జైత్రయాత్ర-14

0
2

[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[వెంకట్రావు ఓ రోజు డ్రెస్ చేసుకుని బయటకు వెళ్ళటానికి సిద్ధమవుతుండగా డా. పిచ్చేశ్వరరావు అక్కడికి వచ్చి పరిచయం చేసుకుంటాడు. ఏం పని మీద వచ్చారని అడిగితే, మీరు తవ్విస్తున్న బావిలో శవం కనబడింది కదా, అంటువ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తగా ఎన్.సి.సి. కేడెట్స్ అందరికీ ఇంజక్షన్స్ ఇస్తే బాగుంటుందని అంటాడు. సరేనంటాడు వెంకట్రావు. నిర్ధారిత రోజున కేడెట్స్ అందరూ వెళ్ళి హాస్పటల్ ముందు నిల్చుంటారు. హుషారుగా లోపలికి వెళ్ళినవాళ్ళంతా బాగా నీరసంగా బయటకు రావడం చూసిన శ్రీనివాస్‍కీ, అంజికి అనుమానం వస్తుంది, మత్తిచ్చి రక్తం ఎక్కువ తీసేసుకుంటున్నారేమని. అలా అనద్దనీ, డాక్టర్ దేవుడనీ, ఐదువేలతో తనకొచ్చిన ఎయిడ్స్ పోగొట్టాడని అంటాడు. మిత్రులు ఆశ్చర్యపోయి వివరాలడిగితే, శీనయ్య చెప్పటంతో తానీ డాక్టర్ దగ్గరకు రావడం, ఆయన ఐదువేలు తీసుకుని మందివ్వడం, ఎవరికీ చెప్పద్దని చెప్పడం అన్నీ చెబుతాడు. శ్రీనివాస్ అంజి మాట్లాడుకుని – వెంకట్రావుకి చెప్తారు. మిగిలిన కేడెట్స్‌ని వెనక్కి పిలిపించేస్తాడు వెంకట్రావు. ఇప్పుడేం మాట్లాడద్దనీ, ఇతని సంగతి తర్వాత చెబుదామంటూ కొన్ని సూచనలు చేస్తాడు. డాక్టర్ సేకరించిన రక్తం నింపిన సీసాలను పట్నం చేరవేయాలనుకున్న శీనయ్య దృష్టి మళ్ళించి ఆ సీసాలను మాయం చేస్తారు మిత్రబృందం. వెంకట్రావుతో మాట్లాడదామని విద్య వస్తే, డాక్టర్ గురించి ఆమెకు చెప్తాడు. అప్పుడా డాక్టర్ గురించి మరికొన్ని విషయాలు చెప్తుంది విద్య. మర్నాడు ఉదయమే డప్పు కొట్టి – బావి గురించి ప్రచారం చేస్తాడు శ్రీనివాస్. గ్రామస్థులు సహకరించకపోవడంతో బావి పని మళ్ళీ మొదటికి వస్తుంది. నెల రోజుల వ్యవధిలో ఇప్పటికే పదిహేను రోజులు గడిచిపోయాయని, మరో 15 రోజుల్లో ఎలాగైనా బావిని పూర్తిచేయాలని అనుకుంటాడు వెంకట్రావు. కేడెట్స్‌కి శ్రమ పెరిగినా, ఓ యజ్ఞంలా చేయాలని చెప్తాడు. ఆ రాత్రి ఎన్.సి.సి. క్యాంపు ప్రాంగణంలో వెంకట్రావు, మిత్రులు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటారు. బసివిని చంపాల్సిన అవసరం రాయుడు ముఠాకి తప్ప మరెవరికీ లేదని అంటాడు ఆంజనేయులు. ఈ హత్య వెనుక ఇంకేదో నిజం ఉందని అంటాడు వెంకట్రావు. దాన్ని తెలివిగా ఛేదించాలని అంటాడు. మర్నాడు శోభ, సుబ్బు తోటలో కూర్చుని ఉంటారు. శోభ కోసం బంగారు ఉంగరం తెచ్చానంటూ ఆమెకు ఇవ్వబోతాడు. అంతలో అక్కడికొచ్చిన శీనయ్య ఆ ఉంగరం తనదే అంటూ లాక్కోబోతాడు. శోభ అతడిని బెదిరించి పంపేస్తుంది. ఇంతలో అక్కడికొచ్చిన శ్రీనివాస్ ఆ ఉంగరం గురించి గట్టిగా అడిగితే, అది బావి దగ్గర, బసివి చనిపోయిన రోజున దొరికిందని నిజం చెప్తాడు సుబ్బు. విషయం వెంకట్రావుకి చేరవేస్తారు. జరిగిన కుట్ర అర్థమవుతుందతనికి. దీర్ఘంగా నిట్టూరుస్తాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-17

[dropcap]ఎన్.[/dropcap]సి.సి. క్యాంపు ప్రాంగణం.

