Site icon Sanchika

జైత్రయాత్ర-9

[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తాను రోజూ రన్నింగ్ చేస్తానని వెంకట్రావుకి చెప్పేసరికి, ఆయన రోజూ ఉదయాన్నే నాలుగు గంటలకల్లా  నిద్ర లేపి సుబ్బుని రన్నింగ్‍కి పంపసాగాడు. ఆయనతో ఆ మాట అనడం తనకి శిక్షగా మారిందని తనని తాను తిట్టుకుంటూ పరుగు మొదలెడతాడు సుబ్బు. శోభ పరిచయమయ్యాకా, ఉదయాన్నే బ్రష్ చేసుకుని వెళ్తుంతాడు, ఆమె కనిపిస్తే తినడానికి ఏదో ఒకటి పెడుతుందని. ఆ రోజు కూడా శోభ వాళ్ళింటి ముందు ఆగుతాడు. అక్కడ ఆమె కనబడదు. ఆమె వేసిన ముగ్గు మీద నిలుచుని కొన్ని క్షణాలు చూసిన సుబ్బిని ఓ నల్ల గండు చీమ గట్టిగా కుడుతుంది. మళ్ళీ పరుగు మొదలు పెట్టి, కొంత దూరం వెళ్ళి అలుపు తీర్చుకోడానికి రాయుడి ఇంటి ముందు ఆగుతాడు. కళ్ళు తిరుగుతున్నట్లనిపిస్తాయి. ఓపిక తెచ్చుకుంటూ యథాలాపంగా రాయుడి ఇంటి వైపు చూసి.. అక్కడ కనబడిన వ్యక్తిని చూసి బెదిరిపోతాడు. ఆమె వనజ, తమ కాలేజీ ప్రిన్సిపాల్ కూతురు. గబగబా వెనక్కి పరిగెత్తి గదికి వచ్చి అంజి, శ్రీనులను నిద్ర లేపుతాడు. కానీ పరిగెత్తుకు రావడం వల్ల వచ్చిన ఆయాసంతో ఏమీ మాట్లాడలేక తల అటూ ఇటూ తిప్పి, కళ్ళు పెద్దవి చేసి ఆవులించి వింత వేషాలు వేస్తాడు. దాంటో వాళ్ళిద్దరూ కంగారు పడతారు. దెయ్యం పూనిందేమో అనుకుని ఓ కర్ర పుచ్చుకుని కొట్టబోతే.. తెలివి తెచ్చుకుని.. వారిద్దరికి అసలు విషయం చెప్పేస్తాడు. ఈ ఊరికెందుకు వచ్చిందో అనుకుంటూ, నీ ముద్దు మరిచిపోలేక వచ్చినట్టుందిరా అంజీ, నీకు మరో మంచి అవకాశం అంటాడు శ్రీను. అంజనేయులు సిగ్గుపడితే, ఖచ్చితంగా అందుకు కాదు, నీ మీద పగ దీర్చుకోడానికి రాయుడి సాయం అడిగి ఉంటుంది. నిన్నిక్కడ లేపేస్తే అడిగేవాడు లేడు కదా అంటాడు సుబ్బు. అంజి ఓ క్షణం పాటు భయపడతాడు. ఈ విషయం ఎన్.సి.సి. కేడెట్స్ అందరికీ తెలిసిపోతుంది. ఏది ఏమైనా తామంత అండగా ఉండి అంజికి ఏమీ కాకుండా చూస్తామని అంటారు వాళ్లు. వనజ గుడికి వెళ్తుంది. ఆమె వెనక్కాలే మిత్రత్రయం కూడా అక్కడికి చేరుతారు. ఆంజనేయులు కూడా లోపలికి వెళ్ళి వనజ పక్కనే నిలబడి దండం పెట్టుకుంటున్నట్టు, ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తాడు. ఇక్కడున్నావేంటి అని అడిగితే, రాయుడు తన బాబయి అని, వాళ్ళింటికి వచ్చానని అంటుంది. తానాపని కావాలని చేయలేదని అంటాడు అంజి. ఏ పని అని అడుగుతుంది. స్నేహితులు పందెం కాయడం వల్ల, కాలేజీలో ఆమెను ముద్దు పెట్టుకున్నానని, తనని ఏమీ చెయ్యద్దని అంటాడు. తప్పు చేసినా, నిజాన్ని ధైర్యంగా చెప్పేవాడే తనకి ఇష్టం అంటుంది వనజ. భయపడద్దని, ఇలా ఇక్కడ కలవడం బావుందని, లవ్ యూ అని చెప్పి వెళ్లిపోతుంది. వాళ్ళ బాబాయికి చెప్పను అన్న మాటలతో ఊపిరి పీల్చుకున్న అంజి, ఆ తర్వాత మాట మీద దృష్టి పెట్టడు. సుబ్బు, శ్రీను వచ్చి వనజ అంజికి లవ్ యూ చెప్పిందని చెప్పి అతన్ని సంతోషపెడతారు. – ఇక చదవండి.]

