జైత్రయాత్ర-10

0
1

[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[అది శ్మశానం. ఓ శవం కాలుతూంటుంది. చుట్టూ బంధుమిత్రులు నిలుచుని చిన్నగా రోదిస్తూ, కపాల మోక్షం కోసం ఎదురుచూస్తుంటారు. కాటికాపరి చంద్రయ్య తన పని అయిందనుకుంటూ ఇంటికెళ్ళి సారా తాగి, పెళ్ళాం రావులమ్మ వండి పెట్టిన బొమ్మిడాయిల పులుసుతో తాపీగా అన్నం తిని శ్మశానం మధ్యలో ఉన్న ఓ అరుగు మీద పడుకుని రాగాలు తీస్తాడు. కాలుతున్న శవం బంధువులు మెల్లిగా వెళ్తు ఉంటారు. వాళ్ళంత దుఃఖంలో ఉంటే నీ పాటలేంటని కసురుతుంది రావులమ్మ. మనిషనేవాడు ఎప్పటికైనా చస్తాడని, ఇప్పుడేడుస్తున్నవాళ్ళు రేపు తాగుతూ ఏడుస్తారని అంటాడు. ఏది ఏమైనా రావులమ్మ తన వెంట ఉంటే చాలని అంటాడు. ఇంతలో మిత్రత్రయాన్ని వెంట బెట్టుకుని అక్కడి వస్తుంది విద్య. చంద్రయ్యని పిలుస్తుంటే, మైకం కమ్మి నిద్ర ముంచుకొచ్చిన అతను లేవడు. రావులమ్మ వచ్చి విషయం ఏంటని అడిగితే, ఎన్.సి.సి. వాళ్ళు ఊర్లో బావి తవ్వుతున్నారనీ, మన ఊరి జనం కూడా కలిస్తే తొందరగా అవుతుంది. అలా వచ్చే వాళ్ళందరినీ మర్నాడు సాయంత్రం మర్రిచెట్టుకు దగ్గరకు రమ్మని టముకు వేయించాలని విద్య చెబుతుంది. సరే, తాను పంపిస్తానంటుంది రావులమ్మ. మర్నాడు ఉదయం చంద్రయ్య ఊర్లో టముకు వేయబోతుంటే రాయుడి గారి భైరవుడు అడ్డుపడతాడు. ఎప్పుడైనా అయ్యగారికి తెలీకుండా ఏ పనైనా చేసావా? ఇప్పుడేంటి మరి అంత ఈరుడివయ్యావా అని అడుగుతాడు. తనకేమీ తెలియదని, విద్య చెప్పినట్టు చేస్తున్నాని అంటాడు చంద్రయ్య. అతన్ని బెదిరించి పంపించేస్తాడు భైరవుడు. క్యాంపులో కూర్చున్న విద్య, వెంకట్రావులకి ఇది తెలిసి ఉసూరుమంటాడు. ఇవన్నీ తమ ఊరి రాజకీయాలే అంటుంది విద్య. ఇంతలో వెంకట్రావుకి ఓ ఆలోచన వస్తుంది. తామే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తే బావుంటుందని అంటాడు. అందరికీ ఆ ఆలోచన నచ్చుతుంది. వెంటనే జట్లు జట్లుగా విడిపోయి గ్రామంలోకి వెళ్ళి అందరికీ విషయం చెప్తారు. పల్లె జనమంతా సహకరిస్తామని మాట ఇస్తారు. మర్నాడు ఉదయం నిర్ణీత ప్రదేశానికి అందరూ వస్తారు. రాయుడు కొబ్బరికాయ కొట్టి, ఒక తట్ట మట్టి తవ్వి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. ఊరి జనం, ఎన్.సి.సి. కేడెట్లు ఉత్సాహంగా పనిచేస్తారు. సుబ్బు మాత్రం పని చేయలేక ఓ మూల కూర్చుంటే శోభ వచ్చి, తాను తెచ్చిన ఉడకబెట్టిన పల్లీలు తినిపించి, కాసేపు కబుర్లు చెప్పి వెళ్తుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-12

[dropcap]సా[/dropcap]యంకాలమైంది. పక్షులు గూటి దిక్కుకు మరలుతున్నాయి.

రెండు ప్రేమ పక్షులు వూరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఎదురెదురుగా కూర్చుని గుసగుస లాడుకుంటున్నాయి.

