[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[క్యాంపు ప్రాంగణంలో సమావేశమైన వెంకట్రావు, విద్య, మిత్రత్రయం, వనజలు – బావి త్రవ్వడం పూర్తి చేయాలని, బసివి హత్యలోని కుట్రని ఎలాగైనా ఛేదించాలని నిర్ణయించుకుంటారు. కేసులో ఏ అప్‍డేట్స్ లేవని ఆంజనేయులు అంటే, టౌన్ నుంచి రాయుడికి ఇన్ఫర్మేషన్ అందుతుందని విద్య అంటుంది. అది విని, రాయుడికి ఈ వారంలో ఫోన్లేమయినా వచ్చాయా అని వెంకట్రావు వనజని అడిగితే, వచ్చిందనీ, ఎవరో సతీష్ అనే వ్యక్తి జామీను గురించి మాట్లాడాడని చెప్తుంది వనజ. రాయుడి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. టౌన్‍కి వెళ్ళి పోలీసులను కలుస్తానని చెప్పి, తాను లేని సమయంలో ఏం చేయాలో వాళ్ళకి వివరిస్తాడు. గ్రామస్థులు వ్యతిరేకించినా, ఎన్.సి.సి. కేడెట్స్ బావి తవ్వడం కొనసాగిస్తారు. టౌన్‍కి వెళ్ళిన వెంకట్రావు ఎన్.సి.సి. కమాండెంట్‌ని కలుస్తాడు. ఆయన జిల్లా ఎస్.పి.తో మాట్లాడి కేసు విషయంలో సాయం చేయమంటాడు. వెంకట్రావు పోలీస్ స్టేషన్‍కి వచ్చేసరికి, ఎస్.పి. నుంచి ఆ స్టేషన్ ఎస్.ఐ.కి ఫోన్ వస్తుంది. కేసుని త్వరగా పరిష్కరించేందుకు తోడ్పడాలని వెంకట్రావు కోరగా, రాజకీయ జోక్యం లేకపోతే, తామెంత వేగంగా, సమర్థవంతంగా పని చేస్తామో చేసి చూపిస్తామని అంటాడు ఎస్.ఐ. అతనికి థాంక్స్ చెప్పి బయటకు వస్తూ, నోటీస్ బోర్డ్‌లో ఓ ఫోటో క్రింద సతీష్ అన్న పేరు చూసి, వెనక్కి వెళ్ళి అతని వివరాలను అడుగుతాడు వెంకట్రావు. సతీష్ కేసు గురించి, కేసుకు సంబంధించిన కొందరి ఫోటోలు చూపిస్తాడు ఎస్.ఐ. వాటిని చూసి ఆశ్చర్యపోయిన వెంకట్రావు మరో గంట సేపు అక్కడే కూర్చుని ఎస్.ఐ.తో చర్చలు జరిపి, ఓ ప్రణాళిక రూపొందిస్తాడు. విద్యార్థులు తవ్వుతున్న బావిలో నీరు పడుతుంది. అయినా గ్రామస్థులు ఆ నీటి విషయంలో సందేహిస్తారు. అప్పుడు ఓ చిన్న కుర్రాడు వచ్చి ఆ నీటిని తాగి, తృప్తిగా వాళ్ళమ్మ వైపు నడుస్తాడు. దాంతో గ్రామస్థుల సందేహాలు తీరి, అందరూ వచ్చి బావి దగ్గర మోకరిల్లుతారు. – ఇక చదవండి.]
అధ్యాయం-18
[dropcap]బా[/dropcap]వి పని చివరి దశలో ఉంది చకచకా కొనసాగుతోంది. బావి చుట్టూతా సిమెంట్‌తో చప్టా కడుతున్నారు ఎన్.సి.సి. క్యాండిడేట్స్ అంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
ఉన్నట్టుండి వనజ స్పృహ తప్పి పడిపోయింది. అందరూ చేతిలో సామాన్లు ఎక్కడివక్కడ పడేసి వనజ చుట్టూ చేరారు. వెంకట్రావు అందరిని దూరంగా నిలబడమని ఫస్ట్ ఎయిడ్‌గా గాలి వెలుతురూ వచ్చేట్టు చేసాడు. ఆంజనేయులు శ్రీనివాస్‌లు సుబ్రమణ్యం అందరూ వనజని క్లినిక్‌కి తీసుకువచ్చారు. వనజను బల్లమీద పడుకోబెట్టి డాక్టర్ పిచ్చేశ్వర్రావు దగ్గరికి వెళ్ళాడు వెంకట్రావు. విషయం చెప్పాడు.
