జానేదేవ్-22

0
2

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 22వ భాగం. [/box]

[dropcap]అ[/dropcap]ప్పటికే పెప్పర్ స్ప్రే చేయబోతున్న వసుంధర చెయ్యి పట్టుబోతుంటే పెనుగులాడుతూ… పెప్పర్ స్ప్రే చేసింది…

“యూ!… రాస్కెల్!… ” అని కళ్లు నులుపుకుంటూ వసుంధరని పట్టకోవడానికి ప్రయత్నించసాగాడు.

అప్పటికే వాసుదేవ్ గభలున లోపలికి వచ్చి రామ్‌లాల్‌ని ఎటాక్ చేసాడు.

రామ్‌లాల్ చేతిలో ఉన్న వసుంధర చేతిని విడిపించడానికి ప్రయత్నిస్తూ రామ్‌లాల్ మొఖం మీద బలంగా ఒక గుద్దు గుద్దాడు వాసుదేవ్.

అప్పటికే డీ.జి.పీ విజయ్‌కాంత్ పోలీసు ఫోర్సుతో లోపలికి వచ్చాడు… రామ్‌లాల్‌ను చుట్టుముట్టారు.

“అంకుల్!… థాంక్స్ అంకుల్… వీడు మాములు వాడు కాదు అంకుల్!… అంతర్జాతీయ దొంగ… వీడు నేరాలు ఇప్పడే కాదు… R.L.Solutions సాఫ్ట్‌వేర్ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఆడవాళ్లకి రక్షణ లేకుండా అయింది. ఈ మధ్యనే మా ఫ్రెండ్ కార్తీక్ అక్క జ్యోతి ఆఫీస్ చివరి ఫ్లోర్ ఎక్కి కిందకి దూకి సూసైడ్ చేసుకుంది. సూసైడ్ ఎందుకు చేసుకుందో ఎవరికీ తెలియదు. జ్యోతి చావు మిష్టరీగానే మిగిలిపోయింది…. వీడు మామూలుగా ఆడవాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడు… ఎవరికి ముఖం చూపించలేక సూసైడయినా చేసుకోవాలి లేదా వీడు అన్నదానికి ఒప్పకొని, ఎవరికి తెలియదు, పరువుపోలేదు అని మానసికంగా చచ్చిపోతూ బ్రతకాలి… ఇతను… నా బెస్ట్ ఫ్రెండ్ వాసుదేవ్… He is very nice guy. వీడి కథ మొత్తం తెలుకుకున్నాడు… ఎలాగైనా చట్టానికి పట్టించాలని డేర్ చేసి నాతో విషయం చెప్పాడు. మా ఇద్దరి వలన కాదేమో అని నమ్రతని మీతో చెప్పి హెల్ప్ చేయించమని అడిగాను” అని వసుంధర అంటుండగానే.

చిరునవ్వుతో అన్నాడు డి.ఐ.జి విజయకాంత్…

“Congratulations Vasudev. You have done great job to the society. Society needs the youth like you. Keep it up” అన్నాడు.

“థాంక్యూ సార్” అని గభాలున జేబులో నుండి సాయిబాబా ఉంగరం తీసి డి.ఐ.జి విజయ్‌కాంత్‌కి చూపెడుతూ “సార్! ఈ రింగ్ నాదే సార్… మా ఇంటి దగ్గర గుడి ఉంది. శాస్త్రిగారమ్మాయి… ఆ అమ్మాయికి తోబుట్టువులు ఎవరు లేరు” అని జరిగినదంతా చెప్పి… “ఈ రింగ్ ఇక్కడే దొరికింది సార్!… నాకు అనుమానంగా ఉంది సార్. ఆ ముగ్గురు అమ్మయిలను వీడే కిడ్నాప్ చేసాడనిపిస్తుంది. మన దేశంలో ఆడపిల్లల కిడ్నాప్‌లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆడపిల్లలను కిడ్నాప్ చేయించేది కూడా వీడే అనిపిస్తుంది సార్. కిడ్నాప్ అయిన సాయిపల్లవి పెట్టుకున్న రింగ్ ఇక్కడ దొరకడం ఏమిటి సార్?” అన్నాడు వాసుదేవ్.

“నువ్వు చెప్పింది కరట్టే బాబూ!… అయ్యా పోలీసుబాబూ… డజను మంది ఆడపిల్లలు ఆ ఎనకాల పాడుబడిపోయిన ఇంటిలో ఉన్నారు… ఆళ్ళను రేపు రాతిరికి ఏ దేశమో పంపడానికి మాటలు జరుగుతూన్నాయి” అంది ఎల్లమ్మ.

పోలీసుల అదుపులో ఉన్న రామ్‌లాల్ ఉరిమినట్లు చూసాడు.

“ఏటి అలా సూత్తావు? నేను కాని మాట అనలేదు. నీకు భయపడి చచ్చిన పాముల్లా ఉన్నాం. ఇప్పడు నువ్వు కోరలు పీకిన పామువి. రాతిరికి నువ్వు ఆళ్లకి తీసుకు ఎలితే ఆడపిల్లల్లో ఒక పిల్ల ఏం అందో తెలుసా? బామ్మా!… మేము నీ మనుమరాళ్లలాంటి వోల్లం. మమ్మలను విడిచిపెట్టు… బ్రతికినంత కాలం నిన్ను దేవుడిలా పూజచేసుకుంటాం అని… నేనంత గొడ్డుబోతు దానినైనా, పిల్లా పీచు లేని దానినైనా ఆ పిల్లల మాటలు, ఆళ్ల ఏడుపులు నా మనసుని ఆలోచనలో పడేసాయి… పోలీస్ బాబూ!… చిన్న పిల్లల దగ్గర నుండి…. పెద్దొల్ల దాకా వదలడు… ఆడపిల్లను దేశాలకి అమ్మేస్తాడు” అంది ఎల్లమ్మ.

అప్పటికే సగం పోలీసులు తోటలోకి పరిగెత్తారు వాళ్లు కూడా వాసుదేవ్ పరిగెత్తాడు… డి.ఐ.జి విజయ్‌కాంత్ నడుస్తూ “వీడిని లాకప్‌లో పడేయండి…” అన్నాడు.

కారు చీకటిగా ఉంది తోట…. పాడుబడిపోయిన ఇల్లు…. పోలీసులు తలుపులు తీయగానే బిలబిలమంటూ యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు వచ్చి సంతోషంగా… “పోలీసులు వచ్చారు… మనల్ని విడిపించడానికి” అని అమ్మాయిలు అంటుండగానే “అన్నయ్యా! వచ్చావా” అని గుంపులో నుండి సాయిపల్లవి పరుగున వచ్చి వాసుదేవ్ నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. కళ్లనుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.

“సాయీ!… ఏడవకమ్మా… నీకేం పరవాలేదు” అన్నాడు వాసుదేవ్.

“అన్నయ్యా!…. అన్నయ్యా….” అని ఏడుస్తూ “నువ్విచ్చిన ఉంగరం ఎక్కడో పడిపోయిందన్నయ్యా. నాకు ఎం.బి.యస్ సీటు రావాలని ఉంగరం ఇచ్చావు ఈ సారి ఖచ్చితంగా సీటు వస్తుందని సార్ అన్నారు” అని వెక్కిళ్లు పడుతూ ఏడుస్తూ అంది సాయిపల్లవి .

“ఇదిగో నీ రింగ్” అని సాయిపల్లవి వేలుకి పెట్టి “ఇక మీ అందరికి ఏం పరవాలేదు ధైర్యంగా కాలేజికి వెళ్లి, హాయిగా చదువుకోండి. పోలీసులు వాడి సంగతి చూసుకుంటారు” అన్నాడు వాసుదేవ్.

“నువ్వు ఉంటే మాకు పోలీసులు అక్కరలేదన్నయ్యా. you are great” అని కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ అంది సాయి ప్లలవి.

నవ్వుతూ గంబీరంగా అన్నాడు డి.ఐ.జీ విజయ్‌కాంత్ “మీ అన్నయ్య – ముసుగులోనున్న ఒక ఇంటర్ నేషనల్ క్రిమినల్‌ని పట్టుకున్నాడు. Once again I would like to congratulate you వాసుదేవ్” అని అభిమానంగా భుజం మీద చెయ్యి వేసాడు.

“థాంక్యూ సార్” అన్నాడు వాసుదేవ్.

 ***

“ఏం ఇచ్చి నీ ఋణం తీర్చుకోను తమ్మడూ? అమ్మ, నాన్న నాకు జన్మ ఇస్తే, తిరిగి పునర్జన్మ ఇచ్చావు” అంది అభిమానంగా వాసుదేవ్ చెయ్యి పట్టకొని పవిత్ర.

“అక్కా!… నువ్వు కూడ ఏంటి?…. అందరూ నేను ఏదో గొప్ప పని చేసేసాని అభినందించడం, పొగడడం చాలా చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఏం చేసానక్కా? మనం మనుషులం… జంతువుల్లో కూడ ఒక దానికి అపాయం జరిగితే తక్కినవని ఏకమై నిస్సహాయస్థితిలో ఉన్న జంతువుకి సహాయపడతాయి…. కాని…. మనుషులు…. మరో మనిషికి అపాయం చేయడానికి, అన్యాయం చేయడానికి… ఇలా ఎనెన్నో వెధవ పనులు చేస్తున్నారు. నాకళ్లెదుట అలాంటి దుర్మార్గాలు కనబడుతుంటే కళ్లు మూసుకొని ఎలా ఉండగలను?…”

“తమ్ముడూ!… నీ మనసెంతో గొప్పదిరా.”

“అక్కా!…” అన్నాడు చిరుకోపంతో.

“నన్ను చెప్పనీయరా!… నీ మనసుకి ఏం తోస్తే అది చేస్తావని తెలుసు… కాని ఆ సమయంలో నీ గురించి కూడ ఆలోచించు… నీ కేమైనా అయితే…! ”ఇంకా పవిత్ర మాట పూర్తి కానేలేదు.

 “అక్కా!… నా గురించి నేను ఆలోచించుకుంటే ఒక్క అడుగు కూడ మందుకు వేయలేను” అన్నాడు.

ఏం మాట్లాడాలో తెలియని దానిలా అలా చూస్తూ ఉండిపోయింది.

“అక్కా! రెస్ట్ తీసుకో!… అమ్మ, నాన్నకి ఇప్పటి వరకు… నీ విషయంలో… అక్క బాగానే ఉంది, ప్రాజెక్ట్ విషయంలో సమస్య వచ్చింది… ఇప్పడు మీరు వచ్చాక చూస్తారుగా, అక్క బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాను. ప్రొద్దున్నే వాళ్లు వస్తున్నారు”  అన్నాడు.

“అలాగే తమ్ముడూ!…” అంది నవ్వుతూ

రాత్రి పది గంటలయింది.

నిద్రలోకి జారుకుంది పవిత్ర.

ఆలోచనలో పడ్డాడు వాసుదేవ్. ప్రొద్దున్నే ట్రైన్‌కి నాన్నగారు, అమ్మ వస్తున్నారు. వాళ్లు వచ్చేటప్పటికి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అక్క తీరు చూస్తుంటే పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావడం లేదు. కాలమే సమాధానం చెబుతుంది. అంత వరకు తను తొందర పడకూడదు. పాపం నీలూ!… తల్లి తిరిగి మాములు స్థితిలోకి వచ్చేస్తుంది ఏమో అని భయపడుతుంది… తనకి తెలియదు… ఇన్నాళ్లు భయబ్రాంతులతో బ్రతుకుతున్న తల్లిలోని భయం పటాపంచలై మాములు అవుతుందని.

ఏ మనిషైనా జీవితంలో ఏదైనా జరిగిన సంఘటన వలన భయపడితే… ఆ భయం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయాన్ని దగ్గరగా తీసుకు వచ్చి చూపెడితే క్షణకాలం భయపడినా, ఆ తరువాత ఆ భయాన్ని వెంటపడి తరిమి కొట్టి తరువాత నిశ్చింతగా ఉండడానికి మనిషి ఇష్టపడతారు…

కాలింగ్ బెల్ మ్రోగడంతో ఈ వేళప్పుడు ఎవరు వచ్చారు అని అనుకుంటూ తలుపు తీసుకుంటూ షాకైయ్యాడు.

ఎదురుగా ప్రదీప్…

ఒక్క నిమిషం కంగారు పడి, తరువాత సర్దుకొని, “రా… ప్రదీప్…” అన్నాడు.

“సారీ!…. దేవ్!…. I am very sorry” అని లోపలికి వచ్చాడు… చేతిలో సూటుకేస్ ఉంది.

“నేను బెంగళూరు నుండి కంపెనీ పని మీద అనుకోకుండా వచ్చాను… ఇంటికి తాళం వేసి ఉంది. అమ్మ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అప్పడప్పుడు నాన్నగారు, పని మీద ఊరెళ్లినా, అయినా నాతో ఊరెళుతున్నట్లు చెబుతారు… ఫోను చేసి నాన్నమ్మకి బాగోలేదని ఫోను వస్తే హడావిడిగా వెళ్లిపోయాం… రేపు ప్రొద్దున్న బయలుదేరి వచ్చేస్తున్నాం అని నాన్న చెప్పగానే హోటల్‌కి వెళ్లిపోయాను…. పవిత్ర గుర్తువచ్చింది… ప్రొద్దున్న తను ఆఫీసుకి వెళ్లిపోతుంది. నేను ఆఫీసుకి వెళ్లిపోయి పని చూసుకొని ఈవినింగ్ ఫ్లైట్‌కి వెళ్లిపోతాను…. దేవ్…తను… పవిత్ర ఇన్నాళ్లు బెస్ట్‌ ఫ్రెండ్‌గానే అనుకున్నాను… కాని పవిత్రతో నాకు ఎంగేజ్ మెంట్ అయినాక… ఏదో ఫీలింగ్. నా మనిషి ఇక్కడే ఉంది… తనని మిస్ అవుతున్నాను. ఒకసారి వెళ్లి చూడాలి అని అనిపించింది… అందుకే ఒక్కసారి పవిత్రని కలిసి వెళ్లిపోవాలనిపించింది… పవిత్ర పడుకుందా?” మొహమాటపడుతూ అన్నాడు.

ఏం మాట్లాడాలో తెలియని వాడిలా ఒక్క నిమిషం మౌనం వహించి… గభాలున గదిలోకి నడిచి కాగితంతో హాలులోకి వచ్చి… “ప్రదీప్!… నాకు ఎలా చెప్పాలో కూడ తెలియడం లేదు… అక్క తన మనసంతా తెరిచి ఈ లెటర్ వ్రాసింది. నేను చెప్పే కన్నా నువ్వు చదివితేనే బాగుంటుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఏం అనుకోం ప్రదీప్ అక్క అయితే తన నిర్ణయం వ్రాసింది కూడా…”

కంగారుగా ప్రదీప్ లెటర్ తీసుకొని చదువుకోసాగాడు.

లెటర్ చదువుతున్న ప్రదీప్ మొఖంలో ఆవేశం, కోపం, బాధ… ఎన్నో చోటు చేసుకున్నాయి. చప్పున లెటర్ మడిచి కంగారుగా అన్నాడు.

“పవిత్ర!… ఎక్కడుంది…. తను బాగానే, ఉంది కదా? … తనని నేను ఒక్కసారి చూడాలి” అన్నాడు బాధగా.

“అక్క బాగానే ఉంది” అని గదిలోకి వెళ్లబోతుంటే వెనకాలే వెళ్లాడు ప్రదీప్.

మంచం మీద కూర్చొని మోకాళ్లమీద తల ఆన్చి ఉంది… కళ్లలో నుండి కన్నీళ్లు నిండి బుగ్గల మీదుగా జారసాగాయి.

గభాలున వెళ్లి రెండు చేతులతో పవిత్ర భుజాలు పట్టుకొని కుదుపుతూ… “అలాంటి పిచ్చి పని ఎందుకు చేసావు… నువ్వు ఏమైనా అయిపోతే నేను పిచ్చివాడిని అయిపోతానేమో అని ఆలోచించలేదా పవిత్రా… అఫ్‌కోర్సు…. నువ్వు ఒకలా అనుకోవచ్చు… ఇద్దరం కలిసి తిరగలేదు… ఒకరి కోసం ఒకరం అన్నట్లు ప్రేమికుల్లా కబుర్లు చెప్పకోలేదు… నా కోసం ప్రదీప్ ఆలోచించడు… మరిచిపోతాడు అని…. నేను బ్రతికి ఉన్నంత కాలం నిన్ను మరిచిపోను పవిత్రా… ఎందుకంటే నాలో ప్రేమ మొలకెత్తింది నిన్ను చూసాకే…

రోడ్డు మీద వెళ్తుంటే బురద మన మీద పడితే మనల్ని మనం అసహ్యించుకుంటామా? … రెండు రోజుల క్రితం బెంగుళూరులో ఏం జరిగిందో తెలుసా?… ఇద్దరు ప్రేమికులు లాంగ్ డ్రైవ్ వెళ్లారు… రిటన్‌లో చీకటి పడింది… కారుని అడ్డగించి నలుగురు నరరూప రాక్షసులు అమ్మాయిని రేప్ చేసారు… కళ్లెదుటే అన్యాయం జరిగినా శక్తిహీనుడై ఏం చేయలేకపోయాడు… అమ్మాయి భయాందోళనతో పిచ్చిదయింది… కోమాలోకి వెళ్లిపోయింది. రాత్రింపగళ్ళు ప్రియురాలికి సేవలు చేస్తున్నాడు ప్రియుడు…. తను బ్రతికితే చాలంటున్నాడు.

దేశం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచం మొత్తాన్ని అరచేతి ఫోనులో చూడగలుగుతున్నాం… అంతే వేగంగా మానవమృగాలు బయలుదేరారు…. లేకపోతే ఎనిమిదేళ్ల పసిబిడ్డ అసిఫాని 60 ఏళ్ల వయసున్న పూజారి దగ్గర నుండి… ప్రజలకి రక్షణ కల్పించ వలసిన వ్యవస్థలోనున్న ఎస్సై వరకు ఎందుకు అమానుషంగా రేప్ చేస్తారు?…

జీవితంలో మనకి ఇష్టం లేనివి ఎన్నో జరుగుతుంటాయి… వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా ముందుకు వెళతాం… ఇది అంతే…. నీ మనసుకి మలినం అంటుకుంటే తప్పకుండా నేను బాధపడతాను. నువ్వు ఎప్పటికి పవిత్రవే… పవిత్ర లేకపోతే ప్రదీప్ లేడని గుర్తు పెట్టుకో” ఆవేశంగా అన్నాడు.

ఒక్క ఉదుటన ప్రదీప్ గుండె మీద వాలిపోయి, మరుక్షణం బలంగా పెనవేసుకుపోయి, ప్రదీప్ గుండె మీద తల అన్చింది పవిత్ర. కళ్ల నుండి కన్నీళ్ల ఏకధాటిగా కారుతూనే ఉన్నాయి.

***

బెల్‌రింగ్ కావడంతో తలుపు తీసిన పవిత్రని చూసి నిరంజనరావు, సుమిత్రల మొఖం సంతోషంతో నిండిపోయాయి.

“నేను చెప్పానా?… మనం ఇంటికి వెళ్లేటప్పటికి పవిత్ర మాములు అయిపోతుందని… టెన్షన్స్‌లో ఉన్నప్పుడు డల్‌గా, మూడీగా ఉండడం కామన్ అని…. కాని నా మాట వినిపించుకోకుండా నడుస్తున్నా, కూర్చున్నా…. చివరికి దేవునికి దణ్ణం పెటుతున్నప్పుడు కూడ పవిత్ర ఎందుకండి అలా ఉంది అని వేపుకు తిన్నావు… హమ్మయ్యా!… పవిత్రా!…. నువ్వులా కనబడడం నాకు పెద్ద రిలీఫ్ అమ్మా…” అన్నాడు చిన్నగా నవ్వుతూ నిరంజనరావు.

“నా బాధ మీకు ఎగతాళిగా ఉంది… నా బంగారు తల్లి ఎప్పడైనా అలా ఉందా? ఇంకాస్త నీరసంగా ఉన్నావమ్మా. నేను వచ్చేసాగా… శుభ్రంగా వండి పెడతాను… నాలుగు రోజుల్లో లేచి తిరగాలి” అంది.

నవ్వుతూ అంది “సరే అమ్మా… మీరిద్దరూ స్నానాలు చేయండి, నేను కాపీ పెట్టి టిఫిన్ చేస్తాను.”

“నువ్వేం చేయవద్దు… నువ్వు రెస్ట్ తీసుకో” అంది సుమిత్ర.

చిరుకోపంగా చూసి అంది పవిత్ర.

“అమ్మా… కనీసం కాఫీ అయినా ఇవ్వనీ.”

“సరే తల్లీ… చెయ్యి కాల్చుకుటావు జాగ్రత్త…”

“అమ్మా!…” అని నవ్వుతూ వంట గదిలోకి నడిచింది పవిత్ర.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here