జలజక్క

0
2

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘జలజక్క’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]గ[/dropcap]త ఆరు నెలల మాదిరిగానే, ఈ రోజు సాయంత్రం కూడా, ఆ అపార్ట్‌మెంట్‍లో ఉన్న ఆడవాళ్ళందరూ జలజ వాళ్ళ టివి హాల్లో ప్రత్యక్షమయ్యారు. వచ్చిన వాళ్ళు ఎదురుబదురుగా వేసిన పెద్ద ఎల్ ఆకారపు సోఫాల్లో చక్కగా సర్దుకుని కూర్చున్నారు. మిగిలిన వాళ్ళు కింద తివాచీ మీద కూర్చున్నారు. అప్పుడే హాల్లోకి నడిచి వచ్చిన జలజ, వాళ్ళని పలకరింపుగా చూసి నవ్వుతూ “ఏంటి ఈరోజు అందరూ కాస్త ఆలస్యంగా వచ్చారు. మీరు వచ్చేస్తారని అరగంట ముందే తయారయి కూర్చున్నాను. సరే ఉండండి, మీ అన్నయ్య గారు పలాసలో తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్ళి వస్తూ, ఓ మూడు కేజీల ఫ్రెష్ గుండు జీడిపప్పు తీసుకొచ్చారు. ఆ వేయించిన జీడిపప్పు, కలాకండ్ స్వీటు తెస్తాను. చక్కగా అవి రెండు తింటూనే నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చు” అంటూ లోనికి నడిచి వెళ్లింది.

అరణ్యం అపార్ట్‌మెంట్స్‌లో జలజ, సుబ్బారావు దంపతులు ఓ సంవత్సరం క్రితమే మొదటి అంతస్తులో ఫ్లాటు కొనుక్కుని గృహప్రవేశం చేశారు. సుబ్బారావ్ ఫర్నీచర్ వ్యాపారం చేస్తాడు. జలజ గృహిణి. అపార్ట్‌మెంట్‍లో దిగిన కొద్ది నెలల్లోనే, ఏ అరమరికలూ లేకుండా, ఆ అపార్ట్‌మెంట్‍లో ఉన్న వారందరికీ ఎంతో చేరువైపోయింది జలజ.

ఓ అయిదు నిమిషాల తర్వాత, వాళ్ళింట్లో పని చేస్తున్న రమణితో పాటు జలజ కూడా పెద్ద ప్లేటులో జీడి పప్పు, స్వీటు పెట్టిన చిన్న ప్లేట్లు ఒక్కోటిగా అందరికీ అందించింది. ఇవ్వడం అయిపోయాక, “తింటూ ఉండండి, లస్సీ కూడా తెస్తాను. తాగి చల్లబడుదురు గాని. ఆ తర్వాత అసలు కార్యక్రమం మొదలుపెట్టుకుందాం” అంటూ మళ్ళీ లోనికి వెళ్లింది.

జలజని చూసిన నాలాగో ఫ్లోర్ నళిని, “జలజక్కకి ఎంత ఓపికో కదా, ఆమె ఇంటికి ఎవరు ఎప్పుడొచ్చినా ఇలానే అన్నీ చేసి పెడుతుంది. చక్కగా నవ్వుతూ పలకరిస్తుంది. అవతలి వాళ్ళు మాట్లాడినా, మాట్లాడక పోయినా తానే అన్ని విషయాలు చెప్తూ పోతుంది. ముఖ్యంగా, ఎవరితోనైనా మాట్లాడేప్పుడు చేతిలో ఫోన్ ఉంచుకోదు. నాకైతే, చేతిలో ఫోన్ లేకపోతే చేయి లేనట్టే అనిపిస్తుంది. ఇక మా ఇంటికి నెలలో ఓ రోజు చుట్టాలొస్తే చాలు, నాకూ కాలూ చేయి ఆడదంటే నమ్మండి” అంది.

“అవును నళిని, సరిగ్గా చెప్పావ్, ఈ రోజుల్లో అందరూ ఎవరికి వారు, ఎండమావి తీరునూ. ఇలా అందరికీ ఆ ఓపిక ఉండదు. ఉన్నా ఇలా పెట్టే గుణం మాత్రం అసలు ఉండదు” చెప్పింది పక్క ఫ్లాట్ మానస.

