జరీ కోక

0
2

[dropcap]శ్రీ[/dropcap]నివాస రావు ఎల్.ఐ.సి మానేజర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు ముచ్చటగా ఉంటారు. పిల్లకి సంగీతం నేర్పిస్తున్నారు. భార్య పద్మ పొందికైంది, అందమైనది. అత్తగారు సత్యవతి కొంచెం మాటకారి. అందరి దగ్గరా కోడల్ని సాధిస్తూ ఉంటుంది. అందువల్ల ఆమె అంటే కొంచెం భయం, విసుగు. వాళ్ళు ఉండేది ఆఫీస్ క్వార్టర్స్‌లో. అక్కడ మరో రెండు కుటుంబాలు ఉంటాయి అంతే. బయటి వాళ్ళు ఎవరు ఉండరు. ఆఫీస్ ఇల్లు ఒకే కాంపౌండ్‌లో ఉంటుంది.

తల్లి సత్యవతి పిల్లాడిని గారంగా పెంచింది. తండ్రి లేడు. మేనమామ సహాయంతో పెంచింది. కాలక్షేపానికి హిందీ పరీక్షలకి పంపేది. తనకి మళ్లీ పెళ్లి చేస్తామని అమ్మ నాన్న అన్నారు కానీ పిల్లవాడు ఉన్నాడు కొద్దో గొప్పో పొలం ఉంది. ఈలోగా పిల్లాడు చదువు అవడం; బ్యాంక్, ఎల్.ఐ.సి టెస్టులు రాయడం; ఎల్.ఐ.సి.లో మంచి ఉద్యోగం రావడంతో జీవితం ఒక గాడికి వచ్చింది.

ఇంకేమి పెళ్లి సంబంధాలు మొదలు పెట్టారు. అప్పుడేనా అన్నాడు, కానీ పెద్దవాళ్ళు అంతా కలగ చేసుకుని పద్మావతితో పెళ్లి చేశారు. కాలగమనంలో ఇద్దరు మనవలు పుట్టారు సత్యవతికి.

అయినా మనస్సుకు అసంతృప్తి. కోడల్ని సాధిస్తూ ఉండేది. తనకి కొడుకుకి పెళ్లి అప్పుడే చెయ్యకుండా కొన్నాళ్ళు హాయిగా కొడుకుతో ఉండాలని కోరిక. మేనమామలు అదేమీ పట్టించుకోలేదు. కానీ మంచి సంబంధం వచ్చింది, పిల్ల బాగుందని అందరూ పట్టు పట్టి పెళ్లి చేశారు. ఆ కోపం సత్యవతికి ఉంది. అది పైకి చెప్పకుండా కోడల్ని సాధించేది.

ఆ చుట్టు పక్కల ఇళ్ళ వాళ్ళు పేరంటం పిలవడానికి వచ్చినా, ఆఫీస్ వాళ్ళు వచ్చినా ఎందుకో అందుకు ముందుకు వచ్చి ‘మా కోడలికి నేను బయటకు రావడం వచ్చి మాట్లాడటం ఇష్టం ఉండద’ని చెపుతుంది. అది చాలు చిలవలు పలవలు వేసి అల్లరి చెయ్యడానికి.

ఒకసారి ఆమె తమ్ముడి కోడలు ఏదో పరీక్షలు రాయడం కోసం వచ్చింది. ఆ రెండు రోజులు ఆమె చెవులు కొరికేసింది. ఈ మాటలు కోడలు చెవిలో అడపా దడపా పడేవి.

వచ్చినామె తెలివిగా “ఏదో మేము నాలుగు రోజులు పనికి వచ్చి వెళ్లి పోతాము. ఎప్పుడు ఉండదే నీ కోడలు. ఆమెను మేము మందలించకూడదు” అని చెప్పి వెళ్లి పోయింది.

పిల్లలు ఎదుగుతున్నారు. జ్ఞానం వస్తోంది. మామ్మ కూర్చోపెట్టి తల్లిని దూషిస్తూ ఉంటే తట్టుకోలేక తండ్రితో చెప్పారు .

శ్రీనివాస్ ఆలోచించాడు. రోజురోజుకీ తల్లి పరిస్థితి అయోమయంగా మారింది.

“అమ్మా మంచి చీర కట్టుకో” అని చెప్పి కారులో తీసుకెళ్ళి మల్లవరం గాంధీ గారి ఆనంద ఆశ్రమంలో దింపి అన్ని చూపించాడు.

“చాలా బాగుంది రా” అంది.

“అయితే ఓ వారం రోజులు ఉండు” అంటూ కార్లోంచి బ్యాగ్ తెప్పించాడు.

“అరే నువ్వు బట్టలు కూడా తెచ్చావు” అన్నది.

“అవును, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. నేను పిల్లల పుట్టిన రోజులకు ఇక్కడకు వచ్చి స్వీట్స్ పంచి పెట్టి వెడుతుంటాను. ఇది ఇద్దరు ఆడవాళ్ళు నడిపే ఆశ్రమం. ఇక్కడ సాత్విక ఆహారం పెడతారు. కోపం, క్రోధం ఉండదు” అని చెప్పి తల్లిని ఒక ప్రత్యేక రూంలో ఉంచి టీ.వీ. పెట్టించి వెళ్ళాడు.

వారం గడిచింది. అబ్బాయి రాలేదు. నెల గడిచింది. సత్యవతికి బెంగ వచ్చింది.

తిట్టే నోరు, తిరిగే కాలు ఊరుఉంటాయా? అందుకే ఆ మేడం దగ్గరికి వెళ్ళి కొడుకుకి ఫోన్ చెయ్యమన్నది.

ఆమె తెలివిగా ‘శని ఆదివారం సెలవు కదా, అప్పుడు వస్తాడ’ని చెప్పి పంపేది.

శనివారం రాగానే ఉదయం లేచి స్నానం చేసి పెద్ద అంచు జరీ కోక కట్టి కొడుకు రాక కోసం చూసేది. కొడుకు రాలేదు. నిరాశ మిగిలింది.

మళ్లీ ఫోన్ చేసింది. “పని వత్తిడి వల్ల రాలేదు” అని చెప్పాడు కానీ అది కాదు, తన తల్లి మాటలు భార్య పడలేక పోతోంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కలసి ఉండాలి. పద్మ చిన్నది, అమ్మ పెద్దది. అస్తమానం సాధిస్తూ ఉంటే ఎలా?

అదీ గాక పిల్లలు కూడా నానమ్మ సాధింపు వినలేక పోతున్నారు. అందుకే అలా పంపేశారు.

***

ప్రతి శనివారం ఎదురు చూపులు మిగిలాయి.

ఒకరోజు శ్రీనివాస్ పెళ్ళాం పిల్లలతో కలసి వచ్చి అందరికీ పళ్ళు పంచి పెట్టించాడు. తల్లి చేత అందరకీ ఇప్పించాడు. సత్యవతి చాలా సంబరపడింది.

సాయంత్రం మళ్లీ శ్రీనివాస్ బయలు దేరాడు. తల్లి కూడ వస్తానంది.

“ప్రస్తుతం వద్దు అమ్మా. నేను వీళ్ళకి నీ నిమిత్తం లక్ష రూపాయలు ఇచ్చాను. అవి తిరిగి ఇచ్చేవరకు నువ్వు ఇక్కడే ఉండాలి” అన్నాడు.

దానికి సత్యవతి బాధ పడింది. వెళ్ళిపోతున్న కారు వంక నిరాశగా చూస్తూ ఉండి పోయింది.

***

మళ్లీ దసరా పండుగ వచ్చింది. శ్రీనివాసు వస్తాడని జరీ చీర కట్టుకుని రెండు చీరలు సంచిలో పెట్టుకుని రెడీ అయ్యింది. రాలేదు. నిరాశ వచ్చింది.

మేడం దగ్గరికి వెళ్లి “అమ్మా, నా బిడ్డ డబ్బు లక్ష ఇవ్వండి. నేను వెళ్ళిపోతాను” అంది.

“మేము డబ్బు తీసుకోలేదు. ఊరికే అలా చెప్పాడు మీ అబ్బాయి. మాకు ఏమి వద్దు. వచ్చినప్పుడు మీకే రెండు వేలు ఖర్చులకు ఇస్తున్నాడు” అని మేడం చెప్పింది.

కానీ పట్టుదలగా సత్యవతి అందరికీ “నా బిడ్డ వీళ్ళకి డబ్బు అప్పు ఇచ్చాడు. వీళ్ళు ఇవ్వడం లేదు” అని చెప్పసాగింది. అందరికీ అలా చెప్పడం పద్దతి కాదని మిగిలిన వాళ్ళు మందలించారు. అయినా వినలేదు

చివరికి సత్యవతి మాటలతో అందరికీ విసుగు వచ్చింది. ఆమెను హోమ్ నుంచి పంపమని చెప్పారు.

అదే విషయం శ్రీనివాసుకి చెప్పారు. అతను బాధ పడటం తప్ప మరేమీ చెయ్యలేదు.

సత్యవతి మాత్రం శనివారం ఆదివారం జరిచీర కట్టుకుని కొడుకు వస్తాడని, ఇంటికి తీసుకెళతాడు అని ఆశ పడుతుంది.

ప్రతి నెల ఇచ్చే రెండు వేలు దాచి మనమలకు ఇస్తానని చెపుతుంది. ఏ కారు వచ్చినా తన కొడుకు వచ్చాడని ఆశగా చూస్తుంది. ఎప్పుడు నలగని జరీ చీరలు కడుతుంది

సత్యవతిలా ఎందరో అత్తగార్లు కోడళ్లను బాధ పెడుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఒక్క కొడుకు అటు తల్లికి ఇటు భార్యకు ఏమి చెప్పగలడు?

అయితే పిల్లలు ఎదిగాకా బామ్మ గడుసుతనం తెలుసుకుని తల్లిని రక్షించ గలిగారు.

ఇప్పటికీ సాధించే ఎందరో అత్తలున్నారు. కోడలు ఎప్పుడు పై ఇంటి పిల్లే కదా. సాధించకుండా ప్రేమగా చూస్తే ఈ సమస్యలు రావని తెలుసుకుంటే ఆనందమయం కదా.

‘నానాటి బ్రతుకు నాటకము…’ అన్న అన్నమయ్య శ్రీ వేంకటేశ అమృత కీర్తన శ్రావ్యంగా వినిపిస్తోంది.

అందరూ ఒక్కసారి ఆలోచించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here