డాక్టర్ విసుగ్గా అతని వంక చూసి “కన్సల్టేషన్ 500 రూపాయలు” అన్నాడు. అతనికి వీళ్ళ మీద ఆరోజు వాక్సినేషన్ డబ్బులు పోగొట్టుకున్నాను అన్న కోపం ఉంది.
“సిటీలోనే అంత ధర లేదు, మీరు మరీ ఎక్కువ చెబుతున్నారు” అన్నాడు వెంకట్రావు.
“ఇది అర్జెంటు కేసు. పైగా సిటీ నుంచి వచ్చి ఈ పల్లెటూర్లో ప్రాక్టీస్ పెట్టినందుకు మాకు ఆ మాత్రం లేకపోతే ఎలాగండి? ట్రాన్స్‌పోర్ట్, ఎక్విప్మెంట్, హాస్పటల్ హత్యలు మాకు ఎన్ని ఖర్చులు” అన్నాడు ఏమాత్రం ఇంటరెస్ట్ లేనట్టు.
వెంకట్రావు వెంటనే 500 రూపాయలు తీసి ఇచ్చాడు ‘తప్పదు ముందు ఆమెని బతికించడం ముఖ్యం’.
పేషెంట్‌ను చూడకుండానే ఏం జరిగింది తెలుసుకొని మందు రాసిచ్చాడు పిచ్చేశ్వరరావు.
“ముందే మా మెడికల్ షాప్ ఉంది అందులో కొనండి. 20% డిస్కౌంట్ కూడా ఇస్తారు” అన్నాడు
వెంకట్రావు ప్రిస్క్రిప్షన్ చూసాడు ప్రముఖమైన ఓ మందుకి ముందు న్యూ అని చేర్చి రాసి ఉంది.
మెడికల్ షాప్‌లో చూపించి టాబ్లెట్లు అడిగాడు. “200 రూపాయలు” అన్నాడు షాప్ వాడు.
వెంకట్రావుకి అంత ఆశ్చర్యంగా ఉంది. ‘కళ్ళు తిరిగి పడిపోయిన మనిషిని చూడకుండా మందు రాసి ఇవ్వటం. అది న్యూ అని చెప్పి ఒక మందు ముందు రాసి ఉండటం.. ఏమిటి చేయటం ఎందుకైనా మంచిది మరోసారి కనుక్కుందాం’ అనుకుంటూ తిరిగి డాక్టర్‌ని కలిశాడు
“ఆ టాబ్లెట్లు తలనొప్పి లాంటివాటికి కదా! మరి ఈ అమ్మాయి ఉన్నట్టుండి పడిపోయింది” అన్నాడు
“ఇది న్యూ. అయినా ఇంతవరకు నా ప్రిస్క్రిప్షన్ ఎవరూ అనుమానించలేదు” అన్నాడు ఇన్సల్ట్‌గా ఫీల్ అవుతూ.
మారు మాట్లాడలేకపోయాడు. వెంకట్రావు అసలు ఇవన్నీ ఆలోచించే టైం లేదు. గబగబా వెళ్లి న్యూ కలిపి వేసేసాడు.
క్షణాలు దొర్లుతున్నాయి. వనజ కళ్ళు తెరవలేదు సరిగదా, ఒళ్ళు చల్లబడి, అపస్మారకంలోకి పోసాగింది అందరికీ ఆందోళన, తెలియని భయం ఆవరించాయి. ఇక లాభం లేదని బస్సులో టౌన్‌కి తీసుకెళ్లారు.
సిటీలో డాక్టర్ పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చి మొత్తానికి గండం కట్టిగించాడు. వనజ కళ్ళు తెరిచింది.
“అసలు ఎందుకు ఆమె అలా పడిపోయింది అంటారు?” అని అడిగాడు వెంకట్రావు.
“జస్ట్ బికాస్ అఫ్ ఎంప్టీ స్టమక్. పొద్దున్నుంచి ఏమీ తినలేదులా ఉంది. చూసి వెళదామని వచ్చి ఉంటుంది. మీతో పాటు పనిచేయాలన్న ఉత్సాహం కలిగి సరాసరి తను కూడా వర్కులో దిగింది. అలసి సొలసి నీరసం మీద అలా అయింది. అంతే!” అని అన్నాడు డాక్టర్.
“మరి ఆ తర్వాత ఒళ్ళు చల్లబడటం, అన్ కాన్షస్ కావటం..?” అనుమానంగా అడిగాడు వెంకట్రావు.
