జననీ జన్మభూమి

0
2

[త్వరలో సంచిక ప్రచురించనున్న ‘సైనిక కథలు’ సంకలనం కోసం డా. మహ్మద్ షరీఫ్ పంపిన కథ. కొత్తగా రాసి పంపిన కథలు ముందు సంచికలో ప్రచురితమవుతాయి. ప్రతిపాదిత సంకలనంలో, ఇప్పటికే ప్రచురితమైన కథలతో బాటు, సంపాదకుల ఎంచుకున్న ప్రమాణాల ప్రకారం కొత్తగా రాసి పంపిన కథల్లోంచి కొన్ని స్వీకరించబడతాయి.]

[dropcap]డాం![/dropcap] డాం! మంటూ తుపాకుల మోత ఇరువైపుల నుండి వినిపిస్తూనే వుంది. నిన్న సాయంత్రం మొదలైన బుల్లెట్ల హోరు ఈ రోజు మధ్యాహ్నము వరకు నిర్విఘ్నంగా కొనసాగుతూనే వుంది.

ఉగ్రవాదులు వెనక్కి తగ్గడం లేదు

సైనికులు వెనుదీయని ధైర్యంతో – ఉగ్రవాదులున్న పాఠశాల భవనాన్ని చుట్టుముట్టి, వారు పారిపోకుండా రాత్రంతా కాల్పులు జరుపుతూ లొంగిపోవాలని హెచ్చరికలు చేస్తున్నారు.

పాఠశాలలో సుమారు ఎనమిది వందల పైచిలుకు విద్యార్థులు ఉన్నారు. సైనికులు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, ఉగ్రవాదులను, కవ్విస్తూ, బెదిరిస్తూ, హెచ్చరిస్తూ గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు.

చిన్న పొరపాటు జరిగినా విద్యార్థుల ప్రాణానికి ప్రమాదమని సైనికులను ముందుకు నడుపుతూ, ప్రత్యేకమైన సూచనలు చేస్తూ ఉగ్రవాదులను లొంగిపొమ్మని హెచ్చరిస్తున్నాడు లెఫ్టినెంట్ కల్నల్ ‘రఘు’. ఆయన సూచనలు పాటిస్తూ విద్యార్థులకు హాని జరగకుండా నిన్నటి నుండి ఓపికతో ఉగ్రవాదులను భయపెడుతూ, గాలిలోకి కాల్పులు జరుపుతు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు సైనికులు.

చివరకు ఉగ్రవాదులు లాభం లేదనుకొని పాఠశాల నుండి ఉపాధ్యాయుని ద్వారా సమాచారం అందించారు. విద్యార్థులందరినీ విడిచి పెడతామని, ఆ ప్రాంత రాజకీయ నాయకుని కొడుకును తమతో తీసుకొని వెళతామని చెప్పారు. సరేనని రఘు విద్యార్థులందరిని క్షేమంగా విడిపించాడు. రాజకీయ నాయకుని కుమారున్ని విడవాలంటే, అమర్నాథ్ యాత్ర సందర్భంగా సైన్యానికి పట్టుబడ్డ తమ నాయకున్ని, అతని ఇద్దరు అనుచరులను విడవాలని ఉగ్రవాదులు డిమాండ్ చేసారు.

పై అధికారులతో చెప్పి, రాజకీయ నాయకులతో చర్చించి పరిషారమార్గం కొరకు ప్రయత్నిస్తానని వారికి మాట ఇచ్చాడు రఘు.

***

అమరనాథ్ యాత్రను భగ్నం చేయాలని ఉగ్రవాదులు దాడికి సిద్ధపడుతున్నారని ఇంటిలిజెన్స్ రిపోర్టు రాగానే యువకుడు, ధైర్యశాలి, దేశభక్త పరాయణుడైన రఘుకు ఈ బాధ్యతను అప్పగించారు రక్షణశాఖ అధికారులు. ఇది అత్యంత ప్రమాదకరం అయినప్పటి యాత్రికులకు ఎలాంటి ప్రాణనష్టం కలుగకుండా వారిలో భయం అనే భావన రానీయకుండా, యాత్రికులతో కలిసి తన జట్టును ఒక ప్రత్యేకమైన బస్సులో తీసుకువెళ్ళి ఉగ్రవాదులు పెట్టిన ల్యాండ్‌మైన్స్ జాగ్రత్తగా తొలగించాడు రఘు.

