[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 7వ భాగం. [/box]
[dropcap]లం[/dropcap]చ్ బాక్స్ వాసుదేవ్‌కిస్తూ – “సాయి పల్లవి చాలా తెలివైన అమ్మాయిరా… క్లాసులో తనే మొదటి స్థానంలో ఉంటుందట… ఆ పిల్లకి నువ్వంటే చాలా అభిమానం…. ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని రెండుసార్లు మనింటికి వచ్చింది… అన్నయ్యకి చూపెడతానని. ఆ సమయంలో నువ్వు ఇంట్లో లేవు” అంది సుమిత్ర.
నవ్వుతూ అన్నాడు వాసుదేవ్ – “అలానా… కాలేజీ నుండి వస్తున్నప్పుడు రిటన్‌లో నేను వాళ్ల ఇంటికి వెళతాలే.”
“ఆ పని చెయ్యి… ఎంతో మంది మనుషులు కలుసుకుంటుంటారు. విడిపోతుంటారు… కాని ఎవరో ఒకరే దగ్గరవుతుంటారు. సాయి పల్లవి అలాంటి అమ్మాయే… నేను గుడికి వెళితే తను ఉందనుకో… అన్నయ్యా…. అన్నయ్యా అని నీ గురించి ఒకటికి పదిసార్లు మాట్లాడుతుంది… సాయిపల్లవి నీ మీద చాలా అభిమానం పెంచుకుంది నాన్నా…. నువ్వు కూడా….” అని సుమిత్ర అంటుండగనే…
“నిజం చెప్పమంటావా అమ్మా… సాయిపల్లవి నన్ను అలా అన్నయ్యా…. అని అభిమానంగా పిలుస్తుంటే నాకు తనంటే చాలా అభిమానం ఏర్పడింది. నిజంగా తనలాంటి చెల్లెలుంటే చాలా బాగుండేదనిపించింది.”
“నీ మనసుకి అలా అనిపించినప్పుడు సాయిపల్లవి నీ చెల్లెలు క్రిందే లెక్క… ” అంది.
***
సాయంత్రం దేవ్ కాలేజ్ నుంచి వచ్చాకా, సుమిత్ర కొడుకుతో మాట్లాడుతూ, “అన్నట్లు నీలూ… ఎందుకో రెండు మూడు రోజుల నుండి రావడం లేదు… తండ్రి లేడు…. తల్లి ఉండి…. లోకంతో సంబంధం లేకుండా మంచం మీద పడి ఉంది…. ఉన్నది ఒక్క తాతయ్య మాత్రమే… ఆయన వయసు పైబడింది…. పాపం ఒక్కర్తి…. ఏం తోస్తుందో ఏమో… భగవంతుడు కొంత మందికి ఏదో ఒక కష్టం పెడుతుంటాడు…. ఎందుకో తెలియదు.”
“అమ్మా…” అన్నాడు కాస్త కోపంగా…
అర్థంకానట్లు చూసింది సుమిత్ర.
“ఏంటమ్మా… ఇలా అంటున్నానని ఏమైనా నా గురించి నువ్వు అనుకున్నా పరవాలేదు…. కాని నేను ఇక భరించలేక అంటున్నాను…
ఒక్కసారి ఆ భగవంతుడిని చూపెట్టు… ఎక్కడున్నాడు… కనబడ్డాడా…. లేదు…. కనబడకపోతే పోయాడు… తీరిగ్గా కూర్చుని వీళ్లకి ఈ బాధలు వాళ్ల నుదిటి మీద వ్రాద్దాం, వాళ్లకి సంతోషం వ్రాద్దాం… వాళ్లని కోటీశ్వరులుగా, వీళ్లని పేదవాళ్లుగా వ్రాద్దాం అని అదే పనిగా కూర్చొని చేతులు అరిగిపోయేలా వ్రాస్తున్నాడా? ఇవన్నీ వ్రాస్తున్నవాడు… పెద్ద పెద్ద స్కాంలు చేసి వేల కోట్లు సంపాదించేవాడిగా నానాగడ్డి కరిచి కోట్లు పోగు చేసుకోనే ధనవంతుడిగా రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుడిగా…. బిచ్చగడిగా, కూలీలుగా తలవ్రాతలు వ్రాస్తున్నాడా. ఇంత పక్షపాతంగా తలవ్రాతలు వ్రాస్తున్నవాడు దేవుడు ఎందుకు అవుతాడు… దేవుడు అనేవాడు లేడు అని నేను అనడం లేదు… దేవుడు ఒక నమ్మకం ఒ విశ్వాసం… అలా అనుకోనైనా కొంతమంది మనుషులు తప్పులు చేయడానికి భయపడతారు. వెనకడుగు వేస్తారు… అలాంటి మనుషులండబట్టే ఈ మాత్రం అయినా మన సమాజం ఇలా ఉంది” అన్నాడు వాసుదేవ్.
చిన్నగా నవ్వింది సుమిత్ర…
“మా కాలం… మనుషులు ఇలానే ఆలోచిస్తారు నాన్నా…”
“మా కాలం అంటున్నావు…. నువ్వేం క్రీస్తు పూర్వం మనిషివి కాదు…. నిజాన్ని ఆలోచించమ్మా…”
“సరేలేరా…” అంది నవ్వుతూ….