“ఆమెకి ఏదో నకిలీ మందు ఇచ్చారు. ప్రముఖ మందులు కంపెనీ పేర్ల ముందు న్యూ తగిలించి దొంగ మందులు అమ్ముతున్నారు. మీకు ఆ డాక్టర్ తెలిస్తే ఓ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి” అన్నాడు డాక్టర్.
అందరూ ఆశ్చర్యపోయారు. పిచ్చేశ్వర్రావు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ గ్రామానికి తిరిగి ప్రయాణం అయ్యారు.
***
“శోభా.. శోభా” తలుపులు తట్టాడు సుబ్రమణ్యం. శోభ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా హాల్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్నాడు పాపయ్య శెట్టి డబ్బులు లెక్కపెట్టుకుంటూ.
“హాయ్ సుబ్రమణ్యం! వచ్చేసావా రా, రా, నాన్న.. నాన్నా.. ఈ అబ్బాయే సుబ్రమణ్యం అంటే” అంది తండ్రికి పరిచయం చేస్తూ.
ధనలక్ష్మి వంటింట్లో ఉన్నట్టుంది ఈ హడావిడి బయటకు వచ్చింది.
“కూర్చో బాబూ! కాఫీ తెస్తా” అంటూ లోపలికి వెళ్ళింది.
“కాఫీ తాగడు. మా ఇద్దరికీ ఒక కేజీ ఉప్మా చెయ్” అంది శోభ.
“నువ్వు ఉన్నావులే తిండిపోతువి. కేజీ అంటే ఎంతో నీకు తెలుసా? ఈ ఆస్తి అంతా అమ్మేసినా నీ ఆకలి తీరదు” అంటూ కూతురిని కసిరింది.
“నాన్నా! అమ్మ చూడు..” అంటూ తండ్రి గడ్డం పట్టుకుంది శోభ.
“దాన్నలా కసురుకోకే! అది ఎవరు అనుకున్నావే? నా బంగారు తల్లి. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి. దానికి కావాల్సింది ఏదో చేసి పెట్టు” అన్నాడు శెట్టి పెళ్ళానికి ఆజ్ఞ జారీ చేస్తూ.
“చేసి పెట్టక నేను ఒక్కతిని ఈ ఆస్తిని మెడకి కట్టుకుపోతాను. అసలు ఇది ఒక ఇల్లు. మనం మనుషులైతేగా” అంటూ వంటింట్లోకి వెళ్ళింది.
“బాబూ! నీ పేరు ఏమిటి మర్చిపోయాను” అడిగాడు శెట్టి గల్లా పెట్టకు తాళం వేస్తూ.
“సుబ్రమణ్యం”
“చూడు సుబ్రహ్మణ్యం! మనమేమిటి? మన ఆస్తి అంతస్తులు ఏమిటి? నువ్వు ఇలా ప్రజాసేవ అంటూ ఈ మురికి రోడ్లు పట్టుకుని ఈ అలగా జనంతో తిరగటానికి మీ నాన్న ఒప్పుకున్నాడా? అసలు మీ ఇంట్లో వాళ్లకి ఈ విషయం తెలుసా అంట” అన్నాడు శెట్టి.
“మా నాన్న లేడండి” అన్నాడు సుబ్రమణ్యం.
“అయ్యో పాపం! గుర్తు చేసి నిన్ను బాధపెట్టినట్లు ఉన్నాను. ఏమనుకోకు బాబు ఇంతకీ మీ నాన్నగారు చనిపోయి ఎన్నాళ్ళు అయింది?” అన్నాడు శెట్టి సంతాపం ప్రకటిస్తూ.
“అయ్యో! చనిపోలేదండీ. వ్యాపారం మీద మద్రాసు వెళ్ళాడు. మరో 15 రోజులైనా పడుతుంది తిరిగి రావడానికి. అందుకే పిక్నిక్‌కి వెళ్తున్నానని మా అమ్మతో చెప్పి వచ్చాను” అన్నాడు సుబ్రమణ్యం.
“పిక్కులిక్కు అంటే?” అర్థం కానట్టు అడిగాడు శెట్టి.
“పిక్నిక్ అంటే విహారయాత్ర అన్నమాట. అంటే స్నేహితులంతా కలిసి పార్కు బీచులకు ఫలహారాలు అవీ కట్టుకొని వెళ్లి తిని సంతోషంగా కబుర్లు ఆటలు పాటలతో గడుపుతారు” చెప్పాడు సుబ్రహ్మణ్యం.
“ఓహో అదే యాత్ర అన్నమాట. అయితే ఇంతకీ మీ అమ్మకి అబద్దం చెప్పి వచ్చావన్నమాట” అన్నాడు శెట్టి దాచుకున్న సగం కాలిన చుట్ట తీసి వెలిగిస్తూ.
