ఎన్నో ప్రశ్నలు రగిల్చిన ‘జై భీమ్’

5
3

[box type=’note’ fontsize=’16’] ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫారంలో విడుదలయి సంచలనం సృష్టిస్తున్న జై భీమ్ సినిమా పట్ల తన స్పందనను తెలియచేస్తున్నారు రాయపెద్ది వివేకానంద. [/box]

[dropcap]జై[/dropcap] భీమ్ – ఈ చిత్రం    చూశాను. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం.

~

మీరు ఒక సారి ఈ కింది లిస్ట్ చూడండి.

  • నిరీక్షణ (1986) దర్శకత్వం బాలూ మహేంద్ర
  • పిరవి (మలయాళం) (1989) సన్నీ జోసెఫ్
  • అంకురం (1993) సి. ఉమా మహేశ్వర రావు
  • మనోహరం (2000) గుణ శేఖర్
  • షాక్ (2006) ఆర్జీవీ/హరీష్ శంకర్
  • నాంది (2021) విజయ్ కనకమేడల
  • జై భీమ్ (2021) త.శె.ఙ్జానవేల్

~

పై సినిమాలన్నింటిలో ఉన్న కామన్ అంశం ఏమిటి అంటే, మానవ హక్కుల హననం. పోలీస్ హింస. అమాయకులపై అక్రమ కేసు బనాయించి వారిని హింసించి వేధించడం.

(గమ్యం, జల్సా, మహానది తదితర చిత్రాలలో సూక్ష్మంగా ఈ అంశాన్ని చర్చించినా, ఇలా అదే కథాంశాన్ని పూర్తి స్థాయి కథాంశంగా తీసుకొనబడలేదు)

మళ్ళీ వీటిలో జై భీమ్, అంకురం గూర్చి మాత్రమే విమర్శకులు చర్చించి వాటిని మెచ్చుకుంటూ వ్యాసాలు వ్రాయటం వెనుక ఉద్దేశం, వారు మానవ హక్కులు అంటే దళితుల హక్కులు అని మాత్రమే సెలక్టివ్ మానవత్వంతో ఆలోచించి వ్రాయటం.

ఈ డైరెక్టర్ ఎక్కడా కూడా ఇది దళితవాద చిత్రం అని చెప్పలేదు.   ఫిల్మ్ క్రిటిక్స్ మాత్రమే ఇలా అంటున్నారు.

త.శె.ఙ్జానవేల్ ఎంతో న్యూట్రల్‌గా తీశాడు చిత్రాన్ని. ఆయన ఎంత న్యూట్రల్‌గా తీశాడో అంత న్యూట్రల్‌గా వ్రాస్తున్నాను నేను ఈ వ్యాసాన్ని.

నాకు దళితుడు అన్న పదానికి నిర్వచనం తెలియదు. నా దృష్టిలో అణచివేతకి గురయ్యే ప్రతివాడు బాధితుడే. డబ్బు లేకపోవడం, విద్యాగంధం లేకపోవడం, అమాయకత్వం ఉండటం, అంగ బలం, ఆదుకునే నాథుడు లేకపోవడం, ఈ కారణాల వల్ల సునాయాసంగా రాక్షసుల బారిన పడటానికి అవకాశం ఉండటం వల్ల వారి బారిన పడి తనువు, ప్రాణం, మానం కోల్పోవడం ఎంత బాధాకరం. రక్షకులే భక్షకులై ఈ అమాయకులని సునాయాసంగా కబళించడం ఎంత హేయం.

ఇలా అణచివేతకి, వెతలకి, బాధలకి గురయ్యేవాడికి ఒక కులం,  మతం, జాతి ఉండవు.

వాళ్ళు బాధితులు అంతే.

