జానేదేవ్-17

0
1

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 17వ భాగం. [/box]

[dropcap]రో[/dropcap]జులు దొర్లుతున్నాయి.

పవిత్ర రోజూ ఆఫీసుకు వెళ్ళివస్తోంది. వాసుదేవ్ రిజల్ట్స్ కోసం ఎదురుచూడసాగాడు.

ఆఫీసు నుండి వచ్చిన పవిత్ర రామ్‌లాల్‌గారిని ఒకటే మెచ్చుకోవడం మొదలుపెట్టింది. “ఆయన గొప్ప మానవతావాది… సోషల్ వర్కర్.. కైండ్ హార్ట్… ఎన్నో ఫౌండేషన్స్ ఉన్నాయి. అతను సర్వీస్ చేయడం, డొనేషన్స్ ఇవ్వడమే కాకుండా ఆఫీసులో అందరినీ మోటివేట్ చేస్తారు… హీ ఈజ్ గ్రేట్ తమ్ముడూ…” అని చెప్పింది.

“చాలా సంతోషం పవిత్రా… పుట్టుక గిట్టుక చూస్తుండగానే జరిపోతుంటాయి… ఈ మధ్యలో మనిషి చేయరాని పనులు ఎన్నెన్నో చేస్తుంటాడు… కాని రామ్‌లాల్ గారిలా కొన్ని మంచి పనులైనా చేస్తే మనిషి జన్మ సార్థకమవుతుంది” అంది సుమిత్ర.

“అవునక్కా! మనిషి గిరి గీసుకుని అదే జీవితం అనుకోకుండా బయట ప్రపంచం చూడాలి” అన్నాడు వాసుదేవ్.

***

మోటారు బైక్ మీద ఇంటికి వెళుతున్న వాసుదేవ్‌కి సంచి నిండా సామానులతో నడవలేక ఆయాసపడుతు నడుస్తున్న రాజేశ్వరరావు కనిపించగా, బైక్ ఆపి – “అంకుల్… రండి… ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను” అన్నాడు.

“వద్దు వాసుదేవ్! ఆంటీ చూస్తే ఊరుకోదు” అన్నాడు.

“ఏంటి ఆంటీ నా బైక్ ఎక్కితే ఊరుకోదా?” అన్నాడు ఆశ్చర్యంగా.

“అయ్యయ్యో! నువ్వలా అర్థం చేసుకున్నావా? నిజానికి నువ్వొక సెలెబ్రిటీవి… నీ వెనకాల ఎక్కడం నాకెంతో గర్వం.”

“ఛ!… ఛ!… సెలెబ్రిటీని కాదంకుల్. మీ ఎదురింటి అబ్బాయిని…”

“అలా అంటావేమిటి? ఈ మధ్యన టివిలో కనబడిన వాళ్ళు మేము సెలెబ్రిటీలం అంటున్నారు కదా? అది సరేలే… నేను బైక్ ఎందుకు ఎక్కనంటే మీ ఆంటీ పేపరులో ఒక న్యూస్ చదివింది. దాని సారాంశం ఏంటాంటే శరీరంలోని కేలరీలు కరగాలంటే అయినదానికి, కానిదానికి స్కూటర్లు, ఆటోలు, కారులు వాడకుండా నడిచివెళ్ళి పనులు చేసుకుంటే మన శరీరంలో ఉన్న అదనపు ఫ్యాట్ కరిగిపోయి, ఆరోగ్యంగా ఉంటాం అని ఉందట… అప్పటి నుండి స్కూటర్ తాళం తీసి దాచేసి, ఇదిగో ఇలా నడవమంటుంది” అని చెప్పి, తనలో తాను నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ “మీ ఆంటీకి నేనంటే పిచ్చి ప్రేమ, కాదు, కూడదంటే నాకు అన్యాయం చేస్తారా? మీ చేతుల్లో నన్ను పోనియండి అని కన్నీరు పెట్టుకుంటుంది. ఆంటీ ప్రేమ ముందు ఈ కష్టం ఎంతని ఇదిగో ఇలా నడుస్తున్నాను వాసుదేవ్…” అన్నాడు.

ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి… “అలాగా… సరే అంకుల్ నేను వెళతాను” అన్నాడు.

రాజేశ్వరరావు ఏదో ఆలోచన వచ్చినవాడిలా… “ఒక్క నిమిషం… పోనీ ఒక పని చెయ్యి… నన్ను మా ఇంటికి రెండిళ్ళ ముందు డ్రాప్ చెయ్యి… బరువు మొయ్యలేక చస్తున్నాను. అక్కడ్నించి వెళ్ళి.. నడిచి వచ్చినట్టు బిల్డప్ ఇస్తాను… ఏమంటావు?” అన్నాడు నవ్వుతూ.

వస్తున్న నవ్వుని ఆపుకుని, “సరే! బైక్ ఎక్కండి అంకుల్” అన్నాడు వాసుదేవ్.

