[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఆరుబయట ఓ కుర్చీలో కూర్చున్న వెంకట్రావు వద్దకు ఓ యువతి, యువకుడు వస్తారు. ఆమె తన పేరు విద్య అనీ, తాను బి.ఎ. చదివాననీ, ఇక్కడ పిల్లలకు ట్యూషన్స్ చెప్తానని అంటుంది. తనతో వచ్చినది తన అన్నయ్య పంచనాథం అని, సంగీత పాఠాలు చెప్తాడని చెబుతుంది. వెంకట్రావు తన పేరు చెప్పి, కూర్చొమని, విషయమేమిటని అడుగుతాడు. మీరు శ్రమదానంతో గ్రామాభ్యుదయం కోసం కృషి చేస్తున్నట్టు విన్నాము, జనాలు కోరినట్టు బావి తవ్వించమని అడిగేందుకు వచ్చామని చెప్తుంది. నిన్న మీటింగ్‍కి రాలేదా అని వెంకట్రావు అడిగితే, వచ్చామనీ, కానీ అక్కడ ఏమీ చెప్పలేమని, అందుకు మిమ్మల్ని విడిగా కలిసి చెప్తున్నానని అంటుంది. మీకు కొన్ని నిజాలు చెప్పాలి అంటూ రాయుడు చేస్తున్న నీళ్ళ వ్యాపారం గురించి చెప్తుంది. రాయుడు కొండచిలువలా ప్రజల ఆస్తులను మింగేస్తున్నాడని అంటుంది. తనకి అర్థంకాని రాజకీయాలు ఈ ఊర్లో ఉన్నాయని గ్రహిస్తాడు. మీ సహాయం మాకుంటే, మా సహాకారం మీకెప్పుడూ ఉంటుంది అని చెప్పి అన్నతో కలిసి వెళ్ళిపోతుంది. ఎన్.సి.సి. పెరెడ్ మొదలవుతుంది. ఆలస్యంగా వచ్చిన కేడెట్లను మూడు జట్లుగా చేసి, ఊరి చివర ఉన్న వేపచెట్టు నుంచి కొమ్మలు కోసుకుని పావుగంటలో రావాలని, లేటుగా వచ్చిన వారికి బ్రేక్‍ఫాస్ట్ ఉండదని ఆర్డర్ వేస్తాడు వెంకట్రావు. మిత్రత్రయం కూడా వాళ్ళల్లో ఉంటారు. నీకు బ్రేక్‍ఫాస్ట్ లేదని ఫిక్స్ అయిపో అంటాడు శ్రీనివాస్ సుబ్బుతో. స్టార్ట్ అని విజిల్ వేస్తాడు వెంకట్రావు. అందరూ పరుగెత్తుతారు. సుబ్బు కూడా పడుతూ లేస్తూ పరుగుపెడతాడు. రెండో వార్డు చివరికొచ్చేసరికి ఒళ్ళు తేలిపోయి పాపయ్య శెట్టి ఇంటి ముందు పడిపోతాడు. ఇంటి ముందు ముగ్గు పెడుతున్న శెట్టి కూతురు శోభ జాలిపడి సుబ్బు మీద చెంబెడు నీళ్ళు కుమ్మరించి పైకి లేపి కూర్చోబెడుతుంది. ఎందుకు, ఎక్కడికి పరిగెడుతున్నావు అని అడిగితే, ఊరి చివరికి వెళ్ళి వేపకొమ్మలు కోసుకురావాలని చెప్తాడు. కొన్ని క్షణాలాలోంచి, తమ ఇంటి పెరట్లో ఓ చిన్న వేపచెట్టు ఉందని చెప్పి, వెళ్ళి ఓ కొమ్మ కోసి తెచ్చి సుబ్బుకి ఇస్తుంది. దాన్ని తీసుకుని సుబ్బు అందరికంటే ముందుగా చేరుకుంటాడు. అందరూ ఆశ్చర్యపడి వెంకట్రావుకి కంప్లైంటు చేస్తారు. ఇంతలో టిఫిన్లు రావడంతో, అందరూ వాటి కోసం ఎగబడతారు. సుబ్బు దానిలోనూ ఫస్ట్ వస్తాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-5
[dropcap]పా[/dropcap]పయ్య శెట్టి ఇల్లు.