ఈ సమాజంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా అంగబలం, అర్థబలం లేని వాళ్ళు సునాయాసంగా ఎర అవుతున్నారు. ఫలానా కులం కారణంగా మాత్రమే వారు ఇలా బలవుతున్నారు అని ఆలోచించడం సినికల్ థాట్ ప్రాసెస్ అని నేను భావిస్తున్నాను. చదువుకున్న వారు కూడా ఇలాంటి ఘోరాలనుభవించిన సంఘటనలెన్నో.. అమాయకంగా మోసపోయిన ఘటనలెన్నో. ఇస్రో ఎస్పియొనేజ్ కేసులో గొప్ప శాస్త్రవేత్త సైతం ఇరుక్కుని అవమానాలు, ఆరోపణలు ఎదుర్కోవటం, అతడితో అనుచితంగా, అవమానకరంగా, అణచివెస్తూ ప్రవర్తించటంలో అతడి చదువు, కులం, సామాజిక స్థాయి ఏమీ అడ్డురాకపోవటం చూస్తే,  ఈ రకమైన అన్యాయానికి బలహీనుడవటం తప్ప ఇతర కారణాలన్నీ తదుపరివేనని అర్ధమవుతుంది.  ఆ రకంగా తీసుకుంటే ఈ దర్శకుడు నా ఈ విమర్శకు అతీతుడు కాడు.

సినిమా ప్రారంభ సన్నివేశంలోనే తన భావ జాలాన్ని బయటపెట్టాడు దర్శకుడు. అలాగని చెప్పి ఆయన అదే పనిగా అగ్రవర్ణాల పట్ల ద్వేషాన్ని వెలిగక్కలేదు. దళితుల పట్ల సానుభూతిని మాత్రమే తెలియబరచాడు. తను నమ్మిన విషయం తాను తీయటం తప్పు కాదు కద. ఇంత బాగా తీయబడ్డ ఈ చిత్రంలో ఇలాంటి లోపాలే కాక, కొన్ని సత్య దూరమైన అంశాలు లేకపోలేదు. అవి కూడా చర్చిస్తాను ఈ వ్యాసం చివర్లో.

ఇది నిస్సందేహంగా హృదయాల్ని ద్రవింపజేసే ఒక దృశ్య కావ్యం. దర్శకుడు ఆద్యంతమూ విషాదవీణియ రాగాల్ని మూగగా మీటుతూనే ఉంటాడు. మన హృదయం కొట్టుకోవడం నిలిచిపోయి, హృదయ స్పందనలు ఆగిపోయి, మనం నిస్సహాయంగా నిలబడిపోయి, కళ్ళలో కన్నీళ్ళు ఇంకిపోయి, రక్తాశ్రువులు రావటం మొదలవుతుంది. మనం జీవిస్తున్న ఈ సమాజం పట్ల ఏహ్యత కల్గుతుంది. కొందరు స్వార్థపరుల అతి తెలివి వల్ల అమాయకులు ఎలా నేల రాలి పోతున్నారో కద అని పిస్తుంది.

కొందరు సుఖంగా జీవించటానికి, తెర వెనుక ఎన్ని అమాయక జీవాలు, చిరునామా కూడా తెలియకుండా మూగగా రాలిపోతున్నాయో కద అనిపించింది.

చిత్రం యావత్తు అమాయకులైన గిరిజనులు (ట్రైబల్స్) ఎలా దోపిడికీ గురువుతున్నారో, దుష్టులైన మానవ మృగాల వంటి పోలీసులు ఈ అమాయకుల మానవ హక్కులను ఎలా కాలరాస్తున్నారో గుండెల్ని పిండేసేలా చిత్రీకరించారు.

ఈ చిత్రం చూస్తున్నంత సేపు, ఆ పాత్రల మనోభావలతో మనం లీనమయిపోతాము. చిన్నతల్లి ఒక కఠినమైన నిర్ణయం తీస్కున్న ప్రతీ సారీ ‘అద్దీ. అద్దీ అలా చెయ్యి తల్లీ. భలే చెప్పావు. నా మద్దతు నీకే’ అని మనం చిన్నపిల్లాడిలా మన ఎదురుగా ఉన్న టీపాయ్‌నో, టేబుల్‌నో పిడికిలి బిగించి గుద్దుతాం.

ఆ పాత్రల పరిస్థితులతో మమేకమై పోతాము. ‘ఏం మనుషులురా ఈ పోలీసులు, తమ స్వార్థం కోసం, పదవిలో ఉన్న ఒక వ్యక్తి మెప్పు కోసం, ఈ అమాయక జీవుల ఉసురు పోసుకుంటున్నాడు. ఎటూ పోలేకుండా వారిని చిక్కించుకుని అంత హింస పెడతాడా. మీరు మానవ  జన్మ ఎత్తిన మృగాలా, రాక్షసులా, వెధవల్లారా. అందుకే కదరా మిమ్మల్ని ‘అన్న’లు అంత హీనంగా చంపేది. అందుకే మా తెలుగు కమర్షియల్ సినిమాలలో అయితే, మా చిరంజీవో బాలయ్య బాబో అయితే సరిఅయిన మొగుళ్ళు రా. మీ బతుకులు చెడ. మిమ్మల్ని కోసి కండ కండకూ కారం పూయాలి.’ అని మనం ఇంకేం చేయలేక నిస్సహాయంగా మన సంస్కారం అనుమతించినంత మేరకు తిట్టుకుంటాము ఈ సినిమాలో పోలీసు వెధవలని.

