[dropcap]జ[/dropcap]నారణ్యాలన్నీ నిర్మానుష్యమై
నిశ్శబ్ద నిశీధిని తలపిస్తున్నాయి
కంటికి కనిపించని శత్రువు
ఆకస్మికంగా దాడిచేస్తుందనే భయంతో
నాలుగు గోడల నడుమ
తనను తానే బంధించుకున్న విచిత్రమైన దుస్థితి
ప్రకృతిని చెరబట్టిన నీచమానవుని దురహంకారానికి
ప్రకృతిమాత ఆగ్రహించిన వైనం
విశ్వమానవుడు భీతితో బిక్కుబిక్కుమంటూ
బహుభారంగా చీకటి జీవితాన్ని ఆస్వాదిస్తోంటే
అనాగరిక అడవి బిడ్డలు
మూగజీవాలు,క్రూరమృగాలు,సాధుజంతువులు, పశుపక్ష్యాదులు
నగర జీవనాన్నినిర్భయంగా…ఆనందంగా
ఆస్వాదిస్తోన్న కమనీయ దృశ్యం!
ఓ మనిషీ!
ఇకనైనా నువ్వు మనిషిగా జీవించకు
ప్రకృతిని ప్రేమిస్తూ
ప్రకృతిని ఆరాధిస్తూ
మృగంలా జీవించు!
మానవజాతిని మేలు గొల్పుతూ
మృగసంతతి నగరవీధులలో నడయాడుతోన్న అద్భుత దృశ్యం!
ఆధునిక మానవుడికి కనువిందు చేస్తూ
కనువిప్పు కలిగిస్తోన్న సుమనోహర చలనచిత్రమే కదా!