“కాదండి. మొదటిసారి రావడం కదా. తెలియక నేను అలాగే ఉంటుందనుకున్నా. ఇప్పుడు తెలిసింది. ఇంకెప్పుడూ రాను. మా నాన్న ఉంటాడుగా” అన్నాడు సుబ్రమణ్యం.
“అయినా నీకు ఈ కాటేజీలు, చదువులు ఏంటి?”
“కాటేజీలు కాదు కాలేజీలు”
“అదే ఏదో లేజీలు. మనోళ్ళు అందరం బిజినెస్ లోనే ఉంటాం. చదువుకుంటే ఉద్యోగాలు చేయాల. అంటే కూలి అన్నమాట. అడ్డమైన వాళ్ళందరికీ సలాం కొట్టాలి. ఎనకటికి చదువుకోనివాడు సాకలోడితో సమానం అనేవాళ్ళు. మరి ఇప్పుడు చదువుకున్నాడు కంటే సాకలోడే మేలు అంటున్నారు
అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ సదువు గట్ల మానేసి చక్కగా వ్యాపారం చేసుకో. పైకి వస్తావు. నాకు బయట పనుంది ఎల్లోత్త” అంటూ వెళ్లిపోయాడు పాపయ్య శెట్టి.
ఇంతలో శోభ తల్లి ఇద్దరికీ కంచాల్లో ఉప్మా తెచ్చింది ఫలహారాలు కానిచ్చాక శోభ ఇల్లంతా తిప్పి చూపించింది సుబ్రహ్మణ్యానికి. చివరిగా గోడౌన్ చూసి ఎంతో ఆశ్చర్యంతో నోట మాట రాలేదు సుబ్రహ్మణ్యానికి నోరు కళ్ళు ఆర్చుకుపోయాయి.
‘ప్రభుత్వం ప్రజానీకం కోసం చౌకగా సప్లై చేసిన బియ్యం, చక్కెర ఎరువులు అన్ని అక్కడే బస్తాల్లో పేర్చి ఉన్నాయి. పురుగులు, ఎలుకలు, పందికొక్కులు తిని పోతున్న పర్వాలేదు కానీ పాపం బీదవాళ్లకు ఎందుకు పంచరు? అంటే ప్రజలు పురుగులు కంటే హీనమైన వాళ్లా?’ మొదటిసారి కొత్త కొత్త ఆలోచనలు సుబ్రహ్మణ్యం బుర్రకి పదును పెట్టసాగాయి.
గోడౌన్ చూసి బయటికి రాబోతుంటే ఓపక్క ఎరువుల బస్తాలు మధ్య నేలమీద వెండి కడియం తళ తళా మెరుస్తూ కనిపించింది సుబ్రహ్మణ్యానికి. శీల ఊడిపోయినట్టుంది. శోభ ముందు నడుస్తోంది ‘తీసుకుందామా వద్దా? తీసుకుని ఏం ప్రయోజనం? తనేం చేసుకుంటాడు? తనేమన్నా ఆడపిల్లా? ఆ కడియం వేసుకుని తిరగటానికి. పోనీ అమ్ముకోవటానికి తానేమీ దరిద్రుడు కూడా కాదు. ఒక్కడే కొడుకు. కొండమీది కోతి కావాలన్నా దొరుకుతుంది తనకి.’
“రా” అంది ఇంతలో శోభ అతని చేయి పట్టి లాగుతూ.
ఏవో తెలియని అనుమానాలు. అర్థం లేని శంకలు, ప్రశ్నలు.
‘వెండి కడియాలు వాళ్ళ ఇళ్లల్లో ఎవరూ ధరించరే!. కనీసం కాలి పట్టాలు కూడా వేసుకోదు శోభ. మరి ఆ కడియం వాళ్ళ పనిమనిషిదా? ఎవరిది అయినా అక్కడ ఎందుకు పడింది? ఎవరు చూడలేదు కామోసు లేకపోతే బస్తాలు లోపలికి బయటికి మోసే కూలీలు దాన్ని ఎప్పుడో దొంగలించి అమ్మి సొమ్ము చేసుకునే వాళ్లే’ అనుకున్నాడు సుబ్రమణ్యం.
శోభ గోడౌన్‌కి తాళం వేసి తాళం చెవి గోధుమలు బస్తాకి ఉన్న కన్నంలో గుచ్చి బయటకు వచ్చింది.
“కూర్చో” అని సోఫా చూపిస్తూ.