“పాముతో కాటేయబడ్డ వాడు ప్రాణాలు కాపాడమని నీ వద్దకు వస్తే, డబ్బులు ఇస్తేనే మందు ఇచ్చి కాపాడతానని అంటావా, ప్రాణం కాపాడతావా?” అని చంద్రు (సూర్య) అడిగితే,

“అదేం మాట. వాడు చివరికి పోలీసు అయినా సరే, మొదట ప్రాణం కాపాడతా” అంటుంది మాయా మర్మం ఎరుగని స్వచ్చమైన ఆ గిరిపుత్రి.

ఆ ఒక్క మాటలో ఎంత అర్థం నింపాడో దర్శకుడు.

‘జీవించు, జీవించనియ్యి’ అన్నది మన సనాతన ధర్మం యొక్క ఆదర్శం కద.

‘నో ఫ్రీ మీల్స్’ అనే కరడు కట్టిన నీచ అమెరికన్ బిజినెస్ సంస్కృతి కార్పొరేట్ వ్యవస్థల రూపంలో విద్య, వైద్యం ఇలా అన్ని రంగాలలో ఎలా విషకోరలు చాస్తూ ఉంది అన్నది మనకు ఆ ఒక్క మాటలో అర్థం అయి ఉన్నతమైన మన మూలాల్ని గుర్తు చేసి. ఉలిక్కి పడేలా చేస్తుంది.

ఈ చిత్రం గూర్చి నేనేమీ రివ్యూ వ్రాయబోవడం లేదు. ఇప్పటికే బోలెడు మంది వ్రాసేశారు. ఈ చిత్రం చూశాకా నాకు కలిగిన మనోభావాలు మాత్రమే ఇక్కడ వ్రాస్తు ఉన్నాను.

***

ఈ సినిమాలో మాటలు గుండెల్ని పిండేస్తాయి.

  • “ఈ దెబ్బలని ఓర్చుకోలేకపోతున్నాను. మనం చేయని ఈ నేరం ఒప్పేసుకుందాము” అన్నమాట విని, “ఒరేయ్ ఈ నొప్పులు, దెబ్బల తాలూకు గాయాలు రెండ్రోజుల్లో మానిపోతాయిరా. ఒక సారి దొంగ అన్న ముద్ర పడితే జీవితాంతం మాసిపోదురా. కాస్తా ఓర్చుకోరా” కథానాయకుడి ఈ మాట గుండెల్ని పిండేస్తుంది
  • “నేనీ దొంగతనం చేయలేదయ్యా” ప్రాణం పోతుండగా అతను చెప్పిన చివరిమాట కూడా ఇదే.
  • “ఈ పోరాటంలో నేను ఓడుతానో గెలుస్తానో నాకు తెలియదు. కానీ పోరాడి ఓడాను అని నా పిల్లలు తెలుసుకుంటే కూడా చాలు నాకు. కానీ నా భర్తను చంపిన నీచుల వద్ద పాపిష్టి డబ్బులు తీసుకోను”
  • “లాయర్లందరూ అవినీతి పరులు అని విశ్వసించే పోలీస్ ఆఫీసర్‌ని నేను, పోలీసులు అందరు నీచులని అభిప్రాయపడే లాయర్‌వి నీవు. మనిద్దరం కల్సి పని చేయబోతున్నాం. తమాషాగా లేదు” ఇది ప్రకాష్ రాజ్ మాట. ఇంకా తమాషా ఏమిటి అంటే, ఈ ప్రకాష్ రాజ్‌ని ఎన్నుకుంది సూర్యానే, ఈ కేసు సాల్వ్ చేయటానికి. ఒకరి వృత్తి నిబద్దత పట్ల ఒకరికి అనుమానాలు ఉన్నా, వారిద్దరి మతం మానవత్వం. ఇది వారిని కలుపుతున్న అంశం. ఇలాంటి మనసులను హత్తుకునే అంశాలు బోలెడు ఈ చిత్రంలో.
  • “పోలీసులందరూ చెడ్డోళ్ళు కారు సర్…” అన్న మాటకి, ముక్తసరిగా “పోలీసులందరూ మంచోళ్ళు కూడా కాదు” అని సమాధానం ఇస్తాడు సూర్య.
  • “ఈ కులపోళ్ళు అందరూ హ్యాబిచ్యువల్ క్రిమినల్స్ మై లార్డ్స్” అంటాడు ఒక సందర్భంలో రావు రమేష్ ప్రభుత్వ తరఫున లాయర్ (ఆడ్వొకేట్ జనరల్), దానికి ప్రతిగా హీరో సూర్యా ఇంకో సందర్భంలో “ఒక కులంలో పుట్టిన వారందరూ నేరస్థులే అనే జెనరలైజేషన్ తప్పు” అంటాడు
  • “చట్టం, న్యాయం, ధర్మం ఇలాంటి వన్నీ ఉన్నోళ్ళకు అండగా ఉంటాయి. వీరికి ఉన్న అండ మనమే”
  • “అమ్మా! డీజీపి మిమ్మల్ని జీపులో దిగబెట్టి రమ్మన్నాడమ్మ” అని పోలీసులు వేడుకున్నా, తనపాటికి బస్సులోనే వచ్చి, నడిచి ఇంటికి వెళ్ళిన చిన్నతల్లిని చూసి మనకేదో కొత్త ఉత్తేజం వస్తుంది.

