Site icon Sanchika

జానేదేవ్-10

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 10వ భాగం. [/box]

[dropcap]గు[/dropcap]డి ముందు మోటారు బైక్ ఆగింది… స్టాండ్ వేసి అనసూయ కోసం అటు ఇటు చూసాడు…

ఫోనులో చెప్పిన పోలికలతో ఒకావిడ కనిపించింది.

దగ్గరగా వెళ్లి “నమస్కారమండి… నేను….” అని ఒక్క నిమిషం… కంగారుపడి…. “జాన్‌ని…. శివ ఫెండ్‌ని” అన్నాడు.

క్రింద నుండి పైకి ఎగాదిగా చూసి కనుబొమలు చిట్లించి “నువ్వు” అంది.

“నేనండీ!…. జాన్‌ని…. శివ ఫ్రెండ్‌ని….”

ఇంకా అనసూయ కనుబొమలు చిట్లించే ఉన్నాయి.

ఏమిటీవిడ?…. ఏంటి…. ఏమీ మాట్లాడడం లేదు… అనుకున్నాడు.

“నువ్వు….” అని అనసూయ అనగానే

“జాన్‌‌నండీ…” అన్నాడు గభాలున వాసుదేవ్….

“ఉండు… బాబు…. నన్ను కన్‌ఫ్యూజ్ చేయకు. ఇప్పుడే క్లారిటీ వస్తుంది… నువ్వు…. ఆ మధ్యన టి.విలో…. ఆ…. గుర్తు వచ్చింది…. ప్రాణాలకు తెగించి అమ్మయిలను కాపాడావని నిన్ను పొగుడుతూ అన్ని చానల్స్‌లో వారంరోజుల పాటు న్యూస్ చూపించారు. ఒక్క టి.వి…. ఏమిటి అన్ని పేపర్లలలో నీ గురించి చాలా గొప్పగా వ్రాసారు… నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది బాబూ” అంది సంతోషంగా అనసూయ.

షాకైయ్యాడు వాసుదేవ్!…

“అవును…. నువ్వేంటి…. జాన్‌ని అంటున్నావు…. నువ్వు జాన్‌వి ఎలా అవుతావు…. నీ పేరు చాలా చక్కటి పేరు. గుర్తు రావడం లేదు. ఒక్క నిమిషం…. గుర్తు తెచ్చుకుంటాను…” అంది.

గభాలున అన్నాడు….

“ఆ శ్రమ మీకు అక్కరలేదండి… నా పేరు వాసుదేవ్. నేను జాన్‌ని కాదు…. కాసేపు అలా కూర్చోండి… ఏ విషయం దాచకుండా మొత్తం చెబుతాను. నేను చెప్పింది విన్నాక, నేను కేవలం మా నాన్నగారి కోసమే ఇలా చేస్తున్నాను అనుకుంటారు ఏమో. అలా చేయాలనుకుంటే వేరే ప్లాన్ వేసేవాడిని ఏమో. మీవారు ఆఫీసులో ఎంతోమంది సిన్సియర్ ఆఫీసర్లని వేపుకు తింటున్నారు. వాళ్ల హార్డ్ వర్క్‌ని గుర్తించకుండా, కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు బేడ్‌గా వ్రాస్తాడు… కారణం ఏమిటో తెలుసాండీ…. అతను కోరిన పార్టీలకు, పబ్‌లకు తీసుకువెళ్లలేదని… అతను కోరినట్లు నడుచుకోలేదని… ఇక లేడీస్ పరిస్థితి అయితే దారుణం…. అతని కన్ను పడిన వాళ్ల పట్ల పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తిస్తాడు… వాళ్లని బెదిరించి…. లొంగదీసుకోవాలని చూస్తాడు…. ధైర్యంగా ఎదురు తిరిగి బుద్ది చెప్పిన వాళ్లు ఉన్నారు…. మానసికంగా కృంగిపోతున్న వాళ్లు ఉన్నారు… ఈ విషయాలన్నీ సైదులు ఎంతో బాధపడి చెప్పాడు…. అమ్మగారు దేవత… ఆవిడకి సార్ చాలా అన్యాయం చేస్తున్నారు అన్నాడు…. ఇంతమందిని బాధపెడుతున్న అతనికి…. బుద్ది చెప్పాలనిపించిందండి… నేను ఒక్కడినే కన్నా…. మీరు కూడా ఉంటే… ఇక జీవితంలో తప్పనేది చేయడేమోనని అనిపించింది… క్షమించండి” అన్నాడు వాసుదేవ్.

