జైత్రయాత్ర-1

2
2

[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

~

అంకితం

తన కవితలతో నన్ను ఉత్తేజపరిచి, ఈ నవల రాసేందుకు నాకు స్ఫూర్తినిచ్చి, చిన్న వయసులోనే పరమపదం చేరిన నా సోదరుడు కస్తూరి వేణుగోపాల్ కు జైత్రయాత్ర నవలను అంకితం చేస్తున్నాను – కస్తూరి రాజశేఖర్.

~

కస్తూరి వేణుగోపాల్ గారి సంక్షిప్త పరిచయం:

శ్రీ కస్తూరి వేణుగోపాల్ 30-08-1959న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు జిల్లా కనగల లో, ఉన్నత పాఠశాల విద్య తెనాలిలో పూర్తిచేశారు. నెల్లూరులో ఐటిఐ (ఎలెక్ట్రానిక్స్) చదివారు. ఓపెన్ యూనివర్సిటీ నుంచి బిఎ చేశారు. 1981 నుంచి హైదరాబాద్‍లో స్థిరపడ్డారు. రుద్రారం లోని నాగార్జున సిగ్నోడ్ లోనూ, జీడిమెట్ల లోని న్యూకాన్ ఇండ్రస్ట్రీస్ లోనూ పని చేశారు. 1978-1990 మధ్య వీరి కథలు, కవితలు అన్ని ప్రసిద్ధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారమయ్యాయి. పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. అనారోగ్యంతో 31 ఏళ్లకే 05-06-1990 నాడు స్వర్గస్థులైనారు.

అధ్యాయం-1

[dropcap]యా[/dropcap]త్ర ప్రారంభమైంది.

సాయంకాలం ఆరుగంటలయ్యింది. వేసవి కావటంతో ఇంకా వెలుతురుగానే ఉంది. కాలేజీ ఆవరణ అంతా సందడిగా ఉంది.

అది కాలేజీ గ్రౌండు నుంచి బయల్దేరుతున్న ఎన్ సి సి సమ్మర్ క్యాంపు బస్సు. దాదాపు విద్యార్థులందరూ ఎక్కేసారు. ఎన్.సి.సి అధికారి, సోషల్ స్టడీస్ లెక్చరర్ వెంకట్రావు మరొక్కసారి అన్ని ఏర్పాట్లూ పర్యవేక్షించి వచ్చి బస్సు ఎక్కి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. బస్సు బయల్దేరింది.

ఉన్నట్టుండి.. పెద్ద శబ్దం.. డ్రైవర్ ఉలిక్కిపడి సడన్ బ్రేక్ వేశాడు. బస్సు డోరు దబదబ లాడింది. అందరూ భయంగా అటుకేసి చూశారు.

ఎడ మూట, పెడ మూటలతో సుబ్బిగాడు ఉరఫ్ సుబ్రహ్మణ్యం ఆపసోపాలు పడుతూ బస్సు ఎక్కి తన భారీ కాయాన్ని సీటు దగ్గరికి జార్చి కూర్చున్నాడు. మూటలు దారికి అడ్డంగా పడి ఉండటంతో అందరూ కోపంగా చూసారు. క్లీనర్ వాటిని మళ్ళీ కిందకు తీసుకెళ్లి బస్సు వెనక ఉన్న లగేజి కేబిన్‌లో పడేసి వచ్చాడు. దాంతో ప్రాణం పోయినవాడిలా వాడిపోయాడు సుబ్బిగాడు.

వెంకట్రావు అతడి వంక కోపంగా చూస్తూ “ఇప్పటిదాకా ఇక్కడే తగలడ్డావ్‌గా.. అంతలోనే ఎటు పోయావ్? ఉన్న భారీ లగేజీకి తోడు మళ్ళీ రెండు మూటలేసుకొచ్చావ్?” అన్నాడు.

సుబ్బిగాడు ఆయాసం తీర్చుకుంటూ బాధ దిగమింగుకుంటూ, “మా అమ్మమ్మ నా కోసం చేసిన చక్కిలాలూ సున్నుండలూ మర్చిపోయానని పనివాడికిచ్చి పంపిందండీ. అవి తీసుకోవటానికి వెళ్లాను.”