చివరి సీన్లో పేపర్ చదువుకుంటున్న లచ్చిమీ ని చూసినా మనకు అదే స్థాయి ఉత్తేజం వస్తుంది.

***

మధురాంతకం రాజారాం గారి కథ ఒకటి ఉంది ‘గణనీయులు’ అని. ఆ కథలో జనాభాలెక్కలు సేకరించే సందర్భంగా ఒక ఉపాధ్యాయుడు అడవులలో, కొండకోనల్లో వెదకి వెదకి జనాభాలెక్కల్లో లేని వలస జీవులను, పశువుల కాపర్లను, ఇలాంటి వాళ్ళని కొత్తగా ఆ జాబితాలోకి చేర్చి తృప్తిగా నిద్ర పోతాడు. ఆ కథలో ఉన్న లాంటి సమాజమే ఇక్కడ, కాకపోతే అంత మంచి ఉపాధ్యాయుడు ఎవరూ వీళ్ళ పేర్లు జనాభాలెక్కలలో చేర్చలేదు. ఒక ఆదర్శ మహిళా టీచర్ ఆ పని చేయబోయి, రాజకీయ నాయకుల చేతిలో చీవాట్లు తింటుంది.

ఈ కథలో కథానాయకుడు ఒక దళితుడు. వెనుకబడిన ఆయన కులం వారి కులవృత్తి ఎలకలు, పాములు, పందులు పట్టి కాపుకు వచ్చిన పంట పొలాలను కాపాడి, రైతులు ఇచ్చే తృణమో పణమో తీస్కుని జీవించడం. ఎప్పుడైనా పని దొరికితే కాంట్రాక్ట్ లేబర్‌గా వెళ్ళి ఇటుకల బట్టీలలో పని చేయటం.

అధికార పక్షంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పాము చొరబడితే దానిని పట్టుకోవడానికి వెళతాడు, అనుకోకుండా తాను చేయని దొంగతనం నేరంలో ఇరుక్కుంటాడు. ఆపై పోలీసులు పెట్టే చిత్ర హింసలు, అతను మాయవడం, ఆ తరువాత చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఇది ఇతివృత్తం.

ఇతన్ని కాపాడటానికి చంద్రు అనే అడ్వకేటు పడిన తపన, చూపిన చొరవ ప్రశంశనీయం. ఈ పరంపరలో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు బయట పడతాయి. అసలు నిందితులు ఎవరూ అన్నది తెలిశాక మనకు మనుషులుగా పుట్టినందుకు అసహ్యం వేస్తుంది. ఇలాంటి సమాజంలోనా మనం ఉన్నది అని భయం వేస్తుంది. మనకు రక్షణ ఉందా అని దిగులు వేస్తుంది.

ఇది యథార్థ సంఘటన ఆధారంగా వ్రాసుకున స్క్రిప్ట్. పాత్రధారులు అందరూ పోటీ పడి నటించారు కాదు కాదు, జీవించారు.

