Site icon Sanchika

జానేదేవ్-14

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 14వ భాగం. [/box]

[dropcap]”ఏం[/dropcap]టి నాన్నా!… ఒక చేతిలో బుక్ పట్టుకుని ఆలోచిస్తున్నావు?… కార్తీక్ ఎలా ఉన్నాడు?… ఇక కార్తీక్ తల్లిదండ్రులు ఎంత బాధలో ఉన్నారో, ఆ బాధను పోగొట్టడం ఎవరి తరం కాదని తెలుసు… నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానే గానీ, లక్ష్మి గారిని ఎలా సముదాయించాలో తెలియక మౌనం వహించాను…” అంది సుమిత్ర.

“నేను ఆ విషయమే ఆలోచిస్తున్నాను అమ్మా… జ్యోతక్క అలా ప్రాణం తీసుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయన్న రూమర్లు బయలుదేరాయట. అసలు ఎందుకమ్మా కొంతమంది మనుషులు ఇలా లేనిపోని కట్టుకథలు అల్లుతారు..?”

“లేదు నానా! పుకార్లు ఉంటాయి… నిజాలుంటాయి. ఎంత తెలివైన వాళ్ళయినా, ఎంత ఆలోచనా శక్తి ఉన్నా ఒక్కొక్కసారి… మనసుకి బాధ కలిగించేదేదైనా జరిగితే అప్‌సెట్ అవుతారు… లేదా డిప్రెషన్‌లోకి వెళతారు. లేదా ప్రాణాలు తీసుకుంటారు… ఎంత సంతోషంగా ఉద్యోగంలో చేరిన నీలు అమ్మగారు అంత సడన్‌గా డిప్రెషన్ లోకి వెళ్లి కోమాలోకి వెళ్ళడం ఏమిటి?

సమాజంలో ఆడవాళ్ళ పట్ల జరుగుతున్నది దాడి అనాలో… బజారులో లభించే అంగడి బొమ్మ లాగా చూసి వాళ్ల జీవితాలు నాశనం చేస్తున్నారు.”

ఆశ్చర్యంగా అన్నాడు వాసుదేవ్ – “ఏంటమ్మా నువ్వు అంటున్నది? జ్యోతక్క చనిపోవడానికి బలమైన కారణం ఉంటుందనుకుంటున్నావా?”

“కారణం లేకుండా ఏ మనిషి ప్రాణాలు తీసుకోరు. అందులోకి జ్యోతి ఆడపిల్ల… తన మనసుని బాధపెట్టిన సంఘటన ఏదైనా కావచ్చు ప్రాణం తీసుకునేలా చేసింది. ఒక్క జ్యోతే కాదు దేవ్… ఎంతోమంది ముక్కుపచ్చలారని ఆడపిల్లలు… వయసు వచ్చిన ఆడపిల్లలు… మలి వయసులో ఉన్న స్త్రీలు కూడా కిడ్నాప్ అవుతున్నారు లేదా అమానుషంగా దుర్మార్గులైన మగవాళ్ళ చేతులో బందీలవుతున్నారు. నరకం అనుభవిస్తున్నారు. ఈ రోజు టీవీలో న్యూస్ చూస్తుంటే నా మనసులో ఏదో తెలియని ఉద్వేగం బయలుదేరింది.”

“వన్యప్రాణుల చట్టం కింద… వేటాడినవాళ్లకి అంత పకడ్బందీగా శిక్ష అమలు చేస్తున్నారు… ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. కానీ కని, పెంచి ప్రాణప్రదంగా చూసుకుంటున్న ఆడపిల్లలను కిడ్నాప్ చేసిన వాళ్ళు కొందరయితే, మరికొందరు వాళ్లని పాడు చేసి, ప్రాణాలు తీసి ఎక్కడో ఒకచోట పడేస్తున్నారు. మరికొందరు రెడ్ లైట్ ఏరియాకు అమ్మేస్తున్నారు…”

“దక్షిణాసియా దేశాల్లో ఏటా వేల మంది మహిళలు బాలికలు అపహరణకు గురై వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నారట…

అసలు ఇంత అన్యాయం ఆడవాళ్లకు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసులు, కోర్టులు ఏం చేస్తున్నట్లు అనిపిస్తుంది.

అన్ని జన్మలలో ఉత్తమమైనది మానవ జన్మ అంటారు… అటువంటిది ఇలా ఆడవాళ్లకు రక్షణ లేకపోవడం ఏమిటి…?

అడవిలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ చట్టం అంత బాగా అమలవుతున్నప్పుడు, జన సమూహం మధ్య ఉన్న ఆడదానికి రక్షణ లేకపోవడం ఎంత దారుణం?… ఇప్పుడు ఉన్న చట్టాలు ఇంకా పటిష్టం చేసి ఆడదాని జోలికి వెళ్లడానికి భయపడే శిక్షను అమలు చేసే చట్టం తీసుకురావాలి… అంతవరకు జానకి లాంటివాళ్ళు, జ్యోతి లాంటివాళ్ళు మనకి కనబడుతూనే ఉంటారు దేవ్…” అంది.

ఆవేశంగా మాట్లాడుతున్న తల్లి వైపు ఆశ్చర్యంగా చూసి… “ఇన్ని ఆలోచనలు ఉన్న నువ్వు సమాజానికి పనికివచ్చే ఏదైనా ఉద్యోగమో లేక వాలంటరీగా ఏదైనా చేయవలసిందమ్మా” అన్నాడు వాసుదేవ్.

చిన్నగా నవ్వి అంది ” పిల్లిని కూడా గదిలో పెట్టి బంధిస్తే పులి అవుతుందంటారు… సమాజంలో ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలు చూసి బాధతో అన్నాను… నా లాంటి వాళ్ళ వలన వాళ్లకు న్యాయం ఏం జరుగుతుంది?

ఆనాడు సమాజం కోసం పాటుపడిన మహానుభావుల లాంటి వాళ్లు… బయలుదేరితే తప్ప ఎక్కడో ఒకచోట ఆడపిల్లలు కిడ్నాప్ అయ్యారనో, ఆడపిల్ల మీద యాసిడ్ దాడి జరిగిందనో, వ్యభిచార గృహాలకు అమ్మేశారనో వినక తప్పదు దేవ్” అంది.

“నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా!”… అన్నాడు.

***

యూఎస్‌ఏ నుంచి పవిత్ర రావడంతో ఇల్లంతా సందడి బయలుదేరింది.

నీలవేణి అంటే పవిత్రకి ప్రత్యేక అభిమానం ఏర్పడింది… ఖాళీ దొరికినప్పుడల్లా జానకితో సమయం గడపడానికి ఇష్టపడేది. జానకిని మామూలు మనిషిని చేయాలన్నదే పవిత్ర ఆశయం…

పవిత్ర, నీలవేణి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడిందని తెలిసి వసుంధరకి వళ్ళు మండిపోయింది… అందుకనే పనిగట్టుకొని పవిత్ర దగ్గరకు వచ్చి అభిమానం చూపెట్టేది…

“నేను నీలు వాళ్ళ ఇంటికి వెళుతున్నాను అమ్మా. వసుంధర ఉంది, తనతో మాట్లాడు…” అన్న పవిత్ర మాటలకు కంగారుపడి… “నీకోసం వచ్చాను పవిత్రా” అని అంది.

“అలాగా!… ఈరోజు ఆంటీతో కొన్ని విషయాల పట్ల అవగాహన కల్పించాలని అనుకున్నాను…” అని అనగానే, “అయితే నేను నీతో వస్తాను” అని పవిత్రతో బయలుదేరింది.

వాళ్ళిద్దరూ ఇంట్లో అడుగుపెట్టేసరికి ఎదురుగుండా కనబడిన దృశ్యాన్ని చూసి నిలబడిన చోటే ఆగిపోయారు.

“అమ్మా!… నాకొద్దు… నేను తరువాత తింటాను… ముందు నువ్వు తిను” అని స్పూన్‌తో జానకికి తినిపించబోతే… చిన్నపిల్లలా గారంగా తల అడ్డంగా అటు ఇటు ఊపుతూ…

“లేదు… నీలూ! … ముందు నేను నీకు తినిపిస్తాను” అని నీలవేణి చేతిలో స్పూను తీసుకుని నీలవేణి నోటిలో పెట్టింది జానకి.

ఆశ్చర్యంగా పవిత్ర వైపు చూసింది వసుంధర.

“వసూ! చూసావా… ఇక్కడకు వస్తే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. నీలు చాలా మంచి అమ్మాయి. మనకి ఏ ముద్దు ముచ్చట జరగకపోయినా తల్లిని ఓ పసిబిడ్డను చూసుకున్నట్లు చూస్తుంది.”

“ఆఁ.. ఆఁ…” అంది వసుంధర. కానీ మనసులో ఆందోళన బయలుదేరింది.