పాపాల గోడలు పాలరాయిలా మెరుస్తున్నాయి. ఊరిజనం అవసరాలకి ‘ఉదారంగా’ అప్పులిచ్చి ఆదుకునే కుబేరుడు పాపయ్య శెట్టి. పేరుకు తగ్గ గుణం, పిల్లికి బిచ్చం పెట్టని పిసినారితనం అతని గుణాలు. రాయుడి గారి ఆంతరంగిక సలహాదారు. ఐదో తరగతి ఆరుసార్లు తప్పినా, ఆ ఊరి రాజకీయాల్ని పదహారోయేటనే ఔపోసన పట్టిన రాజకీయవేత్త. అందుకే డాబుగా తిరిగే రాయుడు సైతం ‘మెదడుకు సంబంధించిన పని’ పాపయ్య శెట్టికే వదిలేస్తాడు.
అలాంటి శెట్టికి కూడా ప్రేమ ఆప్యాయతా, అనురాగం వంటివి వున్నాయి. ఊరిజనం మీద కాదు – ముద్దుల కూతురు శోభ మీద.
ఆ ఇంట్లోంచే ప్రస్తుతం అపస్వర సంగీతం విన్పిస్తోంది.
“‘నమామి’ అనమ్మా” అని శోభతో చెప్పించాలని నానా అవస్థ పడుతున్నాడు సంగీతం మాస్టారు పంచనాథం.
శోభ – తొండం, తోక లేని ఏనుగు పిల్లలా ఉండి. నల్ల బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. నోరు పెద్దదే.. కానీ దాన్ని తినేందుకు మాత్రమే ఉపయోగిస్తుంది.
‘నమామి’ అన్న మూడు అక్షరాలకు తెగ తంటాలు పడుతోంది.
ఇంతలో శోభ తల్లి పంచనాథం కోసం ఫలహారం తెచ్చింది.
“‘నమామి’ అనమ్మా”
“తినాలి” అంది శోభ ఫలహారం వంక ఆబగా చూస్తూ. తల పట్టుకు కూర్చున్నాడు పంచనాథం.
గాడిదకైనా గాంధర్వ గానం వస్తుందేమో గానీ.. ఈ పిల్ల ఏనుగుకి ఒక్క స్వరం కూడా వంటబట్టడం లేదు. అలా అని పాపయ్య శెట్టి కి ఎదురు చెప్పలేడు.
“‘తినాలి’ కాదమ్మా.. ‘నమామి’.. అంటే నమస్కరించటం అన్నమాట. అప్పుడు సంగీతం వంటబడుతుంది.”
“వంటా.. ఏం వంట మాస్టారూ.. నాకు తెచ్చి పెట్టరూ !?” కళ్ళు పెద్దవి చేసి చొంగ కారుస్తూ అడిగింది.
“ఆ వంట కాదమ్మా.. సంగీతం మనకు వస్తుంది అని అర్థం.”
“నేను అన్నాను పోండి మాస్టారూ.. ఇప్పుడు మా అమ్మ ఫలహారం తెచ్చిందిగా.. ఇంక ‘తినాలి’. అంతగా కావాలంటే మీరు అంటూ వుండండి. నేను తింటూ వుంటాను. ఇటు ఇయ్యవే అమ్మా!” అంటూ అమ్మ చేతిలో ప్లేట్ లాక్కుని బొక్కటం మొదలెట్టింది.
“ఇస్తానమ్మా.. ఇస్తాను. ఇలా ఇస్తూనే నీ తిండి కోసం రెండెకరాల బంగారం లాంటి భూమి అమ్మాల్సి వచ్చింది. పాఠం నేర్చుకోవే అంటే ఫలహారం కావాలంటావా? చీల్చేవాళ్ళు లేక గానీ..” అంటూ ఉప్మా ప్లేట్ పంచనాథం ముందు పెట్టి మంచి నీళ్లు తెచ్చివ్వటానికి లోపలకు వెళ్ళింది.
అప్పటిదాకా శోభ మూర్ఖత్వంతో అరచి అరచి అలసిపోయిన పంచనాథానికి ఉప్మా చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఆనందంగా లేచి చేతులు కడుక్కొద్దామని దొడ్లోకి వెళ్ళాడు.