హీరొయిన్ లిజొమోల్ జోస్ చిన్నతల్లి పాత్ర కోసం పుట్టిందా అన్నట్టు ఉంది. ఆ మేకప్ చూసి, నిజంగానే ఎవరైనా గిరిజన స్త్రీ ఏమో అనుకుంటాము. ఆ తర్వాత ఆమె ఫోటోలు గూగుల్ లో చూసి ఆశ్చర్య పడ్డాను.

ఫోటో గ్రఫీ సూపర్. సంగీతం సూపర్. పాటలు ఉన్నాయి, కానీ అన్నీ మాంటేజ్ సాంగ్స్. దీనివల్ల్ సినిమాకి క్లాస్ లుక్కు వచ్చింది. ఎక్కడా కక్కుర్తి పడి డ్యుయెట్లు పెట్టాలి, ఫోక్ సాంగ్ పెట్టాలి, స్టెప్పులు వేయించాలి అని అనుకోలేదు దర్శకుడు.

హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేయబోయే ముందు చంద్రు, చిన్నమ్మని సంతకం చేయమన్నప్పుడు “నాకు సంతకం చేయడం రాదు సర్” అని బేలగా అంటుంది.

ఆ తరువాత దృశ్యంలో ఆమె బిడ్డ పలక మీద తన పేరు వ్రాసి చూపించి రాబోయే తరాలు విద్యను ఒంటబట్టించుకుంటున్నాయని ఇది అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తుంది అన్న అర్థాన్ని సంకేతంగా ఇస్తాడు దర్శకుడు.

ఇదె పాప, చివరి సీన్లో, సందేహిస్తూ, చంద్రూ గారి వంక చూస్తూ కుర్చీలో కూర్చుని, వార్తా పత్రిక అందుకుంటుది. ఆయన ‘శభాష్ గో అహెడ్’ అన్నట్టు చిరునవ్వు చిందిస్తూ చూస్తారు. ఆ తర్వాత ఆ పిల్ల చంద్రు గారిలాగా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా పేపర్ చదవటంలో నిమగ్నం అవుతుంది.

ఈ రెండు దృశ్యాల ద్వారా అంబేద్కర్ చెప్పిన సందేశం ‘విద్య ద్వారానే స్వేచ్ఛ, సమానత్వం లభిస్తాయి. అజ్ఞానాంధకారాలు తొలగేదానికి, విజ్ఞాన జ్యోత్స్న నలుదెశలా కాంతులు విరజిమ్మటానికి మరియు అన్ని సమస్యలకు పరిష్కారం విద్య ద్వారానే లభిస్తుంది’ అన్న సూచనని దర్శకుడు మార్మికంగా చెబుతారు.

వారు సినిమా పేరు జై భీమ్ అని పెట్టటం, చివర్లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టటం వల్ల నేను ఇక్కడ కొన్ని విషయాలు వ్రాయాల్సి వస్తోంది;

నేటి యువత అంబేద్కర్ గారిని పూర్తిగా అర్థం చేసుకోవటంలో విఫలం అయ్యారు అని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పింది ఉత్తి విజ్ఞానం (knowledge) అందించే విద్య గూర్చి మాత్రమే కాదు, విచక్షణతో కూడిన జ్ఞానం (Wisdom) అందరికీ అందాలని ఆశించారు.

ఉత్తి డిగ్రీలు, మార్కులు కొలబద్ద అయితే, ఆ పోలీసులు, రావు రమేష్ లాంటి లాయర్లు, దొంగ సాక్ష్యం చెప్పిన మెడికల్ షాప్ వారు, గుడ్డిగా పోలీసులు చెప్పిన మాటలు నమ్మి ఛాతీ ఎముకలు ఆక్సిడెంట్‌లో విరిగాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ వ్రాసిచ్చిన డాక్టర్ వీళ్ళందరూ కూడా విద్యావంతులే. మరి వారికి విద్య ఏమి ఒనగూడ్చిపెట్టింది. కాబట్టి నైతికత నేర్పని విద్య వృథా.

పలక మీద పేరు వ్రాసి సంతకం చేసినంత మాత్రాన, వార్తా పత్రిక కాలుమీద కాలు వేసి చదివినంత మాత్రాన జ్ఞానం (విజ్‍డం) రాదు. అంతోటి విద్యావంతులు కేరళ నిండా ఉన్నారు. లాభం ఏమి ఉంది? వైద్య రికార్డుల ప్రకారం ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్న రాష్ట్రాలలో కేరళ, వెస్ట్ బెంగాల్ అగ్ర స్థానంలో ఉన్నాయి.

ప్రతి ఒక్కరూ ఉత్తిగా డిగ్రీ తెచ్చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి, అని ఆశించటము; ఉద్యోగం రాకపోతే ప్రభుత్వాలను అమ్మ నా బూతులు తిట్టటానికి తప్ప ఈ విద్య ఎందుకు పనికిరానిదిగా తయారయింది. నిజమైన విజ్‍డం వల్ల ఆత్మస్థైర్యం రావాలి, ఆత్మ గౌరవం పెరగాలి. ఒకరి వద్ద ఏది ఆశించకూడదు అన్న ధైర్యం, స్థైర్యం రావాలి. అలా కాకుండా ‘మేము వెనుకబడి ఉన్నాము’ అని నిత్యము ఆక్రోశిస్తు ఉన్నారు అంటే వారు విద్యను చూసే కోణంలో తేడా ఉంది. వీరికి పగటి కలలు చూపి, అరచేతిలో వైకుంఠాన్ని చూపే రాజకీయ నాయకులు కూడా వీరికి విద్య యొక్క పరమార్థాన్ని తప్పు కోణంలో చూపుతున్నారు. ముఖ్యంగా ఇలా వెనకబడి వున్నామని రోదించేవారు సామాజికంగా ఉన్నత స్థాయిలోవుండి, వారి సంతానమంతా గొప్ప ఉద్యోగాల్లో వుండటం గమనిస్తే,  అసలు వెనకబడివున్నదెవరో అర్ధమవుతుంది. ఇలాంటి సౌకర్యాలు తమకున్నాయని తెలియక అట్టడుగునవున్నవారికి తాము వెనుకబడి వున్నామన్న స్పృహకూడా లేనంత దయనీయమైన స్థితిలో వున్నారు, ఈ సినిమాలో తెగలో వారిలా!!

ఇదే విషయాన్ని జపాన్ వారి గూర్చి హెక్టార్ కార్షియా, ఫ్రాన్సిస్ మిరాల్లెస్ అనే రచయితలు ‘ఇకిగాయ్’ అనే పుస్తకం ద్వారా వ్రాస్తే చదివి మనవాళ్ళు అందరూ శభాష్ అంటారు గానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి, విద్య యొక్క పరమార్థం ఉద్యోగం మాత్రమే అని నమ్ముతారు.

అజ్ఞానం నుంచి బయటపడటం, ఒకర్ని గుడ్డిగా నమ్మే అమాయకత్వం నుంచి బయటపడటం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని మెరుగుపరచుకోవటం, ఒకరిపై ఆధారపడకుండా సాధికారికంగా తమ జ్ఞానాన్ని పెంపొందించుకునేలా, కంప్యూటర్ వాడకం నేర్చుకోవటం, తద్వారా అన్ని పనులు చేసుకోగలగడం, తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవటం, గ్లోబల్ ఆపర్చునుటీస్‌ని విస్తృత పరచుకోవడం, తద్వారా తమకు, తమ కుటుంబాలకు, దేశానికి కూడా అర్థిక సాధికారికతని సాధించుకోగలగడం ఇవన్నీ విద్య ద్వారానే సాధ్యం. కానీ ఇప్పటి యువత అంబేద్కర్ పేరు చెప్పుకుని, ప్రతీ దానికి ప్రభుత్వం మీద ఆధారపడటం, మేము వెనుకబడి ఉన్నామని చెప్పుకోవడానికి పోటీలు పడటం చేస్తున్నారు. వీళ్ళకు తోడుగా మమ్మల్ని కూడా వెనుకబడిన వర్గాలుగా గుర్తించమని కొన్ని సోకాల్డ్ అగ్రవర్ణాల ఆక్రోశం ఇంకో వంక. ఎక్కడికి వెళుతున్నాం మనం?

(ఈ విషయంగా నిరుద్యోగ సమస్య గూర్చి నేను సవివరంగా ఇది వరకు ఒక వ్యాసం వ్రాశాను. మీరు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఆ వ్యాసం చదవవచ్చు.

https://m.facebook.com/story.php?story_fbid=10221593757333419&id=1237660552 )

***

మళ్ళీ ఈ సినిమా ముచ్చటకి వద్దాం.

