[dropcap]ప్ర[/dropcap]తి సంస్థ ఉన్నత ఆశయంతో, ఉత్తమ లక్ష్య సాధనతో, భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథంతో ఆవిర్భవిస్తుంది. కానీ కాలక్రమేణా, సంస్థ నిర్వహణలో సాధకబాధకాలు భరించలేక, నిర్వాహకుల అహంకారాల పోరాటాల వల్ల ప్రజలలో ఆదరణ తగ్గటం వల్ల, నిధుల కొరత వల్ల ఇలా కారాణాలేవయినా కొద్ది కాలానికి సంస్థలు అదృశ్యమవుతాయి. అలా కాక ఒక సంస్థ 25 ఏళ్ళుగా అవిశ్రాంతంగా సాహిత్యం కోసం కృషి చేస్తూ, అందరి మన్ననలను అందుకుంటున్నదంటే, ఆ సంస్థ నిర్వాహకులకు సాహిత్యాభిమానం తప్ప అహం లేదని, అన్ని ఒడిదుడుకులను తట్టుకుని ముందుకు సాగే అకుంఠిత దీక్ష ఉన్నదని, లక్ష్య సాధన తప్ప మరో వైపు దృష్టి లేదని స్పష్టమవుతుంది. అలా తనని తాను నిరూపించుకుంటూ, కాలంతో సంబంధం లేకుండా సాహిత్య సేవ చేస్తూ ముందుకు సాగుతూ 25 ఏళ్లుగా చెన్నైలో తెలుసు సాహిత్యానికి పర్యాయ పదంగా నిలుస్తున్న సాహిత్య సంస్థ ‘జనని’.
ఆ సంస్థ ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వెలువరించిన రజతోత్సవ సంచిక ‘జనని’. 1993లో చెన్నయ్య ఆలోచన కార్యరూపం దాల్చటంలో చేతులు కలిపిన యు.ఎస్.ఆర్. ప్రసాద్, యు. సూర్యకుమారి, కందిమళ్ళ వెంకటేశ్వరులు, నళినీ ప్రసాద్ వంటి వారి సాహిత్యాభిమాన ఫలితంగా ‘జనని’ రూపుదిద్దుకుంది. తెలుగు జాతికి తమ వంతు సేవలు, తెలుగు భాషని సజీవంగా నిలపటానికి తమ వంతు బాధ్యతను నెరవేర్చటం కోసం ఏర్పాటయిన ఈ సంస్థ గత 25 ఏళ్ళుగా అవిశ్రాంత సాహిత్య సేవ సాగిస్తోందనటానికి నిదర్శనం ఈ రజతోత్సవ సంచిక.
ఇందులో 43 అత్యంత ప్రామాణికమైన సాహిత్య వ్యాసాలు ఉన్నాయి. భువనచంద్ర, డా. టి. రంగస్వామి, దివాకర్ల రాజేశ్వరి, తుర్లపాటి రాజేశ్వరి, నిర్మల పళనివేలు, ప్రొ. వెలమల సిమ్మన్న, ఆర్. అనంతపద్మనాభరావు, తిరుమల నీరజ, ఆముక్తమాల్యద, చలపాక ప్రకాశ్ వంటి లబ్ధప్రతిష్ఠుల సాహిత్య వ్యాసాలతో ‘జనని’ సాహిత్య సరస్వతి పాదాలకు అర్పించిన సాహిత్య పూలమాల లాంటిది ఈ రజతోత్సవ సంచిక.
జనని అభిమానులే కాదు, తెలుగు సాహిత్యం పట్ల మక్కువ కలవారందరూ తప్పనిసరిగా కొని దాచుకోవలసిన పుస్తకం ఇది.
***
జనని రజతోత్సవ సంచిక
సంపాదకత్వం: డా. ఉప్పలధడియం వేంకటేశ్వర
పేజీలు: xii+ 440
వెల: ₹ 400/-
ప్రతులకు:
శ్రీ గుడిమెట్ల చెన్నయ్య,
ప్రధాన కార్యదర్శి,
జనని (సాంఘిక, సాంస్కృతిక సమితి),
13/53, రెండవవీధి,
వాసుకి నగర్, కొడుంగైయూర్,
చెన్నై 600118
ఫోన్: 9790783377