Site icon Sanchika

మంచి మనుషుల మంచి కథలు – ‘జక్కదొన’

[శ్రీ ఆర్. సి. కృష్ణస్వామిరాజు గారి కథాసంపుటి ‘జక్కదొన’ పై సమీక్ష అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కథా రచయిత, బాలసాహితీవేత్త శ్రీ ఆర్. సి. కృష్ణస్వామిరాజు గారి 17వ పుస్తకం ‘జక్కదొన’ కథాసంపుటి. 21 కథలున్న ఈ పుస్తకాన్ని అచ్చంగా తెలుగు ప్రచురణలు వారు ప్రచురించారు.

“రాజుగారి కథల్లో మానవీయత తొణికిసలాడే మంచి మనుషులు ఎదురుపడతారు. పుట్టిన ఊరు కోసం ఏదైనా చేయాలని తపన పడుతుంటారు. స్వార్థంతో కూడిన ఒకటి రెండు పాత్రలు ఎదురైనా ఇతరులని చూసి వాళ్ళు కూడా పరివర్తన చెందుతారు” అని ఈ కథలలోని పాత్రల స్వభావాలను తన ముందుమాటలో ప్రస్తావించారు శ్రీ తగుళ్ళ గోపాల్.

~

అప్పు అంటే భయం ఉన్న ఓ వైద్యుడికి ఎదురైన కష్టమేమిటో ‘డబ్బు పాపిష్టిది!’ కథ చెబుతుంది. ‘పరిస్థితి ఎంతో దారుణంగా తయారై ఉంటే కానీ వారు ఈ నిర్ణయం తీసుకుని ఉండరు’ అనుకుంటాడు డాక్టర్ గారి శ్రీమతిని కలిసిన ఓ బ్యాంక్ మేనేజర్. తీర్చలేని అప్పు, సమాజంలో హోదాలతో సంబంధం లేకుండా, మనుషులపై ఒత్తిడి కలిగించి, జీవితాన్ని ఎలా ఛిద్రం చేస్తుందో ఈ కథ చెబుతుంది.

మంచి జరుగుతుందనకున్నప్పుడు, చేసే పని విషయంలో భయపడకూదని ఆమె ఎలా తెలుసుకుంది? వాళ్ళ ఆయన తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా, ప్రాణాలకు తెగించి చేసిన ఓ మంచి పని ఎంతో మందికి ఆనందం కలిగించటంతో, ఆమె ఓ చక్కని నిర్ణయం తీసుకుంటుంది ‘బుడబుక్కల బంగారు తల్లి’ కథలో.

పుత్తూరు నుంచి తమిళనాడులోని పళ్ళిపట్టుకు వెళ్ళే బస్సులో కండక్టర్‍గా పనిచేసే మునియప్ప కొడుకు సముద్రుడు – ఒక రోజు బస్సులో ప్రయాణించి, తండ్రి డ్యూటీ ఎలా చేస్తాడో గమనించి – ప్రయాణీకులని చూసి ఏం నేర్చుకునాడో తెలుసుకోవాలంటే ‘రైట్.. రైట్’ కథ చదవాలి. కండక్టర్‍పై మాట తూలిన కాలేజీ కుర్రాడికి ఓ ముసలామె ఇచ్చిన జవాబు మనుషుల్లోని మంచితనాన్ని గుర్తు చేస్తుంది. చక్కని కథ.

సరదాగా మొదలై, అలవాటుగా మారి, ఆపై వ్యసనమైన ఓ బలహీనత ఒక కుటుంబంలో తండ్రీ కొడుకులను కమ్మేస్తుంది. తండ్రి ఆలస్యంగా మేల్కొన్న అప్పటికే అతని ఆరోగ్యం క్షీణిస్తుంది. కొడుకుని చూసుకుందామని, బెంగుళూరులో ఉద్యోగం చేసుకుంటున్న కొడుకుని ఇంటికి పిలిస్తే, కొడుకు కూడా ఆ వ్యసనానికి లొంగాడని తెలుస్తుంది. అయితే కొడుకు ఇంకా దానికి బానిస కాకపోవడంతో, తండ్రి దుస్థితిని చూసి తాను మారుతాడు. ‘ఆవు చేనులో మేస్తే..’ ఆలోచింపజేసే కథ.

బడిలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ఎంత ముఖ్యమో ‘ఫుల్ మీల్స్’ కథ చెబుతుంది. ‘నాకు బిరియానీ హోటల్‍లో ఉద్యోగం ఇప్పించు దేవుడా’ అని ఓ చిన్న పాప ఎందుకు కోరుకుందో తెలిస్తే, మనసు బరువెక్కుతుంది. ఈ కథలోని మణికంఠ లాంటి వారు సమాజానికి ఎంతో అవసరం.

