Site icon Sanchika

జనవరి పదహారు

[ప్రముఖ జర్మన్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా రచించిన ‘January Sixteenth’ అనే కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Franz Kafka’s poem ‘January Sixteenth’ by Mrs. Geetanjali.]

~

[dropcap]ఒ[/dropcap]హ్హ్.. జనవరి పదహారు!
మీకు తెలుసా.. పోయిన వారం అంతా
ఎంత వ్యాకులపాటుతో అస్తవ్యస్తంగా గడిచిందని?
నిదుర పట్టనే లేదు
పట్టినా.. మెలకువ రావడం అసాధ్యంగా ఉండేది.
జీవితానందాన్ని అనుభవించడమే కష్టంగా మారింది.
మరీ ముఖ్యంగా వారసత్వంగా అమరిన సౌకర్యవంతమైన జీవితం!
గడియారం అస్సలు ఒప్పుకునేది కాదు.
నా లోలోపల ఏముందో.. దెయ్యమో.. రాక్షసో..
లేదా.. ఏదో ఒక అమానవీయతో కదులుతూ.. కెలికేస్తూ..
ఉహూ.. గడియారం ఒప్పునేదే కాదు!
ఇక చుట్టూ ఉన్న బయటి ప్రపంచం ఎప్పటిలా
పొరపాట్లు చేయిస్తూనే ఉంటుంది కదా!
రెండు ప్రపంచాలు విడిపోయి.. విరిగిపోతే..
భయంకరమైన పద్ధతిలో.. చెరో ముక్కలై పోయి..
అచ్చంగా నా నుంచి నన్ను విడదీయడానికి,
నాకు బలవంతాన ఆపాదించబడ్డ ఒంటరితనంలా
ఇక ఇప్పుడు సమానమై.. ఒక.. ముగింపుకి వచ్చాయేమో?
అయితే ఇలాంటివన్నీ చివరాఖరుకి
ఒక పిచ్చితనం లోకి దారి తీస్తాయేమో?
వేరే ఏముందిక మీకు చెప్పడానికి!
దీని గురించిన వేట ఒకటి ఎప్పుడూ నిరంతరాయంగా
నాలోపల జరుగుతూనే ఉంటుంది.
నన్ను రెండుగా చీల్చిపడేస్తుంది..
లేదా.. ఈ వేటతో నేనూ కొట్టుకు పోతూనే ఉంటాను..
ఎక్కడికి వెళ్ళాలి మరి?
వేట ఒక దృశ్యం మాత్రమే..
బహుశా.. వేట అనడం కంటే ఎక్కడికో ఎవరి చేతనో
ఈ భూమి చిట్ట చివరి సరిహద్దు వైపుకి
విసిరి వేయబడుతుంటాననడం సరైందేమో?
నన్నెవరైనా వేటాడుతున్నారేమో.. ఏమో..?
ఏమంటారు?

~

మూలం: ఫ్రాంజ్ కాఫ్కా

అనుసృజన: గీతాంజలి


ఇరవయ్యవ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన రచయితలలో జర్మనీకి చెందిన ఫ్రాంజ్ కాఫ్కా (3 జూలై 1883 – 3 జూన్ 1924) ఒకరు. ఆయన అనేక నవలలు, కథలు రాశారు. ఎందరో రచయితలని ప్రభావితం చేశారు. ఆధునిక సాహిత్యానికి ఒక నూతన ఒరవడిని అందించారు. మెటామార్ఫసిస్ వీరి ప్రసిద్ధ రచన.

Exit mobile version