జానేదేవ్! -12

0
2

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 12వ భాగం. [/box]

[dropcap]”ఏం[/dropcap]టి నాన్నా ఆలస్యం అయింది… పద కాఫీ ఇస్తాను… అన్నట్లు నీ కోసం స్నాక్స్ చేసాను….”

“వద్దమ్మా… తిన్నాను…. కాఫీ కూడా వద్దు”

“ఎక్కడ? ఫ్రండ్స్‌తో బయట తిన్నావా?…”

“లేదమ్మా… సాయి పల్లవి వాళ్ల ఇంటికి వెళ్లాను… పాపం చాలా తక్కువ తేడాతో ఎం.బి.బి.యస్. సీటు మిస్ అయింది. తిండి, నిద్రహారాలు మాని ఏడుస్తూ కూర్చుంటుదట. రామానుజం శాస్త్రిగారు కనిపించి చెప్పారు… అందుకే ఇంటికి వెళ్లి… ధైర్యం చెప్పి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోమన్నాను… డెఫినెట్‌గా ఈ సారి సాయి పల్లకి సీటు వస్తుందమ్మా…” అన్నాడు.

“అదేలా చెప్పగలవు దేవ్… ఎప్పుడూ భరోసా ఇవ్వకూడదు… ఇలాంటి పిల్లలే అప్‌సెట్ అవుతుంటారు” అన్నాడు నిరంజనరావు.

“లేదు నాన్నగారూ… తను ఎం.బి.బి.యస్. చేయాలని చాలా పట్టుదలతో ఉంది. చాలా తెలివైనది. నేను అనుకోవడం జస్ట్ 1, 2 మార్కులతో సీటు మిస్సయ్యింది… పట్టుదలగా చదివితే అనుకున్నది సాధిస్తుంది…”

“అయితే మంచిదే… అన్నట్లు దేవ్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా డిస్టింక్షన్‌లో ప్యాసయితే ఏవైనా సివిల్ సర్వీస్ ఎగ్జామ్సకి ప్రిపేరవుదువుగాని… ఇంతకీ ఇంట్రస్ట్ ఉందా లేదా… లేదు డిగ్రీ అయినాక ఏం చేయాలో నువ్వు ఏమైనా ప్లాన్స్ వేసుకున్నావా…”

“లేదు నాన్నగారూ… నాకు సివిల్స్ ప్రిపేరు కావాలని ఉంది… కాని…” అని ఒక్క నిమిషం ఆగి… “సెలక్ట్ కాకపోయినా…. బాధపడుతూ కూర్చోలేను నాన్నగారు… ట్రై చేస్తాను…”

“సరేలే నాన్నా… నీ వంతు కష్టపడు ఫలితం, గురించి నువ్వే కాదు మేము ఆశ పెట్టుకోం… అంతే కదండి…” అంది కంగారుగా సుమిత్ర.

భర్త ఎక్కడ ఏమైనా కొడుకుని బాధపెడుతాడేమో అని సుమిత్ర భయం…

“ష్యూర్… దేవ్… నీ మీద ఎటువంటి ప్రెజర్ నేను పెట్టను… నీ ప్రయత్నం నువ్వు చెయ్యి…” అన్నాడు దేవ్ భుజం మీద చెయ్యి వేసి తడుతూ నిరంజనరావు.

“థాంక్స్ నాన్నగారూ…” అన్నాడు వాసుదేవ్.

‘హమ్మయ్య…’ అని హాయిగా ఊపిరి పీల్చుకుంది సుమిత్ర. మనసులో మాట కుండబ్రద్దలు కొట్టినట్లు చెబుతాడు దేవ్. భర్త ఎక్కడ బాధపడతాడో అని సుమిత్ర భయం.

***

బెల్ రింగ్ కావడంతో తలుపు తీసిన నిరంజనరావు ఎదురుగా ఉన్న భార్యభర్తలను చూసి ఒక్క నిమిషం ఎవరో అర్థం గానట్లు చూసి, అలా చూడడం మర్యాద కాదని “రండి… రండి… లోపలికి రండి” అని ఆహ్వానించాడు.

ఇద్దరూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటూ “మమ్ములను మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. మనం కలిసింది ఒకేసారి. అసలు మా అబ్బాయి ప్రదీప్ అంటే గుర్తుపట్టగలరు.” అన్నారు.