సుబ్రహ్మణ్యానికి వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయట పడాలనిపించింది.
‘ఎలాగైనా తన వాళ్ళని వెంటనే కలిసి ఈ కడియం విషయాలు చెప్పాలి ప్రయోజనం ఏదైనా ఉన్నా లేకున్నా’
“చాలాసేపు అయింది. మా సార్ నాకోసం ఎదురు చూస్తుంటారు. వెళ్లి వస్తా” అంటూ బయల్దేరాడు.
“సరే” అంటూ తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది శోభ ఆయాసంగా ఆవలిస్తూ.
‘ఎందుకైనా మంచిద’ని చెప్పులు అక్కడే వదిలి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం.
‘విషయం తన వాళ్లకి చెప్పి వాళ్ళు ఒకవేళ తెమ్మంటే తను మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఇప్పుడే వెళ్లి అప్పుడే వెనక్కి వస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. చెప్పులు మరిచిపోయాను అని చెప్తే ఎవరికి అనుమానం రాదు. ఒకవేళ తనవాళ్లు కడియం అక్కర్లేదు అంటే వచ్చి మామూలుగా చెప్పులు వేసుకుని వెళ్ళచ్చు’ అదీ సుబ్రమణ్యం అసలు ప్లాన్. రోడ్డు మీదకు వచ్చాక బడికేసి పరుగు తీశాడు సుబ్రమణ్యం.
***
సుబ్రమణ్యం చెప్పింది విని అందరూ పెదవి విరిచారు. అవసరం లేదని తేల్చేశారు. కొందరికి అసలు ఆ కడియం గురించి ఎందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు. ఒక్క శ్రీనివాస్ మాత్రం ఆశ్చర్యపోయాడు. అతని ఆశ్చర్యాన్ని కారణం తెలిసాక అందరూ ఆశ్చర్యపోయారు. అవును బసివి కాలికున్న కడియం సంగతి “మనలో నా ఒక్కడికే తెలుసు. అంత చనువుగా ఆమె మెలిగింది నా ఒక్కడితోనే. ఊరి వాళ్ళ దృష్టిలో ఆమె బసివైనా నాకు మాత్రం ప్రకృతి. నా ప్రేయసి. ప్రణయని. నా స్వప్న సుందరి” భావావేశంతో బాధతోను ఉక్కిరిబిక్కిరి అయ్యాడు శ్రీనివాస్.
“ఒరేయ్ సుబ్బిగా ఇంకా నిలబడ్డావేం? ఎలాగైనా సంపాదించి తెచ్చే బాధ్యత, సమర్థత నీదే” అన్నాడు ఆంజనేయులు. అంతే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు సుబ్రహ్మణ్యం.
సీతమ్మవారిని వెతకడానికి బయలుదేరిన ఆంజనేయుడిలా శోభ వాళ్ళింటికి బయలుదేరాడు సుబ్రహ్మణ్యం.
***
“ఏం బాబూ మళ్ళీ వచ్చావు?” మర్యాదగానే అడిగింది ధనలక్ష్మి.
“శోభతో ఓ మాట మాట్లాడటం మర్చిపోయాను” అన్నాడు వచ్చిన పని చెప్తున్నట్టు.
“స్నానం చేస్తోంది కూర్చో. నాకు వంట పని ఉంది” అంటూ లోపలికి వెళ్ళింది ధనలక్ష్మి.
శెట్టి గారు ఇంట్లో లేరు. సమయానికి శోభ కూడా లేదు.
‘ఇదే అదును కదులు’ అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుని గోడౌన్ కేసి నడిచాడు సుబ్రహ్మణ్యం.
గోధుమల బస్తాల్లో వున్న తాళం చెవితో గోడౌన్ తాళం తీసి తలుపులు తోసి లోపలికి వెళ్ళాడు. గబగబా వెండి కడియాన్ని కర్చుతో తీసి జేబులో పెట్టుకుని తాళం వేసి హాల్లోకి వచ్చాడు. అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుంది అదే సమయంలో ఎదురు చూస్తుంటారు. మళ్ళీ కలుస్తాను అంటూ కడియం పట్టుకున్న చేతిని ప్యాంటు జేబులోకి ఫ్యాషన్‌గా పోనిచ్చి హడావిడిగా వెళ్లిపోయాడు సుబ్రహ్మణ్యం.
అధ్యాయం-19
రాత్రి ఎనిమిది గంటలవుతోంది.
