జారవ

2
2

[box type=’note’ fontsize=’16’] ఒంటరిగా ఈ అడవిలోకి వచ్చి తప్పు చేశానా అని అతనికి మొదటిసారిగా అనిపించింది. అనాలోచితంగా చేసిన దుస్సాహసమా ఇది అని అనుకున్నాడతను. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి అడవిలో ప్రవేశించిన అతనికి ఏమయింది? ఆసక్తిగా చదివించే కథ శ్రేష్ఠ రాసిన ‘జారవ‘. [/box]

[dropcap]రొ[/dropcap]ప్పుతూ వేగంగా నడుస్తున్న వాణ్ని అసంకల్పితంగా ఒక్క సారిగా ఒంటి కాలిమీద ఆగిపోయాను. ఒక లిప్త కాలంలో నా కళ్ల ముందు నుంచి ఏదో దూసుకుపోయింది. ఏంటా అదని ఆలోచించేంత లోపే పక్కనే పొదల్లో చి”గుర్ర్ ర్ర్…గుర్ర్ ర్ర్” అని హృదయ విదారకమైన అరుపు వినిపించింది. అది ఏ జంతువుదో నేను పోల్చలేను.

కొద్దిగా తేరుకుంటూ ముందుకేయడానికి లేపిన అడుగు వెనక్కి తీస్తున్నాను. నా వొళ్ళు జలదరించి పోయేలా అప్పుడు జరిగిందా సంఘటన. చాలా బలంగా ఉన్న ఒక అడవి పంది అమాంతంగా ఎగిరి నా ముందు నుంచి రెండో వైపు దూకింది. ఆ దూకుడులోని ఉధృతికి వెనక్కి తీస్తున్న కాలు నేలని తాకకుండానే నేను దభీమని పక్కకి పడ్డాను

ఈసారి దాని “గుర్ర్ ర్ర్ …గుర్ర్ ర్ర్” శబ్దంలో ఇందాకటి బాధ లేదు, కసి, ఉక్రోషం, కలగలసిన రౌద్ర భాష అది. అక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.

అదృష్టమేంటంటే ఆ పంది దూకింది నా మీదకు కాదు. దురదృష్టం ఏమిటంటే నా జేబులో మొబైల్ ఫోన్ ఎగిరి దూరంగా వున్న రాతి మీదపడి ముక్కలై కింది పొదల్లోకి జారిపోయింది.

పంది దూకిన వైపు పొదల వెనుక నుండి విచిత్రమైన అరుపులు వినబడ్డాయి. క్షణంలో ఆ అరుపులు వినబడ్డ చోటు నుంచి ఓ బాలుడు మెరుపు వేగంతో పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టు మీదికి ఎగబాకాడు.

నాకు కూడ తక్షణం కర్తవ్యం బోధ పడింది. అందుబాటులో ఉన్న మరో చెట్టు ఎక్కేశాను ఫోన్ వెతుక్కోవాలన్న ఆలోచనని తొక్కి పెట్టేసి.

చెట్టు ఎక్కి కాస్త వెడల్పు ఉన్న కొమ్మ మీద అటో కాలు ఇటో కాలు పెట్టుకుని కూర్చుని వెనుక నిటారుగా వున్న వెడల్పైన మానుకు జారగిలబడ్డాను. అప్పుడర్థమైంది అప్పటిదాకా గాలిలో వస్తున్న వాసన ఏంటో. అది బాలింత వాసన. నాకు ఎడమ వైపున ఉన్న పొదల్లో అప్పుడే పుట్టిన ఏడెనిమిది అడవి పంది పిల్లలు కనబడుతున్నాయి వాటిలో ఒకటి పొట్టలో గుచ్చుకున్న బాణం దెబ్బకు విలవిలలాడుతోంది.

కళ్ళు మూసుకుని ఒక నిమిషం బలంగా గాలి పీల్చాను. ఆగిపోయిన ఊపిరి తిరిగి మొదలయ్యినట్లయ్యింది. కళ్ళు తెరిచి క్రిందికి చూశాను. అక్కడి సన్నివేశాన్ని బట్టి జరిగిందేమిటో ఊహించే ప్రయత్నం చేశాను

నా ఎడమ వైపు పొదల్లో అప్పుడే ఈనిన అడవి పంది తన పిల్లలకు పాలిస్తోంది. కుడివైపు నుండి ఓ జారవ బాలుడు ఆ పందిని కొట్టడానికి బాణం వేశాడు. గురి తప్పిందో, అనుభవ లేమో గానీ ఆ బాణం తల్లి పందిని గీసుకుని పక్కనే ఉన్న ఓ పిల్ల కడుపులో గుచ్చుకు పోయింది.

