[box type=’note’ fontsize=’16’] “ఎంతో లోతు గల విషయాన్ని ఎంచుకున్నప్పుడు సమపాళ్లల్లో పాత్రోచితంగా తీర్చిదిద్దటం అవసరమవుతుంది” అంటున్నారు వేదాంతం శ్రీపతిశర్మ ‘జవానీ జానెమన్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]’జ[/dropcap]వానీ జానెమన్’ 2020లో విడుదలైన హిందీ చిత్రం. సైఫ్ అలీ ఖాన్ మీద గల ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. అతన్ని చూడగానే ఒకటే గుర్తుకొస్తుంది – ‘షోలే’ చిత్రంలో అబితాబ్, ధర్మేందర్ గురించి అన్న మాట – ‘జహా లడకీ దేఖీ, లైన్ లగానా చాలూ..’
జవానీ – మగవాళ్లకి మాయరోగం మామూలే. అదేమిటంటే – ‘మేమెప్పుడూ యువకులమే, అదుగో ఆ అమ్మాయి నన్నే చూస్తోంది, ఈ ఆంటీ నన్నే కోరుకుంటోంది’ అనుకుంటూ ఉంటారు. పెళ్లి అయినా కాకపోయినా జీవితంలోంచి (ఈ ఒక్క జన్మ) క్షణక్షణం ఎంతో తృప్తిని, ఆనందాన్ని పొందాలి కాబట్టి నా స్వాతంత్ర్యంలోంచి ఆవగింజ కూడా తొలగించే అవకాశం కూడా లేదని గట్టిగా నమ్మే నైజం మెల్లగా గూడు కట్టుకుంటూ ఉంటుంది. ఆ గూడు లోంచే ఏదో సమయంలో పిట్టలు ఎగిరిపోతూ ఉంటాయి. వార్ధక్యంలోకి ప్రవేశించిన కొందరు అలాంటి గూడు నేను గట్టిగా ఎందుకు కట్టుకోలేదనే బాధలో బాల్కనీలో కూర్చుని రోడ్డు మీద పారిపోతున్న సజీవ సౌరభాలను ఆస్వాదిస్తూ… అలా ఆస్వాదిస్తున్నప్పుడు ఎవరైనా గమనిస్తే ‘కాలం మారిపోయింది, అలా చూడు? వాటిజ్ దిస్ నాన్‌సెన్స్?’ అని అడుగుతూ ఉంటారు. అసలు సెన్సిటివిటీ ఎక్కడో ఉంటుంది!
స్క్రీన్, ప్రేక్షకుడు ఈ ఇద్దరి మధ్య ‘ఈడిపల్ ట్రాజెక్టరీ’ విషయంలో ఎంతో సైకో అనాలసిస్ ఉంటుంది. సిగ్మండ్ ప్రాయిడ్ వ్యవహారం ఎలాంటిది అన్నది ప్రక్కన పెడితే ‘లిబిడో’ అనేది అంతర్లీనంగా నడిపే ఒక అరంగేట్రం అనేది ఓ మాటలా అనుకోవలసిందే. ‘అరంగేట్రం’ అనటంలో అర్థం ఉంది. ఇది అందరికీ ఎప్పుడూ మొదటిది లాగానే అనిపించాలి. ఫ్రాయిడ్ ‘కథనం’ గురించి ఓ మాట అంటాడు – మరుగున పడ్డ కోరికలను తిరగలిలో తిప్పి ఊహా ప్రపంచంలోకి తీసుకుని వెళ్లినప్పుడు భయాలు, బాధలు, ఆశలు అలా ఆకాశంలో అడుకుంటుంటే అదో కథలా కలలా కనిపించినప్పుడు పదే పదే దానిని కోరుకోవటం అవుతూ ఉంటుంది….. నిజమా?!
నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హాస్యాన్ని, గాంభీర్యాన్ని కలబోసి వాడుకోవటం మనం చూస్తాం. దర్శకుడు చిత్రంలోని ప్రొటాగనిస్ట్‌ను, నేపథ్యంలోని ఫాబ్రిక్‌ను తెర ముందు రెండు సన్నివేశాలలో రక్తి కట్టించాడు.
