Site icon Sanchika

జానేదేవ్-18

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 18వ భాగం. [/box]

[dropcap]“అ[/dropcap]మ్మకి వంట్లో బాగుండలేదని మనుమరాలిని చూడాలంటుందని, మా ఆవిడ సాయి పల్లవిని తీసుకొని ఊరెళ్లింది… దాని స్నేహితులు మేము వస్తాం, పల్లెటూర్లు ఎప్పుడు చూడలేదని అడగడంతో, ఫ్రెండ్స్‌తో సహా ఊరెళ్లింది… మా అమ్మ… ఆరోగ్యం బాగుపడే వరకు తను ఉంటానని, ముగ్గురు పిల్లలను బస్సు ఎక్కిస్తాను… ఒకరికొకరు తోడుగా ఉంటారంది మా ఆవిడ… సరే అన్నాను. సాయి నిన్ననే ఫోనులో నాతో మాట్లాడింది బాబూ!… ‘పవిత్రక్క ఫంక్షన్ మిస్ అయ్యాను’… అని తెగ బాధపడిపోయింది. ‘పల్లెటూరు ఫ్రెండ్స్‌కి ఎంతో నచ్చిందని…. ఎమ్.సెట్ అయినాక మళ్ళీ మన ఊరు వస్తాం అంటున్నారు నాన్నా’ అని నా బిడ్డ సంతోషంగా చెప్పింది. సాయింత్రం ఆరుగంటలకు మా ఊరు నండి బస్సు వచ్చింది… నేను పది నిమిషాలకు ఆలశ్యంగా బస్‌స్టాండ్‌కి వెళ్లాను… వాళ్లు కనబడలేదు… ఫోను చేసి పిల్లలను బస్సు ఎక్కించావా అని మా ఆవిడను అడిగితే… ‘అయ్యో!… అలా అంటారు ఏమిటండి… డ్రైవర్ రాజుకి కూడ చెప్పాను…. కంగారు పడకమ్మ బస్ స్టాప్‌లో దించేస్తాంలే అన్నాడు’ అంది… పిల్లల ఇళ్ళకు ఫోను చేస్తే రాలేదని వాళ్లు కంగారు పడుతున్నారు…” అని కన్నీళ్లు పెట్టకోసాగాడు.

 “ముందు మనం పోలీసు స్టేషనుకి వెళ్లి చెబుదాం రండి… అమ్మా!…. శాస్త్రిగారు, నేను పోలీసుస్టేషనుకి వెళతాం…” అన్నాడు వాసుదేవ్.

“పోలీసు స్టేషను దగ్గర నుండే ఇక్కడకు వస్తున్నాను బాబూ!… వాళ్ళు… వాళ్లు… కేసు బుక్ చేసాం… వాళ్లు ఎక్కడికి పోయారో… వెతికి పట్టుకోవాలి కదా?… మాకు టైమ్ ఇవ్వరా అని చిరాకు పడుతున్నారు…. పిల్లలు అలాంటి వాళ్లు కాదు ఎస్సైగారు అంటే, సరే లెండి పేరంట్స్ ఇలా అనకపోతే ఎలా అంటారు? ఇక వెళ్లండి అన్నారు. అదేంటి బాబూ!ఎస్సైగారు అలా అన్నారు… ఇంటావిడ కళ్లు తిరిగిపడిపోయింది.” అన్నాడు బాధగా రామానుజం శాస్త్రి.

“మీరు…. మీరు కంగారు పడకండి…. ఇప్పుడు పోలీసు డిపార్ట్‌మెంట్ చాలా బాగుంది… ఎటువంటి దొంగలైనా, కిడ్నాపర్లయినా చాలా త్వరగా పట్టుకుంటున్నారు….” అన్నాడు నిరంజనరావు.

“శాస్త్రిగారు పదండి… పోలీసు స్టేషనుకి వెళ్లి ఎస్సైగారిని కలిసి మాట్లాడుదాం రండి” అని గబగబా వీధిలోకి నడిచాడు వాసుదేవ్… వెనకాలే నడిచాడు రామానుజం శాస్త్రి.