నిరంజనరావు సంతోషంగా… “ఆఁ… ప్రదీప్ పేరెంట్స్… గుర్తు వచ్చింది. ప్రదీప్‌ని ఎవరు మరిచిపోతారండి… He is genius. క్యాంపస్ ఇంటర్‌వ్యూలో highest salary ఇచ్చి గూగుల్ వాళ్లు తీసుకున్నారు…. ఈ మధ్యనే అనుకుంటా తను ఏదో సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసాడని, చాలా పెద్ద పొజిషన్‌లోకి తీసుకున్నారని పేపర్లో చూసాను” అన్నాడు.

వాళ్లిద్దరి ముఖాలు సంతోషంతో నిండిపోయాయి.

“సుమిత్రా…” అని కేక వేసి “ప్రదీప్ పేరంట్స్ వచ్చారు” అన్నాడు.

అప్పుడే స్నానం చేసి బెడ్ రూమ్‌లోకి వచ్చిన సుమిత్ర… బొట్టు పెట్టుకొని హాలులోకి వచ్చి వాళ్లని చూసి నమస్కారం చేసి… “ఒక్క నిమిషం… కాఫీ తీసుకువస్తాను” అంది.

“ఇప్పుడే కాఫీ తాగి వచ్చాం… ముందు మీరు వచ్చి కూర్చోండి” అంది ప్రదీప్ తల్లి సావిత్రి.

నవ్వుతూ అన్నాడు నిరంజనరావు – “మమ్ములను మరిచిపోకుండా, ప్రదీప్ పెళ్ళికి పిలవడానికి వచ్చారు…”

“అయ్యో అలా అనుకున్నారా? నిజం చెప్పాలంటే మిమ్మలను మేము మరిచిపోయినా మా ప్రదీప్ మరిచిపోలేదండి” అన్నాడు ప్రదీప్ తండ్రి నారాయణరావు.

అర్థంకానట్లు నిరంజనరావు, సుమిత్ర ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు…

“మిమ్మలను ఇబ్బంది పెట్టకుండా అసలు విషయానికి వచ్చేస్తున్నాను… మా ప్రదీప్ పది రోజుల శలవు మీద వచ్చాడు… నాలుగైదు సంబంధాలు చూసి వాడితో చెప్పాను. ఇంట్రస్ట్ లేదు… తరువాత చూస్తాను నాన్నా” అన్నాడు…

“అయ్యో… మీరు ఉండండి… అసలు విషయం నేను చెబుతాను… ప్రదీప్ అలా అనగానే మా ఇద్దరికీ ఒక డౌట్ వచ్చిందండి… ఈ కాలం పిల్లలు ప్రేమలు… పెళ్లిళ్లను ఇష్టపడుతున్నారు కదా ఎవరినైనా లవ్ చేసాడేమో… పెళ్లి చేయడానికి మాకేం అభ్యంతరం లేదన్నాను” అని సావిత్రి అంటుండగా…

“చాల్లే… నీ కన్నా… నేనే బెటరు… అసలు విషయం ఏమిటంటే… మా ప్రదీప్, మీ పవిత్ర… ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కలిసి చదువుకున్నారు…. వాడి మనసులో పవిత్ర చోటు చేసుకుంది… కాని ఈ విషయం పవిత్ర ముందు చెప్పడానికి మొహమాటపడ్డాడు. ఒక వేళ పవిత్ర తనని మంచి ఫ్రెండ్‌లా అనుకున్నాను అని అంటుంది ఏమో అని చెప్పలేకపోయాడట…” అన్నాడు నారాయణరావు.