తిరిగొచ్చేసరికి ప్లేటు ఖాళీగా ఉంది. శోభా ప్రక్కనే వున్న బిందెను ఎత్తి నీళ్లు తాగుతోంది.
ఏమీ అనలేని అసహాయత, ఆకలి ఆవేశంతో గిరుక్కున వెనక్కు తిరిగి బయటకు వెళ్ళిపోయాడు ఇంక ఆమెతో వాగే ఓపిక లేక.
మంచినీళ్ల గ్లాసుతో వచ్చిన తల్లికి శోభ ‘బ్రేవ్’మని త్రేన్చటం వినిపించింది. విషయం అర్థమై విస్తుపోయింది.
“అయ్యో.. అయ్యో.. ఓసి నీ మొహం మండా.. ఎంత పని చేసావే? అయినా నిన్నని ఏం లాభం? నిన్ను ఎమ్మెస్ సుబ్బలక్ష్మి అంతటిదాన్ని చేయాలని పగటి కలలు కనే మీ నాన్నని అనాలే మొద్దు మొహమా.. చ్చీ.. చ్చీ.. ఒళ్ళు పెరగ్గానే సరిగాదు.. బుర్ర పెరగాలి..” కరచినంత పని చేసింది తల్లి..
శోభ ఓండ్ర పెట్టినట్టు ఏడవటం మొదలెట్టింది. లోపలి దూసుకు వచ్చాడు పాపయ్య శెట్టి.
“ఏమిటే ధనలక్ష్మీ.. వాగుతున్నావ్? నా కూతుర్ని తిట్టావంటే నీ చేమడాలొలిచేస్తానంతే.. నీ పోరు దాని సంగీతానికి అడ్డంగా ఉంది. చిన్న పిల్ల .. ఆకలై తిన్నది.. ఒక్కగానొక్క నలుసు. ఈ ఆస్తంతా దానికే గదా! అదెవరనుకున్నావే? రేపు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి అంత అవుతుందే.. ఏమనుకున్నావ్?” అంటూ శోభను సముదాయిస్తూ దగ్గరకు తీసుకున్నాడు పాపయ్యశెట్టి.
“సర్సరే.. వెళ్లి మంచి నీళ్లు పట్రా” అంటూ శోభకు బిందె ఇచ్చింది ధనలక్ష్మి.
ముద్దుగా తండ్రికి ఓ ముద్దిచ్చి బిందె తీసుకుని చెరువు గట్టుకేసి పరుగుతీసింది శోభ.
***
ఊళ్ళో షికారుకి బయల్దేరారు మిత్రత్రయం. ..అలా అలా తిరిగి చెరువు దగ్గరకొచ్చేరు.
“నీ జీవితాశయం ఏమిట్రా సుబ్బిగా?” అడిగాడు ఆంజనేయులు.
“ప్రేమించి పెళ్లి చేసుకోవటం” గర్వంగా చెప్పాడు సుబ్రహ్మణ్యం.
“ఆహాఁ.. నీ ఆశయం నెరవేరబోతోంది. అటు చూడు” చెరువుకేసి చూపించాడు.
బిందెను చెరువులో ముంచుతూ సన్నగా పాడుతోంది శోభ.
ఆమెను చూడగానే సుబ్రహ్మణ్యం గుండె లయ తప్పింది. ఏదో తెలియని తీయని బాధ. ప్రొద్దున ఆమె తనకు సాయపడిన ఘట్టం గుర్తుకొచ్చింది.
“తెలివి గల పిల్ల” అన్నాడు అనాలోచితంగా..
“ఆహా.. ఆ తెలివంతా ఆ పిల్ల శరీరంలోనే ఉన్నట్టుంది.” అన్నాడు శ్రీనివాస్ ఆ భారీ కాయాన్ని చూస్తూ.
ఇంతలో నీళ్ల బిందె ఎత్తలేక ఆపసోపాలు పడుతూ అటూ ఇటూ చూసిన శోభకు మిత్రత్రయం కన్పించారు.
సుబ్రమణ్యాన్ని చూస్తూ” అబ్బాయ్.. సాయం పట్టవా?” అని అడిగింది.