గభాలున వాసుదేవ్ రెండు చేతులు పట్టుకొని “నిన్ను క్షమించడం ఏమిటి బాబూ… అసలు నన్నడిగితే నీలాంటి వాడే…. ఆ దుర్మార్గుడికి బుద్ది చెప్పగలడు… చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు… అనకొండలా తయారయ్యాడు… అతనికి కరక్టుగా నువ్వే గడ్డిపెట్టాలి… ఒక ప్రక్క నా భర్త ఇంత దుర్మార్గుడని తెలిసి బాధగా ఉన్నా మరో ప్రక్క… నీలాంటి మంచి కుర్రాడితో పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది బాబూ… నువ్వు ఏం చేయమంటే… అది చేస్తాను…. అతనికి బుద్ది వచ్చి కుక్కిన పేనులా ఉంటే సరే… లేదంటే… నా కుతురు, అల్లుడి దగ్గరకు వెళ్లిపోతాను…. నీలాంటి మంచి పనులు చేసే వాళ్లకి నా వంతు సహాయం చేస్తాను… ఎలాగో ఒక లాగ బ్రతుకుతాను కాని ఆ మనిషి నీడలో ఉండను…” అని అనసూయ చెబుతుండగానే…. వాసుదేవ్ సెల్ రింగ్ అయింది.

సైదులు చెప్పింది విని షాకయ్యాడు వాసుదేవ్.

“ఏం జరిగింది బాబూ…” అంది కంగారుగా.

“ముందు మనం వెళ్లాలండి… ప్రోగ్రాం కొంచెం చేంజ్ అయింది…. వెళదామా” అన్నాడు.

“అండి వద్దు బాబూ… ఎప్పుడూ నా కొడకు పుట్టలేదని బాధపడలేదు… కాని ఇప్పుడు నిన్ను చూసాక నాకు నీలాంటి ఒక్క కొడుకు ఉంటే… బాగుండేదనిపిస్తుంది… ఇప్పడైతే మాత్రం ఏం. నువ్వు నన్ను అండీ, ఆంటీ అనకుండా అమ్మా అని పిలిస్తే సంతోషిస్తాను” అంది…

“ష్యూర్… అమ్మా…” అన్నాడు వాసుదేవ్ సంతోషంగా.

***

అదొక పెద్ద స్టార్ హోటల్… బాగా బలిసిన వాళ్లు నానా గడ్డి తిని డబ్బు సంపాదిస్తున్న వాళ్లు, మా బంగారు కొండలు అని అనుకొని అన్ని కమ్‌ఫర్ట్స్ ఇస్తూ చదివిస్తున్నాం పిల్లలను అని భ్రమలో ఉన్న తల్లిదండ్రులను ఆ భ్రమలోనే ఉంచి క్లాసులు ఎగ్గొట్టి మిట్ట మధ్యాహ్నం గర్లఫ్రెండ్స్‌తో వచ్చి… తప్పతాగి రోడ్డు మీదకు వెళ్లి యాక్సిడెంట్‌లు చేస్తే, మరి కొందరూ హోటల్లోనే రూములు బుక్ చేసుకుని ఎంజాయ్ చేసే వాళ్లు, రెండు చేతుల లంచాలు సంపాదించి కోరిన వాళ్లతో ఎంజాయ్ చేయడానికి వచ్చే సంతోషం లాంటి వాళ్లు ఎక్కవగా ఆ స్టార్ హోటల్‌కి వస్తుంటారు.

“అమ్మా… కాసేపు బురఖా వేసుకోండి… లేకపోతే ఎం.డి. గారు మిమ్ములను చూసి ప్లేటు మార్చగలరు” అన్నాడు వాసుదేవ్.

మాటడకుండా బురఖా వేసుకొని సంతోషం, జాస్మిన్ టేబిల్ దగ్గరగా కూర్చున్నారు…. సంతోషంకి కనబడకుండా మొఖం ప్రక్కకి తిప్పి కూర్చున్నాడు వాసుదేవ్.