“మీరు ఉండండి… నేను చెబుతాను… ఇప్పటికి కూడ పవిత్రని అప్పుడప్పుడు పలుకరిస్తుంటడాట… పవిత్ర… చాలా మంచి అమ్మాయమ్మా… తన నేచర్ నాకు చాలా ఇష్టం… అని తన మనసులో మాట చెప్పాడు. అయితే ఆ మాట పవిత్రతో చెప్పొచ్చుకదా అన్నాను… వీలు చూసుకొని చెబుతాను అన్నాడు” అంది సావిత్రి…

“ఉండు సావిత్రి… నన్ను చెప్పనీ… ప్రదీప్ ఊరెళ్లగానే మేము ఇటు మీ ఇంటికి వచ్చాం… మావాడు అడిగేలోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని… ఇలా వచ్చాం… మా ప్రదీప్ గురించి మీకే కాదు పవిత్రకి కూడ తెలుసు… మీరు ఆలోచించుకొని చెప్పండి… అన్నట్లు ముఖ్యమైన విషయం… ఒక వేళ మా సంబంధం అక్కరలేదనుకుంటే…. ఈ విషయం మన మధ్యే ఉండనీయండి… మేము ఇలా వచ్చామని తెలిస్తే మా ప్రదీప్ బాధపడతాడు. ఏమంటారు?” అన్నాడు నారాయణరావు…

“ముందు మీ అబ్బాయి, మీ సంస్కారానికి దణ్ణం పెడుతున్నాను. ప్రదీప్ లాంటి కొడుకును కన్న మీ లాంటి తల్లిదండ్రులు దర్జాగా మా సంబంధం గురించి అడగొచ్చు. మీరు మా పవిత్రని మీ కోడలిగా చేసుకుంటాననడం చాలా సంతోషంగా ఉంది… ఏమాంటావు సుమిత్రా?” అన్నాడు నిరంజనరావు…

“ఇంత మంచి సంబంధం వస్తే సంతోషించకుండా ఎలాగుండగలనండి…. బి.టె.క్ చదువుతున్నప్పుడు పవిత్ర చాలా సార్లు ప్రదీప్ గురించి… ఆ అబ్బాయి తెలివితేటలు గురించి…. అప్పడప్పుడు నాతో చెప్పేది… ఇద్దరూ ఒకరికి ఒకరు తెలుసు… తల్లిదండ్రులుగా పెళ్లి గురించి అడగవలసిన బాధ్యత ఉంది కాబట్టి… పవిత్రని అడుగుదాం అండి” అంది…

“విన్నారుగా మా సుమిత్ర మాటలు… మా అమ్మాయిని అడిగి త్వరలోనే చెబుతాను… చాలా సంతోషంగా ఉందండి… మీరు మా ఇంటికి రావడం…” అన్నాడు నిరంజనరావు.

“ఒక వేళ పవిత్ర… ఈ సంబంధానికి ఆంగీకరించకపోతే… ఈ విషయం మా ప్రదీప్‌కి తెలియకుండా ఉంటే బాగుంటుందండి” అన్నాడు నారాయణరావు.

“మా పవిత్ర గురించి మాకు తెలుసండి… ఈ సంబంధం తప్పకుండా అవుతుదనిపిస్తుందండి” అని నిరంజనరావు అంటుడగానే….

“మీరు నిశ్చింతగా ఉండండి… కనీసం ఇప్పుడైనా కాఫీ తీసుకు రానీయండి” అని సోఫాలోంచి లేచింది సుమిత్ర.

“కాఫీ వద్దండి… స్వీటు ఉంటే తీసుకురండి… లేకపోతే షుగరు తీసుకురండి” అంది నవ్వుతూ సావిత్రి.

అందరూ సంతోషంగా నవ్వుకున్నారు.

***

రాత్రి పది గంటలవుతుంది. గదిలో కూర్చోని చదువుకుంటున్నాడు వాసుదేవ్…

గదిలోకి వచ్చిన సుమిత్ర… కొడుకుని చూసి “చదువుకుంటున్నావా నాన్నా… తరువాత మాట్లాడుతాలే” అని వెనుతిరగబోయింది.

“అమ్మా… ముందు ఇలా వచ్చి కూర్చో… ఏదో మాట్లాడుతానని వచ్చావు… చెప్పకుండా వెళ్లిపోతావేం. చెప్పమ్మా ఎనీ ప్రాబ్లమ్?” అన్నాడు దేవ్.