మూకుమ్మడిగా దాడి చేయడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులతో యాత్రికుల వలె నున్న తమ గ్రూపు సైనికులు పోరాడి కొందరిని చంపేశారు. పారిపోతున్న ముగ్గురిని ప్రాణాలతో పట్టుకోవడం జరిగింది. దొరికి పోయినవాడు కమాండర్ ర్యాంకు గలవాడు కాబట్టి వాడిని విడిపించుకొనుటకు ప్రయివేటు పాఠశాలను దిగ్బంధం చేశారు. ఉగ్రవాదుల షరతు ప్రకారం జైల్లో వున్న ముగ్గురు ఉగ్రవాదులను విడిపించుకొని వచ్చి స్థానిక నాయకుని కుమారున్ని విడిపించాలి. పాఠశాలలో ఉన్న ఉగ్రవాదులకు జైల్లో ఉన్న ముగ్గురుని అప్పగించాలి. వారందరిని ఒక ట్రక్కులో బార్డర్ దాటించాలి. ఈ ఏర్పాట్లన్నీ వెంటనే జరగాలి.

ఉగ్రవాదులందరిని ఒక ట్రక్కులో తీసుకొని పోయారు. బార్డర్ దగ్గరకు వెళ్ళగానే ట్రక్కు డ్రైవర్ అందులోనుండి దూకేసి ట్రక్కులో ముందే బిగించిన బాంబును పేల్చివేశాడు. ఇది దేశ, విదేశాలలోని పత్రికలలో ప్రధాన వార్త వచ్చింది. లెఫ్టినెంట్ కల్నల్ రఘు ధైర్యానికి, ముందుచూపుకు దేశవాసులందరు ప్రశంసించారు. రఘుకు ఆ యేడు స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని చేతుల మీదుగా ‘శౌర్యచక్ర’ పతకం లభించిందింది. రఘు గొప్పతనం గురించి అన్ని పత్రికలలో ప్రధానంగా వ్రాయడం వలన దేశంలోని ప్రతివానికి అతని వివరాలు తెలుసుకోవాలని ఆలోచన కలిగింది.

అంతలోనే దంతెవాడ ప్రాంతంలో నక్సలైట్లు సైనికుల వాహనాన్ని టార్గెట్ చేస్తు పెట్టిన మందుపాతర పేలడంతో చాలమంది సైనికుల శరీరాలు చిన్నాభిన్నమయి, బస్సు లోయలో పడడం వల్ల ఏబదిమంది అమరులు కావడం జరిగింది. ఈ వార్ణ దేశవాసుల గుండెలను మండించింది. నక్సలైట్లను కట్టడి చేయాలని రక్షణశాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా భావించి దీనికి సరియైనవాడు ‘రఘు’ అని, అతనికి పూర్తిగా స్వేచ్ఛనిస్తూ ఈ ఆపరేషన్ అప్పగించారు.

ఆ విషయం తెలియగానే విలేఖరులు, రఘును చుట్టుముట్టి అతని వివరాలు తెలుసుకోవడానికి ప్రశ్నలు చేయసాగారు. ఇంత పెద్ద ఆపరేషన్ ఎలా పూర్తి చేస్తారని, ఇంత ధైర్యం ఎలా వచ్చిందని విలేఖరులు ప్రశ్నించగా, పుట్టుక నాది, చావు నాది జీవితమంతా దేశానిది అన్న జయప్రకాశ్ నారాయణ్ గారి మాటలను గుర్తుచేస్తాడు.

“ఇంతటి తెగింపు మీకు ఎందుకు వచ్చింది? ఇది దేశభక్తియా, లేకుంటే పేరు ప్రతిష్ఠలు రావాలనీ, దేశమంతా మీ పేరు మ్రోగాలనా?” అంటూ గ్రుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారు విలేఖరులు.

“దేశరక్షణ, దేశప్రజల రక్షణ, ధర్మరక్షణ, సమసమాజ రక్షణ నా ద్యేయం. అందుకే నాకు అంతటి దైర్యం తెగింపు, అవి చిన్నప్పటి నుండి నా జీవితం ప్రయాణించిన విలువల వల్ల, మజిలీల వల్ల వచ్చింది” అని చెపుతూ ఉంటే అతని ముఖం గంభీరంగా మారింది.

“సార్ మీ చిన్ననాటి జీవన అనుభవాలు, దేశసేవకై మీప్రయాణం ఎలా మొదలయ్యిందో చెప్పండి” అని పట్టుబట్టారు విలేఖరులు.

