జైత్రయాత్ర-7

2
1

[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ రోజు తెల్లవారక ముందే విజిల్ వేసి కాడెట్స్ అందరినీ గ్రౌండ్ లోకి పిలుస్తాడు వెంకట్రావు. ఐదు వరుసలలో నిలబెడతాడు. మిత్రత్రయం కనబడరు. ఏరీ వీళ్ళు నిద్రలేవలేదా అని మురళి అనే కుర్రాడిని అడిగితే, శ్రీనివాస్, ఆంజనేయులు గన్లు క్లీన్ చేస్తున్నారనీ, సుబ్బు పిండి రుబ్బుతున్నాడనీ చెప్తాడు. అదేంటి అని అడిగితే, మీరు చెప్పారని ఈ రోజు స్పెషల్ టిఫిన్ చేస్తున్నాడట అంటాడు మురళి. కాసేపు కేడెట్స్ సుబ్బు వంట ప్రావీణ్యం మీదా, తిండిపోతుతనం మీద జోక్స్ వేసుకుంటారు. వెంకట్రావు వాళ్ళని హెచ్చరించి, అందరినీ కూర్చొబెట్టి తాము ఊర్లో చేయబోతున్న శ్రమదానం గురించి వివరిస్తాడు. అటుగా వెళ్తున్న విద్య – వీళ్ళ హడావిడి చూసి అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటుంది. ఎస్.సి.సి. కోసం వీలైతే విరాళాలు సేకరించమని ఓ పుస్తకం ఇస్తాడామెకు. సరేనని పుస్తకం తీసుకుని వెళ్ళిపోతుంది. ఆమెతో మాట్లాడి వచ్చేసరికి ఇక్కడంతా గందరగోళంగా ఉంటుంది. మిగతా కేడెట్స్‌ని శ్రీనివాస్‍, ఆంజనేయులు ఏడిపిస్తుంటే, గన్ భుజాన వేసుకుని గ్రౌండ్ అంతా పెరిగెట్టమని పనిష్మెంట్ ఇస్తాడు వెంకట్రావు. కేడెట్స అంతా ఒళ్ళు హూనం చేసుకుని తిరిగొచ్చేసరికి చేసిన పదార్థాలను తినేసి మిత్రులు ముగ్గురూ నిద్రపోతూ కనిపిస్తారు. తమ కార్యక్రమం గురించి చెప్పడానికి రాయుడి ఇంటికి వెళ్తాడు వెంకట్రావు. రాయుడు – అందరి అతిథులకు చేసే విందు-మందు-పొందు ఏర్పాట్లని ప్రస్తావిస్తే, వెంకట్రావు తనకలాంటి అలవాట్లేం లేవని చెప్తాడు. గ్రామాభివృద్ధి కోసం అతనేం చేయబోతున్నాడో అడిగి, వేళాకోళం చేస్తాడు రాయుడు. నీళ్ళు అమ్ముకుని సొమ్ము చేసుకునే వాళ్ళ ఆటకట్టేలా బావి తవ్వించాలని అనుకుటున్నానని చెప్తాడు వెంకట్రావు. అక్కడే ఉన్న పాపయ్యశెట్టి జోక్యం చేసుకుని అనవసర విషయాలలో తలదూరిస్తే, జైల్లో పెట్టిస్తామనీ, లేదా ఎన్‍కౌంటర్ చేయించేస్తామని బెదిరిస్తాడు. రాయుడు కూడా ఇన్‍డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతాడు. వెంకట్రావు మౌనంగా వెనుతిరుగుతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-8

[dropcap]సం[/dropcap]జె కెంజాయరంగులో ఆకాశానికి వర్ణచిత్రాలనద్దుతోంది. గోధూళి వేళ.

శ్రీనివాస్ చేల గట్ల వెంట నడుస్తున్నాడు. ఈ రోజు అతనికి రెస్ట్. మిగిలిన ఇద్దరికీ పని చెప్పారు. ఒక్కడే బయటకి వచ్చాడు.

పచ్చని ప్రకృతి పరవశింపజేస్తోంది. నగరాల్లో కేవలం గూగుల్‍లో వెతుక్కునే ప్రకృతి అందాలు కళ్ళముందే కావలసినంత ఆరబోసి ఉన్నాయి. ఆ భావకవి స్పందిస్తూ ఈలపాట ఆలపిస్తున్నాడు. పక్షుల స్వరాలను ఆలకిస్తున్నాడు. అలా నడుస్తూ చెరువు దగ్గరకు చేరుకున్నాడు.

ఉన్నట్లుండి అతని పాట ఆగిపోయింది. మనసు ఉద్వేగంతో నిండిపోయింది. కళ్ళు ఆర్పటం మరచిపోయి తదేకంగా చూడసాగాడు.