వాసుదేవ్‌ని, రామానుజం శాస్త్రిని చూసి ఎస్సై మొఖంలో చిరాకు బయలుదేరింది…

“ఏరా!… నీకు బుద్ది ఉందా? దోమలు కుట్టి చంపుకు తింటున్నాయి, గుడ్ నైట్ వెలిగించలేదా? వెధవ నైట్ డ్యూటీ!…” అని హోమ్ గార్డు నరసింహ మీద కేకలు వేసాడు.

“గుడ్ నైట్ పెట్టాను సార్!” అన్నాడు భయంగా

“ఏడుగంటలకే పెడితే ఈ పాటికి దోమలు చచ్చేవి. అనవసరంగా కోపం తెప్పించకు.”

రామానుజం శాస్త్రి కంగారుగా వాసుదేవ్ వైపు చూసాడు.

కంగారు పడవద్దని కళ్లతో సైగ చేసి…. “నమస్కారం ఎస్సైగారు…. సాయి పల్లవి, రమ్య… రమణి మగ్గురు ఫ్రెండ్స్… చాలా బాగా చదువుతారు… వాళ్లకు చదువు తప్ప మరో లోకం లేదు… ఇది అంతా ఎందుకు చెబుతున్నానంటే ముగ్గురు పిల్లలను ఎవరో కిడ్నాప్ చేసారండి… ఆడపిల్లలు…. మీరు త్వరగా కిడ్నాపర్లను పట్టుకోండి సార్” అన్నాడు వాసుదేవ్.

రయ్‌మని కుర్చీలోంచి లేచి…. “అయిందా? ఇంకా ఏమైనా చెప్పాలా?… అసలు నీ కళ్లకు ఎలా కనబడుతున్నాను… ఏవయ్యా!… నీతో చెప్పానుగా కిడ్నాపర్లను వెతుకుతాం అని… మళ్లీ ఇతన్ని ఎందుకు తీసుకు వచ్చావు?… మేము మనుషులమే! మీరు చెప్పగానే గభాలున నెత్తిమీద టోపి పెట్టుకొని, లాఠీ పట్టుకొని పరిగెత్తాలా?… ఆడపిల్లలను ఆడపిల్లల్లాగా పెంచాలి… మొన్నటికి మొన్న ట్యూషన్‌కి వెళ్లిన నలుగురు అమ్మాయిలు కనబడడం లేదని… పోలీస్ స్టేషనుకి వచ్చారు… కేసు బుక్ చేసాం… ఒక్క రోజు అయిందో లేదో మేము సీరియస్‌గా వెతకడం లేదని మా మీద డి.సి.పి సా‍ర్‌కి కంప్లెంట్ ఇచ్చాడు” అని ఫకాలున నవ్వి “పోలీసు ఉద్యోగమంటే కత్తి మీద సాము అని తెలిసే వచ్చాను. మీరు మా మీద కంప్లెయింట్ ఇస్తే మా పీకలు తెగిపోతాయి అనుకుంటరా? ఉద్యోగం పోతుందనుకుంటారా?

ఈ నెలలో ఇప్పటికి నాలుగు కిడ్నాప్ కేస్లు బుక్ అయ్యియి. లవర్‌తో లేచిపోతే ఏ బెంగుళురులోనో, బొంబాయిలోనో… ఢిల్లోలోనో దొరుకుతారు. కిడ్నాప్ అయితే బొంబాయి రెడ్ లైట్ ఏరియాలోనో గల్ఫ్ దేశాల్లోనో దొరుకుతారు… ఒకటి రెండు రోజుల్లో వాళ్లని పట్టుకోవాలంటే ఎలా అవుతుంది?… ఎన్నో కిడ్నాప్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి…. మాకు టైమ్ ఇవ్వండి… వెతికి పట్టుకుంటాం… అవసరమయితే ఫోను చేస్తాం… అప్పుడు రండి. చీటికి మాటికి వచ్చి విసిగించకండి” అన్నాడు కోపంగా ఎస్సై.

కంగారుగా భయంగా కన్నీళ్లతో రెండు చేతులు కట్టుకొని రామానుజం శాస్త్రి నిలబడ్డాడు.