అప్పుడే అక్కడకు వచ్చిన నీలవేణి ఇద్దరి వైపు చూసి “ఏంటి ఆంటీ… ఇద్దరూ ఏదో సీరియస్‌గా డిస్కస్ చేస్తున్నారు… నేనేమి డిస్టర్బ్ చేయడం లేదు కదా…” అంది నవ్వుతూ…
ఏం చెప్పాలో తెలియనట్లు సుమిత్ర, వాసుదేవ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
“నీ గురించే నీలూ… ఈ మధ్యన నువ్వు రాలేదని ఒకసారి నిన్ను వెళ్ళి చూడమని… అంటున్నాను” అంది సుమిత్ర.
నీలవేణి కళ్లుల్లో సంతోషం టక్కున మెరిసింది.
“థాంక్స్ ఆంటీ…”
“దేనికమ్మా” అంది ఆశ్చర్యంగా సుమిత్ర…
ఒక్క నిమిషం ఏం చెప్పాలో తెలియక మౌనం వహించి, “మీకు…. నేను గుర్తు వచ్చినందుకు… ” అని గభాలున చేతిలో నున్న టిఫిన్ బాక్స్ సుమిత్ర చేతిలో పెట్టింది…
“ఏంటమ్మా?” అంది…
“స్వీట్ ఆంటీ… అమ్మా… అమ్మా… పుట్టిన రోజు… తాతయ్య…. పాపం ఈ వయసులో… కూతురు అచేతనంగా మంచం మీద ఉంటే… దుఃఖాన్ని దిగమింగుతున్నారు కాని… కళ్లల్లో తడిని దాచుకోలేకపోయారు. తాతయ్యకు ధైర్యం చెప్పి ‘అమ్మ… మన కళ్ల ముందే ఉంది… అమ్మకు మనము తన మనుషలమే అని మనసు విప్పి మాట్లాడకపోయినా నన్ను, నిన్ను చూస్తే ఆ కళ్లల్లో ఏదో వెలుగు, మనం తనకి ఉన్నామన్న భరోసా, కనబడుతుంది… నోరు తెరిచి మనతో మాట్లాడడం లేదని బాధపడకు తాతయ్యా… అలా అయితే ఎంతో మంది చిన్నారులు కళ్లు కనబడకపోయీనా చెవులు వినబడకపోయినా నోట మాట లేకపోయినా జీవన పోరాటం చేస్తున్నారు. అమ్మ మన కళ్లముందు ఉంది. తను చెప్పాలనుకున్నది చెప్పలేకపోయినా మన తోనే ఉంది… అది చాలు తాతయ్యా’ అని నచ్చచెప్పాను… అమ్మకు ఇష్టమైన స్వీటు తాతయ్య తన చేతులతో తినిపించారు… నాకు తినిపించే చాన్స్ ఇవ్వలేదండి” చిన్నగా నవ్వుతూ అంది.
“ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నానాంటీ. నిజం చెప్పాలంటే జీవితంలో మొదటి సారిగా ఇంత సంతోషంగా నేనెప్పుడూ ఉండలేదు” అంది.
ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకే సారి నీలవేణి వపు చూసారు.
నవ్వుతూ అంది నీలవేణి – “కంగారు పడకండి ఆంటీ…
మనిషి జీవితంలో సుఖాలు దుఃఖాలు ఒక దాని వెంట ఒకటి ఉంటాయి. ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన సంఘటనలు నన్ను ఎప్పుడూ ఒకలాగే ఉంచాయి. నిజం చెప్పాలంటే నా జీవితం నా చేతుల్లో లేదు… యాత్రికంగా బ్రతికేస్తున్నాను…. నా అనుకున్న చుట్టాలు ఉన్నారు. కాని మాకు దూరం జరిగారు… చేసిన తప్పులు కప్పిపుచ్చుకొని సమాజంలో ఏ తప్పు చేయని మనుషుల్లా చలామణి అవుతున్నారు… కాని చేయని తప్పని పెద్దది చేసి బూతద్దంలో చూస్తే ఎలా? కాని నాకు అర్థం కానిది ఒక్కటే! అందరిలాగే అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నాను. భూమి మీదకు వచ్చాను…. నువ్వు ఊపిరి ఎలా పోసుకున్నావు…. అంటే నేనేం చెప్పగలను?
పుట్టిన ప్రతీ బిడ్డ తొలిసారిగా నోటిలో నుండి వచ్చే మొట్ట మొదటి మాట… అమ్మ… నేను అలానే అన్నానట… తను తల్లి అయినా, నవమాసాలూ మోస్తున్నా… పురిటి నొప్పులుతో ప్రాణం పోయేటట్లు అవుతన్నా మతిస్థిమితం లేని చలనం లేని అమ్మ తన జన్మకు కారణం ఎవరో ఎలా చెప్పగలదు… అది చుట్టాల దృష్టిలో… సమాజం దృష్టిలో పెద్ద నేరం… అయినా ఆ విషయం గురించి నేనెప్పుడు ఆలోచించలేదు…
అసలు ఈ సమాజం ఎప్పుడు మారుతుంది… నాగరికత ముసుగులో… కూతురు తప్పుచేసినా, ఆ తప్పు ఎవరికి తెలియకుండా కప్పి పుచ్చి ఆ తప్పుని ప్రక్కకు తోసేసి తల్లిదండ్రులు… చక్కగా కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు తల్లిదండ్రులు… ఇది ఎంత పెద్ద నేరం… కాని అమ్మమ్మ, తాతయ్య గ్రేట్ ఆంటీ… ఏం జరిగిందో తెలియదు… వాళ్లకు తెలిసిందల్లా ఒక్కటే… తమ కూతురు బంగారం… తెలిసి ఏ తప్పు చేయదు… తప్పు జరిగింది… మతిని కోల్పోయి… ఎవరో… ఏమిటో తెలియని అయోమయ పరిస్థితిలోనున్న అమ్మని కంటికి రెప్పలా కాపాడుకున్నారు… నా జన్మకు కారణం అయ్యారు అమ్మమ్మ తాతయ్య… వాళ్ల వ్యక్తిత్వానికి…. వాళ్ల మంచి మనసులకు…. నేనెప్పుడు ఋణపడి ఉంటాను” అని చెబుతున్న నీలవేణి కళ్లల్లో నిండిన నీటిని గభాలున తుడుచుకొని “సారీ ఆంటీ… ప్చ్…. సడన్‌గా వచ్చిన సంతోషంలో నన్ను నేను మరిచిపోయి… ఏదేదో మాట్లాడేస్తున్నాను….”
