి, హిందీకి వ్యతిరేకి’ అంటూ నినాదం చేయబోతున్న కొందరి దుర్బుద్ధి ఈ చిత్రానికి వస్తున్న జేజేల ముందు కొట్టుకుపోయింది.

‘చాలా వాటికి’ దూరంగా, స్తబ్ధుగా, బూజుపట్టిన మెదళ్ళతో ఉన్న మనందరికీ ‘ఆలోచన’ కలిగించేలా ఉన్న ‘జై భీమ్’ నవంబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్‌లో వుంది. ఏమి చేయడానికీ మనకు ‘శక్తి’ లేకపోవచ్చు, కానీ సాటి మనుషులు ఎలా బతుకుతున్నారో గ్రహించడానికైనా ఈ చిత్రాన్ని చూద్దాం, రండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here