అధ్యాయం-11

[dropcap]చీ[/dropcap]కట్లు ముసురుకుంటున్నాయి.

అది పితృవనం.

ఆ నిశీథిలో గుండెలవిసే శోకం ప్రతిధ్వనిస్తోంది. అక్కడ ఓ శవం కాలుతోంది. దాని చుట్టూ గుంపుగా బంధుమిత్రులంతా నిలుచుని వున్నారు. సూర్యాస్తమయం నాటికే కాటికి తెచ్చిన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి దూరంగా నుంచుని కపాల మోక్షం కోసం ఎదురుచూస్తున్నారు.

ఆ మనుషులు అటూ ఇటూ కదులుతూ ఉంటే దెయ్యాలు ఛాయారూపాల్లో సంచరిస్తున్నట్లనిపిస్తోంది. స్మశానంలో మర్రిచెట్టు ఫుల్లుగా తాగిన వాడిలా స్తబ్దంగా ఉంది. ఊడలు తూలుతున్నట్లు గాలికి ఊగుతూన్నాయి.. రాత్రి అయ్యేసరికి దూరంగా ఉన్న అడివిలోంచీ స్మశానానికి వచ్చి సగం కాలిన శవాల్ని పీక్కుతినే నక్కలు అప్పటికే ఊళ పెడుతున్నాయి. బయట ప్రహరీకానుకుని ప్రవహిస్తున్న వైతరణిలో కప్పలు బెక బెకమంటున్నాయి. పక్కనే ఉన్న పిచ్చి మొక్కల్లోంచీ వచ్చిన బురద పాము నోట్లో చిక్కిన కప్ప గురకస్వరం గగుర్పొడుస్తోంది. మర్రిచెట్టు కొమ్మలకి తలక్రిందులుగా వ్రేలాడుతున్న చేతక పక్షులు ఏదో దయ్యం కొట్టినట్లు ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి మళ్ళీ కొమ్మల మీదకు చేరుకుంటున్నాయి. గబ్బిలాలు వాటికి తోడుగా ఎగురుతుంటే, గుడ్లగూబలు చెట్టు తొర్రల్లోంచీ ఎర్రటి కళ్ళతో పరిసరాల్ని పరికిస్తున్నాయి.

కాటికాపరి సెంద్రుడు ఇవేవీ పట్టించుకోడు. ఎందుకంటే వాడి జీవితంలో అవన్నీ ఒక భాగం. అక్కడ కాలుతున్న శవానికి దహన సంస్కారం చేసింతర్వాత వాళ్ళని వొదిలేసి ఇంట్లోకెళ్ళిపోయాడు. అక్కడి వాళ్ళిచ్చిన సారాయి పూటుగా త్రాగి, ప్రొద్దున రాయుడిగారింట్లో పందికొక్కుల్ని, ఎలకల్నీ చంపినందుకు దొరగారిచ్చిన బొమ్మిడాయిల పులుసుతో తాపీగా అన్నం తిని తృప్తిగా త్రేన్చాడు. దగ్గరుండి తనకు వడ్డించిన పెళ్ళాం రావులమ్మ కేసి ప్రేమగా చూసాడు. ఆమె ఒకసారి అతని వంక చూసి ఇంటిపనుల్లో మునిగి పోయింది.