బేరర్ రాగానే అన్నాడు సంతోషం…

“జాస్మిన్…. నీకు ఏం కావాలో అర్డర్ ఇచ్చేయ్… ఈ రోజంతా హేపీగా ఎంజాయ్ చేసేద్దాం… మా ఆవిడ ఊరెళ్లతానంది. కంగారు పడి వెళ్లేది లేదు… నీకు కావలసిన వన్ని తిన్నాక ఇటు నుండి పైకి…” అని పొంగిపోతూ “రూమ్‌కి వెళ్లిపోవడమే” అన్నాడు.

“చాల్లే!…. అంత పెళ్లానికి భయపడతావేమిటి?”

“భయపడక ఏం చేయమంటావు. వాళ్ల నాన్న… అదే మా మామ పూర్వకాలంలో విలన్ రాజనాల లాంటి వాడు… మన విషయం తెలిస్తే ఫుట్‌బాల్‌లా ఆడుకుంటాడు. నా కాళ్లు చేతులు విరగొట్టి వాటితో సూప్ చేసుకొని తాగుతాడు.”

“చాల్లే!…. బాబు… వర్ణించకు… అసహ్యం వేస్తుంది….” అని, “మటన్ బిరియాని, చికెన్ టిక్కా, ఫ్రాన్స్ రోస్ట్, కొర్ర మీన పులుసు…” గబగబా ఆర్డర్ ఇచ్చింది జాస్మిన్.

ఆర్డర్ తీసుకొని బేరర్ వెళ్లిపోగానే…. “జాస్మీ!… నీ ఆకలి తీర్చుకుంటున్నావు… సరే… మరి నా ఆకలి ఎప్పుడు తీరుస్తావమ్మా….” అని జాస్మిన్ చెయ్యి పట్టుకొని నొక్కుతూ అన్నాడు సంతోషం…

“చాల్లే!…. ఇప్పటి వరకూ నీ ఆకలి తీర్చుకోలేదా పస్తులున్నావా….”

‘ఛ!… ఛ!… మరి ఇంత బరి తెగించి మాట్లాడుకుంటున్నారు…. వీడు శ్రీరామచంద్రుడనుకొని కాళ్లకు దణ్ణం పెట్టి అడ్డమైన సేవలు చేసాను. ముందు ఇంటి రాగానే కాళ్లు విరిచి మూలన పెట్టాలి’ అని పళ్లు కొరకుతూ మనసులో అనుకుంది అనసూయ.

“అబ్బబ్బ… తిననీ… ఇలా చెయ్యి నొక్కుతుంటే ఎలాగు సంతూ” అంది జాస్మిన్….

“నిన్ను తినొద్దన్నానా…. తిను జాస్మీ… నా పని నేను చేసుకుంటాను….” అని బుంగమూతి పెట్టి అన్నాడు.

కోపంగా ధనలున ప్రక్కకు తిరిగి చూసింది అనసూయ.

‘బుంగమూతితో కొండముచ్చులా ఉన్నావురా! ఛ!… ఛ!… నీలాంటి వెధవతో ఇన్నాళ్లు బ్రతుకు పంచుకున్నానంటే…. రోతగా ఉంది… డెలిగేట్స్ వస్తుంటారు… పార్టీలుంటాయి…. అని వెధవ అబద్దాలు చెప్పి నన్ను నమ్మించావు….’ అని మనసులో తిట్టుకోసాగింది అనసూయ.

“అలా ఎంత సేపు మింగేసిలా చూస్తూవు. నేనడిగింది ఏం చేసావు… ఈ మధ్య టెండర్లలో బాగానే డబ్బులు నొక్కేసావు… అవంతా మీ ఆవిడ చేతిలో పెట్టేసావా” అంది జాస్మిన్…

“జాస్మీ!… మా ఆవిడ సంగతి నీకు తెలియదు… పరాయి సొమ్ము చీపురుపుల్లయినా ముట్టుకోదు…”

“మరైతే ఆ డబ్బంతా ఏం చేసావు?”

“ఏం చేయడమేమిటి జాస్మీ… మొన్న లక్షరూపాయలిచ్చి నెక్లెస్ కొనిపించుకున్నావు కదా?… డబ్బు అవసరం ఉందని ఈ మధ్యనే యాభైవేలు తీసుకున్నావు కదా?….” అని మళ్లీ జాస్మిన్ చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు సంతోషం….

ప్రక్కకు తిరిగి చూసిన అనసూయకి వళ్లు మండిపోయింది… ‘నికృష్టుడా?…. సిగ్గు ఎగ్గు లేకుండా ఏంటిరా ఆ పనులు…. ఇంటికి రా మొఖం నిండా వాతలు పెడతాను…’ అని కసిగా మనసులో అనుకుంది అనసూయ.