ఎనభై ఏళ్ళ వయసున్న తండ్రి కోరిక తీరుద్దామని అనుకున్న కొడుకుకి – పుట్టి పెరిగిన ఊరికీ, మనిషికీ మధ్య ఎంతటి ఆకర్షణ శక్తి ఉంటుందో ‘ఊరి మట్టి’ కథలో తెలుస్తుంది.

కొత్తగా విలేఖరి ఉద్యోగంలో చేరిన జ్వాలాముఖికి ఎదురైన అనుభవాలు, అతడిలో కలిగిన ఉద్వేగాలను, స్పందనలను ‘దుప్పీ.. దుప్పీ.. ఏమాయె!’ కథ చెబుతుంది. వన్యప్రాణులను చంపటం నేరమని తెలిసి కూడా, ఓ దుప్పిని చంపి వండుకుని ఊరంతా తిన్న వార్తని పేపర్‍లో కవర్ చేయాలనుకుంటాడు. కానీ ఆఫీస్‌కి వెళ్ళేసరికి దుప్పి కాస్తా మేకగా మారిపోతుంది. ‘భలే ఉద్యోగం’ అనుకుంటాడు.

తాను పనిచేసే గ్రామీణ బ్యాంకుకు డిపాజిట్లు సంపాదించడానికి మేనేజర్ నిశ్చల చేసిన ప్రయత్నాలను ‘డిపాజిట్’ కథ చెబుతుంది. తన లక్ష్యాన్ని సాధించాడానికి ఆమె చేసిన కృషి, సంకల్ప బలం దృఢంగా ఉంటే, గమ్యం చేరే మార్గం కనబడుతుందని చెప్తుంది.

“పద్యాలు చదివినంత సులువు కాదండీ, టూ వీలర్ డ్రైవింగ్ చెయ్యడం” అన్న బబిత – అశ్విని అనే అమ్మాయి సాయంతో బండి నేర్చుకుంటుంది. అశ్వని నేపథ్యం తెలుసుకున్న బబిత కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. ఇంజనీరింగ్ చదివే అమ్మాయి డ్రైవింగ్ నేర్పడాన్ని ఎందుకు ఉపాధిగా మార్చుకుందో తెలుసుకున్నాక, ఆ  అమ్మాయి పట్ల గౌరవం కలుగుతుంది. ‘L-బోర్డు’ కథ చక్కని జీవితపాఠం చెబుతుంది.

నొప్పి, బాధ మనుషులకే కాదు పశువులకీ ఉంటాయని బొజ్జరాజు ‘జక్కదొన’ కథలో తెలుసుకుంటాడు. తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెందుతాడు. తాను కాలు విరక్కొట్టిన గొర్రెపిల్లను అక్కున చేర్చుకుని కన్నీరు కారుస్తాడు. దానికేమర్థమయిందో గానీ, దాని కళ్ళు కూడా తడి అవుతాయి. ఈ కథ చదువుతుంటే సన్నివేశాలన్నీ పాఠకుడి మనోఫలకం మీద కదలాడుతాయి.

టర్కీలో పెను భూకంపం సంభవించి. జనజీవితం అతలాకుతలమై తిరిగి గాడిన పదేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు,  అక్కడి ప్రజలకు సేవలందించడానికి – పరాయి దేశాల నుంచి వాలంటీర్‌‌లని ఆహ్వానిస్తారు. చిత్తూరు జిల్లా ఈశ్వరాపురంలోని నరసింహ టర్కీ వెళ్ళే బృందంలో చేరాలనుకుంటాడు. కానీ తిరుపతికి వెళ్ళే దారిలో ఎదురైన ఓ వ్యక్తి, అతని కథ – నరసింహ ఆలోచనల్లో మార్పు తెస్తాయి. ‘అంజేరమ్మ కనుమ’ కథ ఆసక్తిగా సాగుతుంది.

“సినిమాల్లో మాదిరి రీలు రీలుకూ సీను మారినట్టు మన జీవితాలు మారవు” అని తల్లి చెప్పిన మాటలని విహంగ జీర్ణించుకుందా లేదా? ఎదుగుతున్న కొద్దీ ఆమెలో వచ్చిన మార్పు ఏమిటీ, అది దేనికి దారి తీసిందో ‘పురుషా.. ఓ పురుషా..’ కథ చెబుతుంది.