వెంకట్రావు గదిలో వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. విద్య, మిత్రత్రయం, వనజ తీవ్రంగా ఆలోచిస్తూ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

“ఇక మనం త్వరగా బావి త్రవ్వటం ముగించాలి” అన్నాడు వెంకట్రావు .

“ప్రకృతి మర్డర్ మిస్టరీ కూడా ఛేదించాలి” అన్నాడు శ్రీనివాస్.

‘అవున’న్నట్టు తలూపింది విద్య.

“రాయుడు గ్యాంగ్‌ని బొక్కలో తొయ్యలి” కోపంగా అన్నాడు ఆంజనేయులు.

“వీటన్నింటికీ ఒక్కటే దారి. నేను టౌన్ కెళ్ళి కొన్ని పనులు చెయ్యాలి” అన్నాడు వెంకట్రావు.

“ఇన్ని జరుగుతున్నా రాయుడు కిమ్మనడకుండా ఎందుకున్నాడు?” అడిగింది విద్య.

“ఏముందీ.. మర్డర్ కేసు మీద అప్‌డేట్స్ ఉండవు. పోలీసులు కూడా మళ్ళీ రాలేదు ఎంక్వయిరీకి” అన్నాడు ఆంజనేయులు.

“అంటే కోల్డ్ స్టోరేజ్‌లో పడేసుంటారు” కోపంగా అన్నాడు శ్రీనివాస్.

“ఏం జరుగుతున్నా, రాయుడికి ఇన్ఫర్మేషన్ టౌన్ నుంచీ అందుతూనే ఉంటుంది” అంది విద్య.

“ఏం వనజా.. రాయుడికి ఏమన్నా ఫోన్లు వచ్చాయా ఈ వారంలో?” వెంకట్రావు అడిగాడు .

“వస్తున్నాయి సర్.. అయితే చాలా మెల్లగా మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువ పోలీస్ స్టేషన్ నుంచే వచ్చినాయి.”

“బసివి మరణం గురించి ఏమన్నా మాట్లాడినట్టు అనిపించిందా?”

“లేదు కానీ ఎవరిదో జామీను గురించి, బెయిల్ గురించీ ఆందోళనగా మాట్లాడినట్టుగా కనిపించింది.”

“ఎవరి పేరన్నా వినిపించిందా? “

“ఎవరో సతీష్‌తో మాట్లాడినట్టుగా అర్థమైంది.”

“ఈ కొత్త క్యారెక్టర్ ఎక్కడ్నుంచీ వచ్చిందబ్బా?” ఆంజనేయులు అన్నాడు.

“వనజ, రాయుడు ఫోన్ నెంబర్ ఇవ్వు. నేను మధ్యాహ్నం మన బస్సులో టౌన్‌కి వెళ్లి వస్తాను. అలాగే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసు విషయం కదిపి చూస్తాను. మా రాక వాళ్ళ ఓ ప్రాణం నిర్జీవమైంది. నేను నైతిక బాధ్యత వహిస్తాను. సరైన న్యాయం చేసే కదులుతాం ఈ వూరినించి” అన్నాడు వెంకట్రావు.

శ్రీనివాస్ కృతజ్ఞతగా చూసాడు. వనజ నెంబర్ పేపర్ మీద రాసి ఇచ్చింది.

తాను లేని సమయంలో ఏంచెయ్యాలో అందరికీ వివరించాడు వెంకట్రావు.

***

బావి త్రవ్వకం జోరుగా సాగుతోంది.

తన బలమంతా ఉపయోగించి గునపాన్ని మట్టిలోకి దించుతున్నాడు సుబ్రహ్మణ్యం. ఎప్పుడూ కష్టపడ్డ శరీరం కాదేమో.. చెమట ధారగా కారిపోతోంది. అతన్ని చూసి అందరూ జాలి పడుతున్నారు. అతని దీక్షని మెచ్చుకుంటున్నారు. విద్య, వనజ, ఊరి కుర్రాళ్ళు తట్టలతో మట్టి ఎత్తి పోస్తున్నారు. ఆంజనేయులు, శ్రీనివాస్ కూడా బావిలోకి దిగి చెరొక వైపు త్రవ్వుతున్నారు.