సెంద్రుడు బయటికి వచ్చి ఆకాశంలోకి చూసాడు. శుక్లపక్ష చంద్రుడు రేపటి పున్నమికి తయారవుతున్నాడు. నక్షత్రాలు చంద్రుడి చుట్టూ అల్లుకుంటున్నాయి. కాలుతున్న శవం తాలూకు బంధువులు మెల్లిగా నిష్క్రమిస్తున్నారు. సెంద్రుడు స్మశానం మధ్యలో ఎత్తుగా ఉన్న సమాధి అరుగు మీద నడుంవాల్చి ఆకాశంవంక చూస్తూ మనసారా రాగం తీస్తున్నాడు.

సుక్కల ఆకాశముందీ –

సుక్కే నా పక్కనుందీ –

సుక్కేసుకుంటే, ఎంత

సుఖమున్నదీ!

ఎన్నెల పక్కేసుకుంటే ఎంత

సక్కగున్నదీ?!..

రావులమ్మ బయటికొచ్చి “ఏందయ్యా నీ ఏసాలు.. అవతల అల్లు పుట్టెడు దుక్కంలో ఉంటే, నీ పాటలేంటీ.. ఆపాపు” కసిరింది.

సెంద్రుడు వెకిలిగా నవ్వాడు, “ఒసే సుక్కీ.. ఎర్రి మొకమా! మడిసన్నాక సావకపోతాడా? సచ్చినాక కాళీ, మట్టిలో కలవక మానుతాడా? ఆడి సమాధి మీద నేను పడుకుంటే ఏందీ? పాడుకుంటే ఏందీ? అయినా ఇప్పుడు ఏడుత్తున్న వాళ్ళే రేపు తాగుతా ఏడుస్తారు..”

“సాల్లే.. చెప్పొచ్చావు!”

“తాగినా, తాగకపోయినా నేను నిజమే సెప్తానే పిల్లా.. పోనీ నువ్వే సెప్పు.. శవాన్ని కాక బతికున్నోల్లని కాలుతారంటే పిచ్చి మొకమా?! ఏడిచేటోడ్ని మరింత ఏడిపిస్తాడు. నవ్వేటోడ్ని మరింత నవ్విస్తాడే బగమంతుడు. ఏం కావాలో తెముల్చుకోవాల్సిందీ, తెలుసుకోవాల్సిందీ మనవే! నేను సూడు.. మనకు మిద్దెలున్నాయా.. లేవు. పైసలున్నాయా.. లేవు. ఎనకా ముందూ ఎవళ్ళన్నా ఉన్నారా.. లేరు.. అయినా ఎంత ఆయిగా ఉన్నాం.. కదా.. నా కొక్కటే ఆలోచన.. నా పక్కన రావులమ్మ ఉంది. చాలు.. అందుకే నా పెదాలమీద ఎప్పుడూ సెరగని తరగనంత నవ్వుంటాడే రావులమ్మా!” అంటూ ఆమెని ఒళ్ళోకి లాక్కున్నాడు పెద్దగా నవ్వుతూ.

“సాల్లే ఆపు.. సచ్చినోడా.. చుట్టూ ఎవళ్ళు ఉన్నారో కూడా చూసుకోవు.. అడుగూ ఎవరో వస్తున్నారు.. నీ జిమ్మడా!” అని విడిపించుకుంది. ఇంతలో శవం తాలూకు మనుషులు పిలిస్తే డబ్బు వసువులు కోసం వెళ్ళింది రావులమ్మ.

“చంద్రయ్యా.. చంద్రయ్యా” అలవాటు లేని దార్లో ఆ గుడిసే వెతుక్కుంటూ వచ్చింది విద్య. తోడుగా మిత్రత్రయం ఉన్నారు.

