జరుగుతున్న కథ

    0
    4

    [box type=’note’ fontsize=’16’] ఇతరుల అనుభవాలను చూసి నేర్చుకునేవారు ఉత్తములు. లేనివారు కష్టపడి పాఠాలు నేర్చుకోవాల్సివస్తుందన్న నిజాన్ని సున్నితంగా చెప్పిన తమిరిశ జానకి కథ “జరుగుతున్న కథ”. [/box]

     

    ఆకులు రాలిన చెట్టు కూడా అందంగానే కనపడుతోంది చేసిన చెక్కబొమ్మల్లే. రోజులు గిర్రున తిరిగేసరికి చిగుళ్ళేసి నవ్వుతుంది మళ్ళీ చూడముచ్చటగా పచ్చగా.

    మనిషై పుట్టిన తనెందుకు నవ్వుతూ బతకలేకపోతోంది. కష్టాలొచ్చినంత మాత్రాన ఇంక మంచిరోజులే లేవని అనుకోవడం పొరపాటు కాదా? తనకి తనే నచ్చచెప్పుకునే ప్రయత్నంలో ప్రశ్నించింది మనసు.

    సమాధానం చెప్పుకోవాలన్న తపనలో గతకాలపు ఎత్తుపల్లాలు పెళ్ళలు పెళ్ళలుగా విరిగి పడుతున్నాయి గుండెమీద.

    అయినా కూడా ఈ గుండె నిబ్బరంగా కొట్టుకుంటూనే ఉందేమిటి చితికిపోకుండా?

    మనసు చలించినంతగా హృదయానికి చలనం ఉండదా! రెండూ అలా ఉంటే మనిషి బ్రతుకు కష్టమవుతుందేమో? నిజమే కష్టమవుతుంది.

    కొంత జీవితం గడిచాక గుండెని మెల్లమెల్లగా బండలా మలుచుకోవడం అలవడుతుంది కాబోలు.

    అలవడటం కాదు అవసరమవుతుంది అంటే సబబుగా ఉంటుందేమో.

    కిటికీలోంచి బయటికి చూస్తూ ఆలోచిస్తున్న శ్రావ్యకి వీధిలో వెళ్తున్న వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని అనిపించింది. ఆశ్యర్యంగా కళ్ళింతంత అయ్యాయి. వీళ్ళకేమీ కష్టాల్లేవా తనకొక్కదానికేనా?

    “ఏంటమ్మా అలా నుంచున్నావు? ఆకలేస్తోంది అన్నం పెట్టు.”

    టీ.వీ. చూస్తున్నదల్లా హఠాత్తుగా లేచి వొచ్చి తల్లి చెయ్యి పట్టుకుని గట్టిగా లాగింది చిన్ని.

    ఉలిక్కిపడి పక్కకి తిరిగింది శ్రావ్య. ఆ వెంటనే గడియారం వైపు చూసింది. పన్నెండవుతోంది. ఆదివారం బడికి సెలవు కావడం వల్ల నిద్ర లేచిన దగ్గిర్నించీ టీ.వీ. ముందు కూచుండిపోయింది చిన్ని.

    మామూలుగా అయితే అంతంతంతసేపు కూతురు టీ.వీ.కి అతుక్కుపోకుండా ఏదో ఆ మాటలూ ఈమాటలూ చెప్పి మరిపించి మధ్యమధ్యలో అక్కడినించి లేచేలా కావాలని చేస్తుండేది బడికి సెలవు ఉన్నప్పుడల్లా. కానీ ఈ రోజు ఆ ధ్యాసే లేదే.

    “పద అన్నం పెడతాను” నిర్లిప్తంగా అంటూ వంటింటివైపు నడిచింది.

    ఆరోజంతా అన్యమనస్కంగానే గడిచిపోయింది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరోజు ఏవ్యక్తికైనా అంతే మనసు వర్తమానంలోకి రానంటుంది. గతాన్ని తవ్వుకుంటూ తవ్వుకుంటూ తల్లడిల్లిపోతుంది. ఆ పరిస్థితిలో రాత్రి నిద్ర కూడా పట్టలేదు శ్రావ్యకి.

    నవ్వుకీ ఏడుపుకీ కన్నీళ్ళే వచ్చినట్టు ఆనందం ఎక్కువైనా విచారం ఎక్కువైనా కంటికే సమస్య ఔను కునుకు పట్టదు కదా.