అప్పుడే అక్కడికి వచ్చిన శోభ సుబ్రమణ్యాన్ని చూసి ఏడవటం మొదలెట్టింది. అందరూ వింతగా చూసారు.

“ఏయ్ శోభా! ఏమైందే ? ఎందుకు ఏడుస్తున్నావ్?” మందలింపుగా అడిగింది విద్య.

“అక్కా.. మా బావ సుబ్రహ్మణ్యం ఎంత కష్టపడుతున్నాడో చూడలేకపోతున్నా.” అంది వెక్కుతూ..

ఆంజనేయులు చుట్టూ చూసాడు బావిలోంచీ తల పైకెత్తి .

వనజ అతణ్ణి చూసి “ఏం చూస్తున్నావ్ అంజి బాబూ?” అని అడిగింది.

“ఎక్కడ గార్ధబాలు? పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి?”

“శోభ వచ్చిందిలే”

“తల్లీ.. ఇప్పుడు నువ్వేడుస్తున్నావా.. గాడిదలెక్కడా అని చుట్టూ చూస్తున్నాలే” అన్నాడు ఆంజనేయులు.

సుబ్రహ్మణ్యం కోపంగా చూసాడు. శోభ ఇవేమీ పట్టించుకోకుండా తాను తెచ్చిన పప్పుండలు మోకాళ్ళమీద వొంగోని సుబ్రహ్మణ్యంకు అందిస్తోంది. ఉన్నట్టుండి పెద్దగా అరిచింది – “బావా నీళ్లు”.

సుబ్రహ్మణ్యం ఉలిక్కిపడి క్రిందకు చూసాడు. అతని చుట్టూ నెల తడి తడిగా మారిపోయింది. ఆనందంగా “ఒరేయ్ నీళ్లు రా” అని అరిచాడు. పైన పనిచేస్తున్న కుర్రాళ్లందరూ బావి దగ్గరికి చేరారు. బావిలోనే ఉన్న శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్లి పరీక్షగా చూసాడు.

“ఇది నీళ్ళూ కాదు.. నీ బొందా కాదు.. సుబ్బిగాడి చెమట” అన్నాడు శోభతో. అందరూ కాస్త నిరాశపడ్డారు.

శోభ మళ్ళీ ఒంగోని పప్పుండలు సప్లై చేస్తూంటే సుబ్రహ్మణ్యం గారంగా తీసుకుంటున్నాడు. ఈసారి పరాచికంగా పప్పుండని అందుకోకుండా వెనక్కు జరిగాడు. శోభ అతనికివ్వాలన్న ఆతృతలో ముందుకు జరిగింది .

అంతే! చిన్న సైజు కొండరాయిలా బావిలో దిగటానికి ఏర్పాటు చేసిన మట్టి వాలు మీదుగా బావిలోకి జారీ సుబ్రహ్మణ్యం మీద పడింది.

“చచ్చాన్న్రా బాబోయ్” అంటూ సుబ్రహ్మణ్యం నోరుతెరచి కూలబడిపోయాడు.

శోభ వెంటనే ఒక పప్పుండని అతని నోట్లో దూర్చింది.

“నేనే గెలిచా” అంటూ చప్పట్లు కొట్టింది.

“నీ గెలుపు మండినట్లుంది. ఇక్కడ నా నడుం విరిగిపోయింది” అంటూ వెనక్కు జరిగి బావి గోడకి ఆని కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం ఆయాసపడుతూ. వనజ పైనుంచి మంచినీళ్ల బాటిల్ విసిరింది. అది అందుకుని సుబ్రహ్మణ్యంకి ఇచ్చాడు ఆంజనేయులు. సుబ్రహ్మణ్యం అది అందుకుని నీళ్లు త్రాగుతూ తేరుకుంటుంటే శోభ పప్పుందాలు తీసి ఇద్దరూ తినటం మొదలెట్టారు.

కాసేపు రెస్ట్ తీసుకుందాం అని శ్రీనివాస్, ఆంజనేయులు కూడా బావిలోంచీ పైకి వచ్చేసారు.

పైన అందరినీ ఒక్క దగ్గర చేర్చి విద్య, వనజ తాము తెచ్చిన పులిహోర, దద్దోజనం పాకెట్లు పంచటం మొదలెట్టారు.