“ప్రకృతీ” తీయగా పిలిచాడు శ్రీనివాస్.

“ఊ.”

“ఇది నిజమేనా?”

“నాకూ అనుమానమే” సందిగ్ధంగా అంది ప్రకృతి.

“ఇది కలే కావచ్చు. కానీ దీన్ని నిజం చేసుకుంటాను. నిన్ను నా దాన్ని చేసుకుంటాను.”

ప్రకృతి ఉలిక్కి పడింది. ముఖంలో రంగులు మారాయి.

“కానీ.. కానీ..” తడబడింది.

“కానియ్యనా..” చిలిపిగా అంటూ ఆమె ముఖాన్ని అరచేతిలో తీసికున్నాడు శ్రీనివాస్.

ఆమె మరిక మాట్లాడలేదు. పెదవుల మధువులు వాళ్ళని మధురలోకాల్లోకి తీసుకెళ్లినయి. శ్రీనివాస్ తమకంగా ఆమెను మరింత హత్తుకుపోయాడు.

అతడు ఉద్రేక మూర్తి. ఆమె కల్లోల గౌతమి.

ముద్దును ముద్దుగా అద్దెకు తెచ్చి సందె రంగు కలిపి ముద్దరాలి బుగ్గలకు అద్దుతున్నాడు.

రెండు చేతులతో ఆమె నడుము నొక్కిపట్టి మెడ మీద మరో ముద్ర.

చక్కలిగిలితో ఆమె గలగలా నవ్వింది. మనసు మనసుతో ముచ్చట్లాడుతోంది –

‘ప్రేయసి సమక్షంలో ఆమె ఒక్కటే.. కానీ పరోక్షంలో నా చుట్టూ ఆమె రూపాలే!’ అన్నాడో కవి. అది ఇన్ఫినిటీ అఫ్ లవ్! కానీ నాకంతా నీ సమక్షమే. ఎందుకంటే, నాలోనే నీవున్నావు. ఇది ఇంట్రాడ్యూరల్ లవ్! నీలో నీ కళ్ళలో నీ కళ్ళ మెరుపులో, నీ కళ్ల మెరుపు వెలుగులో నన్ను చూసుకొనే. కనురెప్పలు మూసి నా రూపాన్ని చూసుకోలేని నన్ను గ్రుడ్డివాడ్ని చేయకు.

నీ దగ్గరకొచ్చేముందు ఎన్నెన్నో ఊహలు ఊసులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయ్. కానీ ఇక్కడికొచ్చేసరికి నోరు పెగలదు. భాష లేని భావం. హృదయం శక్తీ లేనట్టు రెపరెప లాడిపోతుంది. అక్కడి శక్తి పీఠం నా ఎదురుగా తిష్ఠ వేస్తుంది. అందుకేనేమో! అయినా మనసు హృదయం రెండూ ఒకేలా స్పందిస్తున్నప్పుడు నామది భావాల్ని మళ్లీ చెప్పాలా? చెప్పేది హృదయానికేగా?!

ఓ గమ్మత్తయిన ప్రశ్న తెలుసా –

ప్రియుడిలో ప్రియురాలు ఉంటుందా? ప్రియురాలిలో ప్రియుడు ఉంటాడా?

రెండూ కాదు.. ఇద్దరూ ‘ప్రియ’ లో ఉంటారు.

నా పిచ్చికి నవ్వుకుంటున్నావు కదూ! నవ్వు.. ఆ నవ్వే నన్ను కట్టిపడేసింది. నన్ను నీ ‘నవ్వుల’ పాలు చేసింది.

ప్రేమికుల ప్రేలాపనలకి చీకటి ఆనకట్ట వేసింది.

***

“నమస్కారం సార్” అంటూ వెంకట్రావు దగ్గరికి వచ్చింది వనజ.

బావి సైటులో త్రవ్వకం నడుస్తోంది. అందరూ దీక్షగా పనిచేస్తున్నారు. కుర్రాళ్ళకి ఏం పని చేయాలో చెబుతున్న వెంకట్రావు వెనక్కి తిరిగి చూసాడు.

“హలో వనజా?.. ఎలా ఉన్నావ్? నిన్ననే తెలిసింది నీవు వచ్చావని. మీ బాబాయి రాయుడి గారింట్లో ఉంటున్నావనీ.. డాడీ ఎలా ఉన్నారు?”