కంటి చూపు సరిగా కనబడడం లేదని తల్లికి ఫిర్యాదు చేస్తుంది ప్రమీల. ఆడపిల్లలంటే తక్కువ భావం ఉన్న తండ్రి మొదట కాదన్నా, చివరికి కూతురుని కంటి ఆసుపత్రికి తీసుకెళ్తాడు. డాక్టరు గారు ప్రమీలని పరిశీలించి, చిన్న సమస్యేననీ చెప్పి, కళ్ళద్దాలు రాస్తారు. తర్వాత తండ్రిని మళ్ళీ లోపలికి పిలిచి, అసలైన ‘దృష్టి దోషం’ నీది అని చెప్తాడు. ప్రమీలకి ఆ డాక్టర్ చేసిన మరో సాయం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

అన్నిటికీ ప్రభుత్వం మీదే ఆధారపడకుండా, తమకు వీలైన పనులను ప్రజలే స్వయంగా పరిష్కరించుకోవచ్చని చెప్తుంది ‘తొలి అడుగు’ కథ.

గుడికి గోడ కట్టించడం కన్నా, పశువుల దాహం తీర్చడం ముఖ్యమనుకున్న వెటర్నరీ డాక్టర్ అనంత గురించి తెలుసుకోవాలంటే, ‘బోడి గుట్ట’ కథ చదవాలి.

మనుషుల ప్రాణాలకి లాగే, పశువుల ప్రాణాలకి డాక్టర్ల అండ కావాలని ‘ఎర్ర మట్టి’ కథ చెబుతుంది. ఆర్ద్రమైన కథ.

అమ్మ కోక విలువ, ఈత నేర్చుకోవాల్సిన ఆవశ్యకతని చెప్తుంది ‘అమ్మ కోక’ కథ. పట్టణాలలోని వాళ్ళను అనుకరిస్తూ, పల్లెటూరి వాళ్ళు – అత్యంత ఆవశ్యమైన విద్యలను నేర్చుకోవడం మానేస్తున్నారనీ, ప్రాణాలు కాపాడుకునే ఈత నేర్చుకునే విషయంలో అలక్ష్యం కూడదని ఈ కథ చెబుతుంది.

మంచి పనికి పూనుకుంటే, చేతులు కలిపే మనుషులకు కొదువ ఉండదనీ, సంకల్పం మంచిదైనప్పుడు అన్నివైపుల నుండీ సహకారం అందుతుందని ‘నగరి ముక్కు’ కథ చెబుతుంది. సందేశాత్మకమైన కథ, ఆచరణీయమైన సూచన చేసింది.

తాను సాకిన మేకని బలి ఇవ్వకుండా కాపాడిన పసివాడి కథ ‘పొట్టిగుట్టలు’. కేవలం పసివాళ్ళకే ఉండే నిష్కల్మషమైన ప్రేమని చాటుతుందీ కథ.

ఇంట్లో దొరకని ప్రేమ బయట దొరికితే.. సొంత రక్తం కూడా పరాయిదైపోతుందనే కఠిన వాస్తవం గ్రహించిన ఆ తండ్రి కూతుర్ని క్షమించాడా? ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాడా? ‘నిర్ణయ’ కథ ఈ ప్రశ్నలకి జవాబిస్తుంది.

ఓ మామూలు రైతు, తమ ఊరి పిల్లల్లో బాగా చదువుకోవాలనే తపనిని రగిలించడానికి, వాళ్ళు చదువుల్లో రాణించడానికి ప్రోత్సాహకంగా ఏం చేసాడో తెలుసుకోవాలంటే, ‘గోల్కొండ చూసొద్దాం, రారండి!!!’ కథ చదవాలి.

~

“రాజు గారు తన కథల్లో సమాజంలోని వ్యక్తులను పాజిటివ్ కోణం నుంచి మాత్రమే చూపిస్తారు. ఎంత వెదికినా, దుర్మార్గపు మనస్తత్వం గల మనుషులు కనిపించరు” అని ఆచార్య పి. సి. వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.

ఈ కథలు చదివిన పాఠకులు, ఈ అభిప్రాయంతోనూ, పైన ప్రస్తావించిన తగుళ్ళ గోపాల్ గారి అభిప్రాయంతో ఏకీభవించక ఉండలేరు.

ఈ కథలు మంచి మనుషుల మంచి కథలని పాఠకులు భావించడంలో అనౌచిత్యమేమీ ఉండదు.

***

జక్కదొన (కథలు)
రచన: ఆర్. సి. కృష్ణస్వామిరాజు
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 167
వెల: ₹ 140/-
ప్రతులకు:
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్
ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆర్. సి. కృష్ణస్వామిరాజు
ఫోన్ 9393662821
ఆన్‌లైన్‌లో
https://www.telugubooks.in/products/jakkadona

 

~

శ్రీ ఆర్. సి. కృష్ణస్వామిరాజు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-rck-raju/

Exit mobile version