జరుగుతున్నది జగన్నాటకం – పరిచయం

0
2

[dropcap]అ[/dropcap]రిపిరాల సత్యప్రసాద్ వ్రాసిన మొదటి నవల జరుగుతున్నది జగన్నాటకం. ఈ నవలలోని కథను టూకీగా పరిచయం చేస్తాను.

బోసు అనే వ్యక్తి సముద్రంలో కొట్టుకుపోయి సవ్యలంక అనే రాజ్యానికి చేరతాడు. అక్కడి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు విచిత్రంగా ఉంటాయి. అక్కడి వారందరూ కుడిచేయిని వాడేచోట్ల ఎడమచేయిని ఉపయోగిస్తుంటారు. బోసు ఈ ఆచారాలు నచ్చక వాటిని అతిక్రమించినందుకు దళాధిపతి అతడిని బంధించి మరణదండనను విధిస్తాడు. అయితే కొందరు బోసును కాపాడి వారి ధర్మగ్రంథం మహాజ్ఞాన గ్రంథం(దీనికి భవిష్య గ్రంథం, భవిష్య జ్ఞాన గ్రంథం అనే పేర్లున్నాయి)లో పేర్కొన్న మహాబసు అతడేనని, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరాడబోయే వీరుడిగా భావిస్తారు. తరువాత జరిగే పరిస్థితుల కారణంగా బోసు మహాబసుగా మారి రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు. ఇది మొదటి కథ. ఇందులో ఆచార్య వేదాంతం, ద్వీప, జలపతి, పశుపాల(కొన్ని చోట్ల పశుపతి), ఉగ్ర, వామదేవుడు, ఉదంతుడు, సిరిగిరి, సిరివరం, సిరిచరం, సుధాముడు,జ్ఞాతి మొదలైన పాత్రలు వస్తాయి. ఇవికాక మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సామ్రాట్ అశోక వంటి చారిత్రక పాత్రలు కూడా ఎదురుపడతాయి. పుస్తకం పేరులో జగన్నాటకం ఉంది కనుక జగన్నాటకసూత్రధారి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఈ కథలో దర్శనమిస్తాడు. ఈ కథలో చరిత్ర ఎలా ప్రారంభమయ్యింది? మతాధికారానికీ – రాజ్యాధికారానికీ మధ్య వున్న తేడా, పరిస్థితులకు అనుకూలంగా సిద్ధాంతాలను మార్చుకోవాలా? నమ్మిన సిద్ధాంతం మరియు ఉద్యోగ ధర్మం పరస్పరం విరుద్ధమైనప్పుడు కలిగే మానసిక సంఘర్షణ, యుద్ధంలో గెలుపువల్ల శాంతి లభిస్తుందా? వ్యాపార పభుత్వాల మధ్య సంబంధం, యుద్ధం – దాని పర్యవసానం మొదలైన ఎన్నో విషయాలపై చర్చలున్నాయి.

సారథి, మూర్తి, ప్రసాద్ అనే ముగ్గురు స్నేహితులు ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటారు. ఈ సంఘటన జరిగిన తర్వాత సారథి ప్రవర్తనలో మార్పు వస్తుంది. తను సవ్యలంక అనే మరో ప్రదేశంలో ఉన్నట్టు తన పేరు గుర్తులేనట్టు అక్కడి ప్రజలకు తనను బోసుగా పరిచయం చేసుకున్నట్టు అక్కడ అందరూ ఎడమచేతిని ఉపయోగిస్తున్నట్టు తాను ఆ నియమాన్ని అతిక్రమించినందుకు మరణం అంచులదాకా వెళ్ళినట్టు తన మిత్రులకు తెలియజేస్తాడు. అయితే ఇది కల కానీ, కథ కానీ కాదని వాస్తవంగా జరిగిందనీ చెబుతాడు. ఒకే సమయంలో రెండు చోట్ల ఒకే మనిషి ఉండటం ఎలా సాధ్యపడుతుందని అతని మిత్రులు వాదిస్తారు. చివరకు సారథిని డాక్టర్ నరసింహం అనే ఒక సైకియాట్రిస్టు దగ్గరికి తీసుకువెళతారు అతని మిత్రులు. సారథి నరసింహానికి ప్రతిరోజు సవ్యలంకలో జరిగే విషయాలను వివరిస్తుంటాడు. డాక్టర్ నరసింహం సారథికి పేరలల్ వరల్డ్స్ సిద్ధాంతాన్ని వివరిస్తాడు. సమాంతరంగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రపంచాలు ఒకే సమయంలో నడుస్తుంటాయని, రెండు ప్రపంచాలలోను ఒక వ్యక్తిని పోలిన మరో వ్యక్తి ఉండవచ్చని, రెండు ప్రపంచాలకు ఒకదానితో ఒకటి సంబంధం ఉండొచ్చని అయితే ఈ సిద్ధాంతానికి శాస్త్రీయ ఆధారం లేదని, ఎక్కడా నిరూపింపబడలేదని నరసింహం వివరిస్తాడు. సారథి మహాబసుగా సవ్యలంకలో జరిగే విషయాలను నరసింహం కొట్టి పడెయ్యడు. పైగా ఆ లోకంలో తాను ఆచార్య వేదాంతం అని తనకు కూడా ఆ లంకలో జరుగుతున్న విషయాలు అనుభవమౌతున్నాయి అని తెలుపుతాడు. ఇది రెండవ కథ. ఈ కథలో కూడా కావలసినన్ని సిద్ధాంత చర్చలు పాత్రల మధ్య జరుగుతాయి.

