జవాబు లేని ప్రశ్న

18
5

[dropcap]ఇం[/dropcap]కొక వారం రోజుల్లో తన బతుకు తెరువు తలుపు మూసుకుపోతుంది. రవికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు.

రవి తన చిన్న ఊర్లో మిగిలిన ఒకే ఒక పాత సినిమా హాలు ఊర్వశిలో గాంధీ సెనగలూ, పల్లీలూ పొట్లాలు కట్టి సినిమా నడుస్తూ వుండగానే సీట్ల మధ్య తిరుగుతూ అమ్ముకుంటుంటాడు. అవి కొనేవారు తగ్గిపోవడంతోనూ ‘పాప్‌కార్న్ పేకెట్లు లేవా?’ అని కొందరు అడగడంతో గత కొద్దిరోజులుగా పాప్‌కార్న్ పేకెట్లు కూడా తీసుకెళుతున్నాడు.

అమ్మకం పెరగడంతో గాంధీ సెనగల పొట్లాల సంఖ్య బాగా తగ్గించాడు. కానీ నిన్న సెకెండ్ షో ఆట యింటర్వెల్ తరువాత యింటికి బయలుదేరుతూండగా కిరణ్ యింకో వారం రోజుల్లో హాలు మూసేసి పడగొట్టి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టబోతున్నారని చెప్పాడు. అంతే కాదు తనని యిలా సినిమా నడుస్తూండగా పొట్లాలు అమ్ముకోవడానికి అనుమతించరని కూడా చెప్పాడు.

రవికి సినిమా హాల్ మూతపడ్డాక సంపాదనకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. రెండేళ్ల క్రితం రిక్షా తొక్కే నాన్న ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అయిదోక్లాసు తరువాత చదువు మూల పడింది. పాచి పనులు చేసి సంపాదించే అమ్మకి ఆయాసం ఎక్కువై యింతకు ముందులా ఐదుగురు యిళ్ళల్లో పనిచేయలేకపోతోంది. అలాంటి సమయంలో తన గుడిసె పక్కనే వుంటున్న కిరణ్ తను బుకింగ్ క్లర్కుగా పనిచేస్తున్న ఊర్వశి థియేటర్లో మేనేజర్‍తో మాట్లాడి సెనగలూ, పల్లీలూ అమ్ముకోవడానికి అనుమతి యిప్పించాడు. అది మొదలు పెట్టిన ఆరునెలల్లో ఏదో కాస్త కుదురుకున్న సమయంలో థియేటర్ మూతబడుతుందన్న వార్త పెద్ద దెబ్బలా తగిలింది.

***

రవి ఏ వుద్యోగం దొరక్క చివరికి ఊర్వశి థియేటర్ వున్న వీధిలో ఆఖరున వున్న కిరాణా కొట్లో పనికి కుదురుకున్నాడు. రవికి యిష్టం లేకపోయినా ప్రస్తుతానికి తప్పదు. తను థియేటర్లో నెలకు రెండు వేలు వరకూ సంపాదించుకునేవాడు.

హాయిగా సినిమాలు ఫ్రీగా చూసేవాడు. ఈ కిరాణా కొట్లో పొద్దున్నించి రాత్రి పదింటివరకూ గాడిద చాకిరీ చేయాల్సి వస్తోంది. కాస్త పరధ్యానంగా వున్నా యజమానితో తిట్లు తినాల్సి వస్తోంది. పైగా ఎవరు ఏం కొనడానికి వచ్చినా కొట్లో ముందు ఆ వస్తువు పాత స్టాకు తీసి యివ్వకపోతే యజమానితో అదనపు తిట్లూ తప్పటంలేదు. జీతమూ మొదటి నెల వెయ్యి రూపాయలు మాత్రమే యిచ్చి పనితనం చూశాక ఆ పైనెల నించి పదిహేను వందలు యిస్తానన్నాడు. వచ్చే నెల ఎప్పుడు వస్తుందా అని రవి ఎదురు చూస్తున్నాడు.

***

చూస్తూండగానే ఆరునెలల్లో ఊర్వశి థియేటర్ ఊర్వశీ మల్టీప్లెక్స్ థియేటర్‌గా మారి తళ తళా మెరుస్తోంది. కిరాణా కొట్ల పనికి వస్తూపోతూ రవి రోజూ అటువైపు చూస్తూనే వున్నాడు.