బాలింత పంది తన పిల్లల మీద జరిగిన దాడికి ఒక్కసారిగా కోపోద్రిక్తురాలై ఆ బాణం వచ్చిన వైపు దూకింది. దాని లక్ష్యం నేను కాదు. ఆ దాడిని ముందే ఊహించిన, బాణం వేసిన బాలుడు చాకచక్యంగా చెట్టెక్కేశాడు. ఇలా ఆలోచిస్తూ అతని వైపు చూసాను. మధ్యలో ఉన్న చెట్ల కొమ్మల్లోంచి నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తున్నాడు అతని ఎత్తుని బట్టి పది పదకొండేళ్ళు ఉండొచ్చు అనిపిస్తుంది. చిన్న నిక్కర్ మాత్రం ఉందతని ఒంటి మీద. చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకొని అడ్డంగా ఉన్న మరో కొమ్మ మీద నిలబడి ఉన్నాడు. అడవి పంది అతని మీద కోపంతో దాడి చేసినా అతని కళ్ళలో ఏ మాత్రం బెరుకు కనిపించడం లేదు. నల్ల వజ్రంలా మెరుస్తున్న అతని శరీర ఛాయ అంత ఉద్విగ్న పరిస్థితుల్లోనూ నా కెందుకో ఈర్ష్య పుట్టించింది

సరిగ్గా అదే సమయానికి అతను కూడా నా వైపు చూశాడు. ఏదో అన్నాడు. కానీ నాకు అర్థం కాలేదు. నేను స్నేహపూర్వకంగా చేయి ఊపాను. దానికి బదులుగా మళ్ళా ఏదో అన్నాడు.

అసలు కింద ఏం జరుగుతుందోనని కిందికి చూశాను. తల్లి పంది జారవ బాలుడు ఎక్కిన చెట్టు కింద తచ్చాడుతోంది. గుర్రు, గుర్రుమంటూ చాల కోపంగా ఉందది. దాన్నలా చూడగానే నాకు ఒళ్ళు గగుర్పొడిచింది. చల్లని ఆ వాతావరణంలో కూడా నా నుదిటి మీద నుంచి చెమట చెక్కిళ్ళ మీదకు జారి చొక్కాలోకి ఇంకుతోంది.

చిక్కటి అడవి. ఎత్తయిన రాళ్లు రప్పలతో అసమతలంగా వున్న నేల. ఆకాశంలోకి ఎగబాకిన మహా వృక్షాలు, కింద దట్టమైన పొదలు. మధ్య మధ్యలో కొనదేరిన రాళ్లు.

బాణం తగిలి మూలుగుతున్న పంది పిల్ల కోసం చూశాను. ఇప్పుడది మూలగడం లేదు. మిగతా పంది పిల్లలు తమ ముట్టితో దాన్ని పొడుస్తున్నాయి. కానీ దానిలో చలనం లేదు. బాణం అలానే దాని కడుపులో గుచ్చుకుని ఉంది. కానీ రక్తం కారడం ఆగిపోయింది.

తల్లి పంది మాత్రం జారవ బాలుడున్న చెట్టు కిందే తచ్చాడుతోంది అది ఒకసారి ఆగి సాలోచనగా వెనక్కి నడిచింది. మళ్ళీ వేగంగా ముందుకు వస్తుంటే ఆ చెట్టును గుద్ది బాలుడిని కింద పడేస్తుందేమో అనుకున్నాను. కానీ పంది గుద్దినంత మాత్రాన కదిలేంత బలహీనమైన చెట్టు కాదది. అండమాన్‌లో మాత్రమే పెరిగే పడౌక్ చెట్టది. చాలా ఎత్తుగా వెడల్పుగా బలంగా పెరుగుతుందది.

మళ్ళీ, మళ్ళీ అది అక్కడే రోషంతో పచార్లు చేస్తోంది. నాకు మొదటిసారిగా ఒంటరిగా ఈ అడవిలోకి వచ్చి తప్పు చేశానా అనిపించింది. అనాలోచితంగా చేసిన దుస్సాహసమా ఇది?