మొదటిది – జాజ్ (సైఫ్) తన కుమార్తె టియా (అలయా ఫర్నిచర్‌వాలా) డాక్టర్ ముందర కూర్చునుంటారు. డి.ఎన్.ఏ రిపోర్టు ఆ రోజు విడుదల కానుంది (వీళ్లు తండ్రీ కూతుర్లా కాదా అన్న విషయంలో). డాక్టర్ ఇద్దరినీ అభినందించి ‘మీరు పేరెంట్స్ కాబోతున్నారు’ అంటాడు. ‘అది కాదు సమస్య, డి.ఎన్.ఏ టెస్ట్ గురించి చెప్ప’మంటాడు సైఫ్. రిపోర్ట్ మరల చదువుతాడు డాక్టర్. మరోసారి అభినందించి ‘మీరు అయితే తాత కాబోతున్నారు’ అంటాడు.
రెండొవది – సైఫ్ ఒంటరిగా తన మిత్రుడి బార్‌లో తందనాలడుతూ విచ్చలవిడిగా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. రెండు షాట్స్ (మందు) అడిగినప్పుడు ప్రక్కన కుర్రాడు “అంకుల్ పడిపోతారు, వద్దు” అంటాడు. సైఫ్ పౌరుషంతో వరుసగా అయిదు షాట్స్ దాకా వెళ్లి టేబిల్ మీద నిలబడే ప్రయత్నం చేస్తూ జారి క్రింద పడి కాలు విరగ్గొట్టుకుంటాడు.
చిత్రం యావత్తూ సమాజంలో గల విచ్చలవిడితనాన్ని చూపిస్తూ ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.
టియా తన తండ్రిని వెతుక్కుంటూ ఆమ్‍స్టర్‌డామ్ నుండి లండన్‌కు వస్తుంది. మొత్తానికి సైఫ్‌ను గుర్తించి అతని ఇంట్లో పిల్లను కంటానంటుంది. అతను నచ్చ చెప్పి పంపించేస్తాడు. ఆమె ఎదురుగా ఉన్న ఇంట్లోనే అద్దెకు దిగుతుంది. ఈమెతో ఒక ట్రాన్స్‌లేషన్ ప్రాజెక్ట్ చేయించుకునేందుకు ఎవరో ఆమె ఇంటికి వచ్చినప్పుడు కిటికీ లోంచి చూసి సైఫ్ జాసూసీ చెయ్యటం మగవాడి బుద్ధిని ఉన్నదున్నట్లు ప్రదర్శించటం అనిపించింది. సైఫ్ తన సోదరుడితో కలసి ఒక రియల్ ఎస్టేట్ డీల్ చేస్తూ ఉంటాడు. సైప్ ఇంటి యజమానురాలు సంతకం పెడితే ఆ డీల్ అయిపోతుంది. కానీ ఆవిడ ఒప్పుకోదు.
ఈ విషయంలో టియాను వాడుకుంటాడు. ఆవిడ ఆ గార్డెన్‌లో ఉన్న ఓక్ వృక్షాన్ని ఏమీ చేయకుండా ఉంటే ఒప్పుకుంటానంటుంది. అలాగేనని ఒప్పిస్తారు. సైఫ్ సోదరుని తల్లి తండ్రులు ఇంటికి వస్తారు. టియా సోనోగ్రామ్‌ను అనుకోకుండా చూస్తారు. టియా వాళ్లను కౌగలించుకుని తల్లిని పొందినట్లు ఆనందిస్తుంది. అనుకోకుండా ఒక రోజు టియా స్నేహితుడు, ఆమె తల్లి (టబూ) ఇంటికి వస్తారు. ఈ స్నేహితుడు డ్రగ్ అడిక్ట్. చివరగా అక్కడ కట్టబోతున్న మోడల్‌ను పార్టీలో టియా చూస్తుంది. అందులో గార్డెన్, ఓక్ వృక్షం లేకపోవటం చూసి బాధపడి, కోపించి టియా వెళ్లిపోవటానికి నిర్ణయించుకుంటుంది. సైఫ్ ఎంతో ప్రధేయపడతాడు, కాని అది జరగదు.