బండిపోనిస్తూ, “అంకుల్! మీకు అంత కష్టంగా ఉన్నప్పుడు… అదే… సామానులు ఎక్కువగా ఉండి మోయలేనప్పుడు ఆటో ఎక్కి ఇందాక మీరన్నట్టు దిగిపోవచ్చు కదా?” అన్నాడు.

“అబ్బా… చాలా మంచి ఉపాయం చెప్పావోయ్. ఈ ఆలోచ్న నాకు రానే లేదు… థాంక్స్ వాసుదేవ్” అన్నాడు సంతోషంగా.

వాసుదేవ్ కంగారుగా అన్నాడు – “ఆలా నేను చెప్పానని ఎప్పుడూ ఆటో ఎక్కయేగలరు… బరువు మోయలేనప్పుడే…”

వాసుదేవ్ మాట పూర్తి కాకుండానే నవ్వుతూ అన్నాడు రాజేశ్వరరావు – “అలా ఎలా చేస్తాను… పాపం పిచ్చిది ఆంటీ!… దానికి అన్యాయం చేయలేను కదా? ఆంటీ పుణ్యమా అని గాలి ఊదిన బెలూన్‌లా టైట్‌గా ఉండే నా పొట్ట గాలి లీక్ అవుతున్న బెలూన్‌లా తయారవుతోంది.”

గభాలున చూసి… “ఆపేయ్… ఆపేయ్… ఆంటీ మేడ ఎక్కిందంటే కనబడిపోతాను…” అని బైక్ దిగాడు రాజేశ్వరరావు.

చిన్నగా నవ్వుకుంటూ బైక్ పోనిచ్చాడు వాసుదేవ్.

***

హాలులో కూర్చుని టివి చూసున్నారు…

హీరో హీరోయిన్‌ల పెళ్ళి సీను వస్తుంది… టివి వైపు తదేకంగా చూస్తున్న జానకి అంది – “నీలూ!… ప్రదీప్‌కీ, పవిత్రకీ పెళ్ళి కదా? సుమిత్రగారు కూతురు పెళ్ళి అని సంతోషపడుతున్నారు… ప్రదీప్ చాలా మంచి అబ్బాయి అట కదా?…”

“అవునమ్మా”

“నీకూ మంచి అబ్బాయితో పెళ్ళయితే బాగుంటుంది కదా?”

ఆశ్చర్యంగా, కంగారుగా చూసింది నీలవేణి.

“వాసుదేవ్ చాలా మంచి అబ్బాయి కదా?… నీకు వాసుదేవ్‌తో పెళ్ళయితే బాగుంటుంది..”

“అమ్మా…” కంగారుగా అంది నీలవేణి.

“నేను… నేను తప్పుగా మాట్లాడానా?”

“ఛ!… ఛ!… లేదమ్మా! కరెక్టుగానే మాట్లాడావు”

“అయితే వాసుదేవ్‌ని పెళ్ళి చేసుకో”

కంగారుగా ఎవరైనా ఉన్నారా అని అటూ ఇటూ చూసి “ఇంకెప్పుడూ అలా అనకమ్మా”

“ఎందుకు నీలూ!… అలా అనకూడదు?”

“ఓహో అర్థం అయిందిలే!… నీకు వాసుదేవ్ అంటే  ఇష్టం లేదా?… నాకు అంతే!… ఇష్టం లేకపోతే మందులు వేసుకోను… పక్కింటావిడ వస్తే అస్సలు మాట్లాడను…”

“అమ్మా!… నీకెలా చెప్పనమ్మా… ఇంకెప్పుడు  ఈ మాట ఎవరి దగ్గర అనకు… ఏది ప్రామిస్ చెయ్యి…”

“ఎందుకు ప్రామిస్…”

“ఎందుకంటే… ఇంకెప్పుడు  ఈ మాట అనను అని…  ఒట్టు పెడితే సుమిత్ర ఆంటీ, పవిత్ర, వాసుదేవ్ వాళ్ల దగ్గర అనకూడదు. తెల్సిందా అమ్మా?”

“సరే ప్రామిస్!… నీకు  నచ్చిన  అబ్బాయినే పెళ్లి చేసుకుందువుగాని… అటు చూడు వాళ్ల పెళ్లి అయిపోయింది”  అని  టి.వి వైపు చూడసాగింది జానకి.

కాస్త అమాయకం, కొంచెం తెలివితేటలు… అన్నీ కలిసి ఉన్న తల్లితో తను మనసు విప్పి ఏం మాట్లాడగలదు? కళ్లలో నీళ్లు నిండాయి… గభాలున తల్లి ఒడిలో పడుకొని, కళ్లలో నీళ్లు కనబడకుండా ముఖం మీద చెయ్యి పెట్టుకొని “అమ్మా నీ ఒళ్లో పడుకోవచ్చా” అంది…

“ఓ!… పడుకో నీలూ!… నేను బోలెడు సార్లు నీ ఒళ్లో పడుకున్నాను… బాగుంటుంది… అలా పడుకుంటే భయం ఉండదు…” అంది.