***

“నో” ఆరో సారి కూడా అంతే ధృడంగా చెప్పాడు దేబాశిష్ సర్కార్. నిన్న సాయంత్రం చాలాసేపు ‘జారవ తెగ గిరిజనుల్ని’ ఇంటర్వ్యూ చేసే అవకాశం కల్పించమని అతన్ని ప్రాధేయ పడ్డాను. పోర్ట్ బ్లెయిర్‌లోని ‘ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు’ డైరెక్టర్ అతను. నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ రీసెర్చ్ స్కాలర్‌ని.

ప్రపంచంలో అతి అరుదైన ఆదిమజాతి జారవ.

ఒకప్పుడు కొన్ని వేలమంది జారవలు అండమాన్ లోని ప్రధాన దీవుల నిండా ఉండేవాళ్ళు. ఇవ్వాళ కేవలం 420 పైచిలుకు జారవలు మాత్రమే జీవించి ఉన్నారు. వాళ్లు కూడా బట్టల్లే్కుండా కేవలం వేట మాత్రమే జీవనాధారంగా, నాగరికతకు దూరంగా అడవుల్లో బతుకుతున్నారు. వాళ్ల భాష రాకపోయినా వాళ్లని కలసి వాళ్ళ జీవనశైలిని పరిశీలించాలన్నది నాఉద్దేశం. భాషతో సంబంధం లేకుండా గిరిజనులతో భావవ్యక్తీకరణ చేయడం నాకీ రీసెర్చ్ లోకొచ్చాక అలవాటయ్యింది.

“ఇక ఇదే ఫైనలా” అడిగాను జాలిగా ఇంగ్లీష్‌లో.

“అవును”

“ఇంకా పై అధికారిని కలవాలంటే ఎవరిని కలవాలి?” అడిగాను.

“లెఫ్టినెంట్ గవర్నర్‌ని” నవ్వుతూ చెప్పాడతను. “నువ్వు కలవడం చాలా కష్టం. కలిసినా నీ ఇంటర్వ్యూకి అనుమతి సంపాదించడమైతే అసంభవం.”

ఇక అది అయ్యే పని కాదనుకుని నా హోటల్ రూమ్‍కు వచ్చేశాను. కానీ జారవలని కలిసి ఇంటర్వ్యూ చేయాలన్న నా కోరిక మాత్రం చావలేదు.

నా బలమైన కోరికను అండమాన్ లోని స్థానిక మిత్రుడు జంబునాథన్‌కి చెప్పాను అనధికారికంగా ఎలా కలవాలని చాలాసేపు చర్చించాక జంబు ఓ ప్లాన్ చెప్పాడు

పోర్ట్ బ్లెయిర్ నుండి ఉదయానే యాత్రికులను బారాతంగ్, ఇంకా ఆపైకి కొన్ని ప్రదేశాల సందర్శనకి ఎటిఆర్ [అండమాన్ ట్రంక్ రోడ్] మీదుగా రోజూ తీసుకెళ్లారు. అయితే ఆ యాత్ర అంతా పోలీసుల కనుసన్నలలోనే జరుగుతుంది. బారాతంగ్ నుంచి కదంతలా మధ్యలో ఎక్కడన్నా పోలీసుల కళ్ళు కప్పి నన్ను వాహనంలో నుంచి దింపేస్తాడు జంబు. అక్కడ నుంచి రెండు, మూడు కిలోమీటర్లు పడమరగా అడవిలోకి నడిస్తే జారవ ఆవాస ప్రాంతాలు వస్తాయి.

నా పని చేసుకుని మళ్ళీ నేను రోడ్ మీదకు వచ్చి ఖచ్చితంగా ఎక్కడ దిగానో అక్కడ దాక్కుని ఉంటే జంబు తిరుగు ప్రయాణంలో నన్ను తీసుకొచ్చేస్తాడు.

అయితే తిరిగి తీసుకు రావడం కుదరొచ్చు, కుదరక పోవచ్చు. చాల రిస్క్‌తో కూడుకున్న పని అది. దానికి నేను సిద్ధమైతే నన్నక్కడ దింపడానికి అతను ప్రయత్నిస్తానన్నాడు.