సుమిత్ర, వాసుదేవ్… ఆశ్చర్యంగా మొఖమొఖాలు చూసుకున్నారు.
“నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా గర్వంగా ఉంటుంది నీలూ…. పరిస్థితులు అలా నిన్ను మార్చాయో లేక నీ తీరే అంతో తెలియదు కాని… నిన్ను ఆదర్శంగా ఆడపిల్లలు తీసుకొని ఎదగాలి” అంది.
కంగారుగా అంది నీలవేణి – “నేను అందరిలాగే అమ్మా, నాన్న ముద్దుల కూతురుగా ఆడింది ఆట పాడింది పాటాగా ఉంటే వేరేలా ఉండేదానిని ఏమో. పరిస్థితుల ప్రభావం మనిషి మీద ఉంటుంది కదా అంటీ” అంది.
“కరక్టుగా చెప్పావు నీలూ… అన్నట్లు ఈ రోజు అమ్మ నేను మీ ఇంటికి వస్తాం” అని వాసుదేవ్ అన్నంతలో కంగారుగా అంది నీలవేణి.
“అమ్మ… నిద్రపోతుంది… ఇప్పుడు తనని లేపడం ఎవరి వల్ల కాదు… ఒక వేళ నిద్ర నుండి లేపితే, ఏమైందో అనుకోని కంగారు పడిపోతుంది. భయపడిపోతుంది…”
ఆశ్చర్యంగా అన్నాడు వాసుదేవ్ – “అలాగా… డాక్టర్లు ఏమన్నారు…?”
“ఎంతో మంది డాక్టర్లుకి చూపించాం. సైకియాట్రిస్ట్‌కి కూడా చూపించాం.
అందరూ ఒకే మాట… ఆవిడ జీవితంలో చాలా పెద్ద షాక్ తగిలింది.. తను ఊహించని సంఘటన… తనని భయభ్రాంతులకు గురి చేసింది.
తనలో భయాన్ని ఎప్పుడు వదులుకుంటుందో మాములు మనిషి అవుతుంది… మందులు కన్నా తన భయానికే… కారణం తెలుసుకోవాలి… మెల్ల మెల్లగా తను ఎందుకు భయపడుతుందో… చెప్పగలిగితే అమెకు ధైర్యాన్ని కలిగించేటట్లు కౌన్సిలింగ్ ఇచ్చి మెడిసిన్స్ వాడితే నెమ్మదిగా మనుషుల మధ్యకు వస్తుంది. మేము వాడుతున్న మెడిసన్స్ ఫియర్ కాంప్లెక్స్, ఏంగ్జైటీ, టెన్షన్ తగ్గించడానికే… కాని ఇలా కంటిన్యూగా ఎక్కవ కాలం వాడకూడదంటున్నారు… మధ్య మధ్యలో మందులన్నీ స్టాప్ చేస్తే అమ్మలో భయాందోళనలు ఇంకా ఎక్కవవుతాయి… తాతయ్య కూతురిని దగ్గరకు తీసుకొని ఏవేవో కబుర్లు చెబుతారు… నేను చెబుతాను.”
కంగారుగా అంది సుమిత్ర – “అప్పుడు అమ్మ ఏం మాట్లాడదా?”
“ప్చ్… జవాబు చెప్పకపోయినా పరవాలేదాంటీ… కనీసం మేము చెబుతున్న మాటలకు అమ్మ నుండి స్పందన లేకపోయినా పరవాలేదు… అలానే నిద్రలోకి జారుకుంటుంది.”
బాధగా సుమిత్ర వాసుదేవ్ వైపు చూసింది.
“నోరు లేని మూగజీవులను చూసి అందరూ కాకపోయినా కొందరు మనుషులు జాలిపడతారు… ప్రేమగా చూస్తారు… గలగల మాట్లాడుతూ అందరితో ఎంత అబిమానంగా ఉండే అమ్మ ఎంతో పట్టుదలగా చదివి… ఉద్యోగం చేయాలన్న తనపతో చేరి ఎంతో సంతోషంగా ఉన్న అమ్మ సడన్‌గా పిచ్చిదానిలా ఎందుకు అయింది కారణం ఏమిటి? గలగల మాట్లాడే అమ్మ గొంతు ఎందుకు మూగబోయింది. ఇదేం వాళ్లకు అక్కర లేకపోవడం నాకు చాలా బాధగా ఉంటుంది…” మాట్లాడతుండగానే కళ్లనిండా నీళ్లు నిండిపోయి చెంపల మీద జారడం చూసి,. గభాలున కళ్లు తుడుచుకొని… “సారీ” అంది.
గభాలున దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి బుజ్జగిస్తూ…. “సారీ ఏంటమ్మా… మనసులో ఉన్న బాధ చెబితే కొంతైనా మనసుకి ఉపశమనం కలుగుతుంది” అని సుమిత్ర అంటుండగానే… వాసుదేవ్ అన్నాడు.
“నీలూ చ… చ… పనీ పాట లేని వాళ్లు…. మంచి చెడు తెలియని వాళ్లు ఏదో ఒకటి వాగుతుంటారు… మన మనసుకి స్పష్టంగా మనం చేసే ఏదైనా అవనీ క్లారిటీ ఉంటే చాలు.”
“అసలు ఈ సంతోష సమయంలో ఇది అంతా ఎందుకు చెప్పానంటే అందరిలా మీరు కూడా మీ నాన్న ఎవరు అనొచ్చు, జవాబు చెప్పలేని నన్ను దోషిగా చూడొచ్చు. లేదా జాలి పడొచ్చు…” ఇంకా నీలవేణి మాట పూర్తి కానే లేదు… గభాలున నీలవేణి రెండు చేతులు పట్టుకొని…
“నీలూ మమ్ములను తప్పు అర్థం చేసుకున్నావమ్మా.
రోడ్డు మీద నడుచుకు వెళుతున్న అమ్మాయిని పిచ్చి కుక్క వెంటబడి బలవంతంగా లాక్కొని వెళ్లి వళ్లంతా పీక్కొని తింటే ఇందులో ఎవరి తప్పంటావ్… ముమ్మాటికీ ఆ పిచ్చి కుక్కదే అని ఎవరైనా అంటారు… వళ్లంతా గాయాలు పడిన అమ్మాయిని అక్కువ చేర్చుకుని; అనుకోని పరిణామానికి భయపడిపోతున్న అమ్మయిని కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులు చాలా గొప్ప వ్యక్తులు… మనల్ని మనలా బ్రతకనివ్వని సమాజం గురించి మనకెందుకు? అమ్మకు అన్యాయం జరిగిందనో మరి ఇంకేవో అనుకొని బాధపడకు… అమ్మ చాలా అదృష్టవంతురాలు, నీలాంటి మంచి మనసున్న కూతురుకి ఆవిడ తల్లి అయింది” అంది సుమిత్ర.
ఆశ్చర్యంగా తల్లి మాటలు వింటున్న వాసుదేవ్… ‘అమ్మా… నీ మనసెంత గొప్పది! పరిస్థితిని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నావు…. ఎంత బాగా ధైర్యాన్ని నీలుకి ఇస్తున్నావు… you are great amma.’ అనుకున్నాడు.
ఇంకా వాసుదేవ్ ఆలోచనల్లో ఉండగానే తప్పు చేసిన దానిలా ఒక్క క్షణం తల కిందకి దించి “వాసూ… నా గురించి నువ్వేం అనుకుంటున్నావో నాకు తెలియదు… నేను మాత్రం… నా ఒంటరి ప్రయాణంలో మంచి కుటుంబంతో నాకు పరిచయం ఏర్పడిందని సంతోషపడుతున్నాను…” అంది నీలవేణి.
“వాసు ఇంకా నీకు పూర్తిగా అర్థం కాలేదమ్మా, ప్రాణాలకు తెగించి అమ్మాయిలను కాపాడాడు… చిన్నతనం నుండి…”
కంగారుగా “అమ్మా” అని, “చూడు నీలూ ప్రతీ మనిషి ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయకుండా ఉండడు. కొందరు చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు… మరి కొందరు ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు. తప్పు చేయడం మనసుకి సంబంధించినది, మీ అమ్మగారు ఏ తప్పు చేయలేదు… నా దృష్టిలో మీ అమ్మగారు మంచి మనిషి… ఉత్తమురాలు…” అన్నాడు.
“థాంక్యూ వాసూ… థాంక్యూ…”
“ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు ఇంత మంచి మాట అనలేదు… మా చుట్టాలు.. స్నేహితులు మా అమ్మని… కాదు మా కుటుంబాన్ని చిన్నచూపు చూస్తూనే ఉన్నారు… రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు మాట్లాడారు…”
“మన గురించి మనం ఆలోచించుకోవాలి నీలూ! ఎవరి గురించో… ఏమంటున్నారో అని ఏదో అనేసారని అస్సలు పట్టించుకోకూడదు… నేనైతే అలాంటి వాళ్లని అస్సలు కేర్ చేయను. జానేదేవ్ అంటాను” అన్నాడు…
ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసింది… మరు నిమిషంలో ఆ కళ్లలో మెరుపు బయలుదేరింది… సంతోషంగా అంది నీలవేణి.
“అన్నట్లు నా సంతోషానికి కారణం చెప్పనే లేదు కదూ.
అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్నాను. నా మంచం దగ్గర ఎవరో నిలబడినట్లు అనిపించి గభాలున కళ్లు తెరిచి చూసాను… అమ్మ… భయంగా అటు ఇటు చూస్తూ నా మంచం మీద కూర్చోంది…
‘అమ్మా…. ఏమయింది? మంచి నీళ్లు కావాలా? ఆకలేస్తుందా? తినడానికి ఏమైనా కావాలా? రాత్రి సరిగ్గా భోజనం చేసావు కాదు’ అని నేను అంటుడగానే… గభాలున వచ్చి నా ప్రక్కనే పడుకొని… నా చెయ్యి గట్టిగా పట్టుకొని… ఒక్కసారి నా మొఖంలోకి చూసి మరింత దగ్గిరగా జరిగి కళ్లు మూసుకుంది… ఇలాంటి ప్రేమ కోసమే ఇన్నాళ్లు ఎదురు చూసాను…. ఈ విషయం డాక్టరు గారితో చెప్పాను.
‘గుడ్…. చాలా మంచి మాట చెప్పావు… ఆవిడకు తనకు ఒక తోడు ఉన్నరన్న భరోసా కలగడం ముఖ్యం… ఆ భరోసా కలిగిందనుకో నీకు దగ్గర అవుతుంది… నాలుగు రోజులు క్రితం 5 ఏళ్ల పసివాడి కళ్లముందు… భయంకరమైన హత్య జరిగింది… హత్యకు గురుయ్యింది ఎవరో కాదు… ఆ బాలుడి తల్లి… ఆ హత్య చూసిన బాలుడు షాక్‌కి గురై… మూగబోయాడు. హంతకులు పోలీసులకు దొరకుండా ముప్పతిప్పలు పెట్టారు… కేసు ఛేదించాలంటే ప్రత్యక్ష సాక్షిగా ఆ పసివాడే ఉన్నాడు… కాన ఆ పసివాడు షాక్‌లో మూగవాడయ్యాడు…. ఇద్దరు సైకియాట్రిస్టులు అహర్నిశలు కష్టపడి… ఆ పసివాడిని మాట్లాడించగలిగారు…. హత్య ఎవరు చేసారో తెలుసుకోగలిగారు. అప్పుడు మీ అమ్మగారే గుర్తు వచ్చారు… ఇక్కడ నీకు చెప్పవలసిన విషయం ఒకటుంది….
ఏ పేషంటయినా రికవర్ కావడం వాళ్ల మనసులో దాగి ఉన్న సమస్య ఉద్రిక్తత బట్టి… వాళ్లు ఆలోచించే విధానం బట్టి ఉంటుంది… అందుకే అమ్మ ఇన్నాళ్లయినా తనకు జరిగిన విషయం చెప్పలేకపోతుంది…. కాని ఇప్పడు నువ్వు చెప్పే దానిని బట్టి చూస్తే అమ్మ నీకు దగ్గరయి… నువ్వు తనకి తోడు ఉన్నావన్న ధైర్యం వచ్చాక తప్పకుండా తన మౌనం విడుస్తుంది. I am very happy’ అని అన్నారు డాక్టరుగారు. ఇంతకన్నా మంచి రోజు నా జీవితంలో ఇప్పుటి వరకు రాలేదు” అంది సంతోషంగా.
“నువ్వు ప్రత్యేకించి చెప్పక్కరలేదు నీలూ నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది….”
“అమ్మా ఇప్పుడే చెబుతున్నాను…. రేపు సాయంత్రం కాలేజి నుండి రాగానే ఆంటీ దగ్గరకు వెళతాను…. నేను వచ్చేటప్పటికి నువ్వు రెడీగా ఉండు…” అన్నాడు వాసుదేవ్…
“ఏం చెయ్యమంటావురా… ఖాళీ సమయం ఉంటే… మొక్కల పని చెయ్యడంతోనే సరిపోతుంది. చిన్న పిల్లలను సాకినట్లు సాకాలి… లేదా చీడ పట్టి నిగ నిగలాడవలిసిన మొక్కలు వడిలిపోయి నేల చూపులు చూస్తాయి.”
“ఎందుకుమ్మా… నీకు శ్రమ… మొక్కలని నేను చూసుకుంటాను… నువ్వు రెస్ట్ తీసుకో.”
“లేదు దేవ్… పిల్లల సంరక్షణ ఏ తల్లి శ్రమ అనుకోదు… తనకు శక్తి ఉన్నంత వరకు పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలనుకుంటుంది… మొక్కలు అంతే…”
ఏం మాట్లాడాలో తెలియని వాడిలా తల్లి వైపు అభిమానంగా చూసాడు.
ఒక్క నిమిషం అదోలా అయి మరు నిమిషం అన్నాడు వాసుదేవ్.
“నీలూ నువ్వు చెప్పంది కరక్ట్… ఆవిడ మాట్లాడినా, మాట్లాడకపోయినా… మీతో ఉంది… మీ మధ్య. ఎంతో మంది అనారోగ్యంతో చనిపోతుంటారు… వాళ్లని ఇంట్లో వాళ్లు చాలా మిస్ అవుతుంటారు… బాధపడతారు. కన్నీళ్లు పెట్టుకుంటారు… డిప్రెషన్‌లోకి కూడ వెళుతుంటారు…”
“కరక్టుగా చెప్పావు నాన్నా… ఎప్పటికైనా ఆ భగవంతుడు కనికరించకపోడు… అందాక మనుషుల సహనానికి పరీక్షలు పెడుతుంటాడు…”
“అమ్మా…” అన్నాడు చిరుకోపంతో వాసుదేవ్
చిన్నగా నవ్వుతూ దేవుడు గురించి తనకి వాసుదేవ్‌కి మధ్య జరిగిన విషయం గురించి నీలవేణితో చెప్పింది సుమిత్ర.
గభాలున అంది నీలవేణి – “వాసూ… చెప్పింది కరక్టే ఆంటీ…”
“అయితే నువ్వు వాడి పార్టీలో చేరిపోయావన్నమాట…”
నవ్వుతూ చూసింది నీలవేణి. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది.
చీకటి పడింది. మంచం మీద పడుకున్నాడే కాని నిద్రపట్టలేదు వాసుదేవ్‌కి… కళ్లలో నీలవేణి మెదిలింది.
‘చాలా మంచి అమ్మాయి. తల్లిదండ్రుల సమక్షంలో హ్యాపీగా ఉండవలసిన సమయంలో ఎంతో బాధని మనసులో మోస్తూంది. నీలూకి సపోర్టు ఇవ్వాలి… తనకి చేతనైన సహాయం చేయాలి’ అనుకున్నాడు.
సెల్ రింగ్ కావడంతో గభాలున సెల్ ఎత్తి చెప్పు “నీలూ…” అన్నాడు వాసుదేవ్.
“నీలూ… ఎవరా నీలూ… మైగాడ్… నేను ఫోను చేస్తే చిన్ననాటి ఫ్రండ్‌ని మరిచిపోయి… చెప్పు నీలూ అంటావా…. అంటే… నీలూ నామస్మరణలో ఉన్నావన్నమాట… దారుణం దేవ్… చాలా అన్యాయం… ఇంతకీ ఆ రాక్షసి ఎవరు… ఇంత తొందరగా తన పేరు నీ నోటిలో జపంలా అనుకోనేలా చేసిందంటే… ఆ నీలు నో గీలునో పెద్ద గ్రంథసాంగురాలన్నమాట… వచ్చి దాని పని…” అని వసుంధర అన్నంతలో కోపంగా గట్టిగా అరిచారు వాసుదేవి…
“నీకేమైనా మెంటలా… నోటికి ఎలా వస్తే అలా వాగుతావా… అసలు నీలు గురించి నీకేం తెలుసు. తనలో ఉన్న సహనం ఓర్పు నూరో వంతు నీకు ఉన్నా ఇలా మాట్లాడేదానివి కాదు… ఆ అమ్మాయి చాలా గొప్ప వ్యక్తి…”
దేవ్ అని గట్టిగా అరిచాడు…
“దేవ్… ఇంకేం మాట్లాడకు… ఆ తల్లి గిన్నిస్ బుక్ ఎక్కిందా.”
“ప్చ్! నీలాంటి వాళ్లకి గిన్నిస్ బుక్ పెద్ద వెంచర్ ఏమో, నీలూకి అక్కరలేదు…” అని వాసుదేవ్ అన్నంతలో
“దేవ్…” అని తన్నుకు వస్తున్న దుఃఖాన్నిగభాలున ఏడుపు రూపంలో గొల్లుమంది… “మనసా వాచా… నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించాను… ప్రేమిస్తున్నాను… నిన్ను గాక మొన్న పరిచయమైన… ఆ రాక్షసి నీకు ఎక్కువైపోయిందా?” ముక్కు చీదడం మొదలు పెట్టింది…
చిరాగ్గా అన్నాడు… “ఇక టాప్ కట్టేయ్! ఏడ్చేవాళ్లంటే నాకు మహా చిరాకు… అందుకే నీలూ నాకు నచ్చింది… ఏ విధమైన ఎవరి సపోర్టు లేకుండా జీవితాన్ని నెట్టుకొస్తుంది…” అని నీలూ గురించి అంతా చెప్పాడు…
ఒక్క నిమిషం అవతల నుండి ఫోనులో వసుంధర మాట్లాడకపోవడంతో… “నేను ఫోను పెట్టేస్తున్నాను…. మళ్లీ… మళ్లీ ఫోను చేసి విసిగించకు…” అని వాసుదేవ్ అనగానే… కంగారుగా అంది వసుంధర…
“దేవ్… సారీ… వేరీ సారీ… ప్లీజ్ నన్ను క్షమించురా… నా బంగారం కదూ… ఒక్కటి అర్థం చేసుకోరా… నువ్వు…. నువ్వు నా ప్రాణంరా… నువ్వు నాకు దక్కని మరుక్షణం ఈ వసుంధర బ్రతకదు…”
వాసుదేవ్ నుండి సమాధనం రాకపోవడంతో బాధగా అంది…
“సారీ చెప్పాను కదా. ఇంకా నా మీద కోపం పోలేదా… నా ప్రేమ చెప్పినా అర్థం చేసుకోవేంరా? నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? ఉహ తెలిసిన దగ్గర నుండి… నీతోనే ఉన్నాను… నీతోనే పెరిగి పెద్దదాన్నయ్యాను… నాతో పాటు… నీ మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది… సిగ్గు విడిచి చెబుతున్నాను… నువ్వు లేకుండా మెడికల్ కాలేజికి వెళ్లడం నరకంలా ఉంది… అందరూ ఎంతో సంతోషంగా మెడికల్ కాలేజిలో అడుగుపెట్టినందుకు ఆనందిస్తున్నారు… ఒక్కటి గుర్తు పెట్టుకో దేవ్… నువ్వు లేనిదే వసూ లేదు…” అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేనట్లు ఫోను పెట్టేసింది…
ఆలోచనల్లో పడ్డాడు వాసుదేవ్…
చిన్నప్పటి నుండి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండేవారు… ఎన్నో విషయాలలో ఫ్రెండ్స్‌కి తనతో డిఫరెన్స్‌లు వచ్చి దూరం అయ్యారు… కాని వసూ ఎప్పుడు తనతో ప్రతీ దానికి ఏకీభవించేది… తను ఔనంటే ఔను అనేది… కాదంటే కాదనేది… ఒక్కొక్కసారి వసుకి తనపట్ల ఉన్న ఇష్టం, ప్రేమ… అభిమానం చూస్తుంటే కంగారు కూడ పడుతుంటాడు…
***
దేవ్‌కిష్టమని బజ్జీలు చేసి, పైకి తెచ్చింది సుమిత్ర.
తల్లీ కొడుకులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. అప్పుడే నీలు చేతిలో ఒక బాక్స్‌తో పైకి వచ్చింది. వాళ్ళిద్దరినీ అభిమానంగా చూస్తూ నిలుచుండిపోయింది.
“అమ్మ అన్న పదానికి అసలైన నిర్వచనం నువ్వే ఆంటీ” అని మనసులో అనుకొంది నీలవేణి.
కొద్ది సేపు నీలుని గమనించలేదు వాళ్ళిద్దరు. హఠాత్తుగా చూశారామెని. ఎప్పుడొచ్చావన్నట్టు ముఖం పెట్టాడు దేవ్.
వాతావరణాన్ని తేలికపరచాలన్నట్టు సుమిత్ర నవ్వుతూ… “నీలూ… మాకేదో టిఫిన్ బాక్స్ తెచ్చావు. హాటా, స్వీటా?” అడిగింది.
“అయ్యో! మరిచేపోయాను… స్వీటే ఆంటీ… క్యారెట్ హల్వా… మీరు వాసుకి ఇష్టం అని చెప్పారు కదా, ట్రై చేసాను… చాలా బాగా వచ్చిందని…” మరు నిమిషం ఏదో తప్పు చేసిన దానిలా కంగారుపడి… “అది… అది ఎందుకు స్వీటు చేసానంటే… అమ్మ.. అమ్మ… ఇన్నాళ్ళకి నాతో… నా దగ్గరగా… నా తోడు కోరుకుంది…. ఇంతకన్నా సంతోషం ఏం ఉంది ఆంటీ… అమ్మకి స్వీటు తినిపించి వచ్చాను…. గభాలున వాసుకి క్యారెట్ హల్వా ఇష్టం అన్నది గుర్తు వచ్చి తీసుకు వచ్చాను…”
“క్యారెట్ హల్వా… ఈ విషయం ముందు చెబితే నేను బజ్జీలు తినేవాడిని కాదు” అని గభాలున బాక్స్ తీసుకొని తింటూ… “అమ్మా… అచ్చం నువ్వు చేసినట్లే ఉంది స్వీటు… కొత్తగా ట్రై చేసినా బ్రహ్మాండంగా ఉంది… థాంక్యూ నీలూ” అన్నాటు.
నీలవేణి మొఖం సంతోషంతో నిండిపోయింది.
“అంతా నువ్వే తినేస్తావా? నీలు చేతి వంట నన్నూ రుచి చూడనివ్వవా?” అంది నవ్వుతూ సుమిత్ర.
“అయ్యో తనని తిననివ్వండి ఆంటీ… ఇంట్లో ఇంకా ఉంది. ఇప్పుడే వెళ్ళి తెస్తాను ఆంటీ…” అంది.
“అయ్యోయ్యో వట్టినే అన్నానమ్మా… నిజం చెప్పాలంటే నాకు పెద్దగా ఇష్టం లేదు… వాడి కోసమే చేస్తాను. తిను నాన్నా” అంది సుమిత్ర.
“వెళతాను ఆంటీ… చాలా టైమ్ అయింది” అని “బై వాసూ… సాయంత్రం మా ఇంటికి ఆంటీ, నువ్వు రావాలి” అని వెళ్ళిపోయింది నీలవేణి.
“అమ్మా టేస్ట్ చెయ్యి” అని గభాలున సుమిత్ర నోటిలో స్వీటు పెట్టాడు.
తిని ఒక్క నిమిషం అదోలా అయి… ఏం మాట్లాడాలో తెలియని దానిలా చూసి… “ఆ బాగానే ఉంది” అంది.
ఒక్క నిమిషం తల్లి వైపు చూసి “అమ్మా నిజం చెప్పు… స్వీటు బాగుందా” అన్నాడు…
“ముందు నువ్వు చెప్పు నాన్నా… నీకు నచ్చిందిగా…”
“అమ్మా… నిజం చెప్పామంటావా అస్సలు నచ్చలేదు. పచ్చిగా ఉంది. షుగర్ చాలా ఎక్కువ వేసింది… నీలు చాలా సంతోషంలో ఉంది. ఆ సంతోషం పోగొట్టడం ఇష్టంలేక అలా అన్నాను. తల్లిదండ్రుల ప్రేమ, అనురాగాల మధ్య పెరుగుతున్న పిల్లలే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు… వెంటనే వెంటనే తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారు కాని పాపం నీలూ…”
“నీలూని చూస్తుంటే నాకు బాధగానే ఉంది. తనకి మన వల్ల మంచి జరగాలి. సంతోషంగా ఉండాలి. దాని కోసం నువ్వయినా నేనైనా మన వంతు ప్రయత్నం చేయాలి… ఎప్పటికి మన వల్ల నీలు బాధపడకూడదు. నాకు తెలుసు నాన్నా… తనకి మన వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని… కాని కాలం ఎప్పుడు ఒక లాగా ఉండదు కదా…”
“కరక్టుగా చెప్పావమ్మా… తనకి ఎవరి వలన ఏ ఇబ్బంది కలిగినా ఎటువంటి కష్టం వచ్చినా చూస్తూ ఊరుకోనేది లేదు… నువ్వు నిశ్చింతగా ఉండు అమ్మ.”
“నాకు తెలుసురా… నువ్వు ఉండగా నీ చుట్టుప్రక్కలున్న వాళ్లు నిశ్చింతగా ఉంటారు… వంట చేయాలి నాన్నా…” అని ఖాళీ అయిన ప్లేటులు పట్టకొని మెట్లు దిగసాగింది సుమిత్ర.