***

వెంకట్రావు డైరెక్ట్‌గా డిస్ట్రిక్ట్ ఎన్.సి.సి. ఆఫీస్‌కి వెళ్లి కమాండెంట్‌ని కలిశాడు. రాయుడు పాలెంలో జరిగిన విషయాలన్నీ వివరించాడు. తనకు పోలీస్ సహాయం కావాలని కోరాడు. వెంకట్రావు గురించి అతని కమిట్మెంట్ తెలిసిన కమాండెంట్ అప్పటికప్పుడే కలెక్టరేట్‌తో మాట్లాడి కావలసిన ఏర్పాట్లు చేసాడు. వెంకట్రావు వాళ్లకి థాంక్స్ చెప్పి అక్కడ్నించీ బయలుదేరి బసివి మరణం కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. ఎస్.ఐ.ని కలిసి తనని పరిచయం చేసుకున్నాడు. అప్పటికే వాళ్లకి జిల్లా సూపరింటెండెంట్ నుంచీ సూచనలు రావటంతో ఎస్.ఐ. కంగారుగా అడిగిన విషయాలు చెప్పటం మొదలెట్టాడు.

వెంకట్రావు “దయచేసి బసివి మరణం కేసు తొందరగా ఛేదించండి. మీకు కావాల్సిన సహాయం మేము చేస్తాం.”

“తప్పకుండా సార్! ఇప్పటివరకు ఆ విలేజ్ పెద్దలు రాజకీయంగా మా మీద ఒత్తిడి తేవటం వల్ల మేము ఫైల్ ప్రక్కన ఉంచాల్సి వస్తోంది.”

“మీరు మీ పని చేయండి. మేము మీకు అన్నివిధాలా సహాయం చేస్తాం. ఎన్.సి.సి. ఐస్ విత్ యు!”

“సరే సర్. పోలీస్‌కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే కేసు ఎట్లా డీల్ చేస్తామో ఇప్పుడు చూపిస్తాం” అన్నాడు నవ్వుతూ.

“థాంక్స్ సర్!” అంటూ లేచి వస్తూ నోటీసు బోర్డు కేసి యథాలాపంగా చూసాడు వెంకట్రావు. బోర్డు మీద ఒక పాస్‌పోర్ట్ ఫోటో ఉండి క్రింద సతీష్ అన్న పేరు కనిపించింది.

“సర్, ఎవరు ఇతను?”

“అబ్‌స్కేన్డింగ్ కేసు సర్. ఆన్ లుక్ అవుట్! దేశాన్ని కుదిపేస్తున్న నకిలీ మద్యం కేసులో ఇతడు సస్పెక్ట్.”

“ఛార్జెస్ ఏం పెట్టారు?”

“ఫేక్ షూరిటీస్..”

“అంటే..?”

“మద్యం కేసులో ముద్దాయిలకు జామీను ఇచ్చినవాళ్లు ఇతని ద్వారా వచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డులు, అడ్రస్‌లు అన్నీ తప్పే. ఫోటోలు కూడా ఎవరివో తెలియటం లేదు.”

వెంకట్రావు ఒక్క క్షణం ఆలోచించాడు.

“నేను ఒకసారి ఫొటోస్ చూడవచ్చా?” అని అడిగాడు.

“తప్పకుండా సార్” అని లోపలికి తీసుకెళ్లి ఫైల్ తీసి చూపించాడు ఎస్.ఐ.

అందులో ఫోటోలు చూసి ఆశ్చర్య పోయాడు వెంకట్రావు.

వెంకట్రావు అక్కడే మరో గంట ఎస్.ఐ.తో కేసుకి సంబంధించి కీలకంగా చర్చలు జరిపాడు. ఏం చేయాలో కూడా నిర్ణయించుకున్నారు.

లేచి వస్తుంటే ఎస్.ఐ. చేయి కలిపి,” థాంక్స్ సర్.. మీ సహాయాన్ని మర్చిపోలేను” అన్నాడు.

వెంకట్రావు నవ్వుతూ, “ఇద్దరి లక్ష్యం ఒక్కటే అయినప్పుడు.. థాంక్స్‌లు ఎందుకు సార్..” అని బయటికి నడిచాడు.