నీలూ అంటే పవిత్ర మనసులో చాలా మంచి అభిప్రాయం ఉంది… మంచి మార్కులే కొట్టేసింది… కొంపదీసి పవిత్ర మనసులో తన స్థానం తగ్గిపోలేదు కదా?

“వసూ!… ఏంటి ఆలోచిస్తున్నావు?” అని పవిత్ర అనడం… వాళ్ల మాటలు విని గభాలున తల ఎత్తి చూసి అంది నీలవేణి…

“రా పవిత్రా… రా వసూ…”

అన్నం తింటున్న జానకి గభాలున లేచి నడవడం చూసి కంగారుగా అంది నీలవేణి.

“అమ్మా… ఎక్కడికి? ఎవరొచ్చారో చూడు…”

అప్పటికే ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి రెండు చేతులతో రెండు ఐస్‌క్రీమ్‌లు పట్టుకుని గబగబా నడుచుకొని వసుంధర, పవిత్ర దగ్గరకు వచ్చి “తీసుకోండి… తినండి… చాలా బాగుంటాయి” అంది.

నవ్వుతూ వాళ్ళ వైపు చూసి… “మీరు తినవలసిందే! లేకపోతే అమ్మ ఊరుకోదు… అంతే కదా అమ్మా…” అంది నీలు.

“అవును తినండి… నీలూ… నువ్వు తింటావా?” అంది జానకి.

“యూ ఆర్ లక్కీ నీలూ!… అమ్మలో ఎంత మార్పో చూడు… గెస్ట్‌లను కూడా చూసుకుంటోంది” అంది పవిత్ర.

“గెస్ట్‌లా? ఎవరు?” అంది అమాయకంగా జానకి.

“మేమే ఆంటీ!… ఎలా ఉన్నారు మీరు?” అంది పవిత్ర.

ఒక్క నిమిషం కనుబొమ్మలు ముడిచి “మీరు గెస్ట్‌లు కాదు ఫ్రెండ్స్…” అంటూ “నువ్వంటే నాకు చాలా ఇష్టం” అని గభాలున పవిత్ర చెయ్యి పట్టుకుంది జానకి.

“మరి నేను?” అంది నవ్వుతూ వసుంధర.

“నువ్వా!…” అని ఒక్క నిమిషం ఆలోచించి, “ఏమో తెలియదు” అంది జానకి.

“సారీ వసూ!.. అమ్మ… ఈరోజు ఇలా నలుగురిలోకి వచ్చి నోరు విప్పి మాట్లాడుతుందంటే అంతా వీళ్ళ వల్లనే… వాసుదేవ్, సుమిత్ర ఆంటీ, పవిత్ర… అందరూ అమ్మని మనలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు… వాళ్ల ప్రయత్నాలు ఫలించి ఇదిగో ఇలా ఉంది… నేను వీళ్ళకి ఋణపడి ఉన్నాను…” అంది నీలవేణి.

“నేను కూడా ఋణపడి ఉన్నాను నీకు, పవిత్ర, సుమిత్ర గారికి… సుమిత్ర గారు, నువ్వు, వాసుదేవ్… అందరం గుడి కి వెళదామా?” అంది జానకి.

నీలవేణి పొంగిపోతూ…”పవిత్రా… చూసావా… అమ్మ ప్రోగ్రాం వేసింది… వాసుదేవ్‌కి చెప్పు” అంది.

“నిన్ననే వాసుదేవ్ అన్నాడు… ఆంటీని లాంగ్ డ్రైవ్‌కి తీసుకువెళ్లాలి… చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళదామని… ఈ సండే వెళదాం” అంది పవిత్ర.

గబాలున అంది వసుంధర “నేనూ వస్తాను పవిత్రా…”.

“ష్యూర్! తప్పకుండా వెళదాం వసూ! ఆరోజు మా ఇంట్లోనే భోజనాలు… అన్నట్లు నువ్వు ఆరోజు మా ఇంట్లో ఉండిపో వసూ” అంది అభిమానంగా.

“తప్పకుండా నీలూ! … దేవ్ కూడా అంత లేట్ నైట్ ఇంటికి వెళతానంటే ఒప్పుకోడు… నేనంటే దేవ్ చాలా కేర్ తీసుకుంటాడు” అంది.

వసుంధర మనసు అర్థమై తనలో తాను నవ్వుకుంది పవిత్ర.

(ఇంకా ఉంది)

Exit mobile version