***

“మాది ఒక చిన్న పల్లెటూరు. మా తండ్రి రైతు. అంతేకాకుండా గ్రామంలో వయోజనులకు విద్య గరిపే పంతులు అని అందరిచే పిలవబడేవాడు.

మా తాతకు ఉన్న ఆరెకరాల భూమిలో మాకు మూడు, మా చిన్నాయనకు శేషుకు మూడు ఎకరాలు రావడం జరిగింది. మా నాన్న వ్యవసాయం స్వంతంగా చేయకుండా భూమిని కౌలుకు ఇచ్చాడు. నాన్న ఒక పెద్ద సేటు వద్ద ‘మునీము’గా పనిచేసేవారు. నేను ఒక్కన్నే కొడుకును కాబట్టి చదివించేవాడు. మా చిన్నాన్న శేషు తన కొడుకులను వ్యవసాయంలో పెట్టాడు. మా భూమి సారవంతమైంది కాబట్టి అన్ని పంటలు పండేవి. మా భూమిని తనకి అమ్మేయమని చిన్నాన్న శేషు తరచుగా నాన్నతో అనేవాడు.

‘మగపిల్లవాడు ఉన్నాడు. రేపు వాని గతి ఏమవుతుందో, ఉన్న మూడెకరాలు అమ్మితే వానికి ఉద్యోగం రాకపోతే? కనీసం కౌలుకు ఇచ్చైనా బ్రతుకుతాడు. నేను అమ్మను’ అనేవాడు నాన్న. అది మనసులో పెట్టుకొని మా భూమిని కౌలు చేసేవారిని బెదిరించేవాడు చిన్నాన్న.

అప్పుడప్పుడే ఊర్లో నక్సలైట్లు రావడం మొదలు పెట్టారు. వారు రాగానే గ్రామంలో కల్లు అమ్మేవారిని భయభ్రాంతులకు గురిచేసి, ఊరందరి నచ్చేటట్టు చేశారు. అలా ఊర్లో చిన్న చిన్న తగాదాలు, కొట్లాటలను తీర్చుచు ఊర్లో అందరూ తమ మాటే వినాలని ఆజ్ఞాపించడం మొదలుపెట్టారు.

మా నాన్న చదువుకున్నవాడు కాబట్టి, ‘మీరు సమాజానికి మేలు చేయాలంటే తగవుపడే వారు ఇద్దరు చెప్పింది విని న్యాయం చేయండి.. ఒక్కనిదే విని రెండవ వాన్ని దండించడం బాగాలేదు’ అని బాహాటంగా వ్యతిరేకించాడు. అంతే కాకుండా గ్రామాలలో తిరుగుతు భయపెట్టి డబ్బులు వసూలు చేయడం, ఆడవారిని లోబర్చుకోవడం, ఎదురు మాట్లాడిన వాళ్ళ చేతులు, కాళ్లు నరకడం వల్ల నక్సలెట్లు అంటేనే అందరికి ఒక రకమైన భయం ఏర్పడింది. స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే అదనుగా తీసుకొని పోలీసులు స్థానికులను ఇన్ఫార్మర్లగా నియమించుకున్నారు. అన్నలను పట్టుకోవడం, ఎన్‌కౌంటర్లు చేయడం వల్ల నక్సలైట్లకు పోటీగా ఇన్ఫార్మర్లను నియమించారు. వారి ఆచూకీ తెలియగానే చంపడం మామూలుగా మారింది.

దీనిని అదనుగా తీసుకొని మా చిన్నాన్న శేషు నక్సలైట్లను కలిసి – మా నాన్న ఇన్ఫార్మర్‌గా మారి పోలీసులకు సమాచారం ఇస్తున్నాడని అబద్ధాలు కల్పించి నక్సలెట్లకు చెప్పడం జరిగింది. నాన్నను చంపాలని అర్ధరాత్రి ఇంటి తలుపు తట్టి కిడ్నాప్ చేయడానికి వస్తే – ‘నేను ఇన్ఫార్మర్‍ని కాను. ఊరందరిని నడి ఊరిలో కూర్చోబెట్టి నా గురించి అడగండి, ఒక్కడైనా నేను అలాంటి వాన్ని అని అంటే నేనే మీ తుపాకితో ఆత్మహత్య చేసుకుంటా! అంతేగాని ఈ రాతిరి మీతో వస్తే ఏ అడవిలోకి నన్ను తీసుకొని వెళ్ళి నన్ను శిక్షించడమో చంపడమో చేస్తే, నేను ఇన్నిరోజులు సంపాదించిన మంచి పేరు పోతుంది. తల ఎత్తుకొని తిరగలేను’ అన్నాడు.