    చిన్నప్పటినించీ ఎన్నో ఆశలతో ఎన్నెన్నో ఊహలతో పెరిగి పెద్దవుతూ వస్తున్న శ్రావ్యకి అమ్మా నాన్నల పద్ధతి నచ్చేదికాదు. ‘మధ్యతరగతి కుటుంబం కదా తల్లీ మనది. ముందూ వెనకా చూసుకుంటేగానీ ఎంతో ఆలోచిస్తేగానీ రూపాయి డబ్బులు ఖర్చు పెట్టలేం. అందులో నలుగురు పిల్లల్ని కన్నవాళ్ళం, ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు’ అంటాడు నాన్న.

    ‘ఇదుగో అమ్మలూ ఓ పావుకిలో ఉల్లిపాయలు తీసుకురా తల్లీ పక్కనే ఉన్న కిరాణా దుకాణంనించి. తూకం సరిగ్గా తూస్తున్నాడో లేదో బాగా గమనించు. తెగ మోసం చేస్తాడు ప్రతివాడూ తూకంలో. వాడిచ్చే చిల్లర సరిగ్గా ఉందో లేదో ఒకటికి పది సార్లు అక్కడే లెక్కచూసుకునిరా. ఏమీ ఎరగనట్టు అంతా సరిగ్గానే ఉన్నట్టు చేతిలో పెట్టేస్తారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని మాయదారి లోకం కదమ్మా’ అంటుంది అమ్మ ఎప్పుడూ. మోసం మోసం మోసం శ్రావ్య చెవుల్లో నిత్యం మారుమోగే మాటలవి.

    ముందూవెనకా చూసుకుంటూ ఎంతో ఆలోచించిగానీ రూపాయి డబ్బులు ఖర్చు పెట్టలేం అనే నాన్న మాటలు మరోపక్క నించి. ఇంకా ఎన్నో జాగ్రత్తలు మంచీ చెడూ వివరణలు.

    తిక్కరేగుతూ ఉండేది. విసురుగా అంది ఒకరోజు ‘ఎందుకమ్మా పెద్దవాళ్ళకేమీ పనిలేదా పిల్లలకి జాగ్రత్తలు చెప్పడంతప్ప. మా అనుభవంలో మాకే తెలుస్తుందిగా.’

    చాలా గొప్ప పాయింట్ చూపించానన్న గర్వం ఒకింత తొణికిసలాడింది ఆ గొంతులో.

    ‘అందరికీ అన్నీ వాళ్ళ వాళ్ళ అనుభవాలవల్లే తెలియాలి అంటే ప్రతి ఒక్కరూ కష్టనష్టాలు పడాలి. అలా ఎందుకు చెప్పు. ఇతరుల అనుభవాలతో మనం పాఠం నేర్చుకోవడం తప్పుకాదు. నేర్చుకోవాలి కూడా. దానివల్ల ఉంటే లాభం ఉంటుందిగానీ నష్టం ఉండదు.’

    అమ్మ ఇచ్చిన సమాధానం నచ్చితేగా శ్రావ్యకి.

    విక్రమ్‌తో పరిచయం పెంచుకోడానికీ, అతన్ని పెళ్ళిచేసుకోదల్చుకున్నానని అమ్మకీ నాన్నకీ చెప్పడానికీ ఆట్టే రోజులు పట్టలేదు.

    తన ధైర్యానికి తన భుజం తనే చరుచుకుంది.

    కానీ ఉలిక్కిపడిన అమ్మ గుండెలు చరుచుకుంది ‘ఆ కుర్రాడు మంచివాడు కాదే’ అంటూ.

    హేళనగా నవ్వింది శ్రావ్య. “మనం మద్యతరగతివాళ్ళం కాబట్టి మనకి ఆస్తిపాస్తుల్లేవని ధనవంతుల మీద చెడ్డవాళ్ళన్న ముద్ర వేసెయ్యాలా?”

    కూతురి మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియలేదావిడకి.

    ఇంక నోరు విప్పక తప్పలేదు తండ్రికి. “గొప్ప పేద తేడా కాదమ్మా, ఆ కుర్రాడి గుణం మంచిది కాదు. చాలా చెడ్డ అలవాట్లున్నాయి. నీ డిగ్రీ పూర్తికానీ మంచి గుణవంతుడైన కుర్రాడితో పెళ్ళి చేస్తాను.”

    “గంతకితగ్గ బొంత అంటూ రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచించే వాడినెవడినో తీసుకొచ్చి కట్టపెడతారు. నాకు అక్కర్లేదు. అయినా నేనింత పెద్దయ్యాక కూడా ఇంకా మీరు చెప్పినట్టే నడుచుకోవాలా?”

    చిర్రుబుర్రులాడుతూ అక్కడినించి లేచి వెళ్ళిపోయింది శ్రావ్య. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా కాలానికి వాటితో పనిలేదు. కదిలిపోతూనే ఉంటుంది.

