[dropcap]నం[/dropcap]దిత రాయ్ దర్శకత్వం వహించిన బెంగాలీ చిత్రం ‘ప్రాక్తన్’ (2016)ను హిందీ భాషలో ‘జిలేబి’గా 2018లో పుష్పదీప్ భరద్వాజ్ తీసుకుని వచ్చారు. ఈయన కౌసర్ మునీర్‌తో కలిసి రచించారు కూడా.
జిలేబి అనే మధుర పదార్థం మన దగ్గర రెండు విధాలుగా ఉంటుంది – ఒకటి, తీయని పాకంతో చేతికి అంటుకుంటుంది. రెండవది ‘జాంగిరీ’ పేరుతో కొద్దిగా సున్నితంగా ఉండి పెద్దగా అంటుకోదు. రెండూ ఇష్టంగానే తింటారు. తియ్యగానే ఉంటాయి. కాకపోతే, రెండూ వృత్తంలో చుట్లు తిరిగి ఉంటాయి. ఆ తిరిగి ఉండటాన్ని దాదాపు మధురంగానే ప్రదర్శించారు దర్శకులు. బెంగాలీలో వాడిన సారూప్యం ‘ప్రాక్తన్’ – అంటే ‘మాజీ’ అని అర్థం. కాలం ఎన్ని సుడులు తిరిగినా మనిషి మనసు ఎవరితో ముడిపడ్డా, అనుబంధం ఎవరితో ఏర్పడినా అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఏ ముక్క తీసుకుని తిన్నా అది తీయగానే ఉంటుందా లేదా ఉండాలనా అన్న సందేశం ముంబయి నుండి ఢిల్లీ వెళ్ళే రైల్లోనూ, ఆ ప్రయాణంలో రైల్వే వాళ్ళు అలా చెయ్యకండి, ఇలా చెయ్యండి అని అడుగడుగునా వ్రాసి పెట్టిన సైన్‌బోర్డులాగా, అతి చిన్న పాకింగ్‍లో అందించిన భోజనంలాగా మన చేతిలో పెట్టే ప్రయత్నం గట్టిగానే జరిగినట్లు అనిపించింది.
ఇటీవల చిత్ర పరిశ్రమలో కుటుంబ విలువలను మరో కోణంలో చూసే వ్యవహారం బయలుదేరింది. యాంత్రికమైన జీవనం అనివార్యం అయినప్పుడు యువత ఈ విధంగా నడుచుకోవటం తప్ప ప్రత్యామ్నాయం లేదు అని నిర్ధారిస్తూనే చాలా జాగ్రత్తగా ఒకటి లేదా రెండు కుటుంబ విలువల విషయాలను పిండివంటలలా ఎక్కడో దాచిపెట్టి తెర మీదకి నామమాత్రంగా తీసుకుని వచ్చి, రుచి చూపించి మిగతావన్నీ అశ్లీలమైన దుస్తులు, వ్యవహారాలను యథావిధిగా చూపించి పబ్బం గడుపుకుంటున్నారు అందరూ.
అయిశా (రియా చక్రవర్తి) ఒక రచయిత్రి. తన పుస్తకానికి పరిశోధన చేస్తూ ఢిల్లీ వస్తుంది. అక్కడ ఒక గైడ్ (హిస్టరీకి సంబంధించినవాడు) దేవ్ (వరుణ్ మిత్ర)తో ప్రేమలో పడుతుంది.
ఆమె వ్యవహారం ముంబయి జీవితానికి తగ్గట్టు విచ్చలవిడిగా ఉన్నప్పటికీ పాతకాలపు పద్ధతులలో ఉన్న దేవ్ ఇంట్లోకి కోడలిగా వస్తుంది. తల్లి కాబోతుందని తెలుసుకొని దానికి సిద్ధంగా లేదని చెబుతుంది. దేవ్ మటుకు సంతోషిస్తాడు. కానీ అబార్షన్ అనటంతో ఘర్షణ ప్రారంభం అవుతుంది. ఈ ఇంటికి తను పొరపాటుగా వచ్చానని అనుకుని అయిశా అతన్ని వదిలేస్తుంది.