“నేనా?” భయపడ్డాడు. “మా అమ్మకు నేనొక్కొడ్నే కొడుకుని”
“అవును.. అందుకే వీడు వాడి భారం కూడా మా మీదే వేస్తుంటాడు. పోనీ నేను సాయం చేయనా?” అన్నాడు ఆంజనేయులు.
అతన్ని కొరకొరా చూస్తూ సుబ్రహ్మణ్యాన్ని “నువ్వే రా” అంది.
“ఒరేయ్ బంపర్ ఆఫర్.. పో.. నీ పంట పండింది..” అంటూ సుబ్రమణ్యాన్ని ముందుకు నెట్టారు ఇద్దరు మిత్రులూనూ.
‘అయ్యో.. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ కూడా లేనట్టుందే’ అని గొణుక్కుంటూ ఆమెకేసి నడిచాడు.
“అమ్మాయి.. బిందె చాలా బరువుగా ఉందా?” అడిగాడు భయంగా.. “అబ్బే.. ఆ అమ్మాయంత బరువుంటుందంతే!” వెనకనుంచీ శ్రీనివాస్ అన్నాడు.
“కాదు ఆ అమ్మాయే ఎక్కువ బరువులా ఉందే!” అన్నాడు ఆంజనేయులు.
“నోర్ముయ్యండిరా.. దేవుడిచ్చిన శరీరానికి పాపం ఏమేం చేస్తుంది?” అన్నాడు సుబ్రహ్మణ్యం..
“పెంచి పోషించటం తప్ప” అందుకున్నాడు శ్రీనివాస్.
తన తరఫున మాట్లాడటంతో సుబ్రహ్మణ్యం పై ప్రేమ ముంచుకొచ్చింది శోభకు.
అలా ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉండిపోయారు. ఆంజనేయులు పిలిచాడు.
“వూహు.. వాళ్లు వినే పరిస్థితిలో లేరు.. ఉండు” అంటూ జేబులోంచీ ఎన్.సి.సి. విజిల్ తీసి గట్టిగా ఊదాడు శ్రీనివాస్. ఉలిక్కిపడ్డారు శోభ, సుబ్రహ్మణ్యంలు.
“సాయం చేయనా?” తడబడుతూ అడిగాడు సుబ్రహ్మణ్యం.
“వెధవ అనుమానాలెందుకు.. చేసేయ్” అన్నాడు ఆంజనేయులు తొందరపెడుతూ.
“ఒరేయ్.. ఈ బిందెను మీ నెత్తిన పెట్టీ..” కసిరాడు సుబ్రహ్మణ్యం.
“ఆ.. పెట్టీ” చిలిపిగా అడిగాడు శ్రీనివాస్.
“ఛీ.. పోండి” విసుక్కుని శోభ వైపు తిరిగి,
“పట్టమ్మాయ్” అంటూ బిందెను భుజాలకెత్తాడు. ఆ ప్రయత్నంలో గరిమనాభి తప్పిపోయి ధడేల్ మని క్రింద పడ్డాడు సుబ్రహ్మణ్యం.
శ్రీనివాస్, ఆంజనేయులు పరిగెత్తుకుంటూ వచ్చి బిందెను కడిగి బిందె నింపి శోభ భుజానికెత్తి పంపారు.
ఆమె జాలిగా సుబ్రమణ్యాన్ని చూస్తూ వెళ్ళిపోయింది.
‘ఇక సుబ్బిగాడ్ని లేపాలి’ అంటూ వాడి వంక చూసారు.
సుబ్రహ్మణ్యం బురదలో కూర్చొని శోభా వెళ్తున్నవైపే తదేకంగా చూస్తున్నాడు.
“లాభం లేదు.. వాడు ప్రేమలో పడ్డాడు రా..”
“అదేంటి.. వాడు బురదలో పడితేనూ?” అమాయకంగా అడిగాడు ఆంజనేయులు.
“అదే ప్రేమంటే” అంటూ వెళ్లి సుబ్రమణ్యాన్ని లేవదీశాడు శ్రీనివాస్.
అధ్యాయం-6
పాతకాలపు కట్టడమే అయినా ఆ ఇంటికి మరో శతాబ్దం దాకా ఢోకా లేదు. ఏ ప్రకృతీ వికృతాలూ జరక్కపోతే!