“ఏంటి జాస్మీ… నేను చాటుమాటుగా సంపాదించేదంతా నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను. You are my sweet darling” అని మళ్లీ చెయ్యి నొక్కడం మొదలు పెట్టాడు….

“అబ్బబ్బ… నలిగిపోతుంది” అంది గోముగా.

“ఏం నలిగిపోతుంది” అన్నాడు కొంటెగా నవ్వుతూ.

చివ్వున తలెత్తి చూసింది అనసూయ.

‘నీ మొఖానికి కొంటె చూపు ఒకటా… అసలు చూపే లేకుండా చేస్తాను…. ఇంటికి రా చండాలుడా’ అనుకుంటూ ఆవేశంతో ఊగిపోసాగింది అనసూయ.

“అన్నట్లు నా బర్త్‌డేకి ఏం ఇస్తావు?” అంది జాస్మిన్ నవ్వుతూ…

“డిజైనర్ శారీ అడిగావుగా….”

“ఒక్క శారీయేనా? అంది బుంగమూతి పెట్టి.

“అలా బుంగమూతి పెట్టకు బంగారం… ఇలా నిన్ను చూస్తుంటే… పిచ్చెక్కుతుంది… నీ ముందు ఏ టాలీవుడ్, బాలీవుడ్…. హీరోయిన్స్ పనికిరారు….”

“ఈ పొగడ్తలకేం తక్కువ లేదు… ఇంతకీ బర్త్‌డేకి ఏం కొంటావు?”

“డార్లింగ్… ఏ కొనమంటే అది… ఇక ఈ దాసుడిని కరుణించు….”

‘ఓరి దుర్మార్గుడా…. నీ నోటిలో నుండి ఈ మాటలు వింటుంటే తేళ్లు, జెర్రులు ప్రాకుతున్నట్లునిపిస్తుంది… నీ వంట్లో తీటంతా పోవాలంటే నిన్ను తాళ్లతో కట్టేసి వంటి నిండా తేళ్లు, జేర్రులు వేసేయాలి’ అనుకుంటూ గభాలున కుర్చోలోంచి లేవబోయింది అనసూయ.

“అమ్మా!… ఒక్క నిమిషం…” అని గభాలున సంతోషం టేబుల్ దగ్గరకు వెళ్లి “నమస్తే సార్…” అని అన్నాడు వాసుదేవ్.

“ఆ… నమస్తే…” అని అర్థం గానట్లు మొఖం పెట్టి…. “ఎవరయ్యా నువ్వు… నాకు నమస్కారం పెడుతున్నావు” అని …. “ఇక మనం పైకి వెళదామా” అని జాస్మిన్ చెయ్యి పట్టుకొని మురిసిపోసాగాడు.

“ఏంటి సార్… పలకరిస్తుంటే పట్టించుకోరు? బాగున్నారా సార్…” అన్నాడు వాసుదేవ్.

“కనబడుతున్నానుగా…. బ్రహ్మండంగా ఉన్నాను…. వెధవ ఫార్మాలిటీ పలకరింపులు… ఛ… ఛ…” అన్నాడు కోపంగా.

“మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారు. డిస్టర్బ్ చేయనులెండి… ఆంటీగారు బాగున్నారా…” అన్నాడు…

“వాళ్ల నాన్నకి బాగోలేదని ఏడ్చుకుంటూ ఊరెళ్లింది.”

“అయ్యో పాపం! ఏడ్చుకుంటూ ఆంటీ ఊరెళితే మీరు నవ్వుకుంటూ చెయ్యి నొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నారా సార్?”

సంతోషం కోపంగా చూసి అన్నాడు – “ఏవడివోయ్ నువ్వు…. అసలు నీతో నాకు మాటలు ఏమిటి?”

“అయినా ఆంటీ ఊరెళ్లిందని… ఇవన్నీ నీతో చెప్పడం ఏమిటి?… ఇక బయలుదేరు… పానకంలో పుడకలా.”

“ఏదో టెన్షన్‌లో చెప్పేసారు లెండి.”

“టెన్షనా నాకెందుకు.”

“ఎందుకేమిటి సార్… ఆంటీ ఏడుస్తూ ఊరెళితే… మీరు ఇలా నవ్వుతూ ఎంజాయ్ చేయడం… ఎవరైనా నాలాంటి వాళ్లు చూస్తే….”