“బావున్నారు సార్! మీరెలా ఉన్నారు సార్? మీ వర్క్ ఎలా నడుస్తోందీ?”

“నడుస్తోంది. ఉండు.. నీకో ఫ్రెండ్‌ని పరిచయం చేస్తాను” అంటూ విద్యని పిలిచి పరిచయం చేసాడు. కాసేపు ముచ్చట్లయ్యాక, వనజ ‘వెళ్తా’నంటూ బయల్దేరింది.

మిత్రత్రయం పనిచేయకుండా కనిపించేసరికి పెద్దగా కేకలు వేస్తూ అక్కడికి వెళ్ళాడు వెంకట్రావు.

“వాట్ మిస్టర్ ఆంజనేయులూ! మీ ముగ్గురూ ముందు ఉంది నడిపించాల్సింది పోయి, ఇలా లెతర్జిక్‌గా ఉంటారా? మీ వల్ల మిగిలిన వారు కూడా ఫాటిగ్‌గా తయారవుతారు. తా చెడ్డ కోతి వనమల్లా చెరచింది అన్నట్లుంది మీ పరిస్థితి.. దిస్ ఈస్ లాస్ట్ వార్నింగ్!” అన్నాడు విసుగ్గా.

“అబ్బే.. అదేం లేదు సార్. మన సుబ్బిగాడు గెల అరటిపండ్లు లాగించేసి ఆయాసంతో కూలబడితే వాడిని లేపటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాం సార్” అన్నాడు శ్రీనివాస్.

“అరటిపళ్ళా? అవెక్కడివి? ఎవరి తోటల్లోంచైనా కొట్టుకొచ్చారా?” సీరియస్‌గా అడిగాడు వెంకట్రావు.

“చ్చ.. చ్చ.. మీ శిష్యులం అయివుండీ అలాంటి పని చేస్తామా?” అన్నాడు ఆంజనేయులు.

“మధ్యలో నన్ను భ్రష్టు పట్టించకు. అవెలా వచ్చినయ్యో చెప్పి తగలండి.”

“అవి శెట్టి గారింటివి. వాళ్ళమ్మాయి శోభ తెచ్చి వీడికిచ్చింది. వీడు ఆ అమ్మాయికి బావ అవుతాడట. తిండికి మంచి దోస్తీ కుదిరింది. వీడికి చిరుతిండి కూడా బస్తాల్లో సప్లై చేస్తోంది. మనం వీడికి తిండి పెట్టకపోయినా పర్లేదు సార్” అన్నాడు ఆంజనేయులు.

వెంకట్రావు చికాగ్గా, “సీ మిస్టర్ సుబ్రహ్మణ్యం. ఇప్పటికే మనకు వూళ్ళో అంత గొప్ప సహకారం కనిపించటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేసే పనులు అవతలివాళ్ళకి మనల్ని వేలెత్తి చూపే అవకాశం కల్పించకూడదు. ఇక్కడికి ఒక సమస్యని తీర్చటానికి వచ్చాం. మనమే ఊరివాళ్ళకి మనం సమస్య కాకూడదు. మీ చుట్టరికాలూ, బంధుత్వాలూ తర్వాత చూసుకోండి” విసుక్కుంటూ వెళ్ళిపోయాడు.

“ఒరేయ్ సుబ్బిగా, ఎన్ని కష్టాలొచ్చాయిరా నీకు? ఇకనుంచీ శోభా లేదు, శోభనమూ లేదు. రోజూ నీకు దొరికే బ్యాగుల కొద్దీ చిరుతిండి లేదు. మన ఎన్.సి.సి ఫుడ్డు నీకెటూ సరిపోదు. మన పని పూర్తయ్యేసరికి ఏనుగులాంటి నీవు పీనుగ అయిపోవటం ఖాయం. నిన్ను చూసి శోభా, ఆ పిల్లని చూసి వాళ్ళ నాన్నా అందరూ చిక్కిపోవటం ఖాయం. అందుకే శోభని మరచిపో.. లేకపోతే నీకు క్షోభే!” అన్నాడు శ్రీనివాస్ వేళాకోళంగా.

“వాడికేం అవసరంరా! హాయిగా వాళింటికే వెళ్లి తినటం మొదలెడతాడు.. ఏరా సుబ్బిగా.. అంతేగా?” అన్నాడు ఆంజనేయులు.

“తిండి కోసం కాకపోయినా శోభ కోసమైనా వాళింటికెళ్లాల్సిందేరా” అంటూ లేచాడు సుబ్రహ్మణ్యం.