ఆరు గదుల ఇల్లు.. నాగరికతలో వచ్చిన మార్పులకనుగుణంగా తీర్చిదిద్దారు. విశాలమైన స్థలం మధ్య పొదరిల్లులా కనిపిస్తోంది.
రాయుడు వరండాలో కూర్చుని మంగలి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతకీ రాకపోయేసరికి భైరవుడ్ని కేకేసి మంగల్ని పిలుచుకు రమ్మన్నాడు.
భైరవుడికి దారిలోనే ఎదురయ్యాడు మంగలి వెంకన్న. “ఏరోయ్ వెంకన్నా! ఈ రోజు మీ అయ్య రాలేదా?”
“లేదన్నా.. పనిమీద పట్నమెళ్ళేడు .. అందుకే నేనొచ్చేసినాను..”
“అసలే నీకు కత్తి కొత్త.. ఇప్పుడు రాయుడిగారి మీద.. జాగ్రత్తరోరేయ్” హెచ్చరించాడు భైరవుడు.
“నాకూ భయంగానే ఉందన్నా.. కానీ ఏం చెయ్యను చెప్పు.. అటు అయ్యా లేడు.. ఇటు రాయుడిగారి పని.. తప్పించుకునే దారి లేదాయె.. అవకాశం లేక సచ్చినట్టు వచ్చాను”
“సరేలే.. వెళ్ళు.. నేను పొలానికెళ్లి వస్తా” సాగిపోయాడు భైరవుడు.
రాయుడి ఇంట్లో శీనయ్య రాయుడితో, “అయినా కాలం మారిపోయిందయ్యా.. గడ్డం గీసుకోవటానికి కూడా మెషీన్లు వచ్చేసినాయట. మీరు కూడ తెచ్చుకోండయ్యా” అన్నాడు.
రాయుడు శీనయ్య వంక చూసి దర్పంగా నవ్వుతూ, “ఒరేయ్.. మన కాళ్ల దగ్గర ఒకడు వణుక్కుంటూ కూర్చోవటం మన అధికారానికి వాడిచ్చే గౌరవం. ఈ ఊరి రాజు గారికి గడ్డం గీసే వరం వాడికిచ్చాం చూడూ.. అది మన హోదా.. దర్పం.. ఆ కిక్ యంత్రాలతో రాదురా..” అన్నాడు గడ్డాన్ని తడుముకుంటూ.
ఇంతలో మంగలి వెంకన్న వచ్చాడు వంగి వంగి దండాలు పెడుతూ..
అతన్ని చూడగానే రాయుడు లేచి లోపలికి వెళ్లి పై కండువా, లాలీచీ, బనీయన్, పంచె తీసి టర్కీ టవల్ చుట్టుకుని వచ్చి అరుగు మీద కూర్చున్నాడు.
పని మొదలుపెట్టమన్నట్లు ఓ చూపు విసరి గడ్డం పైకెత్తి ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు.
వెంకన్న మంగలి పొది లోంచి సామాన్లు బయట పెట్టి, అద్దం రాయుడికి ఇచ్చాడు. సీసం ముక్క ప్రక్కనే పెట్టుకున్నాడు. గొడ్డుచర్మం మీద చాకు సానపెట్టాడు. ఒక చేత్తో రాయుడి గడ్డాన్ని సున్నితంగా పట్టుకుని మరో చేత్తో చాకు పట్టుకుని నెమ్మదిగా గడ్డం పైన గీకసాగాడు. చాకు పదునుకి రాయుడి గడ్డం నున్నగా తయారవుతోంది.
మృత్యు భయం ఉన్నవాడిలా, తన అదృష్ట క్షణాల్ని లెక్క పెట్టుకుంటూ వెంకన్న చాకుని కదిలిస్తున్నాడు. రాయుడు కూడా వెంకన్న పనితనానికి ఆనందిస్తున్నాడు. ఇంకొక్క నిమిషంలో పని అయిపోతుంది.
చివరికొచ్చేసరికి వెంకన్న మరింత జాగ్రత్తగా చేయటం మొదలెట్టాడు. చేయి వణకటం మొదలైంది. ‘జాగ్రత్త.. జాగ్రత్త’ అనుకుంటూ తనకి తానే హెచ్చరికలు చేసుకుంటూ చేస్తున్నాడు.. అతని ఒళ్ళంతా చెమటలు. స్నానము చేసినట్లు ముద్దగా అయిపోయింది.