“ఏంటి సార్… మీరంటున్నది? మీరు అంత కాలం తీసుకుంటే ఆడపిల్లల పరిస్థితి ఏమిటి? ఈలోగా జరగకూడనిది జరిగితే… ప్లీజ్ సార్ త్వరగా పిల్లలని వెతకండి” అన్నాడు వాసుదేవ్.

 కోపంగా ఉరిమినట్లు చూసాడు ఎస్సై… “యస్ సార్!… ష్యూర్ సార్!… మీరు ఆర్డరు వేసారుగా పరిగెడుతాం… పట్టుకుంటాం అని అనమంటావా?… ఏం నీ కళ్లకి పోలీసు డిపార్ట్‌మెంట్ ఎలా కనబడుతుంది? ఇటు చూడు…” అని గభాలున లేచి బోలెడు ఫైల్స్ తీసి టేబిల్ మీద పడేసి… “సంవత్సరం పైన అయింది కేసులు బుక్ అయ్యి… అయినా కిడ్నాపరుల కోసం వెతుకుతూనే ఉన్నాం. ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి జైలులో పెట్టాం. మేజిస్ట్రేట్ దగ్గరకు తీసుకువెళ్లి మా కస్టడీకి విచారణ చేయడానికి ఇవ్వమని అడిగాం. మేజిస్ట్రేట్ గారు మా కస్టడీకి ఇచ్చారు. హమ్మయ్య వాళ్లని చితక్కొట్టుయినా నిజం రాబెట్టవచ్చునుకున్నాం… కాని తెల్లారేటప్పటికి వాళ్ల ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు… కథ మళ్లా మొదటికి వచ్చింది. కిడ్నాపర్ల కోసం మూడు బృందాలు గాలిస్తున్నాయి… మమ్ములను ఊపిరి తీసుకోనివ్వండి… ఇక బయలుదేరిండి” అన్నాడు.

 “సార్!…” అని వాసుదేవ్ అనగానే… “ఏంటోయ్!… పోనీలే అని మా బాధలన్నీ నోరు నొప్పి వచ్చేలా చేప్పాను… అయినా మళ్లీ… మొదటికి వచ్చావ్?”అని “నరసింహ! తల పగిలి పోతుంది టీ పట్రా… ” అన్నాడు కోపంగా ఎస్సై.

“రండి శాస్త్రిగారు” అని చెయ్యి పట్టకొని… బయటకు తీసుకు వచ్చి…. “అధైర్యపడకండి. సాయి పల్లవి, రమ్య, రమణి తప్పకుండా దొరుకుతారు… నా ప్రయత్నాలు నేను చేస్తాను…. డిటెక్టివ్ జయసింహ ఉన్నాడు… అతన్ని వెళ్లి కలుస్తాను. ఫోటోలు రెడీ చేయండి… ప్రొద్దున్నే వస్తాను” అన్నాడు వాసుదేవ్.

 “సరే బాబూ!… ఒకప్పుడు నాకు సంతానం కలుగలేదని బాధపడేవాడిని. ఇప్పుడు సంతానం ఎందుకు భగవంతుడు ఇచ్చాడని బాధపడుతున్నాను…

నా బిడ్డ ఒక ఆసిఫాలా నరకయాతనతో కూడిన భయంకరమైన చావు లేకుండా ఉంటే చాలు.

ముక్కు పచ్చలారని, లోకం పోకడ తెలియని, పసి బిడ్డలని కూడ వదలడం లేదు దుర్మార్గులు…

ప్రభుత్వం బేటి బచావో అన్న నినాదం చేస్తుంది ఒక ప్రక్క, మరో ప్రక్క దేశం అంతట పసి బిడ్డల దగ్గర నుండి మలివయసు వరకు కూడ ఆడవాళ్లు కిడ్నాప్ అవుతూనే ఉన్నారు…. ఇదెక్కడి దౌర్భగ్యం బాబూ! … దీనిని అరికట్టే నాథుడు లేడా?” అని కన్నీళ్లు కార్చసాగాడు రామనుజం శాస్త్రి.

ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించాడు. ‘శాస్త్రి గారు చెప్పింది కరక్టే… పసి బిడ్డ… చిన్న దెబ్బ తగిలితే గుక్కపెట్టి ఏడ్చి అమ్మ ఒడిలో సేదతీరే వయస్సు పసిదానిని, దున్నపోతుల్లాంటి కామాంధులు ఎనిమిది రోజులు తమ కామం తీర్చుకొని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పసిదాని ఊపిరి బలవంతంగా ఆపేసారంటే వాళ్లు మనుషులను కోవాలా?… రాక్షసులనుకోవాలా?…. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేప్పట్టినా… షీ బృందాలు… వంద దాక పోలీసు బృందాలు పని చేస్తున్నా మానభంగాలు, యాసిడ్ దాడులు, కిడ్నాప్లు జరుగుతూనే ఉన్నాయి’ అనుకున్నాడు.

‘మూడేళ్ల పసి బిడ్డ “cow – safe, deer – safe, why I am not safe” అని వ్రాసి ఉన్న చార్టు పట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఆర్టికల్ చదివి… అవును… ఆ పసిపిల్ల ప్రశ్నకి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి అని అనుకున్నాడు.. దానికి సమధానం సాయి పల్లవి, ఫ్రెండ్స్ కిడ్నాప్ కావడం… అంటే… ఈ దుశ్చర్యలు, దుర్మార్గాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయనేగా…. నో, వీల్లేదు’ ఆవేశంతో ఊగిపోసాగాడు వాసుదేవ్.

రోజులు దొర్లుతూనే ఉన్నాయి… సాయి పల్లవి వాళ్లని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లను పోలీసులు పట్టుకోలేకపోయారు.

***

వీకెండ్… అందరూ హాలులో కూర్చున్నారు కాని ఎవరితో ఎవరు మాట్లాడకోవడం లేదు… జానకి, నీలవేణి వచ్చి పవిత్ర ప్రక్క సోఫాలో కూర్చున్నారు…

వాతావరణాన్ని తేలికపరచాలన్నట్లు పవిత్ర అంది.

“నీలూ!… వాసుదేవ్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంచి మార్కులు వచ్చాయి…”

“అలాగా… కంగ్రాట్స్ వాసుదేవ్” అంది.

“ఆఁ…. ” ముభావంగా అన్నాడు…

“పోలీసులు ఏమంటున్నారు?… నిన్ను అమ్మ నేను గుడికి వెళ్లాం…  ఆ తల్లిదండ్రుల బాధ చూడలేకపోతున్నాం” అంది నీలవేణి.

“తల్లిదండ్రుల కళ్ళకి పిల్లలెప్పుడు…. చిన్నతనంలోనైనా పెద్దతనంలోనయినా పసివాళ్లలాగే కనిపిస్తారు… చిన్న దెబ్బ తగిలినా చిన్న సుస్తీ చేసినా గిలగిల లాడిపోతారు… వాళ్ల ప్రేమ, అభిమానం ముందు… ఏ బంధాలు, సరితూగలేవు” అంది పవిత్ర.

“అవును పవిత్రా… అందుకే వాళ్లు పిల్లల కోసం ఏ త్యాగం చేయడానికైనా రెడీగా ఉంటారు…” అంది సుమిత్ర.

“అన్నట్లు లాస్ట్ వీకెండ్ మా ఆఫీసు వాళ్లందరం అవుట్‌స్కర్ట్స్‌లో నున్న ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్లి సర్వీస్ చేసాం… అన్నట్లు మా ఎం.డి. గారి గురించి ఇక్కడ చెప్పాలి…. ఎం.డి.గారు మానవతా వాది. గొప్ప సోషల్ వర్కర్. ఎన్నో ఓల్డ్ ఏజ్ హోమ్‌లు, ఆర్ఫన్ హోమ్స్ దత్తత తీసుకున్నారు… ఎం.డి. గారిని చూసి బోలెడు విషయాలు నేర్చుకుంటున్నారు అందరూ. ఆయనకి ఇక్కడే కాదు యుఎస్‌ఎలో, గల్ఫ్ దేశాల్లో బోలెడు బిజినెస్‍లున్నాయి. అంత బిజీలోనూ సోషన్ సర్వీస్ చేస్తున్నారు….”