    ఇటు వైపు తల్లితండ్రులకి అటువైపు తల్లితండ్రులకి ఇష్టం లేదన్న కారణం చూపించి శ్రావ్యని స్నేహితుల సమక్షంలో మెళ్ళో దండలు మార్చుకుని పెళ్ళి చేసుకున్నాడు విక్రమ్. అమ్మ నాన్నల సహకారం లేకుండానే చాలా పెద్ద ఘనకార్యం తాను చేశానని సంబరపడింది శ్రావ్య.

    “మా అమ్మా నాన్నలకి ఇష్టం లేదుకదా అందుకని మనం ఉండడానికి వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాను” అంటూ విక్రమ్ ఊరికి చివరెక్కడో విసిరేసినట్టున్న ఇంటికి తీసికెళ్తే భయపడిపోయింది. కానీ ఆ వెంటనే తనకి తనే నచ్చచెప్పుకుంది పెద్దవాళ్ళ కోపం తగ్గగానే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోకుండా ఎందుకుంటాడులే అని.

    పొద్దున పోతే రాత్రికొస్తాడు ఇంటికి.

    ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావంటే చెప్పడు. ‘నాకిక్కడ భయం వేస్తోంది విక్రమ్’ అంటే పకపకా నవ్వుతాడు. ‘నీకా భయమా ఎందుకూ ఇల్లొదిలిపెట్టి నాతో వచ్చినదానివి నీకు భయమేమిటి జోక్ చెయ్యకు’ అంటాడు.

    రాను రాను అతని వాలకం చూస్తుంటే తను పొరపాటు చెయ్యలేదుకదా అన్న ఆలోచన బుర్రలో పురుగై తొలవడం మొదలుపెట్టింది శ్రావ్యకి.

    అనుకున్నంతా అయింది. రెండుమూడు రోజులు ఇంటికే రాలేదు విక్రమ్. మూడురోజుల తర్వాత విక్రమ్ స్నేహితుడినంటూ ఒకతను వచ్చాడు.

    విక్రమ్ గురించి అడిగితే అడ్డం దిడ్డంగా సమాధానం చెప్పాడు. ‘ఇంక వాడెందుకు వస్తాడు? వాడికి ఇక్కడేం పని ఉంది? నన్ను చూసుకోమన్నాడు’ అంటూ చాపమీద గోడకానుకుని కూచున్నాడు.

    ‘విక్రమ్‌కి బాగా దగ్గరి స్నేహితులం అయిదారుగురం ఉన్నాంలే. అందులో నేనొకడిని. నా పేరు చంద్రం. రోజూ ఎవరో ఒకరం వచ్చి నిన్ను చూసుకుంటాంలే. ఒంటరిగా ఉన్నానని భయపడకు అంటూ చటుక్కున లేచి దగ్గరగా వస్తున్న అతన్ని చూసి వణికిపోతూ వెనక్కి జరిగింది శ్రావ్య. సరిగ్గా అప్పుడే అతని చేతిలో సెల్ మోగింది. ఎవరితోనో చాలా కంగారుగా ‘ఇప్పుడే వస్తున్నా’ అని బదులిచ్చి శ్రావ్యవైపు తిరిగి ‘అరగంటలో వచ్చేస్తా’ అనేసి హడావిడిగా వెళ్ళాడు. తను చిన్న తప్పటడుగు కాదు చాలా పెద్ద తప్పటడుగే వేశానని అర్థమైపోయింది శ్రావ్యకి. ఈ రొంపిలోంచి తప్పించుకోవడం ఎలా. అమ్మా నాన్నల మాటలే గుర్తుకొచ్చాయి ఆ సమయంలో ఆమెకి. అయినా తన తప్పు సరదిద్దుకునే అవకాశం ఇప్పటికీ తనకి ఉంది. మోసపోయినవాళ్ళు మోసంలోనే మగ్గిపోవాలని లేదుగా. ఆ చంద్రంగాడు హఠాత్తుగా ఇక్కడినించి వెళ్ళిన ఈ అవకాశాన్ని తను అందిపుచ్చుకోకపోతే తన జీవితమే నాశనం అవుతుంది. పారిపోడానికి మరొక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు శ్రావ్య.

    అమ్మా నాన్నలు ఆదరించి తిరిగి అక్కున చేర్చుకున్నారు కాబట్టి తను ప్రాణాలతో ఉంది. లేకపోతే జీవితం కుక్కలు చింపిన విస్తరేగా. దండలు మార్చుకున్న పెళ్ళికి సాక్ష్యాలేమీ లేవు. అదీ ఒకందుకు మేలే అయ్యింది తనకి. లేకపోతే ఆ సాక్ష్యం చూపించి తనని వాడు బలవంతంగా తీసుకుపోతే నరకం చూడాల్సి వచ్చేదికదా. అలాంటివాడితో ఒక్కరోజుకూడా ఉండడం ఇష్టం లేదు తనకి. విడాకులకి అర్జీ పెట్టుకున్నా అవి ఆమోదించేవరకూ ప్రతి క్షణం కుమిలిపోతూ బ్రతకాల్సిందే. పెద్ద పధకంతోనే విక్రమ్ ఫొటోలు తీయించి ఉండడని అర్థమైంది. ఔను ఆ ఫొటోల ఆధారంగా తను అతని భార్యనని కోర్టుకెక్కే అవకాశం తనకుంటుందని ఫొటోల జోలికి పోలేదన్నమాట.

    గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చింది శ్రావ్య. తన కాళ్ళమీద తాను నిలబడి బ్రతకడానికి ఉద్యోగంలో చేరింది. కానీ ఈ సమాజం అప్పుడప్పుడు తనని చిన్నచూపు చూస్తూ పలికే వంకర మాటలకి మనసు చివుక్కుమంటూనే ఉంటుంది. అలాంటప్పుడే గతం కళ్ళముందు కదిలి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తేనెటీగల్లా ముసురుతున్న ఆలోచనల్ని తోసేస్తూ నిద్ర పట్టించుకుందుకు ప్రయత్నించింది శ్రావ్య.

    ఆ మర్నాడు సాయంత్రం బస్‌స్టాప్ నించి ఇంటికి వస్తుంటే ఓ కారు తన పక్కగా ఆగడం, అందులోంచి పాత స్నేహితురాలు వనజ దిగి ‘శ్రావ్యా’ అంటూ తన చేయి పట్టుకోడం ఆశ్చర్యం ఆనందం కలిగించాయి శ్రావ్యకి. ఎన్ని సంవత్సరాలైపోయింది తామిద్దరూ కలుసుకుని. ఈ ఊరికి దగ్గర్లోనే ఎక్కడో ఉంటోందని వినడమేగానీ ఎక్కడుందో ఈ క్షణం దాకా తనకి తెలియదు. “ఇక్కడే అంటున్నావుగా, మీ ఇల్లు?”

    “కారెక్కు. నేనూ వస్తాను కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు మీ ఇంట్లో” అంటూ స్నేహితురాలిని కార్లో కూచోపెట్టింది వనజ. “ఇప్పుడు చెప్పు శ్రావ్యా మీ ఇంట్లో ఎవరెవరుంటారో?”

    “మా ఇంట్లో నేనూ నా కూతురు అమ్మా నాన్నగారూ” సమాధానం చెప్పింది శ్రావ్య.

    వింతగా చూసింది వనజ. “మరి మీ వారు?”

    “నేను పెళ్ళి చేసుకోలేదు” అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పింది శ్రావ్య. అనాధాశ్రమం నించి ఒకపాపని తెచ్చి పెంచుకుంటున్నాను అని చివరిగా చెప్పింది. కారు ఓ పక్కగా ఆపి స్నేహితురాలి భుజమ్మీద చెయ్యివేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ “నువ్వు చాలా చాలా గొప్పదానివి. అనాథ పిల్లని తెచ్చి పెంచుకుంటున్నావు” అంది వనజ.

    “ఈ విషయంలో చాలామందిలాగే నువ్వూ నన్ను విమర్శిస్తావనుకున్నాను. కానీ మెచ్చుకుంటున్నావు. ఆశ్చర్యం”.

    “ఆశ్చర్యం ఎందుకూ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. కానీ మహిళల్లో మార్పురావాలి శ్రావ్యా. ప్రేమించడం తప్పుకాదుగానీ ఒకరి గురించి ఒకరు క్షుణ్ణంగా వివరాలు తెలుసుకోగలగాలి. ఎక్కువశాతం మహిళలే కదా మోసపోతున్నారు. సమాజంలో జరుగుతున్నవన్నీ చూస్తూ వింటూ కూడా మళ్ళీ మళ్ళీ అమ్మాయిలు పొరపాట్లెందుకు చేస్తున్నారో అర్ధం కాదు నాకు.”

    “నిజమే వనజా ఇతరుల అనుభవాల నించి పాఠాలు నేర్చుకుని తీరాలి. అన్నీ తమ తమ అనుభవంనుండే నేర్చుకుందామని అనుకునే నా బోటివాళ్ళు మారాలి. లేకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అవుతుంది” తల దించుకుని మెల్లిగా అంది శ్రావ్య.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here