రయ్‌మని కుర్చీలోంచి లేచి “ఎంజాయ్ చేస్తానయ్యా… నా ఇష్టం… జీవితంలో అనసూయకు తప్ప ఎవరిని కేర్ చేయను… ఇక నీలాంటి వాళ్లు నాకొక లెఖ్కా” అని గభాలున వంగి జాస్మిన్ బుగ్గ మీద ముద్దు పెట్టి… “టెన్షన్ అట… టెన్షన్… నువ్వు ఏం చేయగలవు” అన్నాడు.

“అయ్యో… మీరు అలా కోపం తెచ్చుకోకండి. మా నాన్నగారి ఆఫీసులో ఎం.డి. కదా అని విష్ చేసాను. అప్పుడప్పుడు నాన్నగారికి లంచ్ తీసుకు వస్తుంటాను” అన్నాడు దేవ్.

“చచ్చాను… ఇక్కడ తగలబడ్డావేం. ఇంతకీ మీ నాన్న ఎవరు?” అన్నాడు చిరాగ్గా.

“నిరంజనరావుగారు.”

“నిరంజనరావుగారబ్బాయివా? మహానుభావుడు. కాళ్ళకింద చీమ కూడ చనిపోనివ్వని మంచి మనిషి… నువ్వేమో సీమటపాకాయలా ఉన్నావు. అన్నట్లు చూడు బాబూ… ఇక్కడ జరిగినదంతా మరిచిపో” అన్నాడు బ్రతిమిలాడతున్న ధోరణిలో.

“ఏం మరిచిపోవాలి సార్… ఈవిడ… జాస్మీ అని మీరు పిలుస్తున్నారు కదూ. ఈవిడితో వచ్చినట్లు… డిజైనర్ శారీ… నెక్లెస్… ఇంకా… గుర్తు రావడం లేదు సార్… అవన్నీ మరిచిపోవలా” అన్నాడు అమాయకంగా మొఖం పెట్టి వాసుదేవ్.

సంతోషం కంగారుగా చూసి… “అవన్నీ చెప్పాలేమిటి? ఇప్పటి వరకు ఎవరికి దొరకని నేను… సి.బి.ఐ వాళ్లనే తప్పించుకు తిరుగుతున్న నేను… నీకు చిక్కాను ఏమిటి. ఆదృష్టం కొద్ది ఇప్పటి వరకు లోబిపిలో ఉన్నాను… కాని నీ మాటలతో హైబిపి… లోకి వెళ్లిపోయేటట్లున్నాను… డైరెక్ట్‌గా మేటర్‌లోకి వచ్చేస్తున్నాను… మీ నాన్న చాలా మంచిమనిషి. మరో భారతీయుడు… చాలా సిన్సియర్‌గా వర్క్ చేస్తాడు… ఆఫీసులో అందరూ నేను ఏది చెబితే అదే చేస్తారు… పాపం నేనంటే అభిమానం వాళ్లకి అప్పుడప్పుడు…. నా నోరు తడుపుతుంటారు… ఎన్నో గిఫ్ట్‌లు ఇస్తుంటారు… వాళ్లు ఆ పని చేస్తే నేను వాళ్ల కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ బాగా వ్రాస్తానని… ప్రమోషన్లు వస్తాయని… కాని మీ నాన్న… నాలుక బయటకు పెట్టి… ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క మందుతో నా నాలుక తడపలేదు… గిఫ్ట్‌లు లేవు గాడిద గుడ్డు లేదు… మీదు మిక్కిలి… లంచం రూపాయినా సరే తీసుకోవడం, ఇవ్వడం అంటే నేరం అన్నాడు. అందుకే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బాగా వ్రాయకూడదని నిర్ణయానికి వచ్చేసాను… కాని…. ఇప్పుడు… నేను లటుక్కున నీ కంట్లో పడ్డాను కదా. ఈ విషయం నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియకూడదు… ఈ డీల్‌కు నువ్వు ఒకేనా?…” అన్నాడు.

“ఈ విషయం నాన్నగారితో చెప్పవచ్చా సార్” అన్నాడు దేవ్.