శీనయ్య మాంచి హుషారుగా ఉన్నాడు. సిల్క్ లాల్చీ, తెల్ల రామరాజ్ కాటన్ లుంగీతో వెలిగిపోతున్నాడు.
తన ఇంట్లో ఒక్కడే కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఎదురుగా చిన్న టీపోయ్. దానిమీద ఫారిన్ విస్కీ సీసా. నంచుకోవటానికి రోస్టెడ్ జీడిపప్పు. చేతిలో గోల్డుఫ్లాక్ కింగ్ సైజు సిగరెట్టు. చిన్న రాయుడి లాగా ఉన్నాడు.
కుర్చీ ప్రక్కనే ఉన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ కేసి తెగ చూసుకుని గర్వంగా నవ్వుకుంటున్నాడు. ఒక పెగ్గు తాగి, బ్యాగ్ తీసి ఓపెన్ చేసి చూసాడు. క్రొత్త వంద రూపాయల కట్ట. పదివేలు. ప్రేమగా నోట్లని తడిమి చూసాడు. ఒక్కసారి పట్నం వెళ్లొచ్చినందుకు పారితోషికం.
వందకీ, రెండోందలకి కక్కుర్తి పనులు చేసే తనకి ఒక్కసారిగా పదివేలు ఇప్పించాడు రాయుడు. రాయుడిమీద గౌరవం పొంగిపొర్లింది.
పెళ్ళాన్ని పుట్టింటికి పంపేసి, టౌను కెళ్ళి సొమ్ము అందుకుని ఊరికి తిరిగి వచ్చాడు. మూడో కంటికి తెలీదు. ఈ రాత్రి మందు, విందు.. అబ్బా బసివి ఉంటేనా.. పొందు కూడా ఉండేది.
బసివి గుర్తుకు రాగానే తాగింది ఒక్కసారి దిగిపోయింది. చెమటలు పట్టినాయ్.
తల విదిలించి విస్కీతో నిండుగా ఉన్న గ్లాస్‌ని ఎత్తి గడగడా తాగేసాడు. సిగరెట్ వెలిగించి మళ్ళీ మనీ మత్తులో మునిగిపోయాడు. అలా తాగీ తాగీ సొమ్మసిల్లి పడిపోయాడు.
అప్పుడే మిత్రత్రయం ఇంట్లోకి అడుగు పెట్టారు – “శీనయ్యా “ అంటూ.
ఉలుకూ పలుకూ లేదు. ఆంజనేయులు ప్రక్కనే ఉన్న జగ్గులో నీళ్ళని శీనయ్య తలమీద గుమ్మరించాడు.
అదిరిపడి లేచిన శీనయ్య “ఏయ్ ఎవడ్రా అది? చంపేస్తా కొడకల్లారా..” అంటూ లేవబోయి మత్తు దిగాక జారిపడ్డాడు.
కుర్చీ కొడుకు తగిలి “అయ్య బాబోయ్” అంటూ అరిచాడు.
“ఓయ్ శీనయ్యా..” పిలిచాడు సుబ్రహ్మణ్యం.
“ఎవరూ?” అంటూ కళ్ళు తెరచి చూసి,
“ఏంది ఎన్.సి.సి. ఇటొచ్చారు?” అన్నాడు ఇకిలిస్తూ.
“ఏం లేదు నీకు చిన్న సన్మానం చేద్దామని” నెమ్మదిగా చెప్పాడు శ్రీనివాస్.
“అయ్య బాబోయ్ సన్మానమా.. నాకా ఇదిగో నీకు ఏదైనా కోపం ఉంటే నడిరోడ్డు మీద చెప్పి కొట్టు. అంతేకానీ, ఎకసెక్కాలు వద్దు” అన్నాడు శీనయ్య ఆశ్చర్యంగా చూస్తూ.
“అందుకే” అన్నాడు ఆంజనేయులు.
“ఆ..” అన్నాడు శీనయ్య అవాక్కై చూస్తూ.
“అదే.. నడిరోడ్డు మీదే రచ్చబండ దగ్గర సన్మానం. రమ్మని చెప్పడానికి వచ్చాము. వెళ్ళొస్తాం” అన్నాడు సుబ్రమణ్యం.
కాస్త తేరుకున్న శీనయ్య “సరే నాకు సన్మానం అన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా?”
“ఏదో మన రాయుడు గారికి. పాపయ్య శెట్టి గారికి, మన డాక్టర్ గారికి” అన్నాడు శ్రీనివాస్.
“అయ్య బాబోయ్..రాయుడు గారి పక్కన, డాక్టర్ గారి పక్కన, ఓరి నాయన.. నేను రాను”
“ఎందుకలా భయపడతావు? వాళ్ళు ఏమైనా దయ్యలా, భూతాలా? చంపేస్తారా, మింగేస్తారా?”