అందరూ చక్కగా జీడిపప్పు తింటూ, కబుర్లు చెప్పుకుంటూ పెద్ద టివిలో, ఓటిటిలో కొత్త సినిమా చూస్తున్నారు. కొందరు తినేసాక మళ్ళీ రమణికి చెప్పి మరీ తెప్పించుకుని తింటున్నారు. తరువాత కాసేపటికి జలజ తెచ్చి ఇచ్చిన లస్సీ తాగి, హమ్మయ్య అని అందరూ శాంతించారు. ఇలా ఇంత హడావుడి జరుగుతోందంటే, ఈ రోజు జలజ బర్త్ డే అనో లేక ఆమె పెళ్లి రోజో అనుకుంటే పొరబడినట్టే. గత ఆరు నెలలుగా ఆమె చిట్టీల వ్యాపారం నడుపుతోంది. వాళ్ళందరూ, ఈ రోజు చిట్టీ పాట పాడుకోవడం కోసమే వచ్చారు.

ఇంతలో జలజ హాల్లోకి వచ్చి, “ఇప్పటికే కొంచెం ఆలశ్యమైపోయినట్టుంది. ఇక ఫటాఫట్ చీటీ పాట మొదలెడదామా” అంది, కింద కూర్చున్న వారితో పాటు ఆమె కూడా తివాచీ మీద కూర్చుంటూ.

“తొందరేవీ లేదక్కా. నిదానంగా పాట మొదలు పెట్టు. కారణం, నీతో ఉంటే అసలు టైమ్ తెలీదు, నీతో ప్రతినెలా ఇలా కొంత సమయం కేటాయించడానికీ, మీ ఇంటికి రావడానికి గాను కూడా, మాలో చాలా మంది చిట్ వేశాం తెలుసా. ఎందుకంటే,ఇది ప్రతి నెలా ఏదో చీటీ పాటలా కాక, ఓ ఆత్మీయ సమావేశంలా జరుగుతోంది. అంతా ఒకచోట ఇలా చేరీ, ఇలా కలుసుకోవడం, ఆ నెలలో మనం కొన్న కొత్త చీరాలూ, నగలూ గురించి మాట్లాడుకోవడం భలే బావుంటుంది. పైగా సొంత అక్కలా క్షేమ సమాచారం వాకబు చేస్తావ్, కష్టం సుఖం అడిగి మరీ తెలుసుకుంటావ్. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే తోడొస్తావ్, పెరుగులోకి తోడిస్తావ్, పచ్చడి పెడితే జాడితో ఇస్తావ్, ఎవరైనా తోక జాడిస్తే, మాటలతోనే జాడిస్తావ్, అన్నిట్లో సాయం చేస్తావ్. కష్టం వచ్చిందంటే చాలు, చీటి ఎవరికి వచ్చినా, వాళ్ళని కాదని కష్టం వచ్చిన వాళ్ళకే వదిలేయమంటావ్. అందుకే మీ ఇంటికి వస్తే ఓ పట్టాన వెళ్ళ బుద్ధికాదు” చెప్పింది పక్క ప్లాటు మానస.

“అవును, ఆ మాట నిజమే”, అని జలజ వైపు తల తిప్పి, “నాకు ఓ చిన్న డౌటానుమానం, నీకు ఇక్కడ చిట్టీలు నడపాలని ఎందుకు అనిపించిందక్కా. ఎందుకడుగుతున్నానంటే, నువ్వు ఈ ఆలోచన చేయకపోతే, నేను కార్ కొనగలిగేదాన్నే కాదు. మా వారిని అడిగి అడిగి విసిగిపోయాను. అంత డబ్బు పెట్టి కారెందుకు, ఈ.ఎం.ఐ.లకి నెలకి బోలెడు ఇంట్రెస్ట్ కట్ అయిపోతుందీ అని ఒకటే పాట పాడారు. నేను ఇక్కడ చిట్ వేసి రెండో నెలలోనే తక్కువ మొత్తం వదులుకుని, చటుక్కున కార్ కొనేసే సరికి మా వారి నోటి వెంట మాట రాలేదంటే నమ్ము. పైగా, వడ్డీ లేదు అని మెచ్చుకున్నారు కూడా. ఇదివరకైతే, నా దగ్గర డబ్బులన్నీ అలా, అలా, ఎలా ఖర్చు అవుతున్నాయో తెలయకుండానే అయిపోయేవి. ఇపుడు జలజక్క పుణ్యావా అని, ఖర్చులని అదుపు చేయడం, అలా మిగిలిన డబ్బులు పొదుపు చేయడం జరుగుతోంది” చెప్పింది ఎదురు ఫ్లాటు లలిత.