పద్దు పుస్తకంలోంచీ తలెత్తిన శీనయ్య వెంకన్న పరిస్థితిని ఆందోళనగా అయోమయంగా చూడసాగాడు. చివరికొచ్చేసింది. గడ్డం నున్నగా నిగనిగ లాడుతోంది. చివరిసారిగా చాకుతో గడ్డం మీద లాగుతున్నాడు వెంకన్న. ‘శంక శాపమౌతుంద’న్నట్లు భయపడినంతా అయ్యింది. ‘చ్చక్’ మని తెగింది రాయుడి గడ్డం. అప్పటిదాకా కళ్ళు మూసుకుని ఆనందం అనుభవించిన రాయుడు విసుగ్గా కళ్ళు తెరిచి అరచేత్తో గడ్డం నిమురుకున్నాడు. చేతికి రక్తం అంటుకుంది. కాల రుద్రుడే అయ్యాడు.
అంతే!
వెంకన్న గుండెల మీద కాలితో ఒక్క తన్ను.. ‘అమ్మో’ అంటూ అరుస్తూ వెంకన్న ఎగిరి పదడుగుల దూరంలో పడ్డాడు. గుండె పట్టుకుని విలవిలా తన్నుకుంటూ వలవలా ఏడ్చేశాడు. ముక్కులో నుంచి రక్తం బొటబొటా కారుతోంది. మూలుగుతూ బలహీనంగా నేలమీద వాలిపోయాడు.
రాయుడు కళ్ళెర్ర జేస్తూ “గాడిద కొడకా.. ఒళ్ళు బలిసిందా.. రాయుడికి గడ్డం ఎలా చేయాలో తెలీదురా నా కొడకా?! పుచ్చె లేచిపోతుంది. ఒళ్ళు దగ్గరెట్టుకుని పనిచేయి” అని అరుస్తూ పెద్ద పెద్ద అంగల్తో రెచ్చిపోయిన పెద్ద పులిలా లోపలికి వెళుతూ, శీనయ్య వంక చూసాడు. “ఇందాక చెప్పానే.. అధికారం.. దర్పం అనీ.. ఇదుగో ఇప్పుడు చూసింది – మన అహంకారానికి అలంకారం” అంటూ పెద్ద పెద్ద అంగల్తో లోపలి వెళ్ళిపోయాడు.
***
పాపయ్య శెట్టి బీరువా తెరచి నల్ల ధనాన్నీ, బీదా బిక్కీ తన దగ్గర తాకట్టు పెట్టుకున్న బంగారాన్నీ చేత్తో తనివి తీరా తడిమి చూసుకుని, లక్ష్మీదేవి ఫోటోకి దణ్ణం పెట్టుకున్నాడు. శోభ సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పెట్టి, నమస్కారం చేసి పూలబుట్ట తీసుకుని గుడికి బయలుదేరింది.
రాయుడి దగ్గర్నుంచీ వచ్చిన శీనయ్య వాకిలి గడపలో ఎదురయ్యాడు. శోభను చూడగానే శీనయ్య మొహం చాటంతయ్యింది. పళ్లికిలిస్తూ ఆమె ఎటు కదిల్తే అటు అడ్డం పడుతూ “బాగున్నావా.. శోభ పాపా?” అనడిగాడు.
“ఏం పాపం? నీకీ మధ్య కళ్ళు కనపడ్డం లేదా?” అమాయకంగా అడిగింది శోభ.
“చ్చీ ఛీ.. నాకు కళ్ళు కనపడకపోవడం ఏమిటీ, ఎవలాలు చెప్పిందీ? వాడి డొక్కా చించీ, డోలు కట్టీ,.” ఇకిలిస్తూ, “మన పెళ్ళికి డోలు వాయిస్తాను” ఆవేశంగా రంకెలు వేసాడు.
“అబ్బా.. ఎందుకు అలా అరుస్తావు? అరిస్తే గుండె నొప్పి వచ్చి చచ్చిపోతారంట” అంది శోభ.