నవ్వుతూ అంది – “అన్ని సమస్యలు ఆ భగవంతుని దయ వలన తీరిపోతున్నాయి… అక్క అమెరికా నుండి చదువు పూర్తి చేసి వచ్చేస్తుంది.. అక్క వచ్చినాక సంబంధాలు చూడాలనుకున్నాం. పెళ్లి అన్నది మాములు విషయం కాదు. ఎన్ని మంచి చెడులుంటాయి… ముక్కు మొఖం తెలియని అబ్బాయిని పవిత్రకిచ్చి పెళ్లి చేస్తాం… వాళ్లిద్దరి మధ్య ఏ పొరపొచ్చాలు లేకుండా కాపురం ఉంటేనే జీవితం సాఫీగా సాగుపోతుంది. ఇలాంటి భయాలు నన్ను వెంటాడుతున్నాయి. కాని ఏ భయం పెట్టుకోనక్కరలేదున్నట్లు మంచి సంబంధం వచ్చింది… అబ్బాయి అక్కతో చదువుకున్నాడు… ప్రదీప్…” ఇంకా సుమిత్ర మాట పూర్తి కానే లేదు, సంతోషంగా అన్నాడు వాసుదేవ్…

“వావ్… ప్రదీప్! జీనియస్, బ్రిలియంట్.”

“అవును నాన్నా. ప్రదీప్, అక్క మంచి ఫ్రెండ్స్ అట. ఇప్పటికి మాట్లాడుకుంటున్నారట… కాని…. పెళ్లి… విషయం గాని ఏది వాళ్ల మధ్యకు రావడం లేదట… శలవులు మీద వచ్చి తిరిగి వెళ్లిపోతూ తన మనసులో మాట చెప్పాడట… సంతోషంగా ప్రదీప్ అమ్మా నాన్న వచ్చారు.”

“మరి మీరేం చెప్పారు” అన్నాడు ఆత్రుతగా….

“అక్కని అడగకుండా గభాలున ఎలా చెబుతాం. అక్క ప్రదీప్‌తో పెళ్లికి అంగీకరిస్తుందంటావా. చాలా మంచి సంబందం…”

నవ్వుతూ అన్నాడు… “ఎగిరి గంతేసి అక్క ఒప్పుకుంటుంది… అసలు ప్రదీప్‌లాంటి వాళ్లని వేళ్ల మీద లెక్కపెచట్టొచ్చు.”

“నీ మాటే నిజమయితే మనం చాలా అదృష్టవంతులవుతాం… అయితే అక్కతో మాట్లాడుతాను…”

“వద్దమ్మా…”

కంగారుగా చూసింది…

“అక్కతో మాట్లాడుతాను… నాతో అయితే అన్ని షేర్ చేసుకుంటుంది.”

“అంతకన్నానా… ఐతే ఎప్పుడు మాట్లాడుతావు?”

“ఇప్పుడు… అక్కకు ప్రొద్దున్న కదా… కొంచెం మాట్లాడాలి… వీలువుతుందా అని మెసేజ్ పెడతాను…”

“సరే నాన్నా….” అని గదిలో నుండి బయటకు నడిచింది.

మెసేజ్ ఇచ్చి చదువుకోసాగాడు వాసుదేవ్.

సెల్ రింగ్ కావడంతో ఎత్తి “హలో అక్కా నేను” అన్నాడు.

“ఏంటిరా ఏదో మాట్లాడాలన్నావు అందరూ బాగున్నారు కదా.”

“బ్రహ్మాండంగా ఉన్నాం…”

“అర్థం అయిందిరా… మళ్లా నాన్నగారికి కోపం తెప్పించే పని ఏదో చేసినట్లున్నావు.”

“అయ్యో అదే లేదు… నిన్ను కాసేపు ఆట పట్టిద్దామనుకున్నాను కాని డైరెక్టుగా అడిగేస్తున్నాను అక్కా… రాపిడ్ ఫైర్ అనుకో… టకటకా జవాబులు చెప్పేయాలి ఓ.కే.నా…” అన్నాడు.

నవ్వుతూ “ఓ.కే… రా” అంది.

“ప్రదీప్ గురించి… అఫ్‌కోర్సు బి.టెక్‌లో నీతో కలిసి చదువుకున్న ప్రదీప్ గురించి నీ అభిప్రాయం?”

“ఇదేం ప్రశ్నరా? అయినా ఇప్పుడు ఈ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నావు?”

“అక్కా అన్యాయం…రాపిడ్ ఫైర్…”

“సారీ…. సారీ…”

“మళ్లీ అడుగుతున్నానక్కా… ఒక్క మాటలో చెప్పాలి… ప్రదీప్ గురించి నీ అభిప్రాయం?”

