Site icon Sanchika

జనన మరణాలు అశాశ్వతం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘జనన మరణాలు అశాశ్వతం’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్లో:
దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా।
తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి॥
(భగవద్గీత 2వ అధ్యాయం. 13వ శ్లోకం.)

[dropcap]ఓ[/dropcap] అర్జునా, ఏ విధంగా మన దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనము అనే వివిధ దశల గుండా సాగిపోతుందో, అదే విధముగా మరణ సమయంలో, జీవాత్మ మరియొక దేహము లోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు అన్నది పై శ్లోకం భావం.

వేదం ప్రకారం జననానికి పూర్వమూ ఉన్నాము మనం. మరణానంతరమూ ఉంటాము. లేనిది రాదెప్పుడూ – ఉన్నది పోదూ. మహా అయితే అవ్యక్తం వ్యక్తమయి కనిపిస్తున్నది. వ్యక్తమే మరలా అవ్యక్తమై పోతున్నది. ఆకాశంలో సూర్యమండల మిప్పుడు ప్రకాశిస్తున్నది. అది సాయంకాలమయ్యే సరికి అస్తమిస్తుంది. కంటికి కనపడకుండా పోతున్నది. అది మనం మరణమనుకొంటే ఎలాగా. మనకు కనిపించకున్నా మరొక దేశవాసులకు కనిపిస్తుంది. తెల్లవారితే మరలా మనకే దృగ్గోచరమవుతుంది. ఈ ప్రక్రియనే వ్యక్తా వ్యక్తం అని శాస్త్రం అంటోంది. ఒక జీవి జన్మించాడంటే అతడు అంతకుముందు  ఎక్కడా లేక అప్పటికప్పుడు ఆవిర్భవించాడని కాదు. అలాగే మరణించాడంటున్నామంటే ఎక్కడా లేకుండా సర్వనాశనమై పోతున్నాడని కాదు. అంతకు ముందు అసలే లేని ఆ జీవి ఎలా వచ్చాడు. ఉన్నాడప్పుడూ. అయితే అతి సూక్ష్మంగా ఉన్నాడు. అలాగే పోయాడంటే మరలా ఆ సూక్ష్మావస్ధలోనే ఉంటాడు. ఇదే తత్వాన్ని భగవంతుడు పై శ్లోకం రూపంలో చక్కగా వివరించాడు.

ఈ శ్లోకంలో, దేహ అంటే శరీరము, మరియు దేహి అంటే ‘దేహమును కలిగియున్నది’ అంటే జీవాత్మ. ఒక జీవితకాలం లోనే శరీరం నిరంతరంగా మారుతూ ఉండటంవలన ఆత్మ చాలా శరీరాలు మారినట్టే అని అర్జునుడికి వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు. అదే విధంగా, ఇది మరణం తరువాత ఇంకొక శరీరంలోనికి వెళుతుంది. ప్రాపంచిక పరిభాషలో మరణం అని మనం అనుకునేది, జీవాత్మ తన యొక్క పనిచేయని పాత శరీరాన్ని త్యజించడం మాత్రమే, మరియు పుట్టుక అని చెప్పుకునేది, జీవాత్మ కొత్త శరీరాన్ని ఇంకోచోట తీసుకోటమే. కర్మ చేయటానికి, ఫల మనుభవించటానికి జీవుడికి ఒక శరీరం అవసరం. కాబట్టి కర్మలను చేసేందుకు జీవుడు ఒక శరీరంలో ప్రవేశిస్తాడు. కర్మ ఫలాలను అనుభవించడానికి కొంత కాలమందులో జీవిస్తాడు. అనుభవం తీరగానే మరలా ఒక అనుభవం కోసం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళుతాడు.