ఎటిఆర్ మీది కంటూ చేరుకుంటే జంబు నన్ను కలవలేక పోయినా ఏదోరకంగా వెనక్కి రావచ్చు అనుకున్నాను కానీ, ఒకసారి అడవిలోకి కాలు పెట్టాక వెనక్కి ఎటిఆర్‌కు చేరుకోవడమే కష్టమవుతుందని అనుకోలేదు నేను.

ఈరోజు ఉదయం పోర్ట్ బ్లెయిర్ నుంచి బయలు దేరాము. జంబునాథన్ కారు నడుపుతున్నాడు. నాతో పాటు ఇద్దరు డమ్మీ యాత్రికులను అతనే తీసుకొచ్చాడు. బారాతంగ్‌కి ముందు ఒక చిన్నపాటి షిప్ మీద కారుని సముద్రపు పాయ దాటించారు. మళ్ళీ రోడ్ ప్రయాణం. ఇంకో పావు గంటలో ‘కదంతల’ అనే ఊరు వస్తుందనగా వెనుక వాహనాలలోని వారు ఎవరూ చూడటం లేదు అని నిర్ధారణ చేసుకుని ఒక మలుపులో టక్కున కార్ ఆపాడు జంబు. కన్ను మూసి తెరిచేంత లోపు నేను కారు దిగి పక్కనే అడవిలోకి అదృశ్యమై పోయాను.

ఒకేసారి చాలా వాహనాలు, కాన్వాయ్‌గా నడుస్తుంటే అందులోంచి తప్పించుకోవడం చాలా కష్టం. జంబు చాల పకడ్బందీగా దించేశాడు నన్ను. పోలీస్ వాహనాలు కాన్వాయ్‌కు ముందు వెనుకా మాత్రమే ఉన్నాయి. ఓ చీకటి మలుపులో చిటికెలో దిగేశాను నేను.

***

పంది పిల్లలకి ఆకలవుతోంది. వాటి అరుపులో ఆకలి బాధని పసిగట్టిన తల్లి తన కోపాన్ని తీసి గట్టునబెట్టి వాటి వైపు నడిచింది. అవి ఆబగా పాలు కుడుస్తున్న శబ్దం చెట్టు మీదిక్కూడా వినబడుతోంది.

పంది అక్కడ నుంచి పిల్లల వైపు వెళ్ళడం గమనించి జారవ బాలుడు మళ్ళా మెరుపులా కదిలాడు. అతన్నే చూస్తున్న నాకు చెట్టు దిగమని కళ్ళతోనే సైగ చేశాడు

అతను వేగంగా చెట్టు దిగేసి నేను కూర్చున్న చెట్టు కింది కొచ్చాడు నెమ్మదిగా దిగుతున్న నాకు చెయ్యి ఆసరా ఇచ్చి క్షేమంగా కిందికి దించాడు.

అతని నల్లని శరీరం లోంచి ఏదో అదృశ్య శక్తి నాలోకి ప్రవహించినట్లనిపించింది. అతని శరీరం మొత్తంలో తెల్లగా మెరుస్తున్న కళ్ళు మల్లెల్లా విరుస్తున్న పళ్ళు నన్ను స్నేహ పూర్వకంగా పలకరించాయి

పూర్తి నగ్నంగా సంచరించే తెగకి చెందిన అతను వేసుకున్న నిక్కర్ అతనికి బాహ్య ప్రపంచంతో క్రొత్తగా ఏర్పడుతున్న సంబంధాన్ని సూచిస్తోంది. ఆ సంబంధం లోంచీ అతను నేర్చుకున్న మొదటి పదం “భాగో” చెప్పాడు నెమ్మదిగా నాకు. శబ్దం రాకుండా అక్కడ నుంచి వెళ్లి పోదామని సైగలతో తెలియజేశాడు.

ఫోన్ కోసం చూడాలన్న నా ఆలోచన విరమించుకుని అతని చేతిలో చెయ్యేసి…..

వెనకేదో భూకంపం వస్తున్న అనుభూతి ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపు అడవి పంది వెయ్యేనుగుల బలంతో అతన్ని వెనుక నుంచి గుద్దింది. నాలుగడుగులు గాల్లోకి లేచి ముందున్న చిన్నపాటి లోయలోకి పడిపోయాడతను.

