[dropcap]మ[/dropcap]హా భారతంలో భీముడు అత్యంత బలశాలిగా పేరున్నవాడు. అరణ్యవాసంలో బకాసురుడు, కిమ్మీరుడు, హిదంబాసురుడు వంటి రాక్షసులను వధించినవాడు. అలాగే అజ్ఞాతవాసంలో కీచకుడిని సంహరించినవాడు. భీముడు వధించిన రాక్షసులలో జటాసురుడు ఒకడు. జటాసురుని వృత్తాంతము మహాభారతంలో అరణ్య పర్వంలో వస్తుంది.
పాండు నందనులు కుబేర వనం చేరుకున్నప్పుడు అక్కడి ఉద్యానవన పరిపాలకులు వారితో, “ఇది యక్ష రాక్షస నిలయము. మీ వంటి వారు ఇచ్చట ఉండటం సరికాదు, మీరు కుబేర నదిని దాటి మరొక ప్రాంతంలో ఆశ్రమం ఏర్పరచుకొని నివసించండి” అని సలహా ఇచ్చారు.
పాండవులు ద్రౌపది గంధమాన పర్వతంపై అర్జుని రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ ప్రదేశం నివాసి అయిన దుష్ట రాక్షసుడు పాండవులను నమ్మించి వారి చెంతన చేరి ఆయుధాలను తస్కరించి పాండవులను హతం చేయాలన్న దుష్ట తలంపుతో బ్రాహ్మణ వేషములో వారి వద్దకు వచ్చి, “భూపాల కులతిలకులారా, నేను వేద వేదాంగవేత్తను, పరమేశ్వర స్వరూపుడైన పరుశరాముని శిష్యుడను” అని వారిని నమ్మించి వారి ఆశ్రమంలో అతిథిగా ఉండటం ప్రారంభించాడు.
అవకాశం కోసం ఎదురుచూస్తున్న జటాసురునికి ఒకనాడు భీముడు అడవిలోకి వెళ్ళినట్లు తెలిసింది. అప్పుడు తన సహజ రూపాన్ని ధరించి ద్రౌపదిని పాండు నందనులను వారి అస్త్రాలను దొంగలించి వాయు వేగంతో గగన వీధిలో సంచరించటం మొదలుపెట్టాడు.
ఈ హఠాత్ పరిణామానికి ధర్మరాజు, ద్రౌపది, నకుల సహదేవులు ఒక్కసారిగా భయపడ్డారు. కానీ ధర్మరాజు తేరుకొని ఆ రాక్షసుడిని హెచ్చరించాడు. కానీ వాయువేగంతో పోయే ఆ మాయావి రాక్షసుడికి ఈ హెచ్చరికలు శాపాలు శుష్క ప్రియాలు అయినాయి.
“భీముడు వస్తే నీ అట అంతం అవుతుంది” అని తీవ్రంగా హెచ్చరించాడు. సహదేవుడు పట్టు విడిపించుకొని కౌశిక అనే కత్తితో ఆ రాక్షసునిపై దాడి చేస్తూ భీముని గురించి కేకలు వేయటం ప్రారంభించాడు. ఇక మాటలకు వినడని భావించిన ధర్మరాజు తన బలాన్ని ఉపయోగించి జటాసురుడి గొంతు నొక్కుతు భుజాలను ఒడిసి పట్టుకోవటం వల్ల ఆ రాక్షసుడి వేగం తగ్గి నేల మీదకు వచ్చి నేలపైనే తీవ్ర వేగంతో కదలనారంభించాడు.
ఆ సమయంలో అరణ్యం నుండి వచ్చిన భీముడు – ధర్మరాజు, నకుల సహదేవులు, ద్రౌపది రాక్షసుని చేతిలో బందీలుగా ఉండటాన్ని గమనించి ద్రౌపదిని, ధర్మరాజు, నకుల సహదేవులను పక్కకు తప్పుకోమని ఉగ్రుడై జటాసురునితో తనతో పోరు సలపమని సవాలు విసిరాడు. “బ్రాహ్మణ వేషంలో ఉండటం వలన నిన్ను గుర్తించటం ఆలస్యం అయింది. లేకపోతే ఈ పాటికి నీవు నా చేతులలో హతం అయి ఉండేవాడివి. నీకు మృత్యువు ఆసన్నమైంది కాబట్టే నాతో తలపడటానికి సిద్ధం అయినావు. నేను నిన్ను బకాసురుడు, హిడింబాసురుడు వంటి రాక్షసులను చంపినట్లుగానే చంపుతాను. నీకు సమఉజ్జీని నేనే కాబట్టి నాతో తలపడు” అని భీముడు జటాసురుని హెచ్చరించాడు.
భీముని మాటలు విన్న జటాసురుడు ధర్మరాజు నకుల సహదేవులను ద్రౌపదిని విడిచి భీమునితో యుద్ధానికి తలపడ్డాడు. జటాసురుడు భీముడు ఇరువురు ఘోర యుద్ధానికి తలపడ్డారు. ఇద్దరు కూడా ఒకొరినొకరు వధించాలని, పగవారి కన్నా మిన్నగా పిడికిటి పోట్లు, పిడి గుద్దులు, ఆ తరువాత గదా ఘాతాలు, గండ శిలలతో కొట్టుకున్నారు. నకుల సహదేవులు సహాయం చేయబోతే భీముడు వారిని వారించి తానూ ఒక్కడే జటాసురునితో భీకర పోరు సల్పాడు. వీరి ఇద్దరి మధ్య పోరు దేవదానవుల మధ్య జరిగినట్లే జరిగింది. చెట్లు పెకలించి, బండరాళ్లు విసురుకుంటూ భీకరమైన పోరు సలిపారు. వారి ఇద్దరి మధ్య జరిగిన పోరు వాలి సుగ్రీవుల మధ్య జరిగిన పోరును గుర్తు చేసింది. వారి ఇద్దరి పిడి గుద్దులు ఉరుముల ధ్వనిని ప్రతిబింబించాయి. చివరకు భీముడు జటాసురుని పైకెత్తి నేలకు వేసి బాదాడు. భీముని ముష్టిఘాతాలకు జటాసురుడు స్పృహ తప్పి నేలకు ఒరిగి ప్రాణాలను వదిలాడు. జటాసురుని చంపినాక ఆ మృత కళేబరాన్ని ధర్మరాజు ముందు పడవేసాడు.
ధర్మరాజు భీముని వీరోచిత చర్యను మెచ్చుకున్నాడు.
Image Source: Internet