వారు సరే అని ఆ రాతిరి విడిచిపెట్టారు. ‘రేపు మధ్యాహ్నం నడి ఊరిలో అందరి ముందు నీవు ఇన్ఫార్మర్ అని మేము రుజువు చేస్తాం. మేము పిలవగానే రేపు రావాలి’ అని వెళ్ళిపోయారు.

ఆ రాత్రి మా అమ్మ నాన్న ఏడుస్తూ గడిపారు. నాన్న ఎవరై ఉంటారని తన గురించి అబద్ధం ఎందుకు చెప్పారని ఆలోచిస్తూ మేల్కోనే ఉన్నాడు. కోడి కూసే సమయానికి మా భూమి కౌలు చేసే రైతు వచ్చి, ‘నీ మీద లేనిపోని అబద్ధాలు వేసి మీ తమ్ముడు నిన్ను చంపించే కుట్ర చేస్తున్నాడు. రేపు ఊరందరి ముందు కూడా అతడే సాక్ష్యం చెపుతాడు. నేను ఈ విషయం చెప్పానని ఎవరితో చెప్పవద్దు. రాత్రి నక్సలైట్లను మీ ఇంటికి తెచ్చి మీ తమ్ముడు చీకట్లో చాలా దూరంలో నిలబడి వున్నాడు. నేను అదే సమయంలో అటుగా వెళ్తూ గమనించి, అనుమానం వచ్చి వారి వెనకే వెళ్ళాను. మీ భూమిని స్వంతం చేసుకోవడానికే మీ తమ్ముడు ఇదంతా చేస్తున్నాడు’ అని చెప్పాడు.

‘అన్నలు చెప్పుడు మాటలు విని చాల మందిని చంపేసిండ్రు, ఈ భూమి వద్దు, ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామ’ని అమ్మ ఒకటే ఏడుపు. ఊరు నిద్ర నుండి లేవక ముందే మేము ఊరు విడిచి పట్నం చేరాము. అదే పట్టుదలతో నాన్న నన్ను పోలీసును చేయాలని చదివించాడు. అమ్మనాన్నలు కూరగాయల మార్కెట్లో ఒక దుకాణం అద్దెకు తీసుకొని కూరగాయల వ్యాపారం చేస్తూ నన్ను బాగా చదివించారు. పరీక్షలో ప్రథముడిగా ఉత్తీర్ణుడనై, ఇంటర్వ్యూకు కూడా వెళ్ళడమైంది, కాని వాళ్ళు అడిగే రెండు లక్షల లంచం నాన్న ఇవ్వలేక పోయాడు. అంతలోనే మిలటరి (ఎస్.ఎస్.బీ) పరీక్షలు బాగా వ్రాసి పాస్ అయినాను. మిలటరీలో ఈ స్థాయికి ఎదిగాను. చిన్నప్పటి నుండి మా ఊరన్నా, ప్రజలన్నా, సేవాభావం చూపించే నాన్నను చూసి, నేను దేశానికి ప్రజలకు సేవ చేయాలని అనుకునేవాన్ని. కాని అంత ఇష్టపడే ఊరి ప్రజలను విడిచిపెట్టి వచ్చే పరిస్థితులు రావడం వల్ల నాన్న మానసింగా ఎప్పుడు బాధపడుతుండేవాడు.

అతని కోరిక ఒకటే. చివరి రోజుల్లో, ఊరి ప్రజలతో కలిసిమెలిసి వుండి మాట్లాడుతూ, ఆ గడ్డ మీదనే ప్రాణం పోవాలి. ‘ఆ ఊరి మట్టిలోనే నేను కలవాలని కోరికగా ఉంది. నాకు మాట ఇవ్వరా’ అని వాపోయేవాడు.

ఇప్పుడా సమయం వచ్చింది. నాన్న కోరిక తీరుస్తాను” అని నిట్టార్చాడు రఘు.

“అంటే ఏం చేయాలని మీ ఆలోచన?” అని ఒక విలేఖరి ప్రశ్నించాడు.

“నాకు అందిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటాను. సంఘంలోని సమస్యలను చక్కదిద్ది, అవినీతి మూలాలను అంతం చేసి, నక్సలైట్ల అవసరం సమాజనికి లేదని నిరూపించడానికి ప్రయత్నిస్తాను” అంటూ రఘు అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here