ఈ నవలలో రచయిత పై రెండు కథలను సమాంతరంగా నడిపాడు. అయితే మొదటి కథలో కొంత ఎక్కువ కథను నడిపి రెండో కథలో తక్కువ కథను నడపడంతో కొంత బేలెన్స్ తప్పింది. సారథి అతని మిత్రుల మధ్య ఐర్లాండ్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన గురించి చర్చకు వస్తుంది. కవిత భారతీయ సంతతికి చెందిన యువతి తన గర్భంలో ఉన్న పిండానికి ఇన్ఫెక్షన్ సోకటంతో దానిని తొలగించమని డాక్టర్లను కోరుతుంది. ఐతే ఐర్లాండ్ చట్టం ప్రకారం క్లినికల్‌గా గర్భస్రావం చేయడం నేరం కావడంతో డాక్టర్లు ఆమె కోరికను నిరాకరించారు. ఇన్ఫెక్షన్ అన్ని అవయవాలకు పాకి తల్లీబిడ్డలు ఇరువురూ మరణిస్తారు. ఈ సంఘటనపై మిత్రత్రయం తీవ్రంగా చర్చిస్తారు. ఒక్క ఐర్లాండే కాదు ప్రపంచంలో ఎక్కడైనా భ్రూణహత్య నేరం అనే చట్టానికి (ఒకవేళ లేకపోతే) కొన్ని మినహాయింపులుండాలని సారథి వాదిస్తాడు. ఈ దిశగా సారథి ఏదైనా ఒక ఉద్యమాన్ని నడుపుతాడేమో అని ఊహించిన పాఠకునికి అటువంటిదేమీ లేకపోవడం కొంత నిరాశను మిగులుస్తుంది. “పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అర్థంలేని సిద్ధాంతాలను పట్టుకొని వేలాడటం అవివేకం, మూర్ఖత్వం” అని తన అహింసా సిద్ధాంతంపై మహాత్మా గాంధీ చేత పలికించడం కొందరికి మింగుడు పడకపోవచ్చు.

అన్నట్టు పై రెండు కథలు కాకుండా ఈ నవలలో మూడో కథ కూడా ఉంది. ఈ కథలో మొదటి రెండు కథలు డ్రగ్ ఇండ్యూజ్‌డ్ హేలోజినేషన్ కారణంగా సారథి ఊహించుకున్నవని డాక్టర్ నరసింహం అనే వ్యక్తి కూడా ఒక కల్పిత వ్యక్తి అని, సారథికి ట్రీట్మెంట్ ఇచ్చింది డాక్టర్ దీప అని రచయిత వివరిస్తాడు.

ఈ నవలకు చదివించే లక్షణాలు మెండుగా ఉన్నాయి. కథలో పాఠకులు ఊహించని మలుపులు అనేకం ఉన్నాయి. ఈ నవలను సాంఘిక, జానపద, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ నవలగా వర్గీకరించవచ్చు. అక్కడక్కడా కొన్ని అక్షరదోషాలు తప్పిస్తే పుస్తకం హాయిగా చదివిస్తుంది. గెటప్ బాగుంది. ఈ పుస్తకం అన్ని ప్రముఖ దుకాణాలలో లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా కొనదలచినవారికి ఇక్కడ లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here