***

వెంకట్రావు రాయుడి ఇంటికొచ్చాడు.

“రండి.. రండి..” అంటూ ఆహ్వానించాడు రాయుడు. వెంకట్రావు వచ్చి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

“ఇంత క్రితం మా కాలేజీ విషయాలు చెప్పాను మీకు.. అంతగా పట్టించుకున్నట్లు లేరు. మా కాలేజీ ప్రిన్సిపాల్ మీ అన్నగారే.” అన్నాడు వెంకట్రావు విషయాన్ని ప్రారంభిస్తూ.

“అవునట.. వనజ చెప్పింది. నాకవన్నీ తెలీదండీ.. తెలిసినా పెద్దగా పట్టించుకోను. ఇంతకీ ఏమిటి విశేషం?”

బిత్తరపోయాడు వెంకట్రావు. అన్నయ్య అనేసరికి అంతెత్తున ఎగిరి గంతేస్తాడనుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి?

“మరేం లేదు సార్, మేమిక్కడ కార్యక్రమం విజయవంతమైతే, మా ఎన్.సి.సి.కీ, మా కాలేజీకీ, దరిమిలా మీ అన్నగారికి జిల్లాలో మంచి పేరూ, గుర్తింపు వస్తుంది. అంచేత, కాస్త ఈ నాలుగురోజులూ మాకు సహకారాన్నీ సహాయాన్నీ అందించి ఎలాంటి గొడవలూ జరక్కుండా చూసే బాధ్యత మీ మీద పెడుతున్నాం.”

“భలేవారే.. వ్యాపారం వ్యాపారమే – వ్యవహారం వ్యవహారమే! నేనుగా మీ కార్యానికి అడ్డు రాను. అంతవరకే! నేను బాధ్యతలకీ, బంధాలకీ అతీతుడని. నా భార్య చనిపోయిందగ్గర్నుంచీ వూరు విడిచి కూడా వెళ్ళలేదు. నా పనేదో.. నా గొడవేదో.. అంతే..! లేకపోతే మా అన్నయ్యే నా గురించి చెప్పేవాడుగా. ఆ మాత్రం అర్థం కాలేదా?”

“నిజమే సుమండీ.. కానీ ఊరి పెద్దగా కార్యక్రమం ప్రారంభించి మంచి ఊఫు ఇచ్చారు. మీ దయవల్ల పని పూర్తయితే అంతకు మించి ఏం కావాలీ. అప్పుడప్పుడు బావి కేసి వచ్చి సూచనలిస్తూ ఉండండి సార్.. వస్తా” నిరాశ కనబడకుండా మాట్లాడి బయటికి నడిచాడు. ప్రహరీ ద్వారం దగ్గరకొచ్చిన వనజ “మీరేం బాధపడకండి సార్.. మా బాబాయ్ తత్వమే అంత. మా డాడీకి బాబాయికి ఏ విషయంలోనూ పొసగదు. చిన్నప్పటినుచీ సమ్మర్ హాలిడేస్‌కి ఇక్కడికొస్తూ అన్నయ్యతో ఆడుకుంటూ ఉండేదాన్ని. వాడు అమెరికా వెళ్ళిపోయాడు. మా పిన్ని చనిపోయింది. బాబాయ్ ఒక్కడే ఉంటాడు. నేనే అప్పుడప్పుడు వచ్చిపోతుంటా! అయినా మన ఆశయం గొప్పది. ఆ తృప్తి తోనే పనిచేద్దాం. ఫలితం దక్కి తీరుతుంది.” అంది.

వెంకట్రావుకి నూతన ఉత్సాహం వచ్చింది.

“అవునమ్మా.. నిజం చెప్పావ్” అంటూ క్యాంపుకి బయల్దేరాడు.

“ఉండండి సార్.. నేనూ వస్తాను” అంటూ అతనితో బయల్దేరింది వనజ.

***

వనజని చూడటంతోనే పరుగెత్తి ఆంజనేయుల్ని వంట గదిలోంచీ బయటకు నెట్టాడు శ్రీనివాస్. ఆ వేషంలో ఆంజనేయుల్ని చూసి ఫక్కున నవ్వింది వనజ.

‘గుర్రు’ మని చూసాడు ఆంజనేయులు.