“ఇప్పటికే నూట పది కిలోలు ఉన్నావ్. మార్నింగ్ ఎన్.సి.సి. పెరేడ్‌లో పెట్టే టిఫిన్లు సగం పైగా నువ్వే తింటావ్.. ఇంకా ఈ చిరుతిళ్ళు కూడానా?”

అదేమీ పట్టించుకోకుండా తన పక్కసీట్లలో కూర్చున్న ఆంజనేయులు, శ్రీనివాస్‌తో ముచ్చట్లాడసాగాడు.

వెంకట్రావు కేబిన్ లోంచీ బస్సు లాబీ లోకి వచ్చి నిలబడి “డియర్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు వెళ్తోంది దేశపటంలో కంటికానని ఓ పల్లెటూరికి. అక్కడికి బస్సులు వెళ్ళవ్. దగ్గరున్న టౌన్‌కి వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు నడవాలి. సరైన రోడ్డు లేదు. కరెంటు పోతే ఎప్పుడొస్తుందో తెలీదు. ఆరోగ్య కేంద్రాలకు సరైన సదుపాయాలు లేవు.

ఎన్.సి.సి సమ్మర్ క్యాంపులో భాగంగా మనం ఆ ఊరి వాళ్లకు అండగా ఉంది మనకు చేతనైన సహాయం చేదాం. గాంధీ గారు అన్నట్లు ‘దేశం యొక్క హృదయం గ్రామాల్లో ఉంది’. మీ యువత ఆ హృదయాన్ని తాకి తరించిపోవాలి. భవిష్యత్తులో మీ వంతు కృషిగా గ్రామాభ్యుదయానికి పాటుపడాలి.”

“ఓ కే సార్” అందరూ పెద్దగా అరిచారు.

వెంకట్రావు అందర్నీ నవ్వుతూ చూసి అంతలోనే అనుమానంగా “అవునూ.. ఈ క్యాంపులో భాగంగా ఒక కండిషన్ పెట్టాను. గుర్తుందా?”

అందరూ మొహమొహాలు చూసుకున్నారు.

“అదే.. ఎవ్వరూ మొబైల్ ఫోన్లు వెంట తెచ్చుకోకూడదు. మర్చిపోయారా?” కోపంగా చూసాడు. వెంటనే “ఆంజనేయులూ.. లేచి అందరి దగ్గరికీ వెళ్లి చెక్ చేసి మొబైల్ ఫోన్ ఉంటే తీసుకొచ్చి డ్రైవర్ దగ్గర ఉన్న నా బాగ్‌లో పడేయి. అలాగే దిగింతర్వాత వాళ్ళ లుగేజ్ కూడా చెక్ చేసి నాకు కంఫర్మ్ చేయి. ఓ కే?” అంటూ తన సీట్ లోకి వెళ్ళాడు. ఆంజనేయులు లేచి అందరినీ చెక్ చేయటం మొదలెట్టాడు.

క్యాబిన్‌లో వెంకట్రావు డ్రైవర్ ప్రక్కనే కూర్చుని రోడ్డు కేసి చూస్తున్నాడు. బస్సు జోరుగా పోతోంది. సిటీ లిమిట్స్ దాటింతర్వాత స్పీడ్ పెంచాడు డ్రైవర్. రాత్రి తాగింది దిగినట్టు లేదు. వెంకట్రావు హెచ్చరించినా వినిపించుకోవటంలేదు.

బస్సు ఏదో ఊర్లోకి ప్రవేశించింది. ఊరిచివర కాలనీ లాగ ఉంది. వీధి దీపాల వెలుతురులో చిన్న చిన్న మగ పిల్లలు అర్ధనగ్నంగా క్రికెట్ ఆడుతున్నారు రోడ్డుకి అడ్డంగా. పెద్దవాళ్ళు రోడ్డు ప్రక్కనే ఉన్న బంకులో కూర్చుని టీ త్రాగుతూ రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. దేశంలోని వెనుకబడ్డ గ్రామాలకు నమూనా రూపంగా ఉంది ఆ కాలనీ. అలాంటి కాలనీలు ఎన్నింటినో దాటుకుంటూ పోతోంది బస్సు.

వెంకట్రావులో ఆలోచనలు. ఈ సారి సమ్మర్ క్యాంపు కమ్యూనిటీ సర్వీసెస్‌గా డిక్లేర్ చేశారు ఎన్.సి.సి జిల్లా అధికారులు. అందుకే దూరంగా ఉన్న కొండ ప్రాంత గ్రామాన్ని ఎంచుకున్నాడు తను. తన ఆదర్శాలకు ఎన్.సి.సి. వేదికగా తన వంతు కృషి చేయగలుగుతున్నాడు.

కానీ ఈసారి తీసుకున్న లక్ష్యం తన ఆదర్శానికే పరీక్షగా మారబోతోందని తెలీదు వెంకట్రావుకి.

***

బస్సులో అందరూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. మొబైల్ ఫోన్లు లేకపోయేసరికి ఒక అరగంట సేపు ఏదో కోల్పోయినవాళ్ల లాగా ఉండిపోయారు. క్రమంగా ప్రక్కవారితో మాట కలిపి తొందరగానే కలివిడిగా మాట్లాడటం మొదలెట్టారు. ఎన్నో రోజులుగా కలవని వాళ్ళు కలసినట్లు ఆత్మీయంగా పలకరించుకుంటున్నారు. ‘సాంకేతిక పనిముట్లు బంధాలు కలుపుకోవటానికి పనికి వస్తాయేమో కానీ నిలుపుకోవటానికి కాదు’ అనిపిస్తోంది వాళ్ళని చూస్తుంటే.

కాలేజీలో త్రిమూర్తులుగా పేరుపడ్డవాళ్లు – సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, ఆంజనేయులు.

సుబ్రహ్మణ్యం ఉరఫ్ సుబ్బిగాడు – లావుగా పొట్టిగా గుమ్మడికాయలా ఉంటాడు. తిండిబోతు.

శ్రీనివాస్ ఉరఫ్ శ్రీను – వంకీల జుట్టుతో చామన ఛాయలో ఉంటాడు. భావకవి. ఎక్కువ మాట్లాడడు.

ఆంజనేయులు ఉరఫ్ అంజిగాడు – షోకిల్లాలా రంగు రంగుల బట్టలు వేస్తూ ఉంటాడు. చలాకీ కుర్రాడు. ఈజీ గోయింగ్!

మాటల మధ్యలో సుబ్రహ్మణ్యం ఆంజనేయుల్ని చూస్తూ, “ఒరేయ్ అంజీ.. మనం నెలరోజుల్దాకా ఏదో మూల ఉన్న విలేజ్‌లో పడుంటాం. ఫోన్ ఉండదు కదా.. మరి నీ వనజా డార్లింగ్ విరహాన్ని భరించగలుగుతుందా?”

“ఆ.. వీడి ముద్దు కోసం కనిపెట్టుకుని ఉంటుందా ఏంటీ!? అయినా ఆ అమ్మాయి కంప్లైంట్‌తో వాళ్ళ నాన్న, మన ప్రిన్సిపాల్ అయిన శ్రీమాన్ చంద్రశేఖర్ రాయలవారు వీడు చేసిన పనికి పనిష్మెంట్ రెడీ చేసే ఉంటాడు. మన క్యాంపు అయి తిరిగిరావటం, వీడ్ని కాలేజీ నుంచి తరిమేయటం జరగక తప్పదు.” అన్నాడు శ్రీనివాస్.

ఆంజనేయులు శ్రీనివాస్ వంక గుర్రుగా చూసి “అపశకున పక్షీ..” అన్నాడు.

“అయినా.. నీకారోజు అంత ధైర్యం ఎలా వచ్చిందిరా?” ఆశ్చర్యంగా అడిగాడు సుబ్రహ్మణ్యం.

ఆంజనేయులు వాడికేసి హీరోలా చూస్తూ “మరి … ఆంజనేయులంటే ఎవరనుకున్నావ్?” అన్నాడు.

“కొంపదీసి ముద్దుకు ముందు ఆంజనేయ దండకం చదివావా ఏమిటీ?” అన్నాడు శ్రీనివాస్.

“అది చదివేది నీలాంటి భక్తులే.. ఆంజనేయుడు కాదు రా భడవా!” మరింత గర్వంగా ఫోజు కొట్టాడు ఆంజనేయులు.

సుబ్రహ్మణ్యం నిరాశగా, “ప్చ్.. ఈ నెల రోజులు.. ప్రపంచంతో మనకు సంబంధాలే ఉండవ్. ద్వీపాంతరవాస శిక్ష లాగా బ్రతకాల్సిందే. సినిమాలూ, షికార్లూ, బార్లూ, గుళ్ళూ, దేవతలూ ఉండరన్నమాట.”

“ఎందుకురా సుబ్బీ తెగ బాధపడిపోతావ్? నిన్నటి అనుభవాల్ని గుర్తుకుతెచ్చుకుంటూ బ్రతికేస్తే సరి” అన్నాడు శ్రీనివాస్.

బస్సు స్పీడ్‌గా పోతోంది. అంతకంటే వేగంగా వాళ్ళ మనసులు స్మృతుల్లోకి పరిగెత్తినయ్.

***

“సావధాన్”

గంభీరమైన కంఠం ఆ కాలేజీ ప్లే గ్రౌండ్‌లో ప్రతిధ్వనించింది. స్టిఫ్‌గా నిలబడి ఎన్.సి.సి. క్యాడెట్ల కేసి తృప్తిగా చూసాడు వెంకట్రావు. వాళ్లంతా ఆ కాలేజీలో చదివే విద్యార్థులు. వెంకట్రావు ఎన్.సి.సి. కాలేజీ వింగ్ కమాండర్. హిస్టరీ లెక్చరర్.

అందర్నీ ఆమూలాగ్రం పరిశీలిస్తున్నాడు. వాళ్ళ బూట్ల పోలిష్ దగ్గర నుంచీ, బెల్ట్ బకెల్ వరకూ, డ్రెస్ ఇస్త్రీ నుంచి టక్ చేసే విధానం వరకూ, తళ తళా మెరిసే ఎన్.సి.సి. బాడ్జినీ పరీక్షగా చూస్తూ, ఏ ఒక్క లోపం కనిపించినా లైన్ లోనుంచి బయటకు తీసి గ్రౌండ్‌లో రౌండ్స్ వేయిస్తున్నాడు.

“విశ్రామ్”

జన్మలో మొదటిసారి ఊపిరి పీల్చుకున్నట్లు మళ్ళీ ఆ అవకాశం రాదేమోనన్నట్లూ క్యాడెట్స్ అందరూ పెద్ద శబ్దంతో శ్వాస తీసుకుంటున్నారు. పాముల గుంపు బుస కొట్టినట్టు వినిపిస్తున్న శబ్దానికి వెంకట్రావు ఉలిక్కిపడి అందరివంక కోపంగా చూసాడు.

వాళ్ళకదేం పట్టట్లేదు. కొందరు గూడలు జారేసారు. ఇంకొందరు గుసగుసలు, మరికొందరు నడుములు వాల్చి ఒంటికాలుమీద కుంటి గుర్రాల్లా నిలబడ్డారు.

“అటెంషన్” గర్జించాడు వెంకట్రావు .

అష్టావక్రులంతా అవలక్షణాలు మానేసి బుద్ధిగా నుంచున్నారు.

“‘విశ్రామ్’ అంటే కాస్త రిలాక్స్ అవ్వటానికి మాత్రమే.. అంతే కానీ ముసలమ్మల్లా గూండాలు వాల్చేందుకు, ముచ్చట్లు పెట్టేందుకు కాదు. ఎన్.సి.సి అంటే పారా మిలిటరీ దళం లాంటిది. పెరేడ్‌లో పెట్టే ఇడ్డెన్లకి ఎగబడి యుద్ధం చేయటం కాదు. అవసరమైనప్పుడు దేశంకోసం యుద్దానికి సిద్ధం కావాలి. అండర్‌స్టాండ్?”

“మేమెప్పుడూ కిందనే నుంచున్నాము సార్.. మళ్లీ అండర్ అంటే పాతాళంలోకి వెళ్లి స్టాండ్ అవ్వాలి” వెనుక వరుస లోంచీ నీరసంగా ఓ గొంతు.

“దేశం గురించి తర్వాత.. ముందు ఆకలి గురించి అండర్‌స్టాండ్ చేసుకోండి సార్” ప్రక్కనుంచి మరో గొంతు.

“షటప్.. డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు అరవటానికి ఇదేమీ అసెంబ్లీ కాదు.. మైండ్ ఇట్.. ఆఁ! హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయొద్దు” అరిచాడు వెంకట్రావు .

“మిమ్మల్ని మీరు మా బాగా పోల్చుకున్నారే” ప్రక్క వరుసలోంచీ ఆంజనేయులు .

ఈలోపు పనిష్‌మెంట్ రౌండ్లు వేసిన క్యాడెట్స్ ఓ ప్రక్కగా నిలబడ్డారు.

వెంకట్రావు ‘సావధాన్’ కాషన్ ఇచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చాడు.

వరుసలో మొదట నిలబడి ఉన్నాడు సుబ్రహ్మణ్యం. తీక్షణంగా అతణ్ణి చూస్తూ “ఒరేయ్.. ఆ బెల్ట్ చూడు పొట్ట మీద నుంచీ జారి కిందపడుతోంది. ఇన్నాళ్ల పెరేడ్‌లో కూడా పొట్ట తగ్గలేదు. మీ నాన్న అడిగి మరీ నిన్ను ఎన్.సి.సి.లో జేర్చాడు. అసలు నీకు ఏమన్నా ఇంటరెస్ట్ ఉందా?”

“అయ్యో సార్.. నాకు చాలా ఇంటరెస్ట్ ఎన్.సి.సి అంటే..”

“ఎందుకు రా?”

“రోజుకో రకం టిఫిన్ పెడతారు సార్.. మా ఇంట్లో ఎక్కువమంది ఉండేసరికి రోజూ ఇడ్లీలే సార్” చొంగ కార్చుకుంటూ చెప్పాడు ఆంజనేయులు.

“ఆ లేసుల్లేకుండా బూట్లు.. పోలిష్ లేదు.. ఎలా ఉన్నావో తెలుసా?”

“కుష్ఠు వాళ్ళలా ఉన్నాడు సార్” ఎవరో వెనుకనుంచి.

“షటప్. మీరిలా కొంటె కూతలూ, కుంటి సాకులూ చెబితే ఈ పూట టిఫిన్ క్యాన్సిల్ చేస్తా.. సుబ్బీ.. అర్థమైందా?”

హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. వెంకట్రావు ముందుకు కదలి బుడబుక్కలవాడిలాగా డ్రెస్ చేసుకున్న ఆంజనేయులు దగ్గరకొచ్చాడు.

“ఏమిటయ్యా ఇది? డ్రెస్సేనా.. ఎన్.సి.సి. డ్రెస్సేనా అంట? ఇంత లూజుగానా ఉంచేది? మీ తమ్ముణ్ణి కూడా ఇందులో వేసుకుని రాకబోయావ్?” వెటకారంగా అన్నాడు వెంకట్రావు .

“లాస్ట్ ఇయర్ మా అన్న కిచ్చిన డ్రెస్ ఇది.. ఇప్పుడు నా కిచ్చారు మీరు. అప్పుడే చెప్పాను కదా సార్ లూజుగా ఉందని.. ఫండ్స్ లేవు ప్రస్తుతానికి సర్దుకో అని మీరే అన్నారుగా?”

“సరి సరి.. రేపు టైలర్ కిచ్చి సైజు చేయించుకో.. ఈ చిరుగు లేంటీ?” మాట మారుస్తూ అడిగాడు వెంకట్రావు.

“ఎలిక్కొట్టేసింది సార్”

“చూస్తూ కూర్చున్నావా? మందు పెట్టి చంపొద్దూ?”

“మందు పెడితే చావకపోగా పందికొక్కుల బలిసి పోయింది సార్”

“అదేంటీ?”

“కల్తీ సార్ కల్తీ.. పురుగుల మందులూ, ఏలికల మందులూ, స్ప్రేలూ ఒకటేమిటీ, కల్తీ నవ్వులూ, కల్తీ మందులూ, కల్తీ మనుషులూ, కల్తీ మనసులూ.. అన్నీ కల్తీనే సార్.. బ్రతికించాల్సిన మందులు చంపుతున్నాయి. చంపాల్సిన మందులు బ్రతికిస్తున్నాయ్.”

“సరేలే.. తప్పు చేసింది కాక వెధవ సమర్థనలూ.. పైగా రాజకీయ ఉపన్యాసాలూ.. హు.. మీ కెందుకురా ఎన్.సి.సిలూ? ప్రజాసేవలూ?” అన్నాడు వెంకట్రావు తలపట్టుకుంటూ.

“రేపటి దేశ నాయకులం మేమే కదండీ” వెనుకనుంచీ ఎవరో..

“చాల్చాల్లే.. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేడిస్తే దేశాన్ని ఉద్దరించినట్లే” అంటూ శ్రీనివాస్ కేసి నడిచాడు వెంకట్రావు.

“ఏవోయ్ శ్రీనివాసూ? పాలిష్ చేసుకునేందుక్కూడా టైంలేనంత బిజీనా తమరు.. అవి బూట్లా? కుక్క తోళ్లా? సిగ్గులేదూ?”

శ్రీనివాస్ వెంకట్రావు వైపు కళ్లెర్రజేసి చూస్తూ సహజధోరణిలో కవిత అందుకున్నాడు –

“బ్రూట్ల ఉక్కు బూట్ల కింద
నా దేశమాత నగ్నంగా నలుగుతోందిక్కడ
నిస్సహాయంగా మూలుగుతోందిక్కడ
నేస్తం!
అందుకే నిన్ను ఆవహిస్తున్నాను.. ఆహ్వానిస్తున్నాను
రా! రేపటి ప్రపంచంలోకి..”

వెంకట్రావు అర్థం కాని అయోమయంలోంచీ ఉలిక్కిపడి తేరుకున్నట్లు –

“ఆపు.. ఆపేయ్.. ఇక ఆపేయ్ అంతే! నేనేదో దోపిడీదారుణైనట్లు, నీవో పిచ్చి పీడితుడివైనట్లూ ఏవిటా కవిత్వం? రాయంగానే సరిగాదు. సరైన సమయంలో వాడటం నేర్చుకో.. అది తెలియకపోతే, ఎంత గొప్ప కవిత్వమైనా చప్పబడిపోతుంది” అన్నాడు ఆయాసపడిపోతూ.

ఇక అలసిపోయి “మీరందరూ రైఫిల్ మోస్తూ ఒక రౌండ్ వేసి రండి. మిగిలిన వారంతా ఎక్సర్‌సైజు మొదలెట్టండి” కాషన్ ఇచ్చాడు.

పెరేడ్ తప్పిపోయినందుకు ఆనందపడుతూ రైఫిళ్లను భుజాలకెత్తుకుని పరుగు ప్రారంభించారు.

***

ఆ విశాలమైన గ్రౌండ్‌లో మరో ప్రక్క కొంతమంది అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ప్రిన్సిపాల్ గారి అమ్మాయి వనజ బంతిని బలంగా తన్నింది. ఎటో చూస్తూ పరిగెడుతున్న సుబ్రహ్మణ్యం కాలికి తగిలింది. బంతి మరింత వేగంగా ముందుకు వెళ్ళింది. వనజ పరిగెత్తుకు రావటం చూసి మరింత హుషారుగా బంతిని ఆమెకు దొరక్కుండా తన్నుకుంటూ పోసాగారు మిత్రత్రయం.

వనజ వాళ్ళ వెనుకే పరిగెత్తుతూ –

“ఏయ్.. నా బాలివ్వు.. లేకపోతే మా డాడీతో చెప్పి.. చెప్పి..” వగరుస్తూ నిలబడిపోయింది.

“ఒరేయ్ అంజీ.. ఆ పిల్ల వాళ్ళ నాన్నతో నీ సంగతి చెప్తుందంటా..”

“ఊ.. చెప్పి..”

“పెళ్లి చేసుకుంటుందేమోరా”

“ఇంకేం.. ఈ నెల్లో చాలా ముహూర్తాలున్నాయిలే “

“అవునా.. అయితే ప్రోసీడ్”

వాళ్ళ అల్లరికి వనజ ఏడుపు ముఖం పెట్టింది. ఈ లోపు వనజ టీం సభ్యులు వెళ్లి వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ గారి అమ్మాయనేసరికి చలిజ్వరం వచ్చిన వాడిలా వణికిపోయాడు వెంకట్రావు. పరిగెత్తుకుంటూ వచ్చాడు.

అతన్ని చూసి సుబ్రహ్మణ్యం “ఏంటి సార్.. మీకు కూడా పనిష్‌మెంట్ ఇచ్చారా.. పరిగెత్తుతున్నారు?” అన్నాడు

సుబ్రహ్మణ్యం చేతిలో బాల్ చూడగానే వెంకట్రావుకు అంతా అర్థమైంది.

“ఒరేయ్.. మీ వెర్రి వేషాలతో నిజంగానే నాకు పనిష్‌మెంట్ వచ్చేలా వుంది. మీరు ఎన్.సి.సి. క్యాడెట్లు. డిగ్నిఫైడ్‌గా ఉండాలిగానీ ఇలా అల్లరి పనులు చేస్తారా.. అసలు ఈ దేశం..”

 “అమ్మో.. దేశం సంగతి ఎత్తద్దు సార్” భయంగా చూస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం.

“ఇవ్వేళ మేం వనజను రక్షించాం సార్” అన్నాడు శ్రీనివాస్ కల్పించుకుంటూ.

“ఈజిట్..? ఆ పిల్లకేమైంది?” ఆశ్చర్యంగా చూసాడు వెంకట్రావు.

“ఏమో సార్.. ఉన్నట్టుండి అంజిగాడిని వాటేసుకుంది.. వాడు ముద్దెట్టుకోబోయాడు”

“ఆ పిల్ల చిన్న పిల్ల.. నీ బుద్ధేమైంది? ప్రిన్సిపాల్ గారి అమ్మాయిని అలా చేయొచ్చా?”

“ఒరేయ్.. విన్నార్రా.. ప్రిన్సిపాల్ గారి అమ్మాయిని వద్దు.. వేరే వాళ్ళని చేయొచ్చని సార్ చెబుతున్నారు.. వినండి.”

“అసలు వాడికి బుద్ది లేదండీ.. సమయానికి మేమడ్డు పడకపోతే..”

“ఆ.. పడకపోతే?”

“పాచిమొహం తోనే ఆ పాపకార్యం చేసేవాడు సార్”

“ఇందులో మా తప్పేం లేదు సార్” ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చాడు శ్రీనివాస్.

“షట్ అప్” అంటూ బాల తీసుకుని వనజకి ఇచ్చి పెరేడ్ దగ్గరికి వచ్చాడు. వెనుకనే మిత్ర బృందం అంత కదిలారు.

అక్కడ –

‘సావధాన్’లో ఉండే అందరూ ఈ తమాషా చూస్తూ సరదాగా జోకులేసుకుంటున్నారు. వెంకట్రావు తలపట్టుకు కూర్చున్నాడు.

“సార్, చూడండి.. వెనుకానుంచేవారో నా మీద రాళ్లేస్తున్నారు”

“ఈ షణ్ముఖం గాడు నా చెవిలో గడ్డిపరక దూరుస్తున్నాడు సార్” ఆక్రోశించాడు మరొకడు.

సహనం చచ్చిపోయింది వెంకట్రావుకి. విసుగు, కోపం, ఉక్రోషం, బాధ వగైరాలన్నీ ఒక్కసారిగా ముసురుకున్నాయి.

“ఛీ.. ఛీ.. అసలు మీలాంటి కోతి మూకని దేశభక్తులుగా క్రమశిక్షణ గల పౌరులుగా తయారు చేయాలనుకున్నానే.. నేను.. నేను పెట్టుకోవాలి గడ్డి..”

“ఎక్కడ సార్”

“సావధాన్” ఆవేదనగా కాషన్ ఇచ్చాడు.

“మేం సావధాన్ లోనే ఉన్నాం సార్”

“షట్ అప్. అటెంషన్”

అందరూ స్టిఫ్‌గా నిలబడ్డారు.

“చూడండీ.. వెధవ్వేషాలు మాని, నే చెప్పేది శ్రద్ధగా వినండి. శనివారంతో కాలేజీ అయిపోతుంది. సెలవల్లో ఊరికే తిని ఊరి మీద పడి తిరిగేస్తారు మీరు. నాకు తెలుసు. ఈసారి అలా కాదు.. ఎన్.సి.సి. తరఫున కమ్యూనిటీ సర్వీసెస్ ప్లాన్ చేశారు జిల్లా యూనిట్ వాళ్ళు. అందుక్కావలసిన పెర్మిషన్లు కూడా వచ్చినై. సీనియర్ క్యాడెట్స్ అందరూ ఆదివారం సాయంకాలానికి మీ మీ పెట్టా బేడా సర్దుకుని కాలేజీ గ్రౌండ్‌లో అసెంబిల్ అవ్వాలి. తెలిసిందా?” అన్నాడు వెంకట్రావు.

“ఎక్కడికెళ్తున్నాం సార్”

“ఎందుకు సార్”

“ఏం ప్రోగ్రామ్ సార్”

“ఏం చేయాలి సార్”

వివరాలు చెప్పసాగాడు వెంకట్రావు. “ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి గ్రామాలకు వెళ్లి మన శ్రమదానంతో చేతనైన సాయం చేద్దాం”

“ఎన్ని రోజులుండాలి సార్”

“నెలరోజులకు సిద్దపడదాం. మీకు అవసరమైన బట్టలు, ఇతర సామాన్లూ మర్చిపోకుండా తెచ్చుకోండి. ఎనీ డౌట్స్?”

“సినిమా హాళ్లు ఉంటాయా సార్”

“కేబుల్ టీవీలూ వైఫైలూ ఉంటాయా”

వెంకట్రావు అందరివంకా చూస్తూ, “ అవన్నీ ఉంటే మన అవసరం ఏముంది వాళ్లకి.. అక్కడ ఏ సౌకర్యం ఉండదు. పైపెచ్చు మీరు మొబైల్ ఫోన్లు తీసుకు రాకూడదు. మొబైల్ లేని జీవితం ఎంత ఒరిజినల్‌గా ఉంటుందో చూద్దాం”

అప్పటివరకూ తమని పిలవలేదని బాధపడుతున్న జూనియర్లు ఊపిరి పీల్చుకున్నారు.

“నెలరోజులు సినిమా లేకుండా నేను ఉండలేనురా” అన్నాడు సుబ్రహ్మణ్యం. అది విన్న వెంకట్రావు –

“అందుకే ప్రతిరోజూ సాయంత్రం మీరే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుని అక్కడి గ్రామీణులతో కలసి మెలసి జీవిద్దాం. వాళ్ళ దగ్గర్నుంచి నేర్చుకుందాం. వాళ్లకి మనం నేర్పుదాం. ఇది ఒక విధంగా సాంఘిక యాత్ర . శ్రీనివాస్.. ఇదుగో ఈ లిస్ట్‌లో ఎవరు రావాలో వాళ్ళ పేర్లు ఉన్నాయి, చదువు.”

శ్రీనివాస్ లిస్ట్ తీసుకుని పేర్లు చదివాడు.

“నౌ డిస్పెర్స్.. ఇంకా టిఫిన్ల కార్యక్రమం కానివ్వండి” అని తన రూమ్ కేసి నడిచాడు. మళ్ళీ ఎందుకో అనుమానం వచ్చి టిఫిన్లు పంచాకే వెళదామని వెనక్కు వచ్చాడు.

ఒకవైపు టిఫిన్ పెట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అండర్ ఆఫీసర్ అసమర్థ పర్యవేక్షణలో ఒక్కో క్యాడెట్ మూడేసి పొట్లాలు లాగించేస్తున్నారు. కొంతమందికి అసలు దొరకలేదు. వెంకట్రావు మళ్ళీ తెప్పించాడు కాంటీన్ నుంచి.

“సార్.. సుబ్బిగాడు ఏడోసారి టిఫిన్ ప్యాకెట్ తీసుకుంటున్నాడు సార్..”

“నీవుందుకిచ్చావ్?”

“నేను సన్నగా ఉన్నానని నన్ను తోసేస్తున్నాడు సార్”

“గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ కొట్టించు”

చేసిన తప్పుకు రౌండ్లకు బయలుదేరాడు సుబ్రహ్మణ్యం. ఇంతలో వెంకట్రావు దగ్గరికొచ్చి “వద్దులే, ఇంద నా ప్యాకెట్ తీసుకో.. పరిగెత్తితే ఆకలి ఎక్కువై నన్ను కూడా తినేస్తావేమో.. దేశంలో ఆహార కొరతపై నీవంతు కదరా?” అంటూ నీరసంగా ఇంటికేసి కదిలాడు వెంకట్రావు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here