దుఃఖం పొంగిపొర్లింది… ‘నువ్వు చెప్పింది నిజం అమ్మా! నీ ఒడిలో పడుకుంటే కొండంత ధైర్యంగా ఉంది. వాసుదేవ్ అంటే ఇష్టం లేని అమ్మాయి ఉంటుందా? తను చాలా మంచి అబ్బాయి…. నూటికో, కోటికో ఒకరుంటారు… వాసుదేవ్ అంటే ఇష్టం కాదు…. ప్రాణం అమ్మా… కాని తనని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేదు…. వసూ ఉంది…. వాళ్ల  అనుబంధం క్రొత్తగా ఏర్పడింది కాదు… వాళ్లిద్దరు ప్రేమికులు… వాసుదేవ్‍ని పెళ్లి చేసుకోవాలని ఆశపడడం చాలా పెద్ద తప్పు…. వాళ్ల దారికి నేను ఎప్పుడు అడ్డు రాను. మనకిష్టమైనది వస్తువైనా, ఏదైనా సరే దూరం అయినప్పుడు చాలా బాధగా ఉంటుంది…. అటువంటిది నేను ఇష్టపడిన మనిషి నాకు దక్కడు అని తెలిసినప్పుడు బాధగానే ఉంటుంది…. అలా  బాధపడడం న్యాయం కాదని తెలిసి నా మనసుకి సర్ది చెప్పకుంటున్నాను  నేను ఒంటరిని… అమ్మ ఉంది… తనలో చలనం లేదని కుమిలిపోయేదానిని… కాని ఈ రోజు అమ్మ నాకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకుంటావా అని అడగడం చెప్పలేని సంతోషంగా ఉంది. అమ్మ ఒడి కొండంత ధైర్యాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. ఇంత కన్నా నాకేం అక్కరలేదమ్మా’ అని తల్లి ఒడిలో పడుకొని ఆలోచనల్లోకి వెళ్లింది.

***

“అమ్మా!…” అని చేతిలో డబ్బు పెట్టిన పవిత్రని చూసి కంగారుగా అంది సుమిత్ర…

“పవిత్రా! ఏంటమ్మా ఇది? నాకెందుకు ఇస్తున్నావు” అంది

“నా శాలరీ అమ్మ… నా ఎకౌంట్లో క్రెడిట్ అయింది… డ్రా చేసి తెచ్చాను…. ఎందకంటావేమిటి? తీసుకో అమ్మా…”

“ఈ డబ్బు నేనేం చేసుకోనమ్మా… నీ ఎకౌంట్లోనే వేసుకో పవిత్రా.”

“ఏంటమ్మా అలా అంటావు…. పిల్లలను పెంచి పెద్ద చేయడానికి, వాళ్ల అవసరాలు తీర్చడానికి ఏ తల్లిదండ్రులైనా ఎంత కష్టపడతారో నాకు తెలుసమ్మా.”

“అది తల్లిదండ్రుల బాధ్యత పవిత్ర…”

“ఇది కూడా మా బాధ్యతే అమ్మా… నాటిన చెట్టు చిగురించి… మొగ్గ తొడిగి… పువ్వు పూస్తే ఎంత సంతోషిస్తామో ఇది కూడా అంతే!…. నా కోసం అయినా ఈ డబ్బు తీసుకో అమ్మా….”

“తప్పకుండా తీసుకుంటాను… ఎందుకంటే నా కూతురికి సంతోషం కలుగుతుందంటే తీసుకుంటాను… నేనే కాదమ్మా ఏ తల్లీ… బిడ్డ మనసు బాధ పెట్టాలని చూడదు” అంది.

***

అర్ధరాత్రి కాలింగ్ బెల్ ఒకటే మోగుతుండడంతో అందరూ కంగారుగా హాల్లోకి వచ్చారు.

గబగబా వెళ్లి తలుపు తీసాడు వాసుదేవ్.

ఎదురుగుండా రామానుజం శాస్త్రిని చూసి షాకయ్యారు.

రెండు చేతులు ఒకచేతిలో ఒకటి పెట్టుకుని, గట్టిగా నొక్కుకుంటూ, ముఖం నిండా చెమటలు పట్టి, కళ్ళ నిండా నీళ్ళతో… “అమ్మా…  బాబూ… సాయి పల్లవిని ఎవరో కిడ్నాప్ చేశారండి” అన్నాడు బాధగా.

అందరూ షాకయ్యారు.

“ఏంటండి పంతులుగారు… అలా అంటున్నారు? అసలు ఏమయింది?” అంది సుమిత్ర.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here