“సార్, మన కోతిమూక బాగానే పనిచేస్తున్నట్టున్నారే” అంది వనజ వెంకట్రావుతో ఆంజనేయుల్ని కవ్విస్తున్నట్టు.

“ఇప్పటిదాకా అంతా బానే వుంది. ఇక నువ్వొచ్చావుగా.. చెప్పలేం” ఉడుక్కుంటూ అన్నాడు అంజనేయులు.

“సరే ఆపు. ఇది కాలేజీ కాదు. ఆ అమ్మాయి మనకు సహాయం చేసేందుకు వచ్చింది. మీరు కాలేజీ కోతుల్లాగా అల్లరి పెడితే సహించేది లేదు. నీ తోక గాళ్ళకి కూడా చెప్పు” అన్నాడు వెంకట్రావు.

“అలాగే సార్.. రండి వనజ గారూ. వచ్చి కాస్త వంట చేసి పెట్టండి” అంటూ ఎయిర్ ఇండియా మహారాజా బొమ్మ లాగా కాస్త వొంగొని ఆహ్వానించాడు ఆంజనేయులు.

“ఫర్వాలేదు.. ఒళ్ళు వొంగుతోంది” కవ్వింపుగా అంది వనజ వంట గది కేసి నడుస్తూ.

వంట గదిలో ప్రహసనం చూసి వనజ అవాక్కయింది. అక్కడ –

“వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు.. ఎన్.సి.సి వారి విందు.. ఎదురేది.. నాకే ముందు” అంటూ సుబ్రహ్మణ్యం పచ్చి సెనగపప్పును పిడికిళ్లతో ఎక్కువగా నోట్లోనూ, తక్కువగా రోట్లోనూ వేసుకుంటూ రుబ్బుతున్నాడు.

“ఒరేయ్ అసలు వంట అంటూ అయితే నువ్వే ముందు తిందువు కానీ.. అల్లా తింటే పప్పు రోట్లో తిరగదు కానీ, నీ కడుపు మాత్రం నొప్పితో త్రిప్పుతుంది.

మరో ప్రక్క శ్రీనివాస్ చెమటలు క్రక్కుతూ కూర మాడకుండా ఎగరేస్తున్నారు. ఇంకొకతను సిగరెట్టు కాలుస్తూ పులుసులో గరిటతో కలియబెడుతున్నాడు. పొగలన్నీ కలగాపులగంగా కలసిపోయినై. కంగాళీగా ఉంది.

వనజ వాళ్ళందర్నీ వారించి నడుంబిగించి కదిలింది. వారంతా ఆమెకు సహాయం చేయసాగారు.

అక్కడ మరో ‘వంటాధానం’ మొదలైంది.

***

సుబ్రమణ్యం పొద్దున్నే రన్నింగ్ చేసి, తిరుగుదారిలో శోభ దగ్గరకి వెళ్లి సున్నుండలు మెక్కి, భుక్తాయాసంతో మెల్లిగా నడుచుకుంటూ బయలుదేరాడు. అదంతా గమనిస్తున్న శీనయ్య సుబ్రమణ్యానికి ఎదురు వచ్చాడు.

“ఏంటి బాబు నీ చేతులు ఇట్లా పొట్టు దిగిపోయినయ్.. ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు.. తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళు” అన్నాడు

సుబ్రహ్మణ్యం తన చేతిలోకి చూసుకుంటూ “ఏం లేదు.. నాకు బానే కనిపిస్తున్నాయే” అన్నాడు సందేహంగా.

“నీకు అర్థం కావట్లేదు బాబూ! నువ్వు కూడా ఎవరికీ చెప్పకు ఇది పెద్ద జబ్బు.. చంపేస్తుంది.. ఇట్నుంచి ఇటే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నేను చెప్తున్నాను కదా! నీ మంచి కోసమే చెప్తున్నా..” అన్నాడు శీనయ్య రహస్యంగా.

సుబ్రహ్మణ్యానికి భయం పట్టుకుంది.

“పైత్యం చేస్తే ఇలాగే చేతులు పొట్టు రేగుతాయని మా బామ్మ చెప్పిందే! కాదా మరి! ఏంటిది?” అన్నాడు లోగొంతుకతో.

“ఇది బామ్మల కాలం కాదు బాబూ! దీన్ని ఇప్పుడు ఎయిడ్స్ అంటారు. ఇది ఒక భయంకరమైన జబ్బు. వెంటనే మన ఊరి డాక్టర్ని కలు. లేకపోతే చచ్చిపోతావ్” అని చెప్పి జారుకున్నాడు శీనయ్య.