గతుక్కుమన్నాడు సంతోషం…

“ఎందుకుయ్యా నన్ను ఇలా వేపుకు తింటున్నావు. ఎక్కడైనా కొరివితో తల గొక్కుంటానా. అసలే నిక్కచ్చి మనిషి… ప్రొమోషన్ వదులు కోవడానికి రెడీగా ఉన్నాడు… నాకే జ్ఞానోదయం అయినట్లు బిల్డప్ ఇస్తాను… బంగారం లాంటి టైమ్‌ని వేస్ట్ చేసి పడేసావ్… ఇక బయలుదేరు…” చిరాగ్గా అన్నాడు.

“సార్… నాకొక డౌట్…” అన్నాడు వాసుదేవ్.

“అదేదో త్వరగా చెప్పి తగలడు” అని జాస్మిన్ వైపు చూసి “సారీ డార్లింగ్ వన్‌ మినిట్” అని వాసుదేవ్ ముఖంలోకి చూసాడు.

“ఒక్క మా నాన్నగారికి ఫేవర్‌గా వ్రాయడమే కాకుండా, తక్కిన స్టాఫ్ దగ్గర కూడ పార్డీలు, గిఫ్ట్‌లు తీసుకోవడం మానేస్తారా సార్…” అన్నాడు.

“ఏంటోయ్ శ్రుతి మించుతున్నావు… తాచెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు వాళ్లందరి తరుపున వకాల్తా పుచ్చుకుంటున్నావా? ఆ పప్పులేం ఉడకవు” అని అంటుండగానే…

“నువ్వెళ్లు బాబూ…. పప్పులెలా ఉడకవో నేను చూస్తాను” అని బురఖా తీసి ఆవేశంతో సంతోషం ఎదురుగా నిలబడింది అనసూయ.

అనసూయని చూసి షాకై… నోటి మీద కుడి చేతి వేళ్లతో ఆవ..వ..వా… అని శబ్దం వచ్చేలా కొట్టుకొని… “అనూ… అనసూయ… ఊరెళ్లావు… ఇక్కడికెలా వచ్చావు…” అని ఎడమ చేతితో జాస్మిన్‌ని వెళ్లమని… సైగ చేయసాగాడు…

“ఇక ఆపు నీ సైగలు… చీ… సిగ్గు… లేదు… నీ వయసేమిటి నీ పనులేమిటి. ఇలాంటి పనులు మా ఊరిలో చేస్తే ముంగిటలో కళ్లాపి జల్లరు… మొఖం మీద జల్లుతారు… పిడకలు గోడకు కొట్టరు… ముఖం మీద కొడతారు” అని అనసూయ అంటుండగానే…

“అనూ… అనూ… అసలు ఏం జరిగిందంటే…” అని సంతోషం అంటుండగానే…

“కాకమ్మ కథలు నాకు చెప్పకు… ఊరిమనిషినని… ఊరకుక్కలా నువ్వు రోడ్డు మీద తిరుగుతానంటే… ఊరుకుంటానని అనుకుంటున్నావు ఏమో… ఇంకా చూస్తావు ఏమిటి తల్లి… మన బంగారం మంచిదైతే… అని నమ్మేదానిని… నీలాంటి వాళ్లు తగులుతూనే ఉంటారు… పద ఇంటికి… ఒక్క మాట… ఇంటికి రమ్మంటున్నానని… క్షమించేసాననుకుంటున్నావు ఏమో… అది ఎప్పటికి జరగదు. క్షమాభిక్ష పెట్టినట్లు నీ కొక అవకాశం ఇస్తున్నాను… నీ బుర్రలో ఉన్న దరిద్రపుగొట్టు ఆలోచనలు వదిలి… ఆఫీసులో ఎవరిని బాధ పెట్టకుండా సక్రమంగా ఉద్యోగం చేస్తానంటే ఇంటి ముందు ఉన్న నూతి దగ్గర తల స్నానం చేసి లోపలికి రా… వేళకి ఇంత తిండి పెడతాను కాని ఎప్పిటికి నీ భార్య కాలేను… ఎంగిలి కూడుకి కక్కుర్తి పడే కుటుంబంలో పుట్టలేదు. మా నాన్నకి తెలిస్తే చెరుకు గడల్లా నీ కాళ్లు చేతులు విరిచేస్తాడు” అంది ఆవేశంగా….

మరణ శిక్ష నుండి తప్పించుకొని యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలా… ‘గుడ్డిలో మెల్ల ఇంటికి రానిస్తుంది’ అనుకుంటూ అనసూయ వెనకాల నడిచాడు సంతోషం.

(సశేషం)

Exit mobile version