[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 21వ భాగం. [/box]
[dropcap]వా[/dropcap]సుదేవ్‌లో దుఃఖం పొంగిపొరులుతుంది. కళ్లనిండా నీళ్లు నిండాయి. గభాలున సెల్ తీసి మెసేజ్ పెట్టాడు…. బాధగా కళ్లు మూసుకున్నాడు.
నిమిషాలు దొర్లుతున్నాయి…
“దేవ్!…” అని అభిమానంగా భుజం మీద చెయ్యి వేసింది వసుంధర.
గభాలున తల ఎత్తి చూసి వాటేసుకొని, “వసూ!… అక్క… అక్క…” అని ఐసియు వైపు చూపెట్టాడు వాసుదేవ్.
వసుంధర షాకైయ్యింది. ఇప్పటి వరకు ఎప్పుడూ వాసుదేవ్‌ని ఇలా చూడలేదు? ఏం జరిగింది?
“వసూ!… నన్ను విడిచి పెట్టి ఎక్కడికి వెళ్లకు… ఒక్కడిని బాధని తట్టుకోలేకపోతున్నాను.”
“ఓ.కె… ఓ.కె… దేవ్! అక్కకి… పవిత్రకి ఏం పరవాలేదు… డాక్టరుగా చెబుతున్నాను… మనుషులన్నాక ఏదో ఒక సుస్తీ చేస్తుంది… తరువాత తగ్గుతుంది…”
“వసూ!… నేను… నేను ఏం చెప్పలేను…” అని గభాలున జేబులో నుండి కాగితం తీసి వసుంధరకిచ్చాడు…
చదువుతన్న వసుంధర మొఖంలో ఆశ్చర్యం భయం, ఆంధోళన బయలుదేరింది.
కంగారుగా అంది… “దేవ్!… ఏమింటీ ఘోరం?… మైగాడ్!… ఎలా భరించావురా ఇంత బాధను?…” అని అటు ఇటు చూసి…. “కనీసం నీలూని అయీనా తోడు తెచ్చుకోలేకపోయావురా…”
“ఏమో!… నాకు నీలూ గుర్తు రానేలేదు వసూ!… నువ్వు… నువ్వు… నువ్వే గుర్తువచ్చావు” అన్నాడు కళ్లనీళ్లతో…
తను… తను… ఇన్నాళ్లు నీలూ విషయంలో అపార్థం చేసుకొని దేవ్‌ని బాధపెట్టింది. మరు క్షణం అభిమానంగా వాసుదేవ్ చెయ్యి పట్టుకొని నడిపించుకొని కుర్చీల దగ్గరకు తీసుకు వెళ్లి “ముందు నువ్వు కూర్చో దేవ్!…” అని కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చోని “దేవ్!… నాకు ఏం మాట్లాడాలో కూడ తెలియడం లేదు… ఏమిటీ మనుషులు మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు… నేను ఈ రోజే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రొత్త ఆర్డినెన్స్ గురించి చదివాను…. దుర్మార్గుల పాపం పండింది రా… వాళ్లకు మరణ శిక్షలు తప్పువు….” అంది.
“క్రొత్త ఆర్డినెన్స్‌ల కోసం… నిర్భయ చట్టం గురించి నేను ఆలోచించను వసూ… నా చేతులతో వాడి పీక పిసికి చంపుతాను” అని ఆవేశంతో ఊగిపోసాగాడు వాసుదేవ్…
“కూల్ దేవ్!… ముందు పవిత్ర గురించి మనం చూడాలి” అని అంటుండగానే డాక్టరుగారు ఐసియులోకి వెళ్లడం చూసి పరిగెత్తుకొని వెళ్లి తనని పరిచయం చేసుకొని, డాక్టరుగారితో పాటు ఐసియులోకి వెళ్లింది వసుంధర…
భయం భయంగా ఐసియు వైపు చూడసాగాడు వాసుదేవ్.
డాక్టరుగారితో మాట్లాడుకుంటూ బయటకు వసుంధర రావడం చూసి గబగబా అడుగులు వేసి అన్నాడు – “అక్క ఎలా ఉంది డాక్టర్?”
“Don’t worry…. she is out of danger….” అని వసంధర వైపు చూసి… “నువ్వు చెప్పు డాక్టరు… Please take care of him” అని వెళ్లాడు.