అనుకోకుండా ఒకరోజు కిరణ్ థియేటర్ దగ్గర మేనేజర్‌తో మాట్లాడుతూ కనిపించేసరికి రవి ఉత్సాహంగా కిరణ్‌ని కలవడానికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అడుగుదామని అనుకున్నాడు. కంప్యూటర్ నేర్చుకుంటేనే బుకింగ్ క్లర్కుగా మళ్ళీ తనకి వుద్యోగం వచ్చే అవకాశం వుంటుందని కిరణ్‌తో మేనేజర్ అనడం తనూ విన్నాడు. దానితో రవికి తనకూ అక్కడే వుద్యోగం ఏదైనా చూడమని కిరణ్‌తో అనలేకపోయాడు.

***

ఒకరోజు కొట్లో పనిచేసుకుంటూ వుండగా కిరణ్ సైగ చేసి బయటకు రమ్మని మల్టీప్లెక్స్ థియేటర్లో వున్న స్నాక్స్ అమ్మే స్టాల్ కౌంటర్లో తనకు ఉద్యోగం దొరికిందని చెబుతూ రవిని కూడా తన కింద పనిచేయడానికి వస్తావా అని అడిగాడు. మళ్ళీ థియేటర్లో ఉద్యోగమనేసరికి రవి ముందు వెనుక ఆలోచించకుండా సరేనన్నాడు. జీతం కూడా రెండు వేల వరకూ వస్తుందనీ పైగా వేసుకోవడానికి యూనీఫారమ్ కూడా యిస్తారని చెప్పడంతో ఎగిరి గంతేశాడు. మరునాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా మల్టీప్లెక్స్ థియేటర్ గేటు దగ్గర కలుసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు.

మరునాడు రవి ఉదయమే ఉత్సాహంగా బయలుదేరి మల్టీప్లెక్స్ థియేటర్ గేటు దగ్గర చేరుకున్నాడు. గేట్ కీపర్ లోపలకి పోనివ్వకుండా అడ్డుపడుతూండగా కిరణ్ చూసి సర్దిచెప్పి లోపలికి తీసుకెళ్లాడు.

మార్నింగ్ షో మొదలయ్యే ముందే హాలు లోపలికి రవిని తీసుకుని వెళ్ళి అన్ని రకాల తరగతుల సీట్ల గురించి చెబుతూ చీకట్లో వాటి నెంబర్ల కోసం ఎక్కడ చూడాలో కూడా చెప్పాడు.

ఆ తర్వాత తను పనిచేసే స్నాక్స్ షాపులోకి తీసుకెళ్లి తను ఆర్డర్ ప్రకారం తయారు చేసి అందించిన దాన్ని ట్రేలో జాగ్రత్తగా చెప్పిన సీటు దగ్గరకు తీసుకొని వెళ్ళి అందించాలని, సినిమా అయిపోయాక ఆ సీట్ల కింద విడిచేసిన ఖాళీ కప్పులూ, వాడి నలిపేసి ఉండచేసిన కాగితం నేప్‌కిన్లూ ట్రేతో సహా వెనక్కు తీసుకురావాలని వివరించాడు. మరి వాటికి డబ్బులో అని రవి అడగ్గానే కిరణ్ ఆర్డర్లూ డబ్బులూ ఫోనులోనే వస్తాయని చెప్పాడు.

రెండు ఆటలు అయ్యాక రవి తను పోలితిన్ పేకెట్లలో ఐదు రూపాయలకు అమ్మిన పాప్‌కార్న్ కూడా పెద్ద కాగితం గ్లాసుల్లో ఎందరో కొనుక్కోవడం చూసి ఉండబట్టలేక కిరణ్‌తో –

“అన్నా, ఈ పాప్‌కార్న్ ఎంతకు అమ్ముతున్నారన్నా?” అని అడిగాడు.

కిరణ్ “డెబ్బై అయిదురూపాయల్రా” అని జవాబు యిచ్చాడు. రవి ఉండబట్టలేక “నేను ఆరునెలల క్రితం వరకూ ఐదు రూపాయలకే అమ్మేను కదా. ఇప్పుడు అదే డెబ్బై అయిదు రూపాలయకి అమ్ముతున్నారా? మరి నన్నే ఐదు రూపాయలకు అమ్ముకోనివ్వచ్చు కదన్నా? ఇప్పుడు అంతే పాప్‌కార్న్‌కు డబ్బైఆయిదు రూపాయలు అందరూ ఎలాగ యిస్తున్నారన్నా?” అని అడిగాడు.

కిరణ్ కోపంగా “నాకవన్నీ తెలీదు. నీకిష్టముంటే పని చేయ్, లేదంటే లేదు” అనేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here