మరొక పుస్తకం విషయంలో మరల ఢిల్లీ వెళ్లటానికి రైలెక్కుతుంది. కూపేలో అను (దిగంగన సూర్యవంశీ) ఆమె చిన్నారి పిల్లతో కలిసి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఫ్లాష్‌బాక్‌లు మొదలవుతాయి. ఎ.సి. ఫస్ట్ క్లాస్ లోని కూపేలో ప్రయాణిస్తున్న వారి కొందరి వ్యవహారాలు కూడా చాలా సందర్భోచితంగా, మనోరంజకంగా అనిపించాయి. ఇంతకీ ఎదురుగా కూర్చున్న అను తన భర్త యొక్క రెండో భార్య అని తెలుసుకున్న అయిశా జిలేబి బదులు కాడా తింటుంది. చిన్నారిని ‘పుల్టీ’ అని పిలుస్తున్నప్పటికీ అసలు పేరు ‘దిశ’ అని తెలుసుకుంటుంది – తనకే పిల్ల పుట్టి వుంటే ఆ పేరు పెడదామనుకున్నారు! ఆ కూపే లోకి రావల్సిన నాలుగో వ్యక్తి ఎవరా అని పెద్దగా గెస్ వర్క్‌తో పని పెట్టలేదు. దారిలో అను కోసం బర్త్ డే కేక్ పట్టుకుని అర్ధరాత్రి దర్శనం ఇస్తాడు దేవ్. ప్రయాణం ముందుకు సాగుతుంది.
అను తన కథ చెబుతుంది – దేవ్ తనకు రెండవ భర్త! మొదటి వ్యక్తి దిశను ‘ప్రసాదించి’ వేరే పిండివంటకై మరో పండగ చేసుకొన్నాడు. దేవ్ అప్పుడు పసిపిల్లగా ఉన్న దిశను పెళ్ళి చూపుల్లోనే దగ్గరకు తీసుకుని తన ఆశయాలను చాటటం వలన ఇద్దరికీ వివాహం అయిపోయింది.
ఈ చిత్రంలోని సంగీతం ఎంతో సున్నితంగా ఉంటుంది. దాదాపు అయిదారుగురు (జీత్ గంగూలీ అండ్ టీమ్) ఈ విషయంలో కష్టపడ్డట్టు తెలుస్తోంది. దేవేంద్ర మరుడేశ్వర్ ఎడిటింగ్ ‘సీమ్‌లెస్’ ఎడిటింగ్‌లో ఓ చక్కని ఉదాహరణ. వరుణ్ మిత్ర నటన ఆకట్టుకుంది. రియా పిచ్చి పిచ్చి దుస్తులలో కూడా అందంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేసినట్లుంది గానీ ఒక రచయిత్రికి ఉండవలసిన కల్పనాశక్తికి పనికి వచ్చే భావప్రకటన ఎక్కడా లేదు. రచయితలు లేదా రచయిత్రులు డ్రింక్ తీసుకుంటూ సిగరెట్లు నోట్లో పెట్టుకుంటే చాలనుకుంటారు చాలామంది దర్శకులు.