కాలికేదో తగిలి ముందుకు తూలిపడ్డాడు సుబ్రహ్మణ్యం. చెయ్యి నేలమీద పడి, బలమైన ఇనప వస్తువు తాకినట్లు బాధ కలిగింది.

“అబ్బా” అనుకుంటూ మూలిగి, అంత గట్టిగా తగిలిన వస్తువేమిటా అని చేత్తో తీసి చూసాడు సుబ్రహ్మణ్యం.

అంతే! ఒక్కసారిగా విసరికొట్టి చావు గావుకేక పెట్టి భయంగా శ్రీనివాస్‌ని గాట్టిగా కావులించుకుని కళ్ళు మూసుకున్నాడు.

“ఏమైంది సుబ్రహ్మణ్యం?”

“పు.. పు.. పుర్రె” వణుకుతూ చెప్పాడు

“ఓస్.. దీనికేనా.. అయినా స్మశానంలో పుర్రెలో, ఎముకలూ కాక పూలూ పళ్ళూ ఉంటాయటరా? పద..” విద్య ముందు హీరోలా ఫోజుకొడుతూ ఆంజనేయులు.

“చంద్రయ్యా..” మళ్ళీ పిలిచింది విద్య.

“ఎవరూ?” ముద్ద ముద్దగా సెంద్రుడు. ఒళ్ళు తెలీని మైకంలోంచీ ఓసారి కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తూ చంద్రయ్య.

“పంతులమ్మని.. విద్యని మాట్లాడుతున్నాను” అంది బిగ్గరగా అరుస్తూ విద్య.

“పంతులమ్మా..? నాకా సదువు ఒంట బట్టకే కదా ఈ పని సేత్తున్నాను.. నాకూ సదువుకీ ఆవడ దూరం.. ఎల్లెల్లు..” అంటూ మత్తులోకి జారిపోయాడు.

ఇక లాభం లేదనుకుని, శ్రీనివాస్ జేబులోంచీ విజిల్ తీసి చంద్రయ్య చెవిలో గట్టిగా ఊదాడు.

అంతే! మత్తూ, గిత్తూ దిగిపోయింది. చావుల్నీ, శవాల్నీ, లెక్క చేయని సెంద్రుడు అమాంతం లేచి నిల్చున్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన రావులమ్మ అది చూసి పకపకా నవ్వింది. చురుక్కుమని చూసేడు సెంద్రుడు.

“ఎందుకా నవ్వు?” కసిరేడు

“మా బాగయిందిలే.. లేకపోతే ఎవరో ఒత్తన్నారు సూడమని సెప్పెల్తే సల్లగా నిద్దర్లోకి జారుకుంటావా?”

విద్య కల్పించుకుని, “చూడండి. మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పట్నం నించీ ఎన్.సి.సి వాళ్ళు వచ్చారు. మనమంతా పక్కనుండి ఊరి ప్రజలకోసం బావి త్రవ్విస్తారు. అందుకు నీవు సహాయం చేయాలి చంద్రయ్యా!”

“పీకల్దాకా తాగి తొంగున్నాడు.. ఈ పూటకిక ఇంతే గానీ ఏం చేయాలో చెప్పండి, రేప్పొద్దున నేను చేయిస్తాను” అంది రావులమ్మ.

“ఈ వూరికి బావి త్రవ్వుదామని వచ్చారు. మన ఊరి జనం కూడా కలిస్తే తొందరగా అవుతుంది. అలా వచ్చే వాళ్ళందరూ రేపు సాయంత్రం మర్రిచెట్టు దగ్గరికి రమ్మని ఉదయం టముకు వేయించాలి. ఈ ఒక్క సాయం చేస్తే మీరు కూడా సాయపడినవాళ్లవుతారు.

“ఓస్ ఇంతేగదా.. నేను జూసుకుంటాను గానీ, మీరు ఈ ఇసయం మరచిపోయి ఏరే పనులు సూసుకోండి” అంది రావులమ్మ.