అక్కడ – ఉండీలేనట్లున్న నీటి పొరల్లోంచీ రాళ్ళూ రప్పలూ బహిర్గతమవుతూ ఉన్నా చూపరుల చూపులకు సిగ్గుపడి నిండుగా కనబడాలనే తాపత్రయంతో అటు ఇటు ఇబ్బందిగా కదులుతున్న జలాశయం –

ప్రపంచంతో సంబంధం లెనట్టు ప్రకృతిలో లీనమైనట్టు తాదాత్మ్యం చెందిన అనుభూతిలో చెరువు గట్టుమీద వెల్లకిలా పరుండిన ఓ పరువాల పగడాల పడుచు!

ఆమె కట్టిన తెల్లచీర తడిసి, ఒంటికి హత్తుకుని యథాశక్తి ఆమె అందాల్ని బయటపెట్టేందుకు ఉత్సాహం చూపిస్తూంది. ఆ తనువుపై సూర్యకాంతికి తళుక్కుమంటున్న నీటి బిందువులు ఆమె వంపుసొంపుల్ని ముద్దాడుతూ ఉత్సవాలు చేసుకుంటున్నాయి.

సిగలో పూవులా

నుదిటి తిలకంలా

కంటిలోని వెలుగులా

మెడలో నగలా

మెరుస్తూ, మెరుస్తూ, మురిపిస్తూ, మరిపిస్తూ –

ఆవిరై, ఆకాశమై, యోగమై, వియోగమై, విహంగమై..

చూస్తున్న శ్రీనివాస్‌ని మాడిన తెలియని లోకాలకు ఎగరేసుకుపోయింది.

ఉన్నట్లుండి ఆమె ఉలిక్కిపడి లేచింది. అటూ ఇటూ చూసింది. చెట్టు చాటునుంచీ ఆమెనే చూస్తున్న శ్రీనివాస్ మెల్లిగా బయటకు కదిలి ఆమె ముందు ఆగాడు.

ఆశ్చర్యంగా అతనివైపు చూస్తూ నిలబడి పోయిందామె. శ్రీనివాస్ మనసు కుదుటబరచుకున్నాడు.

“నీ .. నీ పేరు ..” తడబడుతూ దిక్కులు చూస్తూ అడిగాడు.

ఆమె కూడా తేరుకుంది. అప్పటి వరకూ నిశ్చలంగా ఉన్న ఆమె కళ్ళలో చిలిపిదనం చోటు చేసుకుంది. క్రొత్తవ్యక్తిని సైతం ఆట పట్టించగల జాణతనం జీవం పోసుకుంది.

“ఎవరబ్బాయి.. నువ్వు?” వీణాతంత్రులు మీటినట్లుంది స్వరం.

శ్రీనివాస్ తత్తరపడి “ఎన్.సి.సి..” నీళ్లు నమిలాడు.

“ఓహో.. ఆళ్ళ మడిసివా?.. వెరీ గుడ్.”

ఆశ్చర్యపోయాడు ఆమె ఇంగ్లీష్ విని.

“నాకూ వస్తాదిలే కూసింత ఇంగిలీషు” అంటూ నవ్విందామె.

జలపాతం ఉరకలెత్తినట్టుంది..

“నీ పేరు..” ధైర్యం చేసి అడిగాడు.

“నా పేరా.. ప్రకృతి..” అంది ఆలోచిస్తూ..

‘అబ్బా.. ఎంత పొయెటిక్‌గా ఉంది పేరు – ఆమె లాగే’ అనుకున్నాడు.

“ఏమిటలా చూస్తున్నావ్.. నీ పేరు?”

“శ్రీనివాస్”

‘అలాగా’ అంటూ అతనివైపు ‘అదోలా’ చూసిందామె.

లిపిలేని ఆ కంటి భాష అతనికెన్నో భాష్యాలు చెప్పింది.

“వస్తా” అంటూనే ప్రక్కనున్న పొడిబట్టలు తీసుకుని రాయంచలా సాగిపోయింది.

అల్లాగే.. అటే.. ఆమె వైపే చూస్తున్న శ్రీనివాస్‌కు ఆమె వెనుకభాగాన్ని పరచుకునివున్న కురులు వీడి, విరబోసుకున్న నల్లటి ఒత్తయిన జుత్తు చీకటి పడిందని తెలియచెప్పింది.

రాత్రి –

“ఏరోయ్.. కవీ.. అంత మత్తుగా పడుకున్నావ్? మాకు చెప్పకుండా నాటు కొట్టొచ్చావా?” అడిగాడు ఆంజనేయులు.