“అయ్యో.. గుండె నొప్పా? ఐబాబోయ్? ఇదన్నదెవడో చెప్పు.. వాణ్ణీ..” మరింత ఆవేశపడిపోయాడు.
“మా నాన్న అరిచినప్పుడల్లా, మా అమ్మ చెప్తుంది. ..నేను నీకు కళ్ళు కనపడటం లేదు అన్నానంతే. నా డొక్కా చీలుస్తావా? అమ్మా..” అంటూ ఏడవటం మొదలెట్టింది, పొట్ట పట్టుకుంటూ.
“నువ్వలా ఏడవకు తల్లీ.. మీ నాన్న విన్నాడనే నా డొక్కా చీలుస్తాడు.” బ్రతిమాలసాగాడు. దగ్గరికొచ్చి నోరు మూసాడు.
ఇంతలో డబ్బు లెక్క పెట్టుకుంటూ పాపయ్య శెట్టి బయటికొచ్చాడు.
“ఏంటి శోభ తల్లీ? ఏడుస్తున్నావ్? ఎందుకూ?” అడుగుతుండగానే అడ్డుపడ్డాడు శీనయ్య.
“అమ్మాయిగారు సంగీతం నేరత్తన్నారు కదండీ అదో రాగం గావాసులెండి” అని మాట మారుస్తూ, “రాయుడు గారు మిమ్మల్ని యమర్జంటుగా పీల్చుకు రమ్మన్నారండీ”
“సరే నేనొస్తున్నాను.. నీవు పద” అన్నాడు పాపయ్య శెట్టి.
“నాన్నా, నేను గుడికెళ్తున్నాను” అంటూ కేక పెట్టి బయటకు అడుగుపెట్టింది శోభ.
అప్పటికే సగం దూరం వెళ్లిన శీనయ్య అది విని దారి మార్చి ఆమె కేసి వస్తూంటే, పాపయ్యశెట్టి ఎదురయ్యాడు.
“రాయుడు గారిల్లు అటైతే నువ్వు ఇటు తిరిగావెంటి?” అనుమానంగా అడిగాడు.
“అబ్బే.. ఈ రోజు మా అమ్మ వాళ్ళ నాయనమ్మ సచ్చిపోయిన రోజు. అందుకనే గుడికి వెళ్లి టెంకాయ కొడదావనీ” నసిగాడు.
“ఏవిటీ.. గుడికా? మా శోభ కూడా అటే వస్తోంది. సరే వెళ్లిరా” అంటూ శోభ వైపు తిరిగి “జాగ్రత్తమ్మా” అని చెప్పి ముందుకు కదిలాడు.
గుళ్లో –
శీనయ్య శోభ వెనకాలే ప్రదక్షిణాలు చేస్తున్నాడు. మధ్యలో అనుకోకుండా గోడ తగిలి పూల సజ్జ లోంచీ కొబ్బరికాయ కింద పడింది. ఇద్దరూ ఒకేసారి వంగి అందుకోబోయారు. తలలు ఢీ కొన్నాయి.
“నువ్వా? రెండు తలలు కొట్టుకుంటే ఏదో అవుతుందని చెప్పిందే మా అమ్మ?” ఆలోచించసాగింది.
“నేను చెప్పనా? పెళ్లవుతుందంట”
“నీకు పెళ్లవుతుందా? హ్హ హ్హ ఎవరితో?”
“నీతోనే” నవ్వుతూ అన్నాడు శీనయ్య.
“నీకు పెళ్ళయిపోయిందిగా. అయితే నీవు చెప్పింది అబద్దం. ఇంటికెళ్ళింతర్వాత మా అమ్మని అడుగుతాలే” అంటూ మల్లె ప్రదక్షిణం చేయసాగింది.
శీనయ్య ఆమెకడ్డం పడి, కొబ్బరికాయ కొట్టి చిప్పలు ఆమె చేతుల్లో పెట్టి “అమ్మో.. ఆ పని చెయ్యకమ్మా.. నా తలకాయ కొబ్బరికాయలా పగిలిపోతుంది. నేను తమాషాకి అన్నాను అంతే.. ఎవరి దగ్గరా అనకు. ఈ రెండు కొబ్బరి చిప్పలూ నువ్వే తిను” అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు శీనయ్య.
(సశేషం)