అంతే! అరచేతులు రెండు ఎవరికి కనిపించకుండా కర్చీఫ్ చుట్టుకున్నాడు సుబ్రహ్మణ్యం. క్యాంపుకు వెళ్లి సూట్‌కేస్ తీసి డబ్బుల్నీ జేబుల్లో కుక్కుకుని మళ్ళీ ఎవరితో మాట్లాడకుండా బయటపడ్డాడు. శీనయ్య చెప్పిన అడ్రస్ ప్రకారం డాక్టర్ దగ్గరికి గాభరాగా పరిగెత్తుకుంటూ వెళ్లి క్లినిక్ లోపలికి దూసుకుపోయాడు.

అప్పుడు దాకా లైలా మజ్నుల్లా ఒకళ్ళల్లో ఒకళ్ళు కలిసిపోయి ఉన్న డాక్టర్, నర్సులు సుబ్రమణ్యం రాకతో తడబడి తబ్బిబ్బయ్యారు కంగారుగా..

“ఏంటా పరుగు? ఎవరో చచ్చిపోతున్నట్టు. ఏదో కొంప తగలడి పోతున్నట్టు! ఇంతకీ ఎవరు నువ్వు? ఎక్కడ పేషెంట్? ఏమిటి జబ్బు?” ప్రశ్నల వర్షం కురిపించాడు డాక్టర్ పిచ్చేశ్వరరావు.

సుబ్రమణ్యం తనెవరో, ఆ ఊరికి ఎందుకు వచ్చాడో చెప్పాడు.

“నేనే సార్ పేషెంట్‌ని. నాకు.. నాకు..” భయం, ఆయాసంతో సుబ్రహ్మణ్యానికి మాట పెగల్లేదు

“బానే ఉన్నావ్.. పైగా పరిగెత్తుకొచ్చావ్! నీకేం రోగం?” ఆశ్చర్యంగా, చికాగ్గా అన్నాడు డాక్టర్ మంచి మూడు చెడిపోయినందుకు.

“నాకు భయంకరమైన జబ్బు వచ్చింది డాక్టర్! మీరే కాపాడాలి” అన్నాడు ఏడుస్తూ సుబ్రహ్మణ్యం.

“వాట్? బుల్డోజర్ లాగా బొద్దుగా ముద్దుగా ఉన్నావ్. నీకు జబ్బా? పైగా భయంకరమైందా నీకెలా తెలుసు? ఇంత క్రితం ఎవరి దగ్గరకైనా చూపించుకున్నావా? ఏం జబ్బు? ఏం మందులు వాడుతున్నావ్? పాత పిస్క్రిప్షన్ తెచ్చావా? ఎందుకు తేలేదు?” మళ్లీ ప్రశ్నలు వర్షం.

“నాకు ఇవ్వాళే తెలిసింది సార్. ఇది భయంకరమైన జబ్బు అని” అన్నాడు సుబ్రమణ్యం వెక్కుతూ.

“చూడు ఏదో ఎయిడ్స్ వ్యాధి సోకినట్టు అలా భయపడకు. అసలు విషయం చెప్పు” అన్నాడు డాక్టర్.

“అవును సార్, నాకు ఆ ఎయిడ్స్ వచ్చింది సార్! చూడండి చేతులు ఎలా పొట్టు రేగాయో. సమయానికి శీనయ్య వచ్చి చెప్పబట్టి సరిపోయింది” అన్నాడు సుబ్రమణ్యం

పిచ్చివాడిలా చూసాడు డాక్టర్ పిచ్చేశ్వర్రావ్.

విస్మయంగా సుబ్రహ్మణ్యానికి చూసి “శీనయ్య ఏం చెప్పాడు” అని అడిగాడు.

“వెంటనే మిమ్మల్ని కలిసి వ్యాధి నయం చేయించుకోమని చెప్పాడు సార్.”

పిచ్చేశ్వర్రావ్‌కి కేసు బాగా అర్థమైంది. కాసేపు సుబ్రమణ్యం పరీక్షించినట్టు నటించి గాఢంగా నిట్టూర్చాడు. ఎంతసేపటికి డాక్టర్ మాట్లాడిపోయేసరికి ఈ అనుమానం రెట్టింపు అయింది. “సార్ మాట్లాడండి సార్! నా జబ్బు నయం కాదా? నేను చచ్చిపోతానా?” అన్నాడు పెద్దగా ఏడుస్తూ.

“ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు. అంటువ్యాధి కూడా. దీనికి ఇప్పటివరకు మందే కనుక్కోలేదు” అని చెప్పేడు డాక్టర్.

“డాక్టర్, మరి నా గతి ఏంటి?” విపరీతంగా భయపడిపోయాడు సుబ్రమణ్యం.

“నీకేం భయం లేదు. నేను ప్రపంచం గురించి చెప్తున్నాను. అంతే! కానీ నా దగ్గర మాత్రమే మందు ఉంది. అయితే యాభైవేలు ఖర్చు అవుతుంది ఏమంటావ్?”

“మా ఊళ్లో అయితే మీరు ఎంత అడిగితే అంత ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు నా దగ్గర అంత లేదే?!” అన్నాడు సుబ్రహ్మణ్యం.

“పాపం మన గ్రామాన్ని ఉద్ధరించడానికి వచ్చాడా బాబు.. ఏదో ఉన్నంతలో తీసుకొని న్యాయం చేయండి” అంది నర్సు ప్రేమ వలకబోస్తూ.

వెంటనే సుబ్రహ్మణ్యం జేబులో ఉన్న డబ్బుంతా తీసి టేబుల్ మీద పెట్టి నమస్కారం చేశాడు. డాక్టర్ డబ్బులు లెక్కపెట్టి లోలోపల సంతోషించాడు.

“ఐదువేల రూపాయలకే అంత ఖరీదైన మందు దొరకదే! సరే అమెరికా నుంచి తెప్పించిన ఇంజక్షన్ ఈ కుర్రాడికి చెయ్.”

“కానీ ఒకటే వుంది డాక్టర్” అంది నర్సు.

“పర్వాలేదులే! ఎవరో ఒకరికి ఇవ్వాల్సిందేగా! ఆలస్యమైతే ఎక్స్పైర్ అయినా అయిపోతుంది. ఏదో మనకు చేతనైన సాయం చేస్తున్నాం అన్న తృప్తి ఉంటుంది. ఏమంటావ్?” అంటూ నర్సుకు కన్ను గీటాడు డాక్టర్.

నర్సు పక్క గదిలోకి వెళ్లి ఏవో ఎర్ర నీళ్లు తెచ్చి సిరంజిలోకి ఎక్కించింది. సుబ్రహ్మణ్యం భుజం కిందుగా ఒక్కసారిగా గుచ్చింది.

ప్రాణాలు పోయాయనే అనుకున్నాడు అతడు.

‘అవును మరి ఖరీదైన మందు ఆ మాత్రం నొప్పి లేకపోతే ఎలా అవుతుంది’ సర్ది చెప్పుకున్నాడు.

“ఇక నీకు ఎలాంటి భయము లేదోయ్. ఈ టాబ్లెట్లు వేసుకో” అని ఏవో బిళ్ళలు పొట్లం కట్టి ఇచ్చాడు డాక్టర్.

సుబ్రహ్మణ్యానికి డాక్టర్ దేవుడిలా కనిపించాడు. మరోసారి ఆ దేవుడికి నమస్కారం చేసి బయటపడ్డాడు. దారిలో శీనయ్య మళ్ళీ కలిశాడు.

“డాక్టర్ దగ్గరికి వెళ్ళావా బాబు?”

“ఆ డాక్టర్ చాలా మంచివాడులా ఉన్నాడు శీనయ్య! ఐదువేల రూపాయలకే అంత ఖరీదైన మందు ఇచ్చాడు” డాక్టర్‌ను పొగిడాడు సుబ్రహ్మణ్యం.

“సరేలే, ఈ విషయం ఎవరికీ చెప్పక. ఎయిడ్స్ వచ్చిందని తెలిస్తే నిన్ను ఎవరు దగ్గరికి కూడా రానీయరు. ఊరికి వెళ్ళాక మీ అమ్మానాన్నలతో చెబుతారు. వాళ్లు కూడా నిన్ను రానీరు. నువ్వు రోడ్డు మీద కుష్ఠువాడిలా బ్రతకాల్సి వస్తుంది”

“అలాగా.. అయితే అలాగే! నేనెవరికీ చెప్పనులే” అంటూ ముందుకు సాగిపోయాడు సుబ్రమణ్యం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here