శ్రీనివాస్ సమాధానమివ్వలేదు. ఆ ప్రక్కనే పడుకున్న సుబ్రహ్మణ్యం అతని వంక వింతగా చూసాడు. అంత నిశ్శబ్దంగా ఎప్పుడూ లేడతడు.

“ఏమైంది వీడికి?” ఆశ్చర్యంగా అడిగాడు ఆంజనేయులు.

“మా అమ్మమ్మ చెప్పింది. ‘పల్లెల్లో ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళకు, దయ్యాలుంటాయి’ అని. వీడు ఇందాక ఎక్కడికో వెళ్ళుంటాడు” భయంగా చెప్పాడు సుబ్రహ్మణ్యం.

ఆంజనేయులు వేళాకోళంగా, “దయ్యం అంటే గుర్తొచ్చిందీ.. అవునూ ఈ రోజు మన శోభ కన్పించలేదేంటి?” అన్నాడు.

“నోర్ముయ్యారా వెధవా.. ‘మన’ ఏంటీ ఉమ్మడి ఆస్తి లాగా.. ఆలా అన్నావంటే చంపేస్తాను.”

“సరే గానీ, మన శ్రీనివాస్‌కి కూడా ఏదో ఒక దయ్యాన్ని సెట్ చెయ్యరా.. ఇక్కడున్నన్నాళ్ళూ కాలక్షేపం..”

“మరి నీకో?”

“సరేలే.. చూస్తూ చూస్తూ నన్నే ఆడది వలస్తోందీ?”

“అదేంటిరా.. నీ కోసం ఎంతోమంది పడిచస్తారుగా.. వాళ్ళందరూ ఏమైపోయారో?” వెటకారంగా అన్నాడు సుబ్రహ్మణ్యం.

“అయినా నేను పెళ్లి చేసుకోదల్చుకోలేదులే – నా పేరు సార్థకం చేసుకుంటా.”

“ఏడిచావులే .. ఎప్పుడో ఇల్లీగల్‌గా దేశ జనాభాని పెంచేస్తావ్.. నీ సంగతి నాకు తెలీదూ?!”

“సర్సరే.. ఇంక పండు.. అంగో .. వెంకట్రావు దొర వస్తూండు..” అంటూ ముసుగులో దూరాడు.

‘వీడికి ఇక్కడి భాష వచ్చేసింది.. ఇక్కడే సెటిల్ అవుతాడేమో’ అనుకుంటూ ప్రక్కకు తిరిగి పడుకున్నాడు సుబ్రహ్మణ్యం.

క్రమంగా అందరూ నిద్దట్లోకి జారుకున్నారు.

అంతమంది ఉన్న ఆ గదిలో శ్రీనివాస్ ఒక్కడే నిద్రకు వెలియై, మొహానికి బలియై అటూ ఇటూ కదలుతున్నాడు. కళ్ళు తెరిస్తే కళ్ళముందు కళ్ళు మూస్తే మనసు ముంగిట్లకి వచ్చేస్తోంది ప్రకృతి.

అది ప్రేమలో ఫస్ట్ డే ఫీవర్!

లేచి మెల్లగా బయటకు వచ్చాడు. వెంకట్రావు ఓ మూల క్యాంపు కాట్ మీద నిద్రబోతున్నాడు. ఆరుబయటకు వచ్చి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

కృష్ణ పక్షపు ఛాయలతో చంద్రుడు డిమ్‌గా వెలుగుతున్నాడు. చీకటిగా ఉన్న ప్రకృతి – ప్రకృతి కురులని గుర్తుకు తెస్తోంది.

ఆకాశం ఆమెగా, చంద్రుడే కళ్ళ వెలుగుగా ప్రకృతి భాసిస్తోంది.

అతడి మది ప్రే’మైకం’లో కొట్టుకుపోతోంది. భావావేశం అతడ్ని ఆవహిస్తోంది. ఉతేజితమౌతున్న అతని ప్రేమ అతనిలో మూగ భావరాగాల్ని ఆలపిస్తోంది. అంత నిశ్శబ్దంలో కూడా అతనిలో ఏదో ఘోష..

‘ప్రియా

నీ ప్రేమ ప్రవాహాల వెల్లువలో

కలసిపోతిని.. కరిగిపోతిని.. కానరాకే కదలిపోతిని..

వెక్కుతూ, వేసారుతూ, వెదుక్కుంటూ..

నీ చెంతకు వస్తాను ప్రియా..

ఇల్లు విడచి

ఊరు విడచి

నేల విడచి

ఆశై

ఆలాపనై

ఆవేదనై

ఆవేశమై

ఆకారం లేని

ఆకాశమై

నీ చెంతకు వస్తాను ప్రియా.. వస్తాను.. వస్తాను..’