‘నీలూ… చాలా మంచి అమ్మాయి… ఆప్యాయత అనురాగాలకు… ప్రేమ అభిమానాలకు దూరంగా ఉంటూ జీవిస్తుంది. గుప్పెడు అన్నం దొరకని మనిషికి పంచభక్షపరమాన్నం దొరికితే ఎంత సంతోషిస్తాడో అలా ఉంది నీలు పరిస్థితి… తన తీరు చూస్తుంటే దేవ్‌ని చాలా ఇష్టపడుతున్నట్లు అనిపిస్తుంది…. దేవ్ ఇష్టపడి నీలూని పెళ్లి చేసుకుంటే తను తప్పకుండా సంతోషిస్తుంది. కాని అలా జరిగకపోతే… నీలూ… జీవితం… అయ్యో దేవుడా… అలాంటి పరిస్థితి తీసుకురాకు’ అని మనసులో అనుకుంది సుమిత్ర.
***
సెల్ రింగ్ కావడంతో ‘హలో’ అన్నాడు వాసుదేవ్.
“హలో ఏమిటి దేవ్ హాయ్ అనలేవా…
కనీసం నా నెంబరు చూసి హాయ్ వసూ ఎలా ఉన్నావు… నన్ను మరిచిపోయావా… అంటావేమో అని పిచ్చిదానిని ఎదురు చూస్తుంటాను…. ఎవరో క్రొత్త వ్యక్తి ఫోను చేస్తే అడిగినట్లు హలో అంటావేమిటి… నా నెంబరు చూడలేదా” అంది కోపంగా వసుంధర.
“మై గాడ్…హలో అన్నందుకు ఇంత సేపు క్లాసు తీసుకున్నావా… అసలు నీ నెంబరు చూడలేదు… ఒక చేతిలో బజ్జీలు ప్లేటు, మరో చేతిలో హల్వా ఉంది… గభలున చేతిలో ప్లేటు ప్రక్కన పెట్టి హలో అన్నాను.”
“ఏంటి… స్వీటు, హాటు రెండు తింటున్నావా. కేలరీస్ పెరిగిపోతాయి… ఏంటి… ఆంటీ… కొడుకు కష్టపడిపోతున్నాడనా అన్ని చేసింది…”
“తల్లీ… నీలా మా అమ్మ డాక్టరు కాదు కేలరీస్ లెక్కవేయడానికి…. అయినా అమ్మ స్వీటు చేయలేదు.. మా ఎదురింటి అమ్మాయి… నీలూ నా కిష్టమని క్యారెట్టు హల్వా చేసి తెచ్చింది…”
షాకైయ్యింది వసుంధర…
“ఏంటి మాట్లాడువు… సరే… నేను కిందకు వెళుతున్నాను” అన్నాడు.
“గుండెగిపోయే మాట చెప్పి ఫోను పెట్టేస్తానంటావా?”
కంగారుగా అన్నాడు వాసుదేవ్… “గుండాగిపోయే మాట… నేనెప్పుడు చెప్పాను?”
“క్షణం ముందు చెప్పావు… ఎదురింటి అమ్మాయి నీ కిష్టమని క్యారెట్ హల్వా చేసి తీసుకువచ్చిందా మైగాడ్… ఇంత త్వరగా ఆ పిల్ల… నీకిష్టమైన స్వీటు తీసుకురావడం… చాలా ఆశ్చర్యంగా ఉంది. చిన్నప్పటి నుండి నీ నీడలా ఉన్నా నేనే నీకు దగ్గర కాలేకపోతున్నాను… మధ్యలో వచ్చిన ఆ పిల్ల ఎలా ఇంత త్వరగా… స్వీటు తీసుకొని నీ దగ్గరకు వచ్చింది. కొంపదీసి ఆ పిల్లను చూసి నువ్వేం టెంప్ట్ కాలేదు కదా?” అని ఇంచుమించు ఏడుపు గొంతుతో వసుంధర అనడం విని వళ్లు మండిపోయింది…
“కాసేపు నోరు మూస్తావా?” గట్టిగా అరిచాడు వాసుదేవ్….
అవతల నుండి సమాధానం రాకపోయినా కోపంగా అన్నాడు…
“ఛ… ఛ… మంచి ర్యాంక్ తెచ్చుకొని ఎం.బి.బి.యస్ చుదువుతున్నావు… కాని… ఆడ బుద్ధి చూపించుకున్నావు…. గభాలున ఒక అమ్మాయిని అనుమానించడానికి సిగ్గనిపించడం లేదూ? నీలూ… చాలా మంచి అమ్మాయి… అసలు అమ్మాయి గురించి… ఛ… ఛ… నీలాంటి దానితో చెప్పడం అనవసరం… she is my friend… కాదు… బెస్ట్ ఫ్రెండ్… ఇప్పుడే చెబుతున్నాను… నన్ను ఏమైనా అను… నీలూని ఏమనా అన్నావో… ఊరుకోనేది లేదు… అసలు నీకిలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి?” అని గభాలున ఫోను కట్ చేసాడు వాసుదేవ్.
‘దొంగ సచ్చినోడా… అంత కోపం వచ్చింది ఏమిటిరా… వస్తే వచ్చింది నాకొకటి అర్థం అయింది… నువ్వు బంగారం రా… అందుకే కదా నీ వెనకాల కుక్కపిల్లలా వెంటపడుతున్నాను… కాని… మహాతల్లి… ఏం అన్నావు… నీలూ గీలో నీ మీద మనసు పారేసుకుంటే… నో… ఆ ప్రమాదం ఉంది. వెంటనే వెళ్లాలి… నా జాగ్రత్తలో నేను ఉండాలి’ అని మనసులో అనుకుంది వసుంధర.
(సశేషం)