1995 పీరియడ్ లుక్ భలే తెచ్చారు.

ఒక సీన్‌లో, చెన్నయి నగరంలో బొంబాయి సినిమా పోస్టర్ పెద్దది ఉంటుంది బాక్‌గ్రౌండ్‌లో. హీరో సూర్య అప్పుడప్పుడు వాడే యమహా ఆరెక్స్ 100 బైక్, చిన్నతల్లి పాటలు వినే మర్ఫీ కంపెనీ ట్రాన్సిస్టర్, సూర్యా వాడే నేషనల్ పానసోనిక్ టేప్ రికార్డర్, టీడికే 90 మినిట్స్ కాసెట్, వీసీఆర్, పబ్లిక్ కాల్ ఆఫీస్ తదితరాలు మనకు ఆర్ట్ డిపార్ట్ మెంట్ మరియు డైరెక్టర్ బాగా కృషి చేశారని తెలుపుతుంది.

ఇక ఈ సినిమాలో చిన్న చిన్న లోపాలు.

అప్పటికే దేశంలో మారుతి 800, ఎస్టీమ్, జెన్, బాలెనో (పాత బాలెనో), వాగన్ ఆర్, హ్యుందాయి ఆర్ ఎల్ ఎక్స్ శాంత్రో, ఆక్సెంట్, ఆక్సెంట్, దేవూ వారి సియలో, మేటిజ్, తదితర కార్లు విస్తృతంగా ఉండినాయి. కానీ ఈ సినిమాలో ఎంత సేపున్నా అంబాసిడర్, ఫియట్ పద్మినీ కార్లు చూపిస్తారు. వీళ్ళ దృష్టిలో 1995 అంటే అది ఏదో శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి జమానా అన్న ఫీలింగ్ ఉన్నట్టుంది (ఆ రోజుల్లోనే వచ్చిన ఒక పాట: మారుతి రో, మాటిజ్ రో, సీట్ చూస్తే సియలో రో).

వాహనాల నెంబర్ ప్లేట్ల్ తెల్లవి వాడారు. అప్పట్లో పర్సనల్ వెహికల్స్‌కి నలుపు రంగు నెంబర్ ప్లేట్‌పై తెలుపు రంగు అక్షరాలు ఉండేవి. టాక్సీలకు తెల్ల రంగు నెంబర్ ప్లేట్స్ పై నల్ల రంగు అక్షరాలు ఉండేవి.

కార్ నెంబర్ ప్లేట్ పై APV అని వ్రాశారు కానీ అప్పటికే ప్రతి జిల్లా ఆర్.టీ.ఓ ఆఫీస్‌కి నెంబర్ కోడ్ వచ్చింది. అంటే వీరు చూపదలచుకున్న రాజమండ్రి తదితర ప్రాంతాలకి AP 05, విశాఖకి AP 31, విజయవాడకి AP 16 అనే నెంబరింగ్ వచ్చింది ఆర్.టీ.వో ఆఫీస్ లకి.

ఈ గొడవ అంతా ఎందుకు వస్తుంది అంటే, సాక్షాత్తు అవి తమిళనాడు ప్రాంతాలు అని తెలుస్తు ఉంటుంది. పాత్రలేమో కాకినాడకి వెళ్ళొస్తాము, హైదరాబాద్‌కి వెళ్ళి వచ్చాము అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మన కళ్ళ ముందు బఫూన్ లలాగా చేస్తారు. శంకర్ తీసిన జెంటిల్మన్ కాలం నుంచి గమనిస్తున్నాను ఈ ద్విభాషా చిత్రాల పిచ్చి. అలా కాకుండా ఆ దర్శకుడు, హాయిగా అయ్యా ఇది చెన్నయ్. ఏమి చేసుకుంటారో చేసుకోండి, మీకు అర్థమయి చావదు కాబట్టి తెలుగులో సంభాషణలు పెట్టాం అని అంటే పీడ పోతుంది కద. ఒక్కో సారి తెలుగు బోర్డులు ఒక్కోసారి ఎంత వద్దన్నా అరవ బోర్డులు ఈ బాధ చూసే తిప్పలు తప్పుతాయి ప్రేక్షకులకు.