ఆమె మాటలకి మురిసిపోయిన జలజ, “మీరు నన్ను మరీ పొగిడి తాటి చెట్టు ఎక్కించేస్తున్నారు. అసలు ఇక్కడికొచ్చాక, మీ అందరూ డబ్బు వృథా చేయడం గమనించాను. మీ భర్తల కష్టార్జితాన్ని, మీరు చాలా తేలికగా సినిమాలు, షికార్ల మీద అనవసర ఖర్చులు చేయడం, లెక్కకు మించి కొందరు బ్యూటీ పార్లర్ లకీ వెళుతున్నారు. కొందరు రోజూ ఆన్‌లైన్‌లో ఏదో ఒక వస్తువు ఆర్డర్ చేస్తూనే ఉన్నారు. ఈ ఖర్చులు చాలవన్నట్టు, మళ్ళీ వేరేగా అప్పులు కూడా చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే, నా దగ్గర కూడా కొందరు అప్పులు చేశారు. అవి మళ్ళీ నాకు తిరిగి రావాలి కదా. అందుకే మీ అందరికీ కొంత పొదుపు అలవాటు చేయాలని ఇలా చీటీలు వేయించడం మొదలు పెట్టాను. ఎలాగో ఇందులో నా చీటీ కూడా ఉండనే ఉంది. మీతో పాటు నేనూనూ. ఇక గడిచిన ఆరు నెలలుగా అందరూ చక్కగా అనవసర ఖర్చులు కొంత మాని, మేం చేరతాo, మేం చేరతాo అని పోటీ పడి మరీ చిట్టీలు కట్టే వారు పెరిగిపోతున్నారు. కొందరైతే రెండు మూడు చీటీలు కూడా వేశారు. ఆ చిట్టీ పాడిన డబ్బులతో కొత్త ఇంటికి అడ్వాన్సు, పెద్ద పెట్టున బంగారం, కార్లు, వస్తువులు కొనాలని చూస్తున్నారు. ఇలా అందరూ చేయి, చేయి కలిపితేనే కదా మనలో ఒకరి అవసరం పూర్తిగా తీరుతుంది” చెప్పింది నవ్వుతూ.

“అవునక్కా, నువ్వన్నది నిజం. అలా చేస్తేనే కదా మనం అప్పు, సప్పూ చేయకుండా ఏవైనా కొనుక్కోవచ్చు” చెప్పింది లలిత.

“అయినా అక్కా, మేం చీటి పాటకి వచ్చిన ప్రతిసారీ ఇలా నువ్ వేపిన జీడిపప్పు, స్వీటు వగైరా పెడుతున్నావు. అవి తినడానికే కొందరు కొత్త చీటీలు కడుతున్నారని నా అనుమానం” చెప్పింది మానస. దాంతో అందరూ ఒకేసారి గొల్లున నవ్వేశారు. కొద్ది సేపటికి చీటీ పాట పూర్తి అయిపోవడంతో, అంతా ఎవరి ఫ్లాట్లకి వాళ్ళు వెళ్ళిపోయారు.

మరుసటి నెల ఏడో తారీకున కూడా అందరూ టంచనుగా జలజ ఇంటికి వచ్చారు. వచ్చీ రాగానే, రమణి వారికి జీడిపప్పు, కలాకండ్ తీసుకు వచ్చింది. ఆ ప్లేట్ల వంక చూసిన లలిత, “ఏంటి రమణి, ఎప్పుడూ ఈ జీడిపప్పు, కలాకండేనా. కనీసం వచ్చేసారైనా, రసమలై స్వీటుతో పాటు, ఏ బాదంపప్పో, కర్జూరవో పెట్టమని చెప్పు. ఎప్పుడూ ఇవే అంటే తినీ, తినీ బోరు కొట్టేస్తోంది సుమీ” అంది.