ఆ వెంటనే నన్ను కూడ వెనుక నుంచీ పొడవసాగింది ఆ పంది. దాని బలమైన కోరలు నా తొడల్లోకి గుచ్చుకుని రక్తం కారుతోంది. మళ్ళీ మళ్ళీ కుమ్మేస్తోందది. నడుము నించి కిందకు పచ్చి పుండైంది. జీవితంలో ఇంతకూ ముందెప్పుడూ తెలియని, అనుభవించని, భరించలేని నొప్పి. కానీ ప్రాణ భయంతో ముందుకి కదిలాను.

మళ్ళీ పంది పిల్లలు ఆకలితో అరవసాగాయి. అది నా అదృష్టమేమో, కోపం తగ్గిన పంది వెనక్కి నడిచింది. ఎలాగైనా అక్కడ నుంచి దూరంగా వెళ్లి పోవాలని బాధని నొక్కి పట్టి ముందుకి నడిచాను కాని ఏదో ఒక సాయం లేకుండా రోడ్ దాక చేరే పరిస్థితిలో నేను లేను అని నిశ్చయంగా అర్థమైంది నాకు.

జారవ ఎక్కడ ఉన్నాడా అని చూసి చిన్నగా అతని దగ్గరకు నడిచాను. అతను బాధతో మూలుగుతున్నాడు. పంది బలంగా గుద్దగానే గాల్లోకి ఎగిరి ఓ పెద్ద రాయి మీద పడ్డాడతను. పడ్డాక మళ్ళీ లేవలేదు. నేను అతని దగ్గరకు రావడంతో లేచే ప్రయత్నం చేసాడు.

పైనుండి పడి కొనదేరిన రాయికి బలంగా కొట్టుకోవడంతో అతని కుడికాలు మోకాలి కింద విరిగిపోయి వేలాడుతోంది. రెండో కాలు మీద పైకి లేచి నిలబడలేక మళ్ళీ పడిపోయాడు.

అతను కదల్లేడని అతనికి అర్ధమైంది “భాగో” మళ్ళీ చెప్పాడు, నాకు.

“రోడ్” అడిగాను అతన్ని. అతనికి ‘రోడ్’ అనే పదం తెలిసుంటుందని. నాకు ఇక్కడ దిక్కులు కూడా తెలియడం లేదు. కంపాస్ ఉన్న నా ఫోన్ ఎక్కడో పడి పోయింది.

అతను కింద పడుకునే ఓ దిక్కుగా చూపించాడు, చేతిని. “ని అపో” అన్నాడు. నాకు దాని అర్థం తెలీదు.

సర్వ శక్తులు కూడగట్టుకుని చిన్నగా పైకి లేచాను అతను చూపిన దిక్కు వైపు నడుద్దామని. చీలికలు, పేలికలై పోయిన నా కాళ్ళలోంచి రక్తం ధారాపాతంగా కారుతోంది. కళ్ళు బైర్లు గమ్మి నిస్సత్తువ అవరిస్తోండగా నేల మీదకు జారిపోయాను.

***

కళ్ళు తెరిచే సరికి కదంతలా ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాను, సెలైన్ ఎక్కుతోంది. పైన రేకుల కప్పు, ఎదురుగా జంబు.

“నిన్నలా ఒదిలి పెట్టడం నాదే తప్పు. ఐ యాం వెరీ సారీ” నొచ్చుకుంటూ అన్నాడతను.

“నేనిక్కడికెలా వచ్చాను” అడిగాను.

విస్మయంతో చెప్పాడతను…” ఒక కాలు విరిగిపోయి వేలాడుతోంటే, రెండో కాలుమీద గెంతుకుంటూ నిన్ను రోడ్ మీద దాక మోసుకొచ్చాడు, ఓ పదేళ్ళ జారవ.”

“ని అపో” అన్న మాట వినపడటంతో ప్రక్కకు తిరిగాను. దూరంగా ఉన్న ఓ బెడ్ మీద ఉన్న పేషెంట్ నోటిలోంచి వచ్చింది ఆ మాట. “ఆ మాటకు అర్థం తెలుసా” అని నా ప్రక్కనే ఉన్న నర్సుని అడిగాను.

“పెద్దన్నా …”

నాగరీకుడినైన నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని అలాగే వదిలి నా ప్రాణం కోసం అడవి లోంచి బయటకు రావాలనుకొన్నాను. అతను తన ప్రాణాలు లెక్కచేయకుండా, తన శక్తికి మించి నన్ను కాపాడాడు. నిజమే, అతనికి నాగరికత తెలియకపోవచ్చు, కానీ అతనింకా మనిషి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here