Site icon Sanchika

విఠలాచార్య ఎన్‍సైక్లోపీడియా అనదగ్గ ‘జై విఠలాచార్య’

[శ్రీ పులగం చిన్నారాయణ రచించిన ‘జై విఠలాచార్య’ అనే పుస్తకం సమీక్షని అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]కప్పుడు సినీ తారలు నిజంగా తారల్లాగే ఆకాశంలో అందనంత ఎత్తున ఉండేవారు. వారిని తెరపై కాక నిజజీవితంలో చూసేందుకు అభిమానులు తపించేవారు. వారిని చూసిన వారిని ఇతరులు ఎంతో గొప్ప వారిలా భావించేవారు. వారి నుంచి ఉత్తరాలు అందుకోవడం, సంతకం చేసిన ఫోటోలు అందుకోవటం హిమాలయాలు ఎక్కినంత ఆనందాన్ని కలిగించేవి. అందుకని సినిమా వాళ్లంటే జనబాహుళ్యంలో పట్టరానంత అభిమానం ఉండేది. అయితే ప్రజలకు వారి పేర్లు తెలిసేవి కాని వారి వ్యక్తిగత జీవితం గురించి అంతగా తెలిసేది కాదు. వారి గురించి తెలిపే పత్రికలు కొన్ని ఉండేవి. వాటిల్లోనూ అందరి గురించిన సమాచారం ఉండేది కాదు. ఇప్పటిలా టీవీ ఛానెళ్ళలో సినిమా ప్రమోషన్ల కోసం రావడం, టీవీ కార్యక్రమాలలో పాల్గొనటం వంటివేవీ అప్పుడు లేవు. అందుకే ఆ కాలంలో ఓ సినీతార బొమ్మ ముఖచిత్రంగా వేస్తే, వెంటనే అవి అభిమానుల గోడలపై అతుక్కుపోయేవి. ఆల్బంలలో చేరిపోయేవి. సాధారణంగా నాయికానాయకుల బొమ్మలే అధికంగా అందుబాటులో ఉండేవి. ఇతర కళాకారుల బొమ్మలు అరుదుగా లభ్యమయ్యేవి. వారి గురించీ అతి తక్కువగా తెలిసేది. అలా సినిమాల ద్వారా పరిచయమై తనదంటూ ప్రేక్షక హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుని కూడా వ్యక్తిగతంగా అజ్ఞాతంగానే ఉండిపోయిన అత్యద్భుతమైన కళాకారులలో ప్రఖ్యాత దర్శకుడు, జానపద, మాయమంత్రాల సినిమాల ద్వారా కనీసం రెండు తరాల ఊహలను ప్రభావితం చేసినవాడు విఠలాచార్య. అందుకే విఠలాచార్య గురించి కనీస సమాచారం తెలియజేస్తూ, ఆయనతో కలిసి పనిచేసిన వారి ఇంటర్వ్యూల ద్వారా విఠలాచార్య వ్యక్తిత్వాన్ని, పనితీరును ఆవిష్కరిస్తూ అందించే పులగం చిన్నారాయణ రూపొందించిన ‘జై విఠలాచార్య’ పుస్తకం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది.

ఇటీవలి కాలంలో తెలుగు లోనూ సినిమాలపై పుస్తకాలు వస్తున్నాయి. పేరుపొందిన కళాకారులు మరణించినప్పుడు వారి గురించి సావనీర్లు విడుదల చేయటం తరచు జరుగుతోంది. జీవిత చరిత్రలు ప్రచురితమవుతున్నాయి. అయితే, విఠలాచార్య పుస్తకాన్ని వీటన్నింటికీ భిన్నంగా తీర్చిదిద్దారు పులగం చిన్నారాయణ. సినిమా పుస్తకాలు రూపొందించటంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించిన చిన్నారాయణ విభిన్నంగా రూపొందించిన పుస్తకం ‘జై విఠలాచార్య’ . ఈ పుస్తకంలో విఠలాచార్య జీవిత చరిత్ర  ఒక పేజీలో మాత్రమే ఉంది. కానీ మిగతా అన్ని పేజీలలో విఠలాచార్య పలు విభిన్నమైన రూపాలలో, విశిశ్టమైన రీతిలో విశ్వరూప ప్రదర్శన చేస్తున్న భావన కలుగుతుంది.

వి.ఎ.కె. రంగారావు వ్యాసంలో విఠలాచార్య ‘సంగీత దర్శకులెవరైనా తనకు నచ్చిన సరకు వారి నుంచి రాబట్టే’ కళ గురించి తెలుస్తుంది. టికెట్ కొనుక్కునే ప్రేక్షకులు ఫస్ట్ నుంచి చివరి సీన్ వరకూ ఆనందంగా ఉండాలి. అదొక్కటే ధ్యేయంగా, ధ్యాసగా పని చేసేవారని ‘ఎడిటర్ మోహన్’ ఇంటర్యూలో తెలుస్తుంది. విఠలాచార్య గారు ‘మాట విషయంలో, డబ్బు విషయంలో చాలా పక్కాగా ఉండేవార’ని విఠలాచార్య పెద్ద కొడుకు బి. వి. శ్రీనివాస్ ఇంటర్వ్యూలో తెలుస్తుంది. ‘దర్శకునిగా ఆయన చేసిన ప్రయోగాలు, నిర్మాతగా  ఆయన చూపిన మార్గం ఎందరికో ఆదర్శం’ అన్న విషయం మూడో తనయుడు పద్మనాభ ఆచార్య ద్వారా తెలుస్తుంది. ఈయనే వెల్లడించిన మరో విషయం ‘సినిమా ఫీల్డుకి వెళ్ళకూడద’ని పిల్లలతో ఒట్టు వేయించుకోవటం. విఠలాచార్య సున్నిత మనస్తత్వం, దానగుణం ఆయన పెద్దమ్మాయి రాధ ఇంటర్యూలో తెలుస్తుంది. ‘నాకు ఈ జీవితం చాలు. జీవితంలో అన్నీ చూశాను. మనవళ్ళు, మనవరాళ్లను చూశాను. ఇంకా జీవించాలని ఆశ లేదు’ అంటూ విఠలాచార్య సంతృప్తిగా మరణించారని విఠలాచార్య ఆఖరి కూతురు లలిత ద్వారా తెలుస్తుంది. విఠలాచార్య దేశభక్తి, స్వాతంత్ర్ర్య పోరాటంలో పాల్గొన్న గాథలు ఆయన రాసిన వ్యాసం ద్వారా తెలుస్తాయి. విఠలాచార్య మాతృభాష ‘తుళు’ అని, వాళ్లు ఉడిపి బ్రాహ్మణులు, పూజలు పునస్కారాలు బాగా ఎక్కువ అని, ఆధ్యాత్మిక అంశాలపై శ్రద్ధ అధికం అని విఠలాచార్య శిష్యుడు, దర్శకుడు రోస్ రాజా ద్వారా తెలుస్తుంది. విఠలాచార్యలా మాయాజాలం చేసేవారు ఎవరూ లేరని అంటూ, జయమాలిని పంచుకున్న అనుభవాలు ఆసక్తికరంగా, అద్భుతంగా ఉంటాయి. తెర పైని నటికీ, నిజ జీవితంలో వ్యక్తికీ ఎంత తేడా! అనిపిస్తుంది. విఠలాచార్య నవ్వుతూ పని చేయించుకునేవారని, కొత్తవారికి ప్రోత్సాహమిచ్చేవారనీ, అలాంటి నిర్మాతలు కొందరు ఉంటే చాలు ఇండస్ట్రీ మరో రకంగా ఉంటుందన్న అభిప్రాయం నటుడు నరసింహరాజు ఇంటర్య్వూలో కనిపిస్తుంది. విఠలాచార్య గారు పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ హాస్య ప్రియులని సారథి వ్యాసం ద్వారా తెలుస్తుంది. నటి ప్రభ ఇంటర్వ్యూలో చెప్పిన అనుభవాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. తప్పనిసరిగా తెలసుకోవాల్సిన అనుభవాలివి. ‘విఠలాచార్య అబద్ధం ఆడరు. అబద్ధం ఆడినవారిని విశ్వసించరు. నిజాయితీపరుడు. ఎవ్వరికీ ఇవ్వవలసి సొమ్ము ఎగగొట్టరు. తనను సహాయం కోరినవారికి తృణమో పణమో సహాయం చేసి పంపుతారు తప్ప ఉత్త చేతులతో పంపరు’ అన్న విషయాలు ఫిల్మ్ జర్నలిస్టు ఏచూరి ద్వారా తెలుస్తాయి. ‘ఫిల్మ్ మేకింగ్ మీద ఆయనకున్న పట్టు అపారం. ఏదైనా చాలా పక్కాగా ఉంటుంది’ అంటూ తన అనుభవాలను వివరించారు పద్మకుమార్. ‘నా లాంటి పిల్లల కోసం మాయా ప్రపంచం సృష్టించిన విశ్వామిత్రుడు విఠలాచార్య’ అంటూ, ‘మనలో ఆ పచ్చితనాన్ని, పసితనాన్ని కాపాడుకోగలినంత కాలం – విఠలాచార్య సినిమాలు ఏ జనరేషన్‌ని అయినా ఎంటర్‍టైన్ చేస్తాయి’ అని తీర్మానించారు తోట ప్రసాద్. ఇలా, ఈ పుస్తకం , ఒక పుస్తకాన్ని చదువుతున్నట్టు కాక, పలువురితో సంభాషిస్తున్నట్టు, ఆ సంభాషణల ద్వారా పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటున్న భావనను కలిగిస్తుంది.  ఇవి కాక, ‘యన్టీఆర్ మారువేషాలలో విఠలాచార్య చేసిన మాయ!’, ‘వసూళ్ళ వర్షం కురిపించిన కాంబినేషన్’ అన్న వ్యాసాలు అత్యంత ఆసక్తికరమైన సమాచారాన్ని, విశ్లేషణనూ అందిస్తాయి.

ఇంటర్యూలు, వ్యాసాలతో పాటు విఠలాచార్య నిర్మించిన ప్రతి సినిమా కథ, కళాకారులు, సినీ నిర్మాణంలోని అసక్తికరమైన అంశాలు, గమ్మత్తైన కథలు, నటీనటుల అనుభవాలతో ‘జై విఠలాచార్య’ పుస్తకం అత్యంత వినోదాత్మకమూ, ఆసక్తికరమూ అవటంతో పాటు విఠలాచార్యకు సంబంఢించిన విషయాల  ఎన్‍సైక్లోపీడియా అనదగ్గ స్థాయిలో ఉంది. ఈ పుస్తకంలో వ్యాసాల అమరిక కూడా అత్యంత సృజనాత్మకంగా ఉంది. పలువురు ఒకే రకమైన విషయాలు చెప్పినా, వ్యాసాలు, ఇంటర్వ్యూల నడుమ ఎడం ఉండటంతో, పైగా అవి ఆయా వ్యక్తుల అనుభవాలు కావటంతో అత్యంత ఆసక్తికరంగా చదివిస్తాయి. ఇంటర్యూలలో పలువురు చెప్పిన విషయాలు, ఆనాటి సినీరంగంలో నెలకొని ఉన్న పరిస్థితులతో పాటు విఠలాచార్య పనితీరు, వ్యక్తిత్వం, సృజనాత్మకత వంటి పలు అంశాలను ప్రస్ఫుటం చేస్తాయి. అందుకే దాదాపుగా ఆరు వందల పేజీలున్నా, పుస్తకం ఏకబిగిన చకచకా చదివేసే వీలుండడమే కాదు, చదువుతుంటే కలిగే ఆసక్తి, ఆనందాల వల్ల ఆరు వందల పేజీల పుస్తకం చదివిన అలసట కలగదు. ఇంకా ఇంకా చదవాలని పిస్తుంది. ఈ పుస్తకంలో కళాకారులు వివరించిన అనేక సంఘటనలు, తెలియబరిచిన అనుభవాలు పదే పదే చదివిస్తాయి. మనసుకు హత్తుకుపోతాయి. అంటే ఈ పుస్తకం ఒక జీవిత చరిత్ర కాని జీవిత చరిత్ర అన్నమాట. జీవిత చరిత్ర రచనలో వ్యక్తి జీవితంలోని సంఘటనలు వివరిస్తూ, వ్యక్తిత్వాన్ని విశ్లేషించటం ఉంటుంది. ఈ పుస్తకంలో ఆ పని ఇంటర్వ్యూలు, వ్యాసాలు చేశాయి. పొందుపరిచిన సినిమాల వివరాలు ఈ నడుమ వచ్చి ఇంటర్వ్యూలు, వ్యాసాలలో వ్యక్తి వివరాలు, వ్యక్తిత్వ విశ్లేషణలకు రూపం ఇస్తాయి. దాంతో పుస్తకం చదువుతున్న పాఠకుడు తనంతట తానే విఠలాచార్యను వ్యక్తిగా అర్థం చేసుకుంటాడు. వ్యక్తిత్వాన్ని గ్రహిస్తాడు. కళా ప్రతిభను అవగాహన చేసుకుంటాడు.

  పుస్తకాన్ని సైతం ఎంతో అందంగా, జాగ్రత్తగా రూపొందింఛారు. ఖరీదైన పేజీలతో, చక్కని ఫోటోలతో, అత్యంత ఆకర్షణీయమైన ముఖచిత్రంతో   ‘జై విఠలాచార్య’ పుస్తకం విఠలాచార్య అభిమానులకు ఎలాగో ఆనందం కలిగిస్తుంది. ఆయనను నవతరానికి పరిచయం చేసి ఆయన సినిమాలను చూసేట్టు చేస్తుంది. ఎందుకంటే విఠలాచార్యలో మన్‍మోహన్ దేశాయ్, స్టీవెన్ స్పీల్‍బెర్గ్, జేమ్స్ కేమరూన్ వంటి వారందరూ కనిపిస్తారు. వీరందరూ ఆయన తరువాత వారేనన్న విషయం గ్రహిస్తే విఠలాచార్య గొప్పతనం తెలుస్తుంది. చక్కటి పుస్తకాన్ని అందింఛిన పులగం చిన్నారాయణ అభినందనీయుడు. సినీ అభిమానులందరూ, కొని, చదివి రిఫరెన్స్ పుస్తకంలా దాచుకోవాల్సిన పుస్తకం ఇది.

***

జై విఠలాచార్య
రచన: పులగం చిన్నారాయణ
ప్రచురణ: మూవీ వాల్యుమ్ మీడియా, హైదరాబాద్
పేజీలు: ‎ 528
వెల: ₹ 650.00
ప్రతులకు:
ఫోన్: 9640254786
సాహితీ ప్రచురణలు, విజయవాడ. ఫోన్: 8121098500
నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఆన్‍లైన్‍లో:
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1307&BrandId=18&Name=jai+vittalacharya
https://www.telugubooks.in/te/products/jai-vittalachaarya

~

‘జై విఠలాచార్య’ పుస్తక రచయిత శ్రీ పులగం చిన్నారాయణ ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-pulagam-chinnarayana/

Exit mobile version