[dropcap]స[/dropcap]మ్మెట ఉమాదేవి రచించిన 15 కథల సంపుటి ‘జమ్మిపూలు’. ముందుమాట రాసిన నెల్లుట్ల రమాదేవి – “ఈ పుస్తకంలోని ప్రతి కథా అడవి పూలలాంటి స్వచ్ఛత, సరళత, పరిమళం కల్గి ఉన్నాయి. మట్టి మనుషుల జీవితాల్లోని దాపరికం లేని మనస్తత్వాలని మనముందు పరిచి కళ్ళను తడి చేస్తాయి ‘జమ్మిపూలు’ కథలు” అని కథల గురించి చెప్తారు.
“ఇందులోని ప్రతీ కథ ఒక్కొక్క ఆడకూతురి మనసులోని ఆవేదనను, ఒక పిల్లవాడు లేదా పిల్లదాని గుండెలలో దాగిన బాధ వెనుక వున్న నిజమయిన జీవితాల గురించి చెప్పిన కథలు. ప్రతీ కథా మామూలు కథల వెనుక ఉన్న అసలు కథను చెప్తుంది” అంటూ, ఆ అసలు కథను పట్టుకోగలగడంలోనే ఉమాదేవి ప్రత్యేక వ్యక్తిగా తనదైన గుర్తింపును మన ముందుకు తెచ్చారని, జమ్మిపూల సౌరభాలకు ముందుమాటలో వివరించారు వాడ్రేవు వీరలక్ష్మీ దేవి.
ఈ సంపుటిలో అధిక శాతం కథలు సామాన్య తెలుగు పాఠకుడికి పరిచయం లేని గిరిజన ప్రాంతాలలో సామాన్యుల జీవితాలను, వారి జీవితాలలోని సమస్యలను, ఆనందాలను, విషాదాలను అత్యంత సహజంగా, ప్రతిభావంతంగా ప్రదర్శిస్తాయి. కథల్లలో ప్రధానంగా కనిపించే లక్షణం – మొదలుపెట్టడం ఆలస్యం, కథ పూర్తయ్యేవరకు కదలనివ్వకపోవటం. కథ పూర్తవగానే మరో కథ చదవాలనిపించటం. ఈ రకంగా తనంతట తాను చదివించగలిగే లక్షణం ఉన్న కథల సంపుటి ఇది. ఒక్కో కథ మనకు తెలియని నూతన ప్రపంచ ద్వారాలు తెరుస్తుంది. కానీ తరచి చూస్తే ప్రతి వ్యక్తి నిత్యానుభవాలు కథలలో కనిపిస్తాయి. మానవ జీవితంలోని సార్వజనీనతను అత్యంత సున్నితంగా ప్రదర్శించిన కథలు ఇవి.
ఈ సంపుటి లోని కథలలో కొన్ని పాత్రలు విశిష్ట వ్యక్తిత్వంతో అలరారుతూ చదివిన తరువాత మన మనస్సులో నిలిచిపోతాయి. అలాంటి పాత్ర ‘ద్వాలి’ కథలో ‘ద్వాలి’. పాత్రను రచయిత్రి తీర్చిదిద్దిన తీరు ఒక అనుభవజ్ఞుడైన శిల్పి తన మనస్సుతో శిల్పాన్ని తీర్చిదిద్దినట్టుంటుంది. ఆరంభంలోనే “అయిదేళ్ళ క్రితం నువ్వు ఏ జెండా బట్టుకున్నావో అది ముఖ్యం కాదు… నువ్వు మంది కోసం చేమి చేసినవో గది కావాలె…” అనటం పాత్ర అవగాహనను సూచిస్తుంది. మరో అమ్మాయిపై మోజు పడ్డ భర్తను ఆ అమ్మాయికే వదిలేసి వేరు వస్తూ ఆమె అన్న మాటల లోతు అద్భుతం అనిపిస్తుంది. “ఆమె లేకుండా ఆయిన బతకలేడట. వెళ్ళి జర మంచిగా చూసుకొమ్మని చెప్పుండ్రి. ఆయిన బ్రతుకుల నా చీటీ నేనే చింపి పారేసిన అని చెప్పుండ్రి” అంటుంది. ఈ పరిణతి మహిళోద్ధారక ఫెమినిస్టులు సృష్టించే, పురుషుడిని ద్వేషించి, పురుగుల్లా చూసి, పురుషుడి నుండి పురుషుడికి ‘ఏదో’ వెతుక్కుంటూ వెళ్ళే విముక్తి పొందిన మహిళల్లో కన్ను పొడుచుకుని మెదడు చించుకుని చూసినా కనబడదు. ఈ పాత్రను చూస్తే అసలు ‘ఫెమినిస్టు’ అంటే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ముఖ్యంగా చివరలో ఆమె ఎన్నికలలో గెలిచిన తరువాత ‘ప్రాక్సీ’గా అధికారం చలాయించాలని చూస్తున్న మాజీ భర్తతో “నువ్వెవరో నీకు తెలుసు సరే! నేనెవరో కూడా నువ్వు జర గుర్తుంచుకోవాలె. ‘నేనూ’ ఈ ఊరి ప్రజలందరి బాగు చూసుకోవాల్సిన పంచాయితీ ప్రెసిడెంట్‌ని” అని, అతడి స్థానం అతడికి చూపించిన ‘ద్వాలి’లో కనబడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, పట్టణాలలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారిలో కూడా కనబడదు. అందుకే ఇవి ‘గిరిజనుల’ కథల్లా అనిపించినా, ఈ కథలలో సార్వజనీనత ఉంది. ఇలాంటి సమస్యలు, ఇలాంటి మనుషులు అడుగడుగునా మానవ సమాజంలో కనిపిస్తారు.