***

రాయుడు వరండాలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఇంతలో పాపయ్య శెట్టి వచ్చాడు. రాయుడు గమనించలేదు. చుట్టూ చూసి దగ్గరున్న కుర్చీని లాగి రాయుడి ప్రక్కనే వేసుకుని కూర్చున్నాడు.

“ఏంటి రాయుడు గారూ.. ఆలోచనలో ఉన్నారు?” అన్నాడు పొట్ట నిమురుకుంటూ .

రాయుడు తలా తిప్పి శెట్టిని చూసి, “ఏమ్ శెట్టీ.. ఇలా వచ్చావ్? నేను కబురు పెట్టకుండానే..?” అన్నాడు.

“కబురు పెట్టకపోవటమేవిటీ.. ఇప్పుడేగా మీ ఇంటివైపునుంచీ వచ్చిన కాకి మీ గురించి చెప్పిందీ.. కాకి కబురు చాలదూ?”

“ఈ కాకమ్మ కబుర్లకేంలే.. నీకు కాకులు కూడా కబుర్లు జేరేస్తున్నాయా..”

“మరందుకే గదా తమరు ఈ వూర్లో మొబైల్ ఫోన్లు కూడా రాకుండా చేశారు. మీ ఒక్క ఇంట్లో తప్ప ఫోన్ పనిచేయదు కదా?”

“అది సరే.. ఏమిటి విశేషాలు?”

“విశేషాలేమున్నాయి.. ఇక మనకన్నీ నిస్సేషాలే.. ఉరుములేని వర్షంలా వచ్చిన ఆ గుంపు జలయజ్ఞం మొదలుపెట్టారు.. తెలీదూ?”

“శుభస్య శీఘ్రం”

“ఎవరికీ?”

“ఊరుకి.. ఊరువాళ్ళకీనూ”

“అంటే..?”

“శెట్టీ.. నారుపోసిన వాడు నీరు పోయడా.. నీరుపోసినవాడు పైరు ఇవ్వడా?”

“మరి ఇన్నాళ్లనుంచీ మీరు కుర్చీలోనుంచీ లేవకుండా సంపాదిస్తున్న దిన దిన లాభాలకి నీళ్లొదులుకుంటున్నారా?”

“ఇన్నాళ్లూ నీళ్ళొదిలే సంపాదించాను. ఇకపై ఒక్క నీటిబొట్టు కూడా విదల్చకుండా ఒక్కసారే సంపాదిస్తాను”

“ఇంకా ఏం సంపాదనండీ బాబూ! వాళ్ళు బావి తవ్వే ప్రయత్నంలో ఉన్నారు. మీ బావిలో నీళ్లు ఇక ఊరవు. వూరినా ఊరివాళ్లను ఊరించవు. ఊరివాళ్ళు ఇకపై బావి ముఖం, మీ ముఖం, మీ చాటున వడ్డీలు తిప్పుకుంటూ తిప్పలు పడుతున్నా నా ముఖం చూడరు.”

“మంచిదే కదా.. మన ముఖాల్లోని వికారాలు బయటపడవు.”

“నా ముఖంలా వుంది మీ వేదాంతం.. నాకేం అంతు బట్టటం లేదు.”

“తవ్వనీయవయ్యా.. మనదేంపోయిందీ.. అంతా తవ్వింతర్వాత మొదటి చేద మనమే వేద్దాం. గౌరవం దక్కించుకుందాం. ఫోటో తీయించుకుందాం” హుందాగా నవ్వుతూ అన్నాడు రాయుడు.

“మరి సంపాదనా?”

“అదీ వస్తుంది. బావికోసం నేను గతేడాది తీసుకున్న కాంట్రాక్టు. ఈ బావి మనమే తవ్వించాం అని రికార్డుల్లో రాయిద్దాం. ఆ రెండు లక్షలూ మన జేబులోకి వస్తాయి పైసా పెట్టుబడి లేకుండా.”

“హమ్మో.. హమ్మో.. ఇన్నాళ్లకు మీ తెలివి తేటల్ని దర్శించాను స్వామీ.. ధన్యుణ్ణి.. ఈ దాసుడికి కూడా కాస్త ప్రసాదంలా ఎంతో కొంత..” చేతులు నలుపుకుంటూ గొణిగాడు.

“నిన్ను మరచిపోతానా? నాకు సలహాలివ్వాల్సింది నువ్వే కదా?”

“ఇంకా నా అవసరం ఉంది అంటారా?” మెచ్చుకోలుగా అన్నాడు శెట్టి.