“అమ్మో.. చెప్పొద్దు పెద్ద పెద్దోళ్ళు పక్కన నుంచోటం అది స్టేజి మీద ఉపన్యాసికాలు.. పైగా నాకు సన్మానం.. నాకొద్దు స్వామి” ఖండితంగా చెప్పాడు.
“ఎందుకు అంత భయం? మాకు కుడి భుజం లాంటివాడు, అతని లేనిదే మాకు ఏ సన్మానం వద్దు అని వాళ్లే నిన్ను పిలవమన్నారు” అన్నాడు శ్రీనివాస్.
అంతే! శీనయ్య డంగిపోయాడు.
“అయితే నాకు ఇష్టమే. సాయంత్రం తప్పకుండా వస్తాను” అన్నాడు.
“ఇంక వెళ్లొస్తాం. సరిగా టైం కి రావాలి సాయంత్రం ఐదు ఇంటికి” అన్నాడు సుబ్రమణ్యం.
ముగ్గురు మిత్రులు బయటికి వెళ్లారు.
వాళ్లకి బాగా తెలుసు. ఫారిన్ విస్కీ తాగుతున్నాడు అంటే ఏదో పెద్ద మొత్తంలో డబ్బు ముట్టిందన్నమాట. డబ్బులు చేతిలో పడ్డాయి గనక ఇవాళ కాస్త గొంతు తడుపుకొని వస్తాడు అనుకున్నారు మిత్రులు.
ఈపాటికి రాయుడు గారిని, శెట్టి గారిని ఆహ్వానించడానికి సార్ వాళ్లు వెళ్లే ఉంటారు అనుకుంటూ బడివేపు కదిలారు.
***
రాయుడికి పట్టపగ్గాలు లేనంత సంతోషంగా ఉంది. సిక్కిం స్టేట్ లాటరీ తగిలినట్టుంది. కాలం కలిసి రావటం అంటే అదే మరి! రొట్టె విరిగి నేతిలో పడటం అన్నా, నక్కతోక తొక్కిన రోజన్నా అదే మరి రాయుడికి.
‘వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఈ ఎన్.సి.సి. వాళ్ళ పుణ్యమా అని బ్యాంకులో వేసిన ఊరి బావి కాంట్రాక్ట్ సొమ్ము లక్ష రూపాయలు కదలకుండా భద్రంగా ఉన్నాయి.
అసలు తనకి కాంట్రాక్ట్ రావటం ఏమిటి? గవర్నమెంట్ వాళ్లకి ఇంత మేతబడేసి ఆ డబ్బుని బ్యాంకులో వేసుకోవటం ఏమిటి? చూస్తుండగానే సంవత్సరాలు దొర్లిపోయాయి. వడ్డీ పెరిగి అసలు అంత అయ్యింది ఎవరైనా అడిగితే వర్షాలకు పూడిపోయింది అని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ పడదాం అనుకున్నాడు తను.
పోనీలే.. ఏ లొసుగూ లేకుండా పని పూర్తయింది వీళ్ళ పుణ్యమా అని.
బసివిని ఎవరో చంపి బావిలో పడేసాట్ట. శీనయ్య ఎవరెవరి పేర్లో చెప్తున్నాడు గాని నమ్మ బుద్ధి కావడం లేదు. తను కూడా రచ్చకెక్కటం దేనికి అని చెప్పి పోలీసులకు చెప్పి ఫైల్ క్లోజ్ చేయించాడు.
బావి త్రవ్వటం మొదలెట్టి తన ఆదాయానికి గండి కొడుతున్నారన్న కోపంతో ఏదో ఒక శవాన్ని తీసుకెళ్లి బావిలో వేస్తే పీడా వదులుతుంది అన్నాడు తాను శీనయ్యతో. అదే నిజమైంది.
కానీ, ఎన్.సి.సి. వాళ్ళు బావి త్రవ్వారు. నీళ్లు పడ్డాయి. వాళ్ళు హ్యాపీ. వాళ్ళు ఆ సంతోషంలో ఊరి పెద్దలకి సన్మానం అంటున్నారు. వాళ్ల సంతోషం ఎందుకు కాదనాలి?