“He is very intelligent, genius and good human being…”

“అక్కా… నేను ప్రదీప్ గురించి చాలా అడగాలి… ఒక్క జవాబు ఇవ్వు చాలు.”

“o.k…”

“ప్రదీప్ గురించి కాలేజిలో అమ్మాయిలు ఏమనుకునేవారు…”

“అమ్మాయిలా…” ఒక్క నిమిషం ఆలోచించి “Handsome guy అనుకునేవారు…”

“అబ్బాయిలు…?”

నవ్వుతూ “జెలసీ ఫీలయ్యేవారు” అంది.

“మీ కాలేజి డీన్, ప్రొఫెసర్స్…?”

“He is diamond అనేవారు…”

“అయితే ఇంక ప్రదీప్ గురించి discussion అనవసరం… ప్రదీప్‌తో నీకు మ్యారేజి ఫిక్స్ చేయడానికి ఓ.కే… సే… yes…. Or No…”

“ప్లీజ్ చెప్పక్కా…”

అవతల నుండి మాట లేకపోయేటప్పటికి కంగారుగా అన్నాడు.

“అక్కా… సారీ… సారీ… ప్రదీప్ పేరంట్స్ మన ఇంటికి వచ్చి వాళ్ల అబ్బాయి మనసులో మాట చెప్పారు. I like Pradeep very much అక్కా… ఆ సంతోషంలో నిన్ను కాసేపు ఏడిపిద్దామని…”

“Serious…. రాపిడ్ ఫైర్ అన్నావు… లాస్ట్ క్వశ్చన్ మళ్లా అడుగు…”

“అక్కా… యూ…” అని ఫకాలున నవ్వి, “నిన్ను ఏడిపిద్దాం అనుకునాను… నువ్వే నన్ను… ఓ.కే… ఓ.కే…. ప్రదీప్ తోనే పెళ్లి ఫిక్స్ చేయడానికి నీ అభిప్రాయం Yes or No…”

“Yes” అని నవ్వుసాగింది…

“అక్కా… I am very happy….”

“మరి ఇంకేం క్వశ్చన్స్ లేవా?” అంది నవ్వుతూ….

“అక్కా” అన్నాడు నవ్వుతూ…

“దేవ్… ఏదైనా సరే ఒకటి వద్దనడానికి, కావాలని అడగడానికి కారణం ఉండాలి. ఏ కారణం లేనప్పుడు No అని ఎలా చెప్పగలను వాసుదేవ్?”

“You are 100% correct అక్కా…”

“మరి ఉంటాను…. ఇంత మంచి వార్త త్వరగా అమ్మా నాన్నగార్లతో చెప్పాలి…”

“థాంక్స్ రా…”

“ఎందుకు?” అన్నాడు.

“మా పెళ్లి పెద్దవి నువ్వే కదా మరి ఉంటాను. రేపు ఎగ్జామ్ ఉంది… చదవుకోవాలి.”

“ఓ.కే…” ఉంటాను.

‘అక్క చాలా హేపీగా ఉంది. ఈ విషయం తెలిస్తే అమ్మ, నాన్నా సంతోషిస్తారు…’ అనుకుంటూ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగాడు వాసుదేవ్.

***

డైనింగ్ టేబిల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు వాసుదేవ్. సోఫాలో కూర్చోని నిరంజనరావు పేపరు చదవసాగాడు. పేపరు చదువుతూ మధ్యలో తల ఎత్తి చూసిన నిరంజనరావు తల ఎత్తి వాసుదేవ్‌ని చూసి ఆశ్చర్యంగా “రాత్రి పొద్దు పోయేదాక చదివావు… అప్పుడే లేచేసావేం దేవ్?” అన్నాడు.

ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో తెలియనట్లు చూసాడు.

“నాన్నా… లేచేసావా… వాడు ఎందుకు లేచాడో నేను చెబుతానండి” అని గబగబా వంట గదిలో నుండి వచ్చింది సుమిత్ర.