చివరకు సైఫ్ రియల్ ఎస్టేట్ వాళ్లని ఎదిరించి ఆ చెట్టును నరకటం కుదరదని చెప్పి డీల్ వదులుకుని రైల్వేస్టేషన్‌కు వెళ్లి పిల్లలకు నచ్చ చెప్పి ఇంటికి తీసుకుని వస్తాడు. టియాకు కాన్పు అయి ఆడపిల్లను కంటుంది. సైఫ్ ఓ ‘ఇంటివాడు’ అవుతాడు.
దేనిని నరుక్కుంటున్నాం అన్నది దర్శకుడు చెప్పాడు కానీ దానిని అతికించాడా అనిపిస్తుంది!
సైఫ్ నటన బాగుంది. పూజా బేడీ కుమార్తె అలయ తన పాత్రకు జీవం పోసింది. గౌరవ్-రోషిన్, తనిష్క్ బాగ్చీ, ప్రేమ్-హార్‌దీప్ సింగ్ ట్రాక్ ఈ చిత్రానికి మంచి ఆకర్షణ. రెండు పాటలు ఆకట్టుకున్నాయి. మనోజ్ కుమార్ ఖటోయ్ కెమెరా పనితనం కూడా బాగుంది. ఈ చిత్రానికి కూర్పు అందించిన చందన్ అరోరా పనితనంలో ఏ మాత్రం లోపమున్నా చిత్రం విఫలమైపోయేది. ఇతివృత్తానికి తగ్గి ‘సూచర్స్’ను అద్భుతంగా వాడుకున్నాడు ఈయన. హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్ సంవాదాలు దృశ్యాలకు తగ్గట్లున్నాయి. కేతన్ సోధా సంగీతం పైన చెప్పిన రెండు పాటలలో రక్తి కట్టించింది.
2011 సంవత్సరంలో భారతీయ అంతరాజాతీయ చలన చిత్రోత్సవంలో (గోవా) ఒక ఇజ్రాయిల్ చిత్రం ప్రదర్శనకు వచ్చింది. ఇది టొరంటొ సన్‌డాన్స్‌లో, కార్లోవీ వేరీలో జెరుసలేమ్ అంతర్జాతీయ చిత్రోత్సవాలలో (2011) పురస్కృతమైన చిత్రం. దీని పేరు ‘రిస్టొరేషన్’.
జోసెఫ్ మాడ్‌మోనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయకుడు ఒక కార్పెంటర్. పాత ఫర్నిచర్ షాప్ ఒకటి ఉంటుంది ఇతనికి. ఆధునిక ఒరవడులలో ఇతని కుటుంబం ఇదే విధంగా ఛిన్నాభిన్నం అవుతూ ఉంటుంది. గర్భం ధరించిన ఈయన కోడలు మరొకరితో సంబంధం పెట్టకోవటం ఇతన్ని ఎంతగానో కలవరపరుస్తుంది. ఒక వైపు కుటుంబాన్ని, కుటుంబ విలువలనీ నిలుపుకోవాలనే ఆదుర్దా, మరో వైపు ఈయన వడ్రంగి పనితనాన్ని ఆదరించని కాలం వలన దారిద్య్రం… ఇలా ఓ ఘర్షణ. చివరకు ఇంటి వెనుక పడి వున్న తరతరాల నాటి ఒక పియానోను ఇవతలకి లాగి దానిని బాగు చేసి షాపులోని కుర్రాడి సహాయంతో ‘పాలిష్’ చేసి వేలానికి పెట్టి ఊహించలేని లాభాన్ని పొంది తననీ, తన కుటుంబాన్నీ గట్టెక్కిస్తాడు ఈ ముసలి కార్పెంటర్. పన్‌జిమ్ లోని కళా అకాడమీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు విదేశీయులతో సహా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టటం ఇప్పటికీ గుర్తు. దేని ద్వారా దేనిని పునరిద్ధరించాడు?
జాగ్రత్తగా ఆలోచిస్తే ‘జవానీ జానెమన్’లో కూడా ఓక్ వృక్షం, గార్డెన్, ఆ ముసలావిడ సమస్య చలనచిత్రం ప్రారంభం నుండే ఫోకస్‌లోకి రావలసిన అవసరం ఉంది. అందరు ఇళ్ల యజమాలు సంతకాలు చేసినప్పుటికీ ఈవిడ ఒక్కతే దేని వలన చెయ్యటం లేