జానేదేవ్-24

0
2

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 24వ భాగం. [/box]

[dropcap]ఆ[/dropcap]శ్చర్యంగా వసుంధర వైపు చూసి “వసూ! ఏంటిది…. నీకేమైనా మతిపోయిందా…” అన్నాడు వాసుదేవ్ కోపంగా.

“దేవ్!… ప్లీజ్!… కోపం తెచ్చుకోకు…. ఒక్క నిమిషం ఆగు” అని కోపంగా తల్లిదండ్రుల వైపు చూసి “ఇప్పుడు గొడవలు, పంచాయితీలు ఎందుకు…. నా కడుపులో బిడ్డకు తండ్రి దేవ్!… మా పెళ్ళి జరిపించండి…. ” అంది వసుంధర.

సుమిత్ర, పవిత్ర, వాసుదేవ్… కంగారుగా వసుంధర పొట్ట వైపు చూసారు. గుమ్మడికాయ సైజులో ఉంది వసుంధర పొట్ట.

“మా పెద్దమ్మాయి చెల్లెలుకి మంచి సంబంధం చూసింది…. డాక్టర్ ప్రకాష్… USAలో పెద్ద డాక్టరు. వాళ్ళకి మా వసూ ఎంతో నచ్చింది… ఈ వారంలో వసూతో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడానికి USA నుండి వస్తున్నారు. ఇప్పుడు వాళ్లకి మేము ఏం చెప్పాలి? మా మొఖాలు ఎలా చూపెట్టాలి” అంది బాధగా డాక్టరు ప్రమీల.

ఆవేశంగా గభాలున వసుంధర దగ్గరకు వెళ్లి పొట్ట మీద చెయ్యి పెట్టి “ఏంటిదంతా వసూ” అని అనుమానం వచ్చి చప్పున చేత్తో పొట్ట మీద నొక్కి “చూడండి ఆంటీ… మీరు గైనకాలజిస్టు కదా? ఒకసారి చూడండి” అన్నాడు కోపంగా వాసుదేవ్…

ఒక్క నిమిషం వాసుదేవ్ మాటలకు ఆశ్చర్యపోయి గభాలున వెళ్ళి వసుంధర పొట్ట మీద చెయ్యి పెట్టి చూడబోయింది డాక్టరు ప్రమీల.

కంగారుగా వసుంధర వెనక్కి జరిగి… “నా బిడ్డను ఏం చేయకమ్మా…. మా పెళ్ళికి ఒప్పకోకపోతే, నా బిడ్డలో వసూదేవ్‌ని చూసుకుంటూ బ్రతికేస్తాను” అంది.

కూతురు ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ, ‘నీ బిడ్డను ఏం చేయను’ అని చప్పన వసుంధర రెండు చేతులు పట్టుకొని కంగారుగా “ఏంటి వసూ ఇదంతా?…. ఏంటి నాటకం?” అని వసుంధర పొట్ట మీద చెయ్యి వేసి చూస్తూ “ఇలాంటి వెధవ నాటకాలు ఎందుకు ఆడుతున్నావు?… అసలు నీకు ఇలాంటి వెధవ ఆలోచన ఎందుకు వచ్చింది?… ఛ!… ఛ!…” అంది కోపంగా డాక్టరు ప్రమీల.

“సారీ అమ్మా!…. ఇలాంటి సీను టి.వి సీరియల్‌లో చూసాను. బాగుందనిపించింది. అందుకే చిన్న పిల్లో…” అని నసిగి, ఆ పిల్లోని బయటకు తీసి చేత్తో పట్టుకొని బిక్క ముఖం పెట్టి నేల చూపులు చూడసాగింది వసుంధర.

ఒకరి ముఖాలు ఒకరు కంగారుగా ఆశ్చర్యంగా చూసుకున్నారు సుమిత్ర, పవిత్ర, వాసుదేవ్…

“అయితే వాసుదేవ్‌తో మ్యారేజ్‌కి మీరు ఒప్పుకోరా?” అంది వసుంధర.