***

‘బ్రేవ్’ మని త్రేన్చుతూ పని జరిగే చోటుకు వచ్చాడు సుబ్రహ్మణ్యం. అప్పటికే పని ప్రారంభమై పావుగంట అయింది. లంచ్ ముగించి అయిష్టంగానే పనిలోకొచ్చాడు. భుక్తాయాసం. నిద్ర ముంచుకొస్తోంది. అక్కడ తన కోసం వేచి చూస్తున్న తట్టని చూసేసరికి నీరసం ముంచుకొచ్చింది. బద్ధకంగా నడుచుకుంటూ బావి దగ్గరికి వచ్చాడు. నిజానికి దూరంగా పారిపోదామని వుంది. ఊరి జనం సహాయ నిరాకరణతో పని పదింతలు పెరిగింది. మెల్లిగా మట్టి గడ్డల్ని తట్టలోకి ఎత్తసాగాడు వీలున్నంత నింపాదిగా. ఒక్కొక్క మట్టిగడ్డ ఒక్క టన్ను బరువులా తోస్తోంది. అవకాశం వస్తే అక్కడే పది నిద్రపోవాలనిపిస్తోందతనికి. అటూ ఇటూ చూసి చతికిలపడ్డాడు. మూగన్నుగా నిద్ర కమ్ముకొచ్చింది. సగం మూసుకున్న కళ్ళకి గునపం ఏదో గుండెలమీదకి దూసుకొస్తున్నట్లు తోచింది. అంతే! ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.

శ్రీనివాస్ గునపం ఎత్తి నిలబడి ఉన్నాడు. సుబ్రహ్మణ్యం చేతులెత్తి దణ్ణం పెట్టాడు. శ్రీనివాస్ గునపాన్ని సుబ్రహ్మణ్యం చేతిలో పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యం ఉక్రోషంగా లేచి పని మొదలెట్టాడు.

విద్య, వనజలు మట్టి తట్టల్ని భారంగా మోసుకుంటూ వెళ్లి ఓ ప్రక్కగా మట్టిని పోసి ఖాళీ తట్టల్ని తెస్తున్నారు తిరిగి నింపటానికి.

వెంకట్రావు వాళ్ళని గమనించాడు. దగ్గరకొచ్చి –

“ఏమ్మా వనజా.. చాలా కష్టంగా ఉన్నట్లుందే. కాసేపు రెస్ట్ తీసుకోండి” వనజ బావి దగ్గర పనిచేస్తున్న ఆంజనేయులు దగ్గరికి వెళ్లి కూర్చుంది.

అది విన్న సుబ్రహ్మణ్యం సంతోషంగా పలుగు పడేసి ప్రక్కనే ఉన్న చెట్టు నీడన కూర్చున్నాడు.

అది చూసి వెంకట్రావు “ఏం నాయనా కూర్చున్నావ్?”

“మీరే కదా సార్.. రెస్ట్ తీసుకోమన్నారు?”

“నిన్ను కాదు నాయనా.. కష్టపడుతున్నవాళ్ళని. నీవు లేచి పని మొదలెట్టు.”

అంటూ విద్య వైపు చూసి “రండి.. కాసేపలా కూర్చుందాం” అని చెట్టు నీడకి దారి తీశాడు వెంకట్రావు.

“ఏమిటి వూర్లో విశేషాలు? ఇక ఊరి వాళ్ళు మనకు సహాయం చేయనట్టేనా?” అంటూ మొదలైన సంభాషణ బావి పనులు, మీదుగా బసివి మరణం వరకూ వెళ్ళింది.

“ఆమెది హత్య అనే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆమెకు లేదు.”

“అవును. ఆ రోజు రాత్రి ఎవరో ఆ మూటను బావిలో వేసిన శబ్దం విన్నానని సుబ్రహ్మణ్యం చెప్పాడు.”

“అయితే ఎవరు చేశారో తెలియటం లేదు.”

“నా వూహ నిజమైతే అన్నీ తొందర్లోనే బయటికి వస్తాయి.”

“ఏమిటి మీ వూహ?” ఆసక్తిగా అడిగింది విద్య.

“ఆధారం లేకుండా చెప్పకూడదని కుర్రాళ్ళకి చెప్పి, నేను అదే తప్పు చేయలేను కదా” అన్నాడు చిరునవ్వుతో వెంకట్రావు .

ఇంతలో శ్రీనివాస్ ఆనందంతో కేక పెట్టాడు. “హాయ్.. ఓహో.. నీళ్లు.. నీళ్లు” అంటూ.

అతని పలుగు దెబ్బకి జల పైకి వచ్చింది. వెంకట్రావుతో కలసి అందరూ వెంటనే అక్కడ జేరారు. తలా ఒక దెబ్బ వేశారు. పాదాలు తడుస్తుంటే మరింత ఉత్సాహంగా త్రవ్వసాగారు.