“థాంక్స్ అమ్మా” అని విద్య వెనక్కు తిరిగి బయలుదేరింది.

వెనక్కు తిరగబోయిన సుబ్రహ్మణ్యం ప్యాంటు ఎవరో పట్టి లాగినట్టయింది. అసలే అది స్మశానం అని గుర్తుకొచ్చి సుబ్రహ్మణ్యం గుండె ఝల్లుమంది. అరుద్దామన్న నోరు పెగల్లేదు.

గొంతు పెగలక శ్రీనివాస్‌ని చొక్కా పట్టుకు లాగాడు. చొక్కా చిరిగి ఆ ముక్క సుబ్రహ్మణ్యం చేతిలోకి వచ్చింది. శ్రీనివాస్ వాడి వంక తిరిగి ముక్క చివాట్లు పెట్టాడు.

“మళ్లీ ఏం ముంచుకొచ్చిందీ?”

సుబ్రహ్మణ్యం మాట్లాడలేక వెనక్కు చూడమని సైగ చేసాడు.

అటు చూసిన అందరూ ఫక్కున నవ్వారు.

సుబ్రహ్మణ్యం ప్యాంటుని రావులమ్మ చీర కొంగు అనుకుని సెంద్రుడు గట్టిగా పట్టుకుని “సుక్కీ..” అని కలవరిస్తున్నాడు.

“ఛీ ఛీ ఆడా మగా అని కూడా తెలియటం లేదు.. మాయదారి తాగుడూ.. మాయదారి మొగుడూ.. ఈడు” అంటూ సెంద్రుడి చేతిమీద శవం తాలూకు ఎముకతో ఒక్క దెబ్బ వేసింది. చేయి విదిలించుకుని సరికి సుబ్రహ్మణ్యం ప్యాంటు సేంద్రుడి చేతిలోంచీ బయట పడింది.

అందరూ బయటపడ్డారు.

***

‘డం.. డమ్మూ.. డమ్ చిక్కూ..’ అంటూ వినవస్తున్న టముకుకి ఇళ్లల్లో జనమంతా వీధిలోకొచ్చి నిలబడ్డారు.

“ఒహో.. గ్రామ ప్రజలందరికీ ఇందుమూలంగా తెలియజేయునదేమనగా..” అని సేంద్రుడు చాటింపు మొదలెడుతుండగా.. “నువ్వెవ్వరికీ ఏవీ తెలియజేయనక్కర్లేదు.. ఆపు..” అంటూ ఎదురొచ్చాడు భైరవుడు. ఆగిపోయాడు సెంద్రుడు.

“ఏరా.. ఎప్పుడైనా అయ్యగారికి తెలీకుండా ఏ పనైనా చేసావా? ఇప్పుడేంటి మరి.. అంత ఈరుడివయ్యావా?” కండలు సవరించుకుంటూ ఆనాడు భైరవుడు.

సేంద్రుడు అయోమయంగా చూసాడు.

“ఏందిరా.. నాటకాలాడుతున్నావా? “

“సత్తే పెమానంగా నాకేం తెలీద్దోరా.. నా మాట నమ్ము.. గంగమ్మ తల్లి మీదొట్టు” దీనంగా అన్నాడు సేంద్రుడు.

“సరే.. ఇప్పుడు సెప్తున్నా తెలుసుకో.. అల్లు సెప్పినట్టు నువ్వు చేయొద్దు.. చండాళ్ళేచిపోతాయ్” కళ్ళెర్ర జేశాడు భైరవుడు.

‘అట్టాగే’ అంటూ నీరసంగా ఇంటిదారి పట్టాడు సెంద్రుడు. జనాలంతా మళ్ళీ ఇళ్లల్లోకి వెళ్లిపోయారు.

క్యాంపులో కూర్చున్న వెంకట్రావ్, విద్యలు జరిగింది తెలుసుకుని ఉసూరుమన్నారు.

“మీరు ఎందుకిలా నిరుత్సాహపడుతున్నారు?” అడిగింది విద్య.