అప్పటికే వసుంధర కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

చప్పున కూతురు దగ్గరకు డాక్టరు ప్రమీల వెళ్ళి “నీ మనసులో వాసుదేవ్ ఇంతగా ఉన్నాడని తెలిసాక, మ్యారేజ్‌కి ఒప్పుకోకుండా ఎలా ఉంటాం… ఏదో మా నర్సింగ్ హోమ్ చూసుకోవడానికి అల్లుడు, కూతురు డాక్టర్లయితే బాగుంటుందనుకున్నాం. USA వెళ్లాక డాక్టరు ప్రకాష్ అయితే బాగుంటుందనుకున్నాం… ఇప్పుడు నువ్వు వాసుదేవ్‌ని ఎంత లైక్ చేస్తున్నావో తెలిసాక మీ ఇద్దరికి పెళ్ళి చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం.”

“చూడు ప్రమీలా!… మనకు నచ్చినవి పిల్లల మీద బలవంతంగా రుద్దకూడదు… మనకి నచ్చినవి వాళ్లకి నచ్చాలని లేదు… వాళ్లకి నచ్చినవి మనకి నచ్చాలని లేదు…!”

“కలిసి జీవించే ఇద్దరికి ఒకరికి ఒకరు నచ్చితే చాలు! వాళ్లు జీవితంలో ఏ సమస్యనైనా దేనినైనా దాటుకుంటూ ముందుకు వెళతారు…. అన్నట్లు వాసుదేవ్ నాన్నగారు లేరాండీ…” అని డాక్టరు రమేష్ అంటుండగానే నిరంజనరావు హాల్లోకి వచ్చాడు.

ఒకరిని ఒకరు పరిచయాలు చేసుకున్నారు….

అప్పుడు సుమిత్ర, పవిత్ర వంట గదిలోకి కాఫీలు తీసుకురావడానికి వెళ్లారు…

అక్కడ ఉండడం ఇబ్బందిగా అనిపించి గదిలోకి వెళ్లి కిటికీలో నుండి బయటకు చూడసాగాడు వాసుదేవ్.

ఎదురింటిలో దృశ్యాన్ని చూసి వాసుదేవ్ పెదాలపై నవ్వు బయలుదేరింది.

మామిడి చెట్టు కింది ఉన్న చాప మీద రాజేశ్వరరావు యోగాసనాలు వేస్తున్నాడు…. ఎదురుగా చేతిలో బెత్తంతో పట్టుకుని…. “ఇంకాస్త వంగండి… ఊపిరి తీసుకొని, వదలండి…. సరిగా వేయండి ఆసనాలు. నా పసుపు కుంకం నాకు దూరం చేయకండి” అంటుంది భాగ్యలక్ష్మి.

గదిలోకి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి, వెనక నుండి వాసుదేవ్‌ని కౌగిలించుకొని “ప్లీజ్ దేవ్…. నన్ను క్షమించు… నీ కసలే సెంటిమెంట్స్ తక్కువ… ‘ప్రేమా లేదు దోమా లేదనే మనిషివి… నేను ఈ స్టెప్ వేయకపోతే…. మీ వాళ్లు చూసే సంబంధం చేసుకో…. నాకే పరవాలేదు… జానేదేవ్’ అని ఎక్కడంటావో అని ఇలా చేసాను…. ఇంకా కోపం పోలేదా, మాటడవా?…. నువ్వు లేనిది నేను లేను దేవ్” అంది వసుంధర.

గభాలున వెనక్కి తిరిగి, ఆమాంతంగా వసుంధరని కౌగిట్లో బంధించి ఊపిరాడనంతలా ముద్దులు పెట్టాడు.

ఒక్కసారి తెల్లబోయింది వసుంధర…

సిగ్గు పడుతూ…. కళ్ళెత్తి వాసుదేవ్ కళ్లలోకి చూస్తూ “సమాధానం చెప్పలేదు” అంది…

“సమాధానం చెప్పానుగా…. మళ్లీ ఇంకోసారి చెప్పనా?” అని గభాలున వసుంధరని కౌగిట్లో బంధించబోయాడు వాసుదేవ్.