‘జమ్మిపూలు’ కథలో ‘వాల్యా’, ‘గంసీ’ కథలో ‘గంసీ’ పాత్ర, అమ్మ ప్రశాంత జీవితానికి అడ్దు రాకూడదనుకున్న ‘రెడపంగి కావేరి’; ‘బొడ్రాయి’ కథలో ‘కేవళ్యా’, ‘దశ్మి’ కథలో ‘దశ్మి’, ఇలా ప్రతీ కథలో ఓ మహిళ పాత్ర విశిష్ట వ్యక్తిత్వంతో అలరారుతూ ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా, మహిళలలో ఔన్నత్యానికి నిదర్శనంగా నిలుస్తారు. ఇలాంటి పాత్రలను సృజించిన రచయిత్రిని మించిన మహిళా పక్షపాతి గాని, ఫెమినిస్టు గాని మరొకరుండరు.
~ ~
ఈ సంపుటిలోని కథలలో రచయిత్రి అక్కడక్కడా లోకరీతిని తెలిపే వాక్యాలను వెదజల్లారు.
“ఆడి పిల్లల దగ్గర తీసుకోవడం… ఆడి పిల్లలకు అమర్చిపెట్టడం… ఇది ఈనాటి ముచ్చట కాదు కదా! ఈ ఒక్కటీ ఆగిననాడు బతుకులే మారిపోతయి.” (జమ్మిపూలు).
“గిప్పుడయితే నేను సస్తే అయ్యో! మా బాపు సచ్చిండు అని ఏడుస్తరు. నాగిట్ట బంగ్లాలుంటే మా బాపింక ఎప్పుడు సస్తడా? అని ఎప్పుడు పంచుకుందామా అని ఎదురుసూస్తరు.” (మనసు నిండింది).
“ఉపాధ్యాయ వృత్తిని ప్రేమించినవారే ఆ వృత్తిలో బాగా రాణించి పిల్లలకు సరైన న్యాయం చేస్తారు.” (ఊరి ఉమ్మడి సిరి).
“ఊరోళ్ళను కాపాడే గ్రామ దేవతరా బొడ్రాయి! పిచ్చివేషాలు ఏసిండ్రో! మా ఆడబిడ్డలను కాపాడ్తానికి పతీరాయీ బొడ్రాయే అవుతది జాగ్రత్త!” (బొడ్రాయి).
ఒక్కో కథను అత్యుత్తమ స్థాయిలో తీర్చిదిద్ది పఠిత మనసు విశాలమయి, లోకం, లోకంలోని మనుషులు, మనస్తత్వాలు అర్థమయ్యే రీతిలో సృజించిన కథలు ఇవి. సాహిత్యాభిమానులు తప్పనిసరిగా చదివి విశ్లేషించాల్సిన కథలివి
***
సమ్మెట ఉమాదేవి
ప్రచురణ: కవీర్ణ ప్రచురణలు
పేజీలు:154
వెల: ₹ 160/-
ప్రతులకు
సమ్మెట ఉమాదేవి
C/O శ్రీ బి.డి కృష్ణ,
ఇంటి నెంబర్ 3-2-353, సెకండ్ ఫ్లోర్,
స్వామి వివేకానంద స్ట్రీట్,
ఆర్ పి రోడ్, సికింద్రాబాద్-500003,
మొబైల్ నెంబర్:98494057
sammetaumadevi@gmail.com