ఆమె మాటలు విన్న మానస, “బావుంది లలితా నీ వరస, ఏదో పుణ్యానికి పెడితే, నీ మొగుడితో సమానంగా పెట్టమందట నీలాంటిదే వెనకటికి. ఇలా పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందనీ. చీటీ కట్టే వారికి ఇంత ఖర్చు పెడితే ఇక జలజక్కకి లాభం లేక పోగా నష్టం కూడా నెత్తిమీదకి వస్తుంది.” అని ఓ క్షణం ఏదో తట్టినట్టు, మౌనంగా ఉండిపోయి ఆలోచిస్తూ “అవునూ, ఓ పక్క పొదుపు చేయాలి అంటూనే, ఇంత డబ్బు నష్టపడి, అంత శ్రమతో కష్టపడి మరీ చిట్ నడుపుతోందా” అంటూ ఏదో తట్టినట్టు ఆగిపోయింది.

అప్పటికే, రమణి తెచ్చిన ప్లేట్లని అందరూ లాక్కునంత పనిచేసి మరీ తీసుకు తినేశారు. కొంచెం సేపు టీవీలో సినిమా చూశాక, “జలజక్క ఏది రమణీ! ఎప్పుడూ మేం రావడానికి ముందే మా కోసం వేచి చూస్తుండేది. ఇవాళ చీటీ పాట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినట్టు” అడిగింది మానస.

“అమ్మగారు అర్జెంట్ పని ఉందని మధ్యాహ్నమే వెళ్లారండీ. సాయంత్రం ఏదో సమయంలో వచ్చి మిమ్మల్ని పలకరిస్తానని చెప్పమన్నారండీ” చెప్పింది.

ఆ తర్వాత, ఆరైనా జలజ రాలేదు. దాంతో వచ్చిన వారిలో, ఆమె వస్తుందన్న కొండంత నమ్మకం కాస్తా సున్నుండ సైజుకి పడిపోయింది. ఆరున్నర కావడంతో, వారి నమ్మకం కాస్తా ఆవిరైపోయింది. తరవాత కొద్ది సేపటికి లలితతో పాటు కొందరికి వాట్సప్‌లో వాయిస్ మెసేజ్ వచ్చింది. “మీ అందరూ చేయి, చేయి కలపడం వలనే నా అవసరం తీరింది. నేను అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం వచ్చింది. ఇప్పుడు నేను కోటీశ్వరురాలినై చక్కగా విదేశాలకి వెళ్లిపోతున్నాను” అని ఉంది ఆ సందేశంలో .

దాంతో అందరూ లబోదిబో అనుకుంటూ వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. ఆ రాత్రి టీవీలో, “కొంత డబ్బు ఇచ్చి, ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి కాకుండానే దానిని సొంత ఫ్లాటు అని చుట్టు పక్కల వాళ్ళకి చెప్పి, ఎంతో నమ్మకంగా అందరికీ జీడిపప్పు పెట్టి, చివర్లో వారి మాడు పగలుగొట్టినంత పని చేసింది. ఆ అపార్ట్‌మెంట్‍లో చాలా మంది దగ్గర పెద్ద మొత్తంలో చీటీ పేరుతో డబ్బులు వసూలు చేసి, చీట్ చేసి విదేశాలకి పరారైన జలజక్క అలియాస్ జలజ. ఇప్పటికీ, మంచితనం ముసుగుతో, నమ్మకం ఎరగా వేసి, లైసెన్సు లేకుండా చిట్టీలు నడిపే వారి చేతుల్లో ప్రజలు చిక్కుకుని మోసపోవడాన్ని, వారి అమాయకత్వం అనాలో లేక వారిని అమాయకులు అనాలో అర్థం కాదు” అని యాంకర్ వార్తని పూర్తి చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here