కంగారుగా అంది – “దేవ్!…. వదులు…. నువ్వు మారిపోయావు”

నవ్వుతూ అన్నాడు – “నువ్వే నన్ను మార్చేసావు…”

“వసూ!…. దేవ్…. ఎక్కడున్నారు కాఫీ చల్లారిపోతుంది….!” అని గట్టిగా పిలిచింది పవిత్ర.

చప్పున వాసుదేవ్ కౌగిలిని విడిపించుకొని…. కంగారుగా అంది – “నేను వెళ్లిన కాసేపయ్యాక నువ్వు రా”.

నవ్వుతూ చూసాడు వాసుదేవ్.

***

చేతిలో కుంకం భరణితో జానకి, చేతిలో టిఫిన్ బాక్స్‌తో నీలవేణి హాలులోకి వచ్చారు…. హాలులో అందరిని చూసి మెహమాటంగా అంది నీలవేణి.

“అమ్మ… మీకు బొట్టు పెట్టాలంటే….”

“నీలూ!…. అంత ఇబ్బంది పడుతున్నావేంటి?…. ”

“వీళ్లు మా అమ్మా, నాన్నా…. నా పెళ్లి గురించి మాట్లాడానికి వచ్చారు…. అమ్మా! నీలు…. ఎదిరింటిలో ఉంటారు…. వాసుదేవ్ బెస్ట్ ఫ్రెండ్… అఫ్‌కోర్సు నాకు ఫ్రెండే…”

వాళ్లిద్దరికి నమస్కారం పెట్టింది నీలవేణి.

“చాలా చక్కగా ఉంది అమ్మాయి” అంది డాక్టర్ ప్రమీల.

“ఒక్క చక్కదనమే కాదండి…. చాలా మంచి మనసున్న అమ్మాయి…. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఇంటి కోడలవుతుందో గాని వాళ్లు అదృష్టవంతులు” అంది సుమిత్ర…

“సుమిత్రగారు!… మా నీలుతో అట్ల తద్ది చేయిస్తున్నాను…. చాలా సేపు అట్ల తద్ది చేయడానికి ఇష్టపడలేదు నీలు. చివరికి నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఒప్పుకుంది” అని సుమిత్ర నుదుటి మీద కుంకుం బొట్టు పెట్టి ప్రక్కనే ఉన్న డాక్టర్ ప్రమీలకు, పవిత్రకి, వసుంధరకి బొట్టు పెట్టి… “తప్పకుండా రేపు సాయంత్రం మా ఇంటికి రండి…. వసూ నాకు తెలుసు…. మీరు కూడా ఉండడం సంతోషంగా ఉంది…. మరి వెళతానండి…. నీలూ! దేవ్‌కి ఇష్టమని క్యారట్టు హల్వా తెచ్చావు కదా? ఇంకా పట్టుకొనే ఉన్నావేమిటి?…. నువ్వు ఉంటావు ఏమో నువ్వు ఉండు…. నాకు బోలేడు పనులున్నాయి” అని జానకి అనగానే…

“మీరు ఉండండి…. కాసేపు మీతో మాట్లాడినాక వెళుదురుగాని” అంది డాక్టర్ ప్రమీల.

అందరూ ఆశ్చర్యంగా చూసారు.

“నాకు ఈ అమ్మాయని చూసాకా ఆలోచన వచ్చింది. డాక్టర్ ప్రకాష్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే యాక్సిడెంట్‌లో పోయారట… మా అమ్మాయి చేస్తున్న హాస్పిటల్‌లోనే డాక్టర్ ప్రకాష్ కార్డియాలజిస్ట్‌గా చేస్తున్నాడు…. చాలా మంచి విలువలున్న అబ్బాయి అని మా అమ్మాయి చెప్పింది. ఎలాగు వాళ్లు రేపు ఇండియా వస్తున్నారు…. ఈ అమ్మాయిని చూపెడితే బాగుంటుంది…. ఈ అమ్మాయి తప్పకుండా నచ్చుతుంది” అని ఏవో ఆలోచన వచ్చి చప్పున నీలవేణి వైపు చూసి “ఈవిడేంటటి ఇలా మాట్లాడుతుంది…. అతను ఎలా వుంటాడో అని అనుకుంటున్నావు ఏమో…. అచ్చం హీరోలా ఉంటాడు. మా అల్లుడు వాసుదేవ్ బ్రదర్ అంటే నమ్ముతారు” అని సెల్‌లో ఫోటోలు నీలవేణికి చూపించబోతే కంగారు పడింది నీలవేణి.

గభాలున తల్లి చేతిలో సెల్ అందుకొని… “నీలూ! చాలా బాగున్నాడు చూడు…” అని చూపించబోతే “నాకు చూపించు వసూ” అని సెల్ తీసుకొని ఫోటోలు చూసి సంతోషంగా…. “సుమిత్రగారూ!…. మీరు చూడండి” అని చూపించంది జానకి. తల్లి చేతిలో నుండి సెల్ తీసుకొని ఫోటోలు చూస్తూ…. “తమ్ముడూ!… చూడు ఎంత బాగున్నాడో!…. ఆంటీ చెప్పింది కరక్టే…. అచ్చం నీకు బ్రదర్‌లా ఉన్నాడు” అంది పవిత్ర.

“అయ్యో!… ఇంటి నిండా చుట్టాలున్నట్లున్నారు. మనం మనం తరువాత వాసుదేవ్‌తో సెల్ఫీ తీసుకుందాంలే… మరి వెళదామా?” అని వచ్చినంత వేగంగా రాజేశ్వరరావు, భాగ్యలక్ష్మి వెనుతిరగబోయారు.

“పరవాలేదు రండి… ” అని నిరంజరావు అన్నాడు.

“మా ఆవిడ చాలా తెలివైనదండి… ఫేస్‌బుక్‌లో మా ఇద్దరి ఫోటోలకు ఎవరు లైక్‌లు కొట్టడం లేదని ఆ మధ్య వాసుదేవ్‌తో దిగిన సెల్ఫీలు పెడితే బోలేడు లైక్‌లు వచ్చాయి.

“నిన్న న్యూస్‌లో ఇంటర్‌నెషనల్ క్రిమినల్‌ని పట్టకొని చట్టానికి అప్పగించినందుకు ముఖ్యమంత్రిగారు వాసుదేవుని అభినందిస్తూ చాలా మాట్లాడారు. నిన్నంతా అన్నీ చానల్స్‌లో వాసుదేవ్‌ని మెచ్చుకుంటూ, సమాజానికి ఇటువంటి వ్యక్తి అవసరం ఎంతో ఉందని చెబుతూనే ఉన్నారు… అన్నట్లు నీతో లైవ్ ఇంటర్‌వ్యూలు ఉంటాయని చానల్స్ వాళ్లు అంటున్నారు…. ఈ సమయంలో నీతో సెల్ఫీ తీయించుకొని ఫేస్ బుక్‌లో పెడితే బోలెడు లైక్‌లు వస్తాయని మా ఆవిడ ఆశ…” అని గడగడా గుక్క తిప్పుకోకుండా అన్నాడు రాజేశ్వరరావు.

“బాబూ!…. దేవ్…. చుట్టాలతో హడావిడిగా ఉన్నారు… తరువాత సెల్ఫీ తీసుకొవడానికి రమ్మంటావా?” అంది భాగ్యలక్ష్మి.

“ఎందుకండి…. మా అందరితో కలిపి వాసుదేవ్ ఫోటో తీయించుకుంటాడు” అన్నాడు నవ్వుతూ డాక్టర్ రమేష్.

ఒక్క నిమిషం అర్థంగానట్లు చూసి “మీరందరూ తీయించుకోండి… పాపం వాసుదేవ్ చాలా మంచి అబ్బాయి. ఎన్ని సార్లో సెల్ఫీలు తీయించుకున్నాం. మేము మాత్రం వాసుదేవ్‌కి చెరోవైపు నిలబడి ఫోటో తీయించుకుంటాం…. ఫేస్‌బుక్‌లో వాసుదేవ్‌తో కలిసి తీయించుకున్న ఫోటోలు పెడితే బోలేడు లైక్‌లు వస్తాయి” అంది భాగ్యలక్ష్మి.

అందరూ హాయిగా నవ్వుకున్నారు.

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here