“దేవ్!… పవిత్రకి ఏం పరవాలేదు. రెండు మూడు రోజుల్లో పవిత్ర మామూలవుతుందిరా… పవిత్రని చూద్దువుగాని…” అని వాసుదేవ్ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళుతూ… “దేవ్!… కంట్రోల్ యువర్ సెల్ఫ్…. ఏం జరగనట్లే ఉండు…. టైములో పేషంట్ మైండ్‌సెట్ డిఫరెంట్‌గా ఉంటుంది…”
“ఓ.కే… ఓ.కే… పవిత్రకేం పరవాలేదు కదు…” అన్నాడు.
“దేవ్!… డాక్టరుగారు చెప్పారు… నమ్మడం లేదా?… నువ్వే చూడు…” అంది.
“ఓ.కే… ఓ.కే…” అని ఐసియులోకి అడుగులు వేసాడు…
కళ్లనుండి కారుతున్న కన్నీటిని చేత్తో తుడుచుకుంటూ, కుడి చేతికి సెలైన్ ఉండడంతో, ఎడమ చెయ్యి చాచి వేళ్లతో రమ్మట్లు చూసింది పవిత్ర.
పవిత్ర దగ్గరకు గబగబా అడుగులు వేస్తూ తను బాధపడుతున్నట్లు ఎంత మాత్రం అక్క అనుకోకూడదు… ఇప్పుడు పవిత్రకు కావలసింది ధైర్యం…
వాసుదేవ్ చెయ్యి గట్టిగా పట్టుకోవడంతో గభాలున ఆలోచనల నుండి తేరుకొని అన్నాడు.
“అక్కా!… ఎలా ఉన్నావు… నువ్వు… నువ్వు… ఏమిటి?… ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోవడం ఏమిటి?”
“అవును పవిత్రా!… నువ్వు… చేయని తప్పుకి శిక్ష ఎందుకు వేసుకున్నావు?… వాడికి శిక్ష పడడానికి ధైర్యంగా పోరాడాలి కాని….” అంది.
“ష్ట్!…” నిర్లిప్తంగా నవ్వి అంది, “మాటలు చెప్పడం సుళువని నా వరకు వచ్చాక కాని తెలిసి రాలేదు వసూ!… ”
“ఏంటండి చూడడానికి పర్మిషన్ ఇస్తే పేషంట్‌ని డిస్టర్బ్ చేస్తున్నారు… చూసారుగా… ప్లీజ్ వెళ్లండి” అంది సిస్టర్.
“సారీ… సారీ….” అని వాసుదేవ్, వసుంధర బయటకు వచ్చారు.
రెండు రోజుల్లో పవిత్రని డిశ్చార్ట్ చేసారు.
విషయం తెలిసి బాధగా అంది నీలవేణి…
“మమ్మల్ని పరాయివాళ్ళుగానే చూస్తున్నావా దేవ్!… నేను మాత్రం మీరు నా కుటుంబం, నా వాళ్లే అనుకుంటున్నాను…”
“నీలూ!… ప్లీజ్!… అలా అనుకోకు… అనుకొని సంఘటన, నెత్తి మీద పిడుగుపడినట్లయింది… ఎవరు గుర్తు రాలేదు… అక్కని బ్రతికించుకోవాలని పిచ్చివాడిలా పరిగెత్తాను….”
“నా మనసుకి నచ్చిన వ్యక్తులలో నువ్వొకదానివి.”
“అవును నీలూ!… దేవ్ త్వరగా ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయడు… నీకు అంత క్లోజ్ అయ్యాడంటే నువ్వు తన మనసుకి ఎంతో నచ్చావు…. ”
ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు వాసుదేవ్!… ఎంత ఫ్రాంక్‌గా మాట్లాడుతుంది వసూ…
“సారీ!… దేవ్!… ఇంట్లో వంట ఏం చేయవద్దు. నేను తెస్తాను” అంది నీలవేణి.
“వద్దులే నీలూ!… నేను వంట చేస్తాను” అంది వసుంధర.
“వద్దంటే బాదపడతావు ఏమో… మీ ఇద్దరూ కలిసి వంట చేయవచ్చు కదా!” అన్నాడు.
“అవును నీలూ!… ఆ పని చేద్దాం… దేవ్‌ని ఒక్కడిని విడిచి పెట్టడం ఇష్టం లేక ఇంటికి వెళ్లలేదు. ఒకసారి ఇంటికి వెళ్లి నా బట్టలు బుక్స్ తీసుకొని వస్తాను… కాస్త నువ్వు దేవ్‌కి తోడుగా ఉండు” అంది వసుంధర…
“అలాగే… పవిత్ర నిద్ర లేచిందో లేదో చూసి వస్తాను…” అని, “ఇప్పటికి ఇంటి నుండి టిఫిన్ తెస్తాను” అంటూ పవిత్ర గది వైపు నడిచింది నీలవేణి.
“అక్కా!… నా మీద నీకు నమ్మకం ఉందా?” అన్నాడు వాసుదేవ్.
“ఏంటి దేవ్!… పవిత్ర గురించి నీకు తేలీదా? అలా అంటావు నీకు తెలీదా?” అంది వసుంధర.
“వసూ!… నీకు అర్థం కావడం లేదు. ఇప్పటి పరిస్థితి వేరు. అక్కకి నా మీద నమ్మకం ఉందంటే నేను ధైర్యంగా ముందడుగు వేస్తాను. ఇప్పటికే సమయం అయిపోతుందని అక్క సెల్ తీసుకొని పని ప్రారంభించాను… నేను వేసుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది” అన్నాడు వాసుదేవ్.
“ఏం ప్లాన్ తమ్ముడూ” అంది కంగారుగా.
రామ్‌లాల్‌కి అక్క మెసెజ్‌లు ఇస్తున్నట్లు తనే ఇస్తున్నాడు. అక్క ప్లేస్‌లో వసుంధర తన ప్లాన్ అమలు పరచడానికి అంగీకరించింది. ఆ రాస్కెల్ అంచనా ప్రకారం వాడి బ్లాక్ మెయిల్‌కి ప్రతీ ఆడపిల్ల సరెండర్ అవుతుందని వాడి నమ్మకం. వాడి నమ్మకాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవడమే తన ఉద్దేశం. ఈ విషయంలో వసూ తనకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చింది
“ఏంటి తమ్ముడూ!… ఆలోచిస్తున్నావు” అంటూ, రామ్‌లాల్ తన కిచ్చిన డెడ్‌లైన్ గుర్తు వచ్చి “తమ్ముడూ… ఇప్పటికే నా బ్రతుకు వీధి పాలు కాకుండా కాపాడావు. ఏం చెయాలనుకుంటే అది చెయ్యి తమ్ముడూ…” అంది.
“థాంక్స్ అక్కా!… నువ్వు ధైర్యంగా ఉండు.” అన్నాడు
“ఎలా ఉంటాను తమ్ముడూ? నేనే కాదు ఎంత ధైర్యవంతురాలైన ఆడపిల్ల అయినా డీలా పడకుండా, బయపడకుండా ఎలా ఉంటంది? ”
“పవిత్ర!… నువ్వు చాలా అధైర్యపడుతున్నావు అసలు నీకు జరిగినది లెఖ్కలోకి రాదు” అంది వసుంధర.
“ప్లీజ్ వసూ!… నేనేం చిన్న పిల్లను కాను… నన్ను ఊరుకోబెట్టడానికి చెబుతున్నావు.”
“లేదు పవిత్ర! నిజమే చెబుతున్నాను. మా అక్క సత్యకి చాన్నాళ్ల వరకు పిల్లలు పుట్ట లేదు… చివరికి ఐవిఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయింది. కాని బోలేడు కాంప్లికేషన్స్… చివరికి డెలీవరీ టైమ్‌లో కూడా పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందట. తల్లో… పిల్లో ఎవరో ఒకరినే కాపాడగలం అని డాక్టర్లు తేల్చి… ఆపరేషన్‌కి ప్రిపేరయ్యరు… అటువంటి కేసులకి టాప్ ఎక్స్‌పర్ట్స్ అయిన ఇద్దరు ఇండియన్ డాక్టర్లులు, ఇద్దరూ ఫారినర్స్‌లు ఒక నల్ల డాక్టరు బృందం ఎంతో కష్టపడి ఆపరేషన్ చేసారు… ఆ డాక్టర్లే కాకుడా బోలేడు మంది డాక్టర్స్ స్టాఫ్ అక్క వంటి మీద నూలు పోగు లేకుండా చూసి ఉంటారు… అంత వరకు ఎందుకు హస్పిటల్‌లో సూపర్ స్పెషలిస్టులు అందరూ మేల్ డాక్టర్స్… చిన్న వయసులో ఉన్న డాక్టర్లు గైనకాలజిస్టులు, కేసులన్నీ వాళ్లే చూస్తారు… క్రొత్తగా పెళ్లైయి ప్రెగ్నంట్ అయిన వైఫ్‌లను తీసుకొని ఆ యంగ్ డాక్టర్ల దగ్గరకే వస్తారు అబ్బాయిలు… ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి… వాళ్లు మంచి భావంతో మంచి చూపుతో కేసులు డీల్ చేస్తున్నారా, లేక బేడ్ ఇన్‌టెన్షన్‌లో ఉన్నారా అన్నది వాళ్లకే వదిలేద్దాం… నువ్వు ఆ విధంగా ఆలోచించు పవిత్ర… అంది ఆవేశంగా.
“కరక్టుగా చెప్పావు వసూ… అమ్మ… మా అమ్మ జీవితం తన ప్రమోయం లేకుండా నాశనం చేసాడు దుర్మార్గుడు… నేను పుట్టాను. ఇందులో నాది, అమ్మది ఏం తప్పు ఉంది. తనకి జరిగిన అన్యాయానికి భయభ్రాంతురాలై పిచ్చిదై నన్ను కడుపులో మోసింది… మా చుట్టాలు, సమాజం దృష్టిలో మా అమ్మ ఒక పతిత అయినా, నేను ఇల్లీగల్‌గా పుట్టాననుకుంటున్నా, నా దృష్టిలో అమ్మ దేవత. ఒక బంగారు తల్లి… వళ్లు కొవ్వెక్కి ఎవడితోనో తప్పు చేయలేదు… అన్యాయంగా ఒక దుర్మార్గుడికి బలి అయింది… ఇప్పటికి అమ్మ స్థానం నా దృష్టిలో ఎంతో ఉన్నత స్థానంలో ఉంది… పవిత్రా!… నేను ఒకటే నమ్ముతున్నాను… నా తల్లికి అన్యాయం జరిగినందుకో…. దేనికో తెలియదు… ఒక మనిషిని మోసం చేయడం నేరం! ఎదుటి మనిషి వలన మోసానికి గురికావడం ఆ మనిషి మంచితనానికి, సత్ప్రవర్తన, ఔన్నత్యానికి నిదర్శనం!” అంది నీలు.
“నీలూ… భయాన్ని జరిగిన అన్యాయాన్ని ప్రక్కన పెట్టి కాసేపు పవిత్ర ఆలోచిస్తే తను ఎవరికి భయపడవలసిన పని లేదు… దర్జాగా… తల ఎత్తుకొని తిరగొచ్చు…” అంది వసూ.
“మీరుద్దరూ ఫూలిష్‌గా ఆలోచిస్తున్నారు. అసలు ఆ రోగ్‌కి తప్ప ఈ విషయం ఎవరికి తెలియదు. వాడు ఒక బురదలో దొర్లే పంది… ఒక నికృష్టుడు. వాడికి చట్టం ఏ శిక్ష విధించినా, వాడు నా చేతుల్లో చావవలసిందే” అన్నాడు దేవ్ ఆవేశంగా.
“తమ్ముడూ!… నువ్విలా ఆవేశపడితే నా కోసం నువ్వేం చేయవద్దు… అమ్మ, నాన్నలకి మనిద్దరం రెండు కళ్లు అన్నావు. మానసికంగా చచ్చిపోయి చావడానికి సిద్ధపడితే బ్రతికించావు… నువ్వే ఆవేశపడితే… నేను సహించేది లేదు… ఒక్కటి గుర్తు పెట్టుకో… నీ ప్రాణం మీదకు తెచ్చుకుంటే… నీ అక్క ప్రాణాలతో మిగలదు…” అంది పవిత్ర.
కంగారుగా అన్నాడు వాసుదేవ్ – “అక్కా!… నేను… జాగ్రత్తగా ఉంటాను. నువ్వేం కంగారు పడకు…” అన్నాడు.
***
“దేవ్!… మన ప్లాన్ ఫెయిల్ కాదు కదా?”
“నా ఫ్రండ్ నమ్రత మనకి ఫుల్ హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేసింది. She is my best friend… ఇక మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వాడిని. నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకోవాలి… ఆవేశం ఆలోచనని చంపేస్తుంది దేవ్… ఆలోచనతో జాగ్రత్తగా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకు నడవాలి…!” అంది వసుంధర.
“వసూ!… నువ్వు ఉన్నావుగా… నన్ను కంట్రోల్ చేయడానికి…. మీ ఫ్రెండ్ నమ్రతకి మరో సారి మన ప్లాన్ గురించి చెప్పు… తన హెల్ప్ మనకెంతో అవసరం…” అన్నాడు.
“నేను ఇంటికి వెళ్లి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసాను… పేపరు మీద అన్నీ నోటు చేసి ఇచ్చాను Don’t worry దేవ్” అంది వసుంధర.
రామ్‌లాల్‌కి మెసెజ్ పెట్టింది పవిత్ర..
రాత్రి తొమ్మిది గంటలకి ఇంటి ముందు కారు వచ్చి ఆగింది… గబగబా వెళ్లి కారులో కూర్చుంది పవిత్ర.
కారు బయలుదేరిన 5 నిమషాలకు కారు వెనకే కారులో బయలుదేరాడు వాసుదేవ్…
ముందు కారు రయ్‌మని పోతుంది…
గూగుల్ నుండి షేర్ లోకేషన్‌లో పెట్టింది పవిత్ర outskirts దాటి కారు వెళుతూనే ఉంది… చివరికి పెద్ద మామిడి, కొబ్బరి తోటలోకి వెళ్లింది కారు… వెనకాల కారులో ఉన్న వాసుదేవ్ ఫామ్ హౌస్ బయటే కారు ఆపి వెయిట్ చేయసాగాడు… లోపలికి కారు వెళ్లడం ధనాలున కరెంట్ పోవడం ఒకేసారి జరిగింది.
“ఒరేయ్!… సీతయ్యా!… కరంట్ పోయింది. జనరేటరు ఎయ్యి… గంటలో వస్తున్నానని సార్ ఫోను చేసినారు కదా? ఆప్పడే అరగంట అయినది. బేగి జనరేటరు ఎయ్యి…. అన్నట్లు సచ్చినోడా డీజిల్ అయిపోనాది ఎల్లి తెస్తానన్నావు, తెచ్చినావా? ఎక్కడ చచ్చావురా? ఓలమ్మో కారు కూడ వచ్చినాది” అని, “ఎవరొచ్చినారో ఏటో” అని చీకట్లో నడుచుకుంటూ యల్లమ్మ కారు దగ్గరకు వచ్చి అంది.
“ఎవరు వచ్చినారు… సార్ చెప్పినారూ…. అమ్మాయి గారు వస్తారని… సమించు తల్లి… సచ్చినోడు సీతయ్య డీజిల్‌కి ఎల్లినాడు… ఈ విషయం చెప్పబోక పెద్దసారుతో… మా పీకలు కొస్తాడు” అని “ఒరే సితయ్యా” అని గట్టిగా కేకలు వేసింది యలమ్మ.
డీజిల్ డబ్బా భుజం మీద పెట్టకొని కూనిరాగం తీస్తూ ఫామ్‌హౌస్‌లోకి వెళుతున్న సీతయ్య వెనకాలే వాసుదేవ్ నెమ్మదిగా అడుగులు వేసాడు.
ఫామ్‌హౌస్ వెనకాల వైపు వెళ్లి, జనరేటర్ దగ్గరకు వెళ్లి… “ఎదవ కరంటు ఈయెల పోవాలా? పెద్ద సారు వస్తే నన్ను షూట్ చేసి పడేస్తారు. బేగ డీజిల్ యేయాలా” అని జేబులో అగ్గి పెట్టి కోసం చూసి… ‘తస్సాదియ్యా ఎదవ మతిమరుపు అగ్గి పెట్టి అయిపోనాది కొనడం మరిచిపోయాను ముసలిది ఎక్కడా కనబడడం లేదు… చెవి కోసిన మేకలా అరుస్తాది… ఓపాలి పిలవాలి’ అని అనగానే వెనకాలే ఉన్న వాసుదేవ్ గభాలున సీతయ్య నోరు మూసి తన కూడ తెచ్చిన మత్తు మందు జల్లిన రూమాలు పెట్టి… సీతయ్య స్పృహ కోల్పోయిన వెంటనే సీతయ్యని లాక్కుంటూ ఫామ్‌హౌస్ వెనకాల తోటలోకి తీసుకు వెళుతుండగా కాళ్లకింద గట్టిగా ఏదో గుచ్చుకొని చెప్పులోకి గుచ్చుకోవడంతో సీతయ్యని క్రింద పెట్టి చెప్పులో గుచ్చుకున్నది తీసి, ఏమిటా అన్నట్లు సెల్ టార్చివేసి చూసాడు… సాయి బాబా ఉంగరం… షాక్ అయ్యాడు. అది సాయి పల్లవికి తానిచ్చిన ఉంగరం. అంటే… సాయి పల్లవి ఇక్కడే ఎక్కడో ఉంది మాట… అంటే వీడు… చిన్న పిల్లలను అడవాళ్లను… ఎక్కడికో పంపుతున్నాడా?… అయితే సాయిపల్లవి కిడ్నాప్ అయి చాలా రోజులయ్యింది.