“కాక ఏం చేయమంటారు? మీ వూరికి సహాయం చేద్దామని మేమొస్తే ఇదంతా మా లాభం కోసం అన్నట్టు చూస్తారేంటీ?” నిస్పృహగా అన్నాడు వెంకట్రావు.

“అయ్యో.. మీకింకా అర్ధం కాలేదా? ప్రపంచమంతా పరచుకున్న టెక్నాలజీ ఈ వూళ్ళో అడుగుపెట్టకపోయినా, రాజకీయాలు మాత్రం ఏం మొహమాటం లేకుండా పుట్టింటికొచ్చినట్టు వచ్చేసినయ్. అలాంటి అడ్డంకుల్ని పట్టించుకుంటే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. “ అంది విద్య.

“ఏమో.. నాకు వెనక్కి తిరిగి వెళ్లి ముందుకెళ్లే మార్గం ఏదీ కనిపించటం లేదు” నిరాసక్తంగా అన్నాడు వెంకట్రావు.

“ఎందుకు?”

“ఈ వూరు, ఇక్కడి మనుషులూ, ఇక్కడి రాజకీయాలూ, కక్షలూ, కార్పణ్యాలూ మాకు తెలీవు.”

“ఈ వూరే కాదు. ఈ దేశంలో ఏ వూర్లో అయినా ఇంతే! మనసుంటే మార్గం దొరక్కబోదు. సంకల్ప బలమే సర్వ విధాలా మార్గాన్ని చూపిస్తుంది.”

“అదేదో మీరే చెప్పండి. పోనీ మనమే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తే బావుంటుందేమో?” ప్రశ్న, సమాధానం తానే ఇస్తూ.. అన్నాడు వెంకట్రావు.

“అద్భుతంగా ఉంటుంది. ప్రజలని కలిస్తే వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుస్తాయి.”

అంతే! అందరూ జట్లుగా విడిపోయి తలా ఒక వీధికీ బయల్దేరారు. అప్పటిదాకా వీళ్ళతో ఆంటీ ముట్టనట్టు ఉన్న పల్లె జనం అసలు విషయం తెలిసాక ఎంతో సంతోషంతో ఆహ్వానించారు. అభినందించారు.

మంచి పనికి తమ మద్దతుంటుందని తెలిపారు. అన్ని భయాలూ పోయి ఉత్సాహాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు.

మరుసటి రోజు తేలారేసరికల్లా ఊర్లోని ఆడా మగా, ముసలీ ముతకా, పిల్లా పీచు, అందరూ బావికోసం మార్కింగ్ చేసిన వాటర్ పాయింట్ దగ్గరికి వచ్చారు.

రాయుడు వచ్చి టెంకాయ కొట్టి, ఒక తట్ట మట్టి త్రవ్వి కార్యక్రమం ప్రారంభించాడు. క్లుప్తంగా మాట్లాడి వెంటనే వెళ్ళిపోయాడు తన మందీ మార్బలంతో. అతనే మొదలెట్టాడు కాబట్టి ఏ జంకూ లేకుండా అందరూ పలుగు పారా పట్టారు. లంచ్ టైంకి ఐదు అడుగుల లోతు త్రవ్వారు. లంచ్ తర్వాత మరింత చురుగ్గా పని సాగింది. మట్టి త్రవ్వే వాళ్ళు కొందరైతే తట్టల్లో ఎత్తి దూరంగా పడేసేవాళ్ళు మరికొంత మంది. చిన్న పిల్లలు కూడా ఉత్సాహంగా ఉడుత సాయం చేస్తున్నారు. ఆ దృశ్యం చూస్తే శ్రమైక జీవన సౌందర్యం కనిపిస్తోంది.

ఓ చోట శ్రీనివాస్ బృందం మట్టి తవ్వుతుంటే సుబ్రహ్మణ్యం త్రవ్వేచోటికి, మట్టి పడేసే చోటికి పని అందుకుంటున్న వాడిలాగా అటూ ఇటూ తిరుగుతూ, కష్ట పడిపోతున్నట్టు మధ్యలో ఆపసోపాలు పడుతూ వీర లెవెల్లో నటించేస్తున్నాడు.