వాళ్ళ శ్రమ, వాళ్ళ ఖర్చు. పర్మిట్లు తెచ్చుకున్నారు. ఊరి వాళ్ళు శ్రమదానం చేశారు. తనే ఊరికి పెద్ద కదా. అయినా ప్రజా సేవ చేయాలని ప్రాణత్యాగాలు చేస్తూ పోతే బతికున్న వాళ్ళంతా చచ్చిన వాళ్ళ పేర్లు చెప్పుకొని ప్రభుత్వ ఖజానాల్లో ఉన్న ప్రజల సొమ్ము అంతా పందికొక్కుల్లా మేసేయటం తప్ప ప్రజల పరిస్థితి బాగుపడేది ఏమీ ఉండదు.
అయినా తనంత వ్యవహార జ్ఞానం ఉన్నవాడు రాజకీయాలకు పనికిరాడులే.
‘అదుగో వనజ బయల్దేరి వెళ్తోంది. నేను కూడా లేచి బయలుదేరాలి’ అనుకుంటూ లేచాడు రాయుడు.
***
పాపయ్య శెట్టి నూతి దగ్గర పీట మీద కూర్చున్నాడు. ఒళ్లంతా నూనె పట్టించినట్టు నిగనిగలాడుతోంది. తల చీకేసిన తాటికాయ టెంకలా ఉంది. భార్య ధనలక్ష్మి కుంకుడు రసం పోస్తోంది.
“ఏవండోయ్.. మరి..” అంది సంతోషంగా
“ఇవాళ నాకేదో మూడింది అన్నాడు శెట్టి నెమ్మదిగా.
“ఛ.. ఛ .. ‘లక్ష వస్తేనేం, లక్ష్మి వస్తేనేం.. నా మామ కట్నం ఇవ్వలేదుగా’ అని ఏడిశాట్ట వెనకటికి ఎవడో.. మీ అప్పు పత్రాలు, ఆస్తి గోలలు కోపం నా మీద చూపిస్తారు ఏంటి?” అంది విసుగ్గా.
“అది కాదే! నేను అన్నది ఇవాళ నువ్వు సంతోషంగా ఉన్నట్టు అనిపించి..” నశిగాడు శెట్టి.
“ఏం నేను సంతోషంగా ఉంటే మీ కళ్ళల్లో కుంకుడు రసం పోసినట్టు ఉంటుందా?” కసిగా అంది ధనలక్ష్మి.
“అబ్బ క్షమించేద్దు.. కోపం మాని ఇంతకీ ఆ సంతోషం వార్త ఈ చెవిన వెయ్యి” అన్నాడు.
“మరి మీకు సన్మానం చేస్తారట” అంది.
“అయ్య బాబోయ్” గావు కేక పెట్టాడు.
“ఏమైంది?” విసుగ్గా అంది ధనలక్ష్మి.
“కుంకుడు రసం పడిందిలే.. సర్దుకుంది.. సరేగాని ఎవరు సన్మానం చేస్తామంది?”
“మన అల్లుడు గారు వాళ్ళు” చెప్పింది.
“అబ్బో” మళ్లీ గావు కేక పెట్టాడు శెట్టి.
“నీకేమైనా దయ్యం పూనిందా?” అని అడిగింది.
“కుంకుడు రసం.. సర్దుకుందిలే” నీళ్లు కుమ్మరించుకుంటూ శెట్టి.
“ఎప్పుడో తెలుసా, ఇవ్వాళే” అంది ధనలక్ష్మి.
“ఇంతకీ ఇవన్నీ అల్లుడుగారు చేసే పనులన్నమాట” అన్నాడు.
ఇంతలో ఏదో గుర్తుకొచ్చినట్టు “అవును ఈ అల్లుడు ఎవరే?” అన్నాడు.
“అదే మన సుబ్రమణ్యం! అయినవాడు, అమ్మాయికి ఈడు జోడు” అంది.
“మరి ఆస్తి?”
“నిన్ను నన్ను తగలేసినా తరగని ఆస్తుంది. ఒక్కడే కొడుకు” అంది విసుగ్గా.
“ఏడీ ఎక్కడున్నాడు?”
“హాల్లో కూర్చున్నాడు” అంది.
పాపయ్య శెట్టి డ్రెస్ చేసుకుని హాల్లోకి వచ్చేసరికి గొల్లుమని నవ్వు, ఏడుపు ఒకేసారి వినిపించినాయ్.
ఆశ్చర్యపోయాడు శెట్టి.
ఇంతకీ ఆ నవ్వేది తన కూతురు.. చీ చీ పరాయి మగాడితో.. ఆ తప్పేముందిలే కాబోయే అల్లుడేగా అనుకుంటూ సన్మానం కబురు వినటానికి వాళ్ళ దగ్గరికి కదిలాడు.
(వచ్చే వారం ముగింపు)