ప్రారంభ దృశ్యంలో ఆ రోజు విడుదల అయి బయటకు వచ్చిన ఖైదీలను వారి వారి కులాలు అడిగి తక్కువ కులస్తులను పక్కన నిలబెట్టి మళ్ళీ వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి తమ టార్గెట్లు పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు పోలీసులు. అదే సమయంలో అగ్రవర్ణాల నేరస్తులను మీరు వెళ్ళవచ్చు అని పంపిస్తారు. ఇది నాకు జీర్ణం కాలేదు. ఇది కేవలం సినిమాటిక్‌గా అనిపించింది. కానీ ఈ దృశ్యం, కులాని బట్టి నేరస్తులుగా నిర్ణయించే మనస్తత్వాన్ని చక్కగా ప్రదర్శిస్తుంది. బ్రిటీష్ కాలమ్నుంచి తెగలను నేరగాళ్ళుగా పరిగణించటం ఇన్నేళ్ళయినా మారకపోవటం ఒక దురదృష్టం.

ఎవ్వర్నీ కులం అడగకూడదు అనేలాంటి సంస్కారాలతో పెంచారు మమ్మల్ని. మా చిన్నప్పటి నుంచి కూడా ఫలానా వాళ్ళతో స్నేహం చేయవద్దు అని కానీ, ఫలానా వాళ్ళతోనే స్నేహం చెయ్యి అని కానీ మా పెద్దలు చెప్పలేదు. నాకు స్నేహితులు ఏ కులాలవారో నాకు తెలియదు. కానీ ‘పెరగంగా పెరగంగా పెద్ద బావ కోతి…’ అన్న సీమ సామెత ప్రకారం, ఊహ తెలిసి, ఉద్యోగాలు చేసే దశకు వచ్చేటప్పటికి, నేను ఈ సమాజంలో ప్రతి చోట కులం కులం అని వింటున్నాను.

ఒక సారి మహారాష్ట్రలో అకోలా నుంచి ఓవర్ నైట్ జర్నీ చేసి, నాందేడ్‌కి రావాలి. బస్సులో నా పక్క సీట్ అతను డైరెక్టుగా ఇన్‌డైరెక్టుగా నా కులం అడుగుతున్నాడు. నా చేతికి ఉన్న కాశీ దారం లాంటిది నల్లగానో ఎర్రగానో కాక తెల్లగా ఎందుకు ఉంది, ఇది ఏ దేవుడిది అని నిలదీసి అడిగాడు. కానీ నేను నా కులం చెప్పలేదు అతనికి. అతను ఆ రాత్రంతా నన్ను తాకకుండా వీలయినంత దూరంగా కూర్చున్నాడు. అతని ఖర్మ అతనిది అని చెప్పి నేను నిద్ర పోయాను హాయిగా.

అలాగే ఇప్పుడు ప్రతి అప్లికేషన్ ఫిల్ చేసెటప్పుడు అగ్రవర్ణం వాడివా- ఇదిగో నీ స్థానం ఇక్కడ అని నన్ను అణగదొక్కబడుతున్న సమాజంలో జీవిస్తున్నాను. నా ఆహారపుటలవాట్లు, పద్దతులు, నా అభిరుచులు అన్నీ కూడా హేళనకి గురిఅవుతున్న సమాజంలో ఉన్నాను నేనిప్పుడు. 1995 లో కూడా ఇదేలాంటి పరిస్థితులే ఉన్నాయి, నేను పెరిగిన సమాజంలో.

కాబట్టి కులం ఆధారంగా ఎవ్వర్నీ నేరస్థుడు అనకూడదు అని సూర్యా చెప్పిన సందేశం లాగానే, కులం ఆధారంగా అగ్రవర్ణాల వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళని, బలిసినవాళ్ళని, కడుపు నిండినవాళ్ళని అనుకోకూడదు అని నాకు అనిపించింది.

ఒకప్పుడు వెనుకబడ్డ వాళ్ళని నిస్సందేహంగా ముందు వరుసలోకి తేవాల్సిందే, కానీ దానికి ప్రతిగా ఇంకో వర్గపు అమాయకులని (అంటే నాలాంటి వారిని) మెరిట్ ఉన్నా వెనుకకు తోయవలసిందేనా? సమానత్వం కద మనకు కావాల్సింది, ప్రతీకారచర్యలు కాదు కద.

సినిమా టైటిల్ మాత్రం చాలా ప్రభావశాలిగా ఉంది.

శుభం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here