మరణం మరియు పునర్జన్మ ప్రకృతి నియమం. పుట్టినవాడు చనిపోతాడు; మరియు మరణానంతరం, అతను మళ్లీ జన్మను పొందడం ఖాయం అని భగవద్గీత స్పష్టంగా చెబుతోంది. అయితే ఒక సద్గురువు సహాయంతో ప్రశాంత మనస్కులై, చిత్తశుద్ధితో సద్గురువుచే చెప్పబడిన ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా పునరావృతమయ్యే ఈ బాధాకరమైన కొనసాగింపు నుండి విముక్తి పొందవచ్చు అని కూడా పతంజలి యోగసూత్రాలు స్పష్టం చెస్తున్నాయి. యోగ మార్గంలో పరిపూర్ణులైన వారు – జ్ఞాన యోగ, కర్మ యోగ మరియు భక్తి యోగ ద్వారా – జనన మరణ చక్రం నుండి తప్పించుకుంటారు. అంటే వారు మళ్లీ జన్మించరు. పరిపూర్ణత స్థితిలో, వేరు భావన అదృశ్యమవుతుంది. జనన మరణ చక్రం నుండి విముక్తుడవుతాడు. మరోవైపు, యోగాలో పరిపూర్ణత లేని వారు మళ్లీ మళ్లీ పుడతారు. ప్రతి జీవిలో ఒక ఆత్మ ఉందని మరియు అది జనన-మరణ-పునర్జన్మ చక్రం గుండా వెళుతుందని మరియు చివరికి విశ్వంతో (పూర్ణ పరబ్రహ్మం) కలిసిపోతుందని యోగశాస్త్రం చెబుతోంది. మృత్యువు తన సమయం వచ్చినప్పుడు వస్తువు ప్రపంచంలోని ప్రతిదానిని తాకి నాశనం చేస్తుంది. అయితే, అది అమరత్వం మరియు నాశనం చేయలేని ఆత్మను తాకదు. మరణం భౌతిక శరీరానికి మాత్రమే ఉంటుంది. ఆత్మ చెక్కుచెదరకుండా ఉంటుంది మరియు మళ్లీ జన్మ తీసుకోవడానికి శరీరం నుండి తప్పించుకుంటుంది. శరీరం శిధిలమయ్యాక ఆ శరీరాన్ని విసర్జించి, ఆ జన్మలో చేసిన సంచిత, ప్రారబ్ద కర్మలను అనుభవించడానికి తిరిగి మరొక అనువైన శరీరాన్ని ఆశ్రయిస్తుంది.

అయితే మానవుల ఆలోచనా పద్ధతి అతనికి మరణం అంటే భయం ఏర్పడేలా అవుతోంది. మానవుడు బాల్యము పోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించడం లేదు. అట్లే యౌవనము పోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించడం లేదు. కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, భయానికి గురవుతూ ఉంటాడు. మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటం వల్ల భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని, బంధాన్ని అతిగా పెంచుకోవటం వల్ల తాను ప్రేమిస్తున్నవి తాను అనుభవిస్తున్నవి సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే మరణంపై భయాన్ని కలుగచేస్తుంది.

తన వందేళ్ళ ప్రస్థానంలో అనునిత్యం ఇన్ని మరణాలు చూసినా మనిషికి ఈ మృత్యు భయం వీడకపోవటానికి కారణం ‘మోహం’.  మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు, ధర్మరాజుని ప్రపంచంలో అన్నిటినీమించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటని అడుగుతాడు! అందుకు ధర్మరాజు ప్రాణులు ప్రతి రోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవటమే ఆశ్చర్యమని చెబుతాడు. జనన మరణాలు అశాశ్వతమని గుర్తించి, తాను బ్రతికి వున్న ప్రతీ క్షణం ఎంతో విలువైనదని అర్థం చేసుకుంటూ అనుక్షణం మంచి నడవడికి, సత్ప్రవర్తనలు కలిగి వుంటూ అతి విలువైన ఈ మానవ జన్మకు సార్థకత చేకూర్చుకోవడమే మన ప్రథమ కర్తవ్యం.

Exit mobile version