కొందరు క్యాడెట్స్ బురదని ఎత్తి బయట పోయసాగారు. క్రమక్రమంగా నడుములోతు వచ్చినాయి. అందరూ పెద్దగా “హర హర మహాదేవ్” అంటూ అరుస్తూ పైకి వచ్చారు.

శ్రీనివాస్ అక్కడే ఒక్క నిమిషం నిలబడ్డాడు ఆ నీటిని చూస్తూ. ప్రకృతి తనని ప్రేమగా తడిమినట్లు అనిపించింది. అతని కళ్ళు చెమర్చినాయి.

‘ఆ క్షణం తన జీవితాంతం గుర్తుండిపోతుంది’

ఆప్యాయంగా ఆ నీటిని ముద్దు పెట్టుకున్నాడు.

వాళ్ళు ఆనందంతో వేసిన కేకలు విని ఊరిజనాలు అక్కడికొచ్చారు. బురద అంటుకున్న ఒంటితో వున్నా క్యాడెట్ లని వింతగా చూడసాగారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే వెంకట్రావు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు.

శ్రీనివాస్ పైకి వచ్చాడు. వెంకట్రావు జనాలవంక చూశాడు.

“రండి.. ఇది మీ కోసమే. ఇక మీ కష్టాలు తీరినయ్. ఈ రకంగా మీ ప్రధాన సమస్య తీరిపోయింది. నాకెంతో సంతోషంగా ఉంది” అన్నాడు.

కానీ గ్రామస్తులు నీటివంక అనుమానంగా చూసారు. బావిలోకి తొంగి చూసి దూరంగా నిలబడ్డారు.

వెంకట్రావుకు పరిస్థితి అర్థమైంది. వాళ్ళు ఇంకా ఆ అనుభవం నుంచీ తేరుకోలేదు. అసలు వాళ్లకు ఇష్టం లేదు కూడా! మూఢనమ్మకాలను మించిన అవసరం మరొకటి లేదు.. అందుకే ఎదురుగా ఉన్న గంగమ్మ తల్లి వాళ్లకి విషంగా కనిపిస్తోంది.

అంతకంతకూ నీటి ఎత్తు పెరుగుతోంది. క్రమంగా బురద అడుక్కి వెళ్ళిపోయి స్వచ్ఛమైన నీరు కనిపిస్తోంది.

వెంకట్రావు మళ్ళీ వాళ్ళని ఒప్పించటానికి ప్రయత్నం చేశాడు.

“చూడండి. కల్మషం లేని ఆ నీళ్లు మీకు ప్రాణాధారం. ముక్కుపచ్చలారని పసిమొగ్గని బసివిగా మార్చింది మీ మూఢాచారం. ఒక్కరోజు దేవతారాధన పొంది మిగిలిన సంవత్సరమంతా ఆమె పడిన మానసిక వ్యథని మీ ఆచారం పట్టించుకోలేదు. నిజానికి ఆమె మరణించలేదు. నిర్జీవ బ్రతుకు లోంచీ నిశ్చల సమాధిలోకి వెళ్ళిపోయింది. నిజంగా దేవతగా మారిపోయింది. అదే ప్రకృతి రూపం. ఇదుగో ఆమె రూపం – స్వర్ణవాహిని! జలతరంగిణి! దీంతో మీ పంటలు బంగారం అవుతాయి. మీ బ్రతుకులు స్వతంత్రమవుతాయి. ..రండి” అన్నాడు ఉత్సాహపరుస్తూ.

అప్పటికీ వారిలో ఏదో సందేహం. శ్రీనివాస్ చేదతో బావిలోని నీటిని తోడాడు.

స్వచ్ఛంగా ఉన్న నీరు స్వాగతం పలుకుతోంది. కాని, ఊరి వాళ్ళ మూర్ఖ సంప్రదాయం వారి కాళ్లకు సంకెళ్లు వేస్తోంది. అంతలో..

జనంలోంచీ ఓ బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చి దోసిళ్ళతో ఆ నీరు త్రాగాడు. తృప్తిగా చిరునవ్వులతో తల్లి దగ్గరికి నడిచాడు.

అంతే..

ఆ సందేశం వారి సందేహాల్ని తీర్చిపారేసింది.

అందరూ బావి దగ్గరికి వచ్చి మోకరిల్లారు.

వెంకట్రావు తృప్తిగా నిట్టూర్చాడు..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here