“ఓరి దొంగ సచ్చినాడా సీతయ్య… ఎక్కడ చచ్చావురా పెద్ద సారు వచ్చారు…. ఈ రోజు నీ పని అయిపోనాదిరా… నీ పీక కోస్తారు” అని గట్టిగా అరవసాగింది యల్లమ్మ.
ఉంగరం చప్పున బేబులో పెట్టి జనరేటర్ దగ్గరకు పరిగెత్తాడు వాసుదేవ్…
“ముసలిదానా… మీ పని ఈ రోజు అయిపోయింది… డీజిల్ ఉందా? నేను వేస్తాను” అని అనుకుంటు వస్తున్న వ్యక్తి మాటలు విని జనరేటర్ దగ్గర ఉన్న వాసుదేవ్ డీజిల్ డబ్బా నేల మీద పోసాడు…
“ఎవడివిరా నువ్వు?” అని డ్రైవర్ అన్నంతలో తన దగ్గర నున్న మత్తు రుమాలు డ్రైవర్ ముక్కు దగ్గర పెట్టి… ‘రాస్కెల్ వచ్చాడు…. అక్కడ పాపం తను ఎంత భయపడుతోందో?’ అని ఫామ్ హౌస్‌లోకి వెళ్లి…. ఏ రూమ్‌లో ఉన్నారో అని చీకటిలో చూసుకుంటూ వెళ్లసాగాడు వాసుదేవ్….
గది తలుపులు తెరిచే ఉన్నాయి…
“సారీ పవిత్రా… రాస్కెల్ సీతయ్య నా ముడ్ అంతా పాడు చేసాడు. నీకేమైనా పిచ్చా… సుసైడ్ చేసుకోవడం ఏమిటి? నువ్వు ఎంత అందగత్తెవో తెలుసా? నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేద్దాం అనుకున్నాను… నావల్ల కాలేదు… ఒక్క నిమిషం నీ మెసేజ్ లేటయితే నీ ఫోటోలు వైరల్ అయేవి… ‘నేను సూసైడ్… చేసుకుంటున్నాను… చనిపోయే ముందు నిన్ను ఒక్కటి అడుగుతున్నాను. నన్ను వదిలేయ్… నా ఫోటోలు డిలీట్ చెయ్యి’ అని మెసేజ్ పెట్టావు… చచ్చి సాధించేది ఏముంది? బ్రతికి ఉండి బ్రతుకు బంగారుమయం చేసుకో. నీకేం కావాలో చెప్పు? కార్లా? బంగళాలా?… డబ్బా… ఏం కావాలసినా ఇస్తాను” అని నవ్వి, “కాని నాకు కావలసినది నువ్వు… నువ్వు పెర్మనెంట్‌గా నాతో ఉంటానన్నా నాకు ఇష్టం ఉండదు… ఎందుకనుకున్నావు… ఏదైనా సరే నాకు త్వరగా బోరు కొడుతుంది. నాతో కొన్నాళ్లు కలిసి ఉండి తరువాత హాయిగా పెళ్లి చేసుకో… ఇండియాలో… ఇబ్బంది అనుకుంటే ఎబ్రాడ్‌లో నా కంపెనీకి డిప్యూటేషన్ మీద పంపిస్తాను… నువ్వు కలలో కూడా ఊహించలేని జీవితం అనుభవిస్తావు. ఏమంటావు?” అని గభాలున భుజం మీద చెయ్యి వేసాడు రామ్‌లాల్….
చేతిలో నున్న పెప్పర్ స్ప్రే చప్పున పైకెత్తేలోగా ధనాలున కరెంటు రావడంతో ఎదురుగుండా ఉన్న వసుంధరని చూసి షాకై ఆశ్చర్యంగా కంగారుగా అన్నాడు రామ్‌లాల్ – “ఎవరు నువ్వు?….”
(ఇంకా ఉంది)