అప్పుడే ఫోన్ మ్రోగింది. గుడి గంటల్ని విన్నట్టు పాపయ్య శెట్టి కళ్ళు మూసుకుని తన్మయంగా ఆ రింగ్ టోన్ వింటున్నాడు. రాయుడు లేచాడు. “కాసేపు అలాగే మొగనీయండి దొరా.. అమావాస్యకో పున్నమికో వింటాం ఈ వూళ్ళో ఈ గంటలు..” అన్నాడు. రాయుడు లోపలి కదిలాడు. పాపయ్య శెట్టి కూడా లేచి అతనితోనే నడుస్తున్నాడు.

రాయుడు అతని వైపు చూసి, ‘ఎక్కడి’కన్నట్టు చూసాడు.

“ఆ గంటలు దగ్గర్నుంచీ విందామని” ఆశగా అన్నాడు పాపయ్య శెట్టి.

“ఫోన్ గంటలు వినాలని ఉంటే సరే.. కానీ ఫోన్‌లో మాట్లాడేది వినాలని ప్రయత్నిస్తే.. నీ గంట మోగుతుంది” అంటూ క్రూరంగా చూసాడు.

“అయ్యా.. మరి నే వస్తా .. మీరు రిసీవర్ లేపిన తర్వాత ఇంకెక్కడి గంటలు?” అంటూ బయటికి కదిలాడు పాపయ్య శెట్టి.

కానీ అతని మనసులో వేరే ఆలోచన రూపుదిద్దుకుంటోంది.

***

శోభ పరిగెత్తుకుంటూ బడి దగ్గరకు వచ్చింది.

అక్కడున్న వెంకట్రావును చూస్తూ ,

“ఇక్కడో మొద్దబ్బాయి ఉన్నాడండీ.. కాస్త పిలుస్తారా?” అని అడిగింది.

“మొద్దబ్బాయా.. ఇక్కడెవరూ లేరే..” సందేహంగా అన్నాడు వెంకట్రావు.

“ఉన్నాడండీ, లావుగా, బొద్దుగా, మొద్దులా ముద్దొస్తూ ఉంటాడు.”

“ఓహో.. సుబ్రమణ్యమా..” అని అంటూ ఉండగానే మిత్రత్రయం అటుకేసి వచ్చారు.

వంట ప్రయత్నాల్లో ఉన్నట్టున్నారు. వాళ్ళ మొహాలకంటిన పిండినీ, చేతిలో ఉన్న తొక్కలనీ చూస్తుంటే తెలుస్తోంది ఈ రోజు మెనూ!

వాళ్లు నలభీములకు సోదర త్రయంలా ఉన్నారు.

సుబ్రహ్మణ్యంను చూడగానే చింకి చాటంత అయింది శోభ మొహం.

“ఏయ్.. అబ్బాయ్.. సాయంత్రం గుడికొస్తావా?” అంది.

“ఎందుకూ.. నీ పెళ్లా?” నవ్వుతూ అడిగాడు ఆంజనేయులు.

“ఛీ.. దేవుడికి నేనే పెళ్లి చేయిస్తున్నా.. బాగా ప్రసాదాలు పెడతారు. తప్పకుండా రండి” అంటూ పరుగెత్తుకెళ్లిపోయింది శోభ.

“జాగ్రత్త తల్లీ. .. ఈ బడి ఏ కాలం నాటిదో! నీవు పరిగెత్తితే టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం కంటే ఎక్కు వ రెక్టర్ స్కేల్‌లో వస్తుంది ఇక్కడ. బడి పునాదులతో సహా లేచిపోతుంది.. పాపం” అన్నాడు ఆంజనేయులు పెద్దగా.

“ఛ.. ఊరుకోరా.. పాపం ఆ అమ్మాయి అంత ప్రేమగా మనవాణ్ణి పిలవటానికి వచ్చింది. పద పద.. మన సుబ్బిగాణ్ణి ఆ పిల్ల కప్పజెప్పే బాధ్యత మనదే” అన్నాడు శ్రీనివాసు. ఆ మాట వినంగానే సుబ్రహ్మణ్యం భయంగా చూసాడు వాళ్ళవైపు.

“మరేం భయం లేదు.. మేము కూడా దూరంగా ఉండి చూస్తూంటాంగా.. కానీ మాక్కూడా ప్రసాదం తేవాలరోయ్!” అన్నాడు ఆంజనేయులు.

అధ్యాయం-9

మధ్యాహ్నం భోజనాలయ్యాయి. విద్య అప్పుడే వచ్చింది. ఆమె వెంట కొందరు యువకులు వున్నారు. వాళ్ళందరూ ఆ గ్రామానికి చెందిన వాళ్ళే. వెంకట్రావు వాళ్లందరినీ కూర్చోబెట్టాడు. సుబ్రమణ్యo ఆంజనేయులు, శ్రీనివాస్ లను పిల్చాడు. చర్చ మొదలయ్యింది.