రచనాశక్తి ఒక వ్యక్తికి స్వయంగానే ఊహకు అందని ఒక అంతర్లీనమైన అంతరంగికమైన శక్తి. బలహీనతగా కనిపించేది కాస్తా ఎప్పుడు ఉన్మాదంగా, విస్ఫోటనంగా మారుతుందో ఊహించడం కష్టం. రచయితలు అన్నింటినీ తిరస్కరించి కేవలం వారి విశిష్టమైన శుద్ధ చైతన్యంలోనూ జీవించగలరు, ఎందుకో ఒక్కోసారి అందరినీ కౌగిలించుకుని మీరందరూ కూడా నాలోనే ఉన్నారని నిరూపించి చూపించగలరు. భావ విన్యాసం, స్వరూపాల సారూప్యం కోసం జీవితాలలో ఎన్నో వదులుకుంటారు వీళ్ళు! మరో ప్రపంచాన్ని దర్శించటానికి తామరపువ్వు అక్కరలేదు, చిన్నారి మల్లెపూవు చాలు. రెండు పూలే! ఓ క్షణం చాలు ఓ అనుభూతికి – అందుకే ‘కభీ కభీ’లో ‘మైం హర్ ఎక్ పల్ కా షాయర్ హూం’ అంటాడు! ఇతివృత్తంలో ఎంతో పోలిక ఉన్నప్పటికీ ఒక కవిత్వపు కోణం పూర్తిగా లోపించిందనే చెప్పాలి ‘జిలేబి’ చిత్రంలో. ఒక రైలు ప్రయాణాన్ని ఎంచుకుని గతాన్ని ముందరకి తీసుకుని వచ్చే ప్రక్రియలో మంచి నేర్పరితనం చూపించారు దర్శకులు.
ఒక పర్యాయం ఈనాటి దర్శకులు ఇలాంటి నేపథ్యాన్ని ఎంచుకున్నప్పుడు ‘ద లాకెట్’ (జాన్ బ్రాహ్మ్, 1946), ‘పొసెస్డ్’ (కర్టిస్ బెర్న్‌హార్డ్, 1946) చిత్రాలు సరదాగా చూస్తే కొన్ని సాంకేతికపరమైన క్రొత్త ఆలోచనలు రాగలవు. ఫ్లాష్‌బాక్ అన్నది ఒక స్త్రీ మనోవేదనకు మూలస్తంభంగా ఎంచుకుని చూపిస్తే ‘ప్రయాణం’ ఒకలా ఉంటుంది. స్త్రీ ప్రధానంగా సాగే చిత్రాలలో ఆమె ఫ్లాష్‌బాక్ ఆమె స్వయంగా చెబుతున్నప్పుడు అదే కథ మరోలా కనిపిస్తుంది – హాలీవుడ్‌లో ఎక్కువగా జరిగిన ప్రయోగం ఇది.
మన దగ్గర కథానాయకుడు చెప్పటం చూస్తాం. కరుణ రసాన్ని పండించే ప్రయత్నం చేస్తాం. స్త్రీ ఇక్కడ ఇంకొకరి ‘దృష్టి కోణం’ గా ఎక్కువ కనిపిస్తుంది. ఒక రచయిత్రి విషయాన్ని సంఘటనల ద్వారా ఆవిష్కరిస్తోందా లేక కేవలం విషం మ్రింగి ఊరుకుంటున్నదా అన్నది కథని గొప్ప అంశంగా లేక తేలిపోయే మాటగా చూపిస్తుంది.
మారీన్ ట్యూరిమ్ రచించిన విశ్లేషణాత్మకమైన పుస్తకం ‘ఫ్లాష్‌బాక్స్ ఇన్ ఫిల్మ్: మెమొరీ అండ్ హిస్టరీ’ (1989) మనం ఎంచుకోవలసిన పద్ధతిని చాలా చక్కగా సూచిస్తుంది. ఫ్లాష్‌బాక్ లోని మనోవిజ్ఞానం తెర మీదకు అందంగా పాకినప్పుడు ‘ఇంటర్ టెక్స్ట్’ అనే ప్రక్రియ అందరినీ అలరించి కళాత్మకంగా మారుతుంది. అలా కాకుండా ఓ కవితో లేక ఓ పాటో పెట్టి ఇదిగో నేనూ అందించాను అన్నప్పుడు వేడిగా వడ్డించినా విరిగిపోయిన జిలేబి ముక్కలను తిని ఫరవాలేదు, తీయగానే ఉంది అని చెప్పాల్సి ఉంటుంది!