“అక్కా అంత బిగ్ షాట్ కదా? సాయి పల్లవి వాళ్ల కిడ్నాప్ల గురించి ఏవరైనా హైయ్యర్ అఫీషియల్స్‌ని ఇన్‍ఫ్లూయన్స్ చేస్తారేమో అడుగు” అన్నాడు దేవ్.

“ష్యూర్ తమ్మడూ!… అన్నట్లు అక్కడ మేము తీయించుకున్న ఫోటోలు ఉన్నాయి… ” అని గబగబా ట్యాబ్ ఓపెన్ చేసి ఫోటోలు చూపెట్టడం మొదలుపెట్టింది పవిత్ర…

నీలవేణికి పవిత్ర ఫోటోలు చూపెడుతుంటే జానకి ఆత్రుతగా వంగి చూడడం చూసి… “ఆంటీ… మీరు ఇటు రండి, చూపెడతాను” అని ఫోటోలు చూపెడుతూ ఒక్కొక్కొరి గూరించి చెప్పసాగింది… చివరిగా ఒక ఫోటో చూపెడుతూ…. “వీళ్లంతా మా ఆఫీసు స్టాఫ్… ఈయనే… మా ఎం.డి. గారు” అని రామ్‌లాల్‌ని చూపిచగానే షాక్ తగిలిన వ్యక్తిలా అయి… భయంతో వణికిపోతూ… క్రూరంగా కళ్లు పెట్టి భారంగా ఊపిరి తీసి…. “వీడు… వీడు…” అని గభాలున పవిత్ర చేతిలో నుండి ట్యాబ్ తీసుకొని నేల కేసి కొట్టి జానకి స్పృహ కోల్పోయింది.

అందరూ ఒక్కసారి షాకైయ్యారు…. మరు నిమిషం కంగారుగా “అమ్మా… అమ్మా” అని జానకిని కదపసాగింది నీలూ…

“ఉండు నీళ్లు తీసుకువస్తాను నీలూ…” అని నీళ్ల కోసం పరిగెత్తింది పవిత్ర…

గభాలున సెల్ తీసి డాక్టరుకి ఫోను చేసాడు వాసుదేవ్…

“ఆంటీ ఎంతో ఇంప్రూవ్ అయ్యారనుకుంటే సడన్‌గా ఇలా జరిగిందేమిటి?” అంది పవిత్ర.

“అమ్మా…. అమ్మా….” అంటూ, “అమ్మ కాషాయ బట్టలతో, జలపాల జుత్తుతో, నుదుట కుంకం పెట్టుకున్న వాళ్లని చూస్తే భయంపడుతుంది కాని ఇలా ఎప్పుడు జరగలేదు… నా చిన్నతనంలో కోమాలోనే చాన్నాళ్లుంది… తరువాత కోమాలోంచి బయటకు వచ్చినా… ఎవరితో మాట్లాడేది కాదు… తరువాత నా ఒక్కదానితోనే బాగుండేది… కాని మీతో పరిచయం అయ్యాక చాలా పెద్ద మార్పు వచ్చింది…. కాని ఇప్పుడు మళ్లీ…. ఇలా జరగడం ఏమిటి?” అంది బాధగా నీలవేణి.

డాక్టరు వచ్చి పరీక్ష చేసి… “కంగారు పడవలసినది లేదు… ఆవిడ గురించి మీరు చెప్పిన దాని బట్టి చూస్తే…. ఆవిడకి నచ్చనిది ఏదైనా జరిగితే భయపడుతుంది… కోపం కూడా వస్తుందేమో అనుకుంటున్నాను… ఒకసారి సైకియాట్రిస్ట్‌కి కూడా చూపెట్టండి… ఇంజక్షన్ ఇస్తున్నాను, కాసేపటిలో మాములు అవుతారు…” అని ఇంజక్షన్ చేసి వెళ్లిపోయాడు డాక్టర్.

(ఇంకా ఉంది)

Exit mobile version