విషయం – బావి ఎక్కడ త్రవ్వాలి?

“ఊరి చివరున్నా చెరువు ప్రక్కన నీటి జల ఉంది, తొందరగా నీళ్లు పడొచ్చు” అన్నాడు వెంకట్రావు.

“కానీ, అక్కడ అన్నీ రాయుడు, పాపయ్య శెట్టి పొలాలే ఉన్నాయి కనుక ఊరివాళ్ళని అటు రానీకుండా అడ్డుకుంటే ప్రయోజనం చేకూరదు” అన్నాడు ఓ యువకుడు.

“ఊరి మధ్యలో త్రవ్వితే అందరికీ నీళ్లు అందుబాటులో ఉంటాయి కదా?” అన్నాడు ఆంజనేయులు.

“అది కుదరని పని” అంది విద్య.

“ఎందుకు..?”

“అసలే ఇరుకు రోడ్లు, బావి వేస్తె నీళ్లు అందుబాటులో ఉంటాయి కానీ రోడ్లన్నీ బురదమయం అయిపోతాయి. దానివల్ల రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది.”

“అయితే ఓ పని చేద్దాం.. ఎక్కువమంది గుడిసెవాసులు నివసించే పడమటి రోడ్డు పక్కాగా ఓ ప్రభుత్వ స్థలంలో వేస్తే సరి. తర్వాత అక్కడినించీ కాలువ తవ్వితే బయట కారిన నీళ్లు పొలాలకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది” అన్నాడు వెంకట్రావు.

అందరూ వెంకట్రావు ఆలోచనని అభినందించారు. ఆ మధ్యాహ్నమే ఇద్దరు కుర్రాళ్ళు పట్నం వెల్లి జియాలజిస్ట్‌ని పిలుచుకు వచ్చారు. భూ పరీక్షలు చేసి వాటర్ పాయింట్ లని మార్కింగ్ చేసి వెళ్ళాడతడు. మర్నాడే త్రవ్వకం మొదలెట్టాలని నిశ్చయించుకున్నారు.

వెంకట్రావు రాయుడి దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయమంతా వివరించాడు.

“ఊరి పెద్దలు మీరు. మీరు లేకుండా మేము ఈ పని చేపట్టటం భావ్యం కాదు. అందుకని దయచేసి మీరు వచ్చి రేపు ఉదయం బావి త్రవ్వకానికి ప్రారంభోత్సవం చేయాలి” అన్నాడు.

“అంటే.. నేను ఇంతకీ రేపు వచ్చి ఏం చేయాలి? ఉపన్యాసమివ్వాలా?..తట్టా, మట్టీ మోయాలా? లేకపోతే..” సందేహంగా అడిగాడు రాయుడు అర్థం కానట్టు.

“అబ్బే.. అదేం లేదు.. పలుగుతో ఒక్క దెబ్బ వేసి కాస్త మట్టి తీస్తే చాలు” అన్నాడు వెంకట్రావు.

“అంతేనా? అయితే తప్పకుండా వస్తాను. మీరు చెప్పినట్లే చేస్తాను. ఏదో నా వ్యాపారం పోతుందేమోనని మొదట్లో వ్యతిరేకించాను.. అదేం మనసులో పెట్టుకోకండి. వూరికింత మంచి జరుగుతోందని తెలిసినప్పుడు తప్పకుండా నా వంతు సాయం చేస్తాను. నేను ప్రజల మనిషిని. వ్యాపారం వ్యాపారమే.. వ్యవహారం వ్యవహారమే!” అన్నాడు రాయుడు.

ఆ కాస్త ప్రోత్సాహానికే వెంకట్రావు సంబరపడిపోయారు. ఏ గొడవా లేకుండా తమ లక్ష్యం నెరవేరితే చాలు. ఊరి రాజకీయాలు తనకనవసరం.

రాయుడికి నమస్కారం చేసి క్యాంపుకి బయల్దేరాడు వెంకట్రావు.

***

మిత్రత్రయం గుడికి చేరేసరికి శోభ తల్లితో కలసి పూజ చేయిస్తోంది. చుట్టూతా అవసరానికి మించి ప్రసాదాలు ఉన్నాయి. వీళ్ళకి అనుమానం వచ్చింది. ‘పూజ కోసం ప్రసాదాలు చేశారా? లేక ప్రసాదాల కోసం పూజ చేయిస్తున్నారా?’.

‘ఏదైతేనేం. సుబ్బిగాడి పంట పండింది. వాడు అప్పుడే వాటివంక ఆబగా చూస్తున్నాడు.’

వాళ్ళని చూసేసరికి శోభ ఎగిరి గంతేసింది. ప్రసాదాల బుట్టలు ఒక్కసారిగా అడుగెత్తు ఎగిరి పడ్డాయి. ప్రసాదాలు కొంత ఎగిరి కిందపడి కంగాళీగా మారింది.

అవేం పట్టించుకోకుండా, శోభ వాళ్ళ అమ్మని లాక్కుని పోయి సుబ్రహ్మణ్యంను చూపించి, “అమ్మా.. వీళ్ళేనే.. అప్పుడు చెరువు దగ్గర నాకు బిందె నీళ్లు నింపి సాయం చేసిందీ.. చాలా మంచివాళ్ళు..” అని పరిచయం చేసింది.

తల్లి ధనలక్ష్మి ముందు ముఖం చిట్లించినా శోభకు ఈడూ జోడూగా కనిపించిన సుబ్రహ్మణ్యంను చూసాక ఎందుకో ప్రశాంతంగా మారిపోయింది. సుబ్రహ్మణ్యం వంక చూస్తూ – “ఏ వూరు బాబూ మీది?” అంది.

“హైదరాబాద్ అండీ”

“ఏం పనిమీదొచ్చారు?”

చెప్పాడు.

“ఎవరబ్బాయివి?”

చెప్పాడు సుబ్రహ్మణ్యం చేతులు కట్టుకుని.

అంతే! సుబ్రహ్మణ్యం తండ్రి పేరు విని ఆశ్చర్యానందాలతో అతన్ని పట్టేసుకుని ముక్కున వేలేసుకుంది.

“ఆంటీ.. అది నా వేలు.. మీ ముక్కులోకి వెళ్తోంది” వాపోయాడు సుబ్రహ్మణ్యం.

“అయ్యో.. ఇంద బాబు నీ వేలు” అంటూ చెయ్యి వదిలేసి, “అయితే నీవు సదాశివ పర్వతాలు గుప్తా గారి అబ్బాయివా?” అంది.

“అవునండీ. ఎందుకండీ?” అన్నాడు భయంగా చేతులు వెనక్కు పెట్టుకుంటూ.

“భలేవాడివే.”

“అవునండీ.. భలేవాడినే.. మా అమ్మమ్మ కూడా అలాగే అంటూ ఉంటుంది.”

“అయితే మాకు కావలసిన వాడివే.. మీ తాతగారూ మా నాన్నగారూ వేలు విడిచిన సోదరులు.”

“అంటే ఇప్పుడు నా వేలు విడిచారు.. అలాగా?” అమాయకంగా అడిగాడు సుబ్రహ్మణ్యం.

అదేం పట్టించుకోకుండా సంబరంగా

 “మీ తాతగారు ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇదుగో.. నేను ఇలా ఈ ఊరి కోడలిగా వచ్చేసాను. అయితే అన్నగారు బాగున్నారా బాబూ?” ఆప్యాయంగా అడిగింది ధనలక్ష్మి.

“నాకన్నలెవరూ లేరే ?” అయోమయంగా తల గోక్కుంటూ అన్నాడు సుబ్రహ్మణ్యం.

“ఏమోరా.. నీకు తెలీకుండా మీ నాన్నకి సెటప్ ఉందేమో?” అన్నాడు ఆంజనేయులు.

“షట్ అప్” మెల్లిగా గొణిగాడు సుబ్రహ్మణ్యం.

“అదే నాయనా.. మీ నాయన నాకు అన్న వరుస.. అదన్నమాట.”

“అంటే.. నీవు ఆవిడకి అల్లుడివన్నమాట” నవ్వుతూ అన్నాడు శ్రీనివాస్.

“మా నాయనే.. ఎంత మంచి మాట అన్నావ్.. ఇంద.. నోరు తీపిచేసుకో” అంటూ ఓ లడ్డు శ్రీనివాస్ కిచ్చింది ధనలక్ష్మి.

సుబ్రహ్మణ్యం, శోభ ఒకర్నొకరు చూసుకుని బోల్డు సిగ్గుపడిపోయారు. ధనలక్ష్మి తన ధోరణిలో చెప్పుకుపోతోంది.

“అయినా కుర్ర కుంకాలు మీ కివేం తెలుస్తాయిలే.. బంధుత్వాలున్నాయి కానీ బంధాలు తాత్కాలికంగా తెగిపోయినాయి. ఈ వూళ్ళో నేను అడుగుపెట్టిన తర్వాత మరీనూ.. ప్రపంచంతో సంబంధాలే తెగిపోయినాయి. అంతే.. మీరక్కడ.. మేమిక్కడ.. ఎవరెక్కడున్నదీ తెలీదు కదా ఈరోజు వరకు. అయినా మన పిచ్చి గానీ మనుషులు దూరమైనంత మాత్రాన మమతలు దూరమౌతాయా.. చెప్పు?”

“దూరం కావు ఆంటీ” అంటూ సుబ్రహ్మణ్యం శోభకు దగ్గరగా జరిగాడు. ఇద్దరూ ఏదో లోకంలో ఉన్నట్టున్నారు.

ఆంజనేయులూ, శ్రీనివాస్ విసుగ్గా, అసహనంగా నిల్చున్నారు. ధనలక్ష్మి వాక్ప్రవాహం సాగుతూనే ఉంది.

“అసలు నిన్ను చూడగానే అనుకున్నాను.. ముందుకొచ్చిన పొట్టా, పైకి లేచిన ముక్కూ, వెళ్ళకొచ్చిన కళ్ళూ అచ్చు మీ బామ్మ లాగానే ఉన్నావ్. ఎక్కడుంటున్నావ్? ఎవరింటికొచ్చావ్?”

చెప్పాడు సుబ్రహ్మణ్యం.

“వీలున్నప్పుడల్లా మా ఇంటికి వచ్చేళుతూండు నాయనా..”

“ఆ అబ్బాయికి మన ఇల్లు తెలీదేమోనే.. నేను వెంట బెట్టుకొస్తాలే.. నువ్వు ముందు ఆ ప్రసాదాలన్నీ మాముందు పెట్టి వెళ్ళు .. అందరికీ పంచాలి” అంది శోభ ఆరిందాలా.

ధనలక్ష్మి, వెళుతూ ,”జాగ్రత్త తల్లీ.. అలవాటుకొద్దీ అంతా నీవే తినేసేవు.. కక్కుర్తి మనుషులనుకుంటారు.” అంటూ రెండు కొబ్బరి చిప్పలు శ్రీనివాస్, ఆంజనేయులికి ఇచ్చి ఒక బుట్ట సుబ్రమణ్యంకు ఇచ్చి నవ్వింది. ఆ నవ్వు విని సుబ్రహ్మణ్యం భయపడి ముడుచుకుపోయాడు.

“ఎక్కడో గుర్రం సకిలించిందిరా” అన్నాడు ఆంజనేయులు. శ్రీనివాస్ అతడి కాలు తొక్కాడు మాట్లాడొద్దన్నట్టు.

తర్వాత శోభను చూసి, “ఇదిగో పాపా! మీ బావగారికి ప్రసాదం బాగా పెట్టాలి. లేకపోతే వరాలివ్వడు. మేమలా వెళ్లొస్తాం. వాణ్ని ప్రసన్నం చేసుకో ప్రసాదం పెట్టి” అంటూ వెళ్లిపోయారు.

“బావా.. తీసుకో ప్రసాదం..” అంది శోభ తలవంచుకుని గమ్మత్తుగా సిగ్గుపడుతూ.. ఓణీ కొంగు కొసలు వ్రేలికి చుట్టకుంటూ. ముందు మొహమాట పడినా మళ్ళీ దొరకవేమోనని నిమిషంలో ఒక బుట్ట ఖాళీ చేసాడు. అలా చూస్తూ ఉంటే తనకు మిగలవాని అర్థం అయ్యింది శోభకు. అంతే.. ముందుకు దూకింది. పోటీగా ఒక బుట్ట లేపి తినటం మొదలెట్టింది. ఆ మింగుడు చూసి పూజారి గబగబా గర్భగుడికి తాళంవేసి వెళ్ళిపోయాడు – ఇంకాసేపుంటే గుళ్లో లింగాన్ని కూడా మింగేస్తారేమోనని!

బయటికొచ్చింతర్వాత, శ్రీనివాస్ ఆంజనేయులుతో, “ఒరేయ్ నీవు వాణ్ని తీసుకుని క్యాంపుకి వెళ్ళిపో.. నేను అలా పొలాల్లోకి వెళ్లి కాస్త కవిత్వం రాసుకుని వస్తా” అన్నాడు.

“ఒరేయ్ జాగ్రత్త.. పొలాల్లోకి ఒంటరిగా వెళ్తే దయ్యం పట్టుంకుంటుందిట.. సుబ్బిగాడి వాళ్ళ అమ్మమ్మ చెప్పిందిట.”

శ్రీనివాస్ థమ్స్ అప్ అంటూ బొటన వ్రేలు చూపి పొలాల్లోకి వెళ్తూ నవ్వుకున్నాడు.

“నిజమే.. నాకు ప్రేమ దయ్యం పట్టింది.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here