అది గమనించి, ఆంజనేయులు, “ఒరేయ్ సుబ్బిగా.. ఒక్క తట్ట మట్టి అయినా మోశావా? అటూ ఇటూ తిరగటం తప్ప” అన్నాడు.

“మోయలేకపోతున్నారా?”

“ఇది మోయలేకపోతే రేపు నూట యాభై కిలోల శరీరాన్ని మోసుకుంటూ తిరగాలి. నీ ఇష్టం. కాస్తంత శరీరాన్ని కష్టపెడితేనే, స్మార్ట్‌గా తయారవుతావ్” అన్నాడు ఆంజనేయులు.

“పని ఎగ్గొట్టటంలో స్మార్ట్ వాడు” అన్నాడు శ్రీనివాస్.

అంతలో వెంకట్రావు అటుగా రావటం చూసి సుబ్రహ్మణ్యం ఒక తట్టలో రెండు పారల మట్టి వేసుకుని లేవనెతేందుకు కష్టపడుతూ కాలు మెలిక పడి క్రింద పడ్డాడు.

“ఖర్మ.. నీకు పని గండం ఉన్నట్టుంది రా సుబ్బిగా! నీవు ఒక్క పని చేస్తే నీకు మేం పది సపర్యలు చేయాల్సివస్తుంది కానీ, నీవు పోయి చెట్టుక్రింద కూర్చో..” జాలిగా అన్నాడు శ్రీనివాస్.

“నీవురా నిజమైన ఫ్రెండ్ వంటే” అంటూ తట్ట అక్కడే పడేసి కుంటుకుంటూ పోయి చెట్టుకింద కూలబడ్డాడు.

అప్పటిదాకా అతన్ని గమనిస్తున్న శోభ ఎగురుకుంటూ వచ్చి అతని పక్కనే కూలబడింది. ఆకులు, చెట్ల డిజైన్ లంగా వోణీలో వుంది.

అతడి కళ్ళలోకి చూస్తూ “నేనెలా ఉన్నానో చెప్పు?” అంది.

“నాకు తినటం తప్ప చెప్పటం రాదు”

“ఏదో ఒకటి చెప్పు” గారాం చేసింది.

“మర్రిచెట్టులా వున్నావ్… నీ జడలు తెగిపోయిన వూడల్లా ఉన్నాయి.. బాగా చెప్పానా?”

“భలే భలే.. నీవు ఏం చెప్పినా బాగుంటుంది. “

“ఏంటీ విశేషం.. పెళ్లి కుదిరిందా?”

“ఛీ.. ఇవ్వాళ నా పుట్టిన రోజు.”

“మరి నాకేం తెచ్చావ్? అవునూ. ఏంటి ఏదో సంచీ పెట్టుకొచ్చావ్ బొడ్లో. ఏంటవి?”

“అబ్బా.. నీ కన్నీ తొందరే” అంటూ శోభ బొడ్లో దోపుకున్న ఉడకపెట్టిన పల్లీల సంచీ తీసి తెరచింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ పల్లీ పప్పులు తింటూ తొక్కల్ని మట్టి కుప్పలో వేయసాగారు. అంతలో శోభ వాళ్ళ పాలేరు ఓ చిన్న సైజు బస్తా తెచ్చి వాళ్ళ ప్రక్కనే పెట్టి వెళ్ళిపోయాడు.

“అదేంటీ” అడిగాడు దాని వంక ఆబగా చూస్తూ.

“చూడు” అంటూ మూతి ముడి విప్పింది. అరటి గెలలు.

ఇంకా అక్కడ బకాసుర విందు మొదలైంది.

పదినిమిషాల్లో ముగించి “బావా.. వెళ్తా.. ఇంకా మా స్నేహితురాళ్ల దగ్గరికి వెళ్ళాలి” అంటూ గజగామినిలా నేల తాటిస్తూ వెళ్ళింది.

(సశేషం)

Exit mobile version