“వాడు ఎందుకు లేచాడో నువ్వు చెబుతావా” అన్నాడు ఆశ్చర్యంగా…

“అవునండి, ఒక్క నిమిషం” అని వాసుదేవ్ వైపు చూసి… “నాన్నా… మాట్లాడావా…?” అని అడిగి; “నా అంచనా ప్రకారం… ఓకే…yes… అని తన అంగీకారం చెప్పి ఉంటుంది… సంతోషం మాతో షేర్ చేసుకోవాలని… ప్రొద్దున్నే లేచి కూర్చున్నావు… అంతేనా” అంది నవ్వు మొఖంతో సుమిత్ర…

“అమ్మా… యూ ఆర్ గ్రేట్…”

“ఏమండీ… పవిత్ర… ప్రదీప్‌తో పెళ్లికి అంగీకరించిందండి” అంది సంతోషంగా.

నవ్వుతూ అన్నాడు… “తల్లి కొడుకుల మథ్య ఎంత మంచి understanding ఉంది. Anyway… పవిత్ర… మన అమ్మాయి… ప్రదీప్‌తో పెళ్లికి అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి వార్త… ఏ మాత్రం కష్టపడకుండా, శ్రమ లేకుండా, టెన్షన్ లేకుండా… వినడం… చాలా సంతోషంగా ఉందర్రా. మీ అమ్మ ఎప్పుడు అంటునట్లు ఇదంతా భగవంతుడి అనుగ్రహం అనిపిస్తుంది… భగవంతునికి కృతజ్ఞతలు చెప్పకోవాలి…”

సుమిత్ర మొఖం సంతోషంతో నిండిపోయింది. ఆయన చెప్పింది నిజం. పవిత్ర USA నుండి వచ్చినాక సంబంధాలు చూడడం మొదలు పెట్టాలనుకుంది. ఎలాంటి సంబంధం వస్తుందో… అబ్బాయి ఎలాంటి వాడో… ఏన్నో… ఆలోచనలు… తెలియని కంగారు భయం… కాని బంగారం లాంటి ప్రదీప్ సంబంధం రావడం… ఇదంతా భగవుతుని అనుగ్రహం కాకపోతే మరేమిటి…

“అమ్మా…” అన్న వాసుదేవ్ పిలుపుతో ఆలోచిన నుండి బయటకు వచ్చింది.

“ఇక మీ అమ్మ ఇప్పటి నుండి పెళ్లికి చేయవలసిన పనులు, ఏం కావాలో లిస్ట్ తయారు చేసే పనులలో మునిగిపోతుంది” అన్నాడు నవ్వుతూ నిరంజనావు.

“పెళ్లి పనులన్నీ నా ఒక్కదాని మీద వేసి మీరు తప్పించుకోవాలని చూస్తూన్నారు ఏమో. అదేం కుదరదు” అంది నవ్వుతూ సుమిత్ర.

గదిలోకి వచ్చిన వాసుదేవ్ కళ్లల్లో తల్లిదండ్రుల మొఖలలో సంతోషం కళ్లల్లో మెదిలింది.

పిల్లల బాగోగులు, పిల్లల భవిష్యత్తలు… పిల్లల సంతోషాలు తప్ప తల్లిదండ్రులకు వేరే ఆలోచనలుండవు… అది వాళ్ల బలహీనతే లేక భగవంతుడు తల్లిదండ్రుల మనసులో అమృతంలాంటి మంచితనం పూర్తిగా నింపాడా…

ఒక్కటి మాత్రం నిజం…. తల్లిదండ్రుల లోకం పిల్లలే… వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్దమే…

అక్క పెళ్లి ప్రదీప్‌తో జరుగుతున్నందుకు అమ్మ, నాన్నా సంతోషపడిపోతున్నారు. తను సివిల్ సర్వీస్‌కి వెళ్లాలని నాన్నగారికి ఉంది… కాని బలవంతంగా తన ఇష్టాన్ని తన మీద రుద్దడానికి వెనక్కి జంకుతున్నారు…. కాని ఆయన కోరినట్లు తను సివిల్ సర్వీస్‌లో సెలక్ట్ అయితే నాన్నగారి సంతోషానికి అవధులుండవు… అమ్మ కూడా సంతోషిస్తుంది. మరుక్షణం తను అలా ఆలోచిస్తున్నందుకు ఆశ్చర్యపోయాడు. తనేనా ఇలా ఆలోచిస్తున్నాడు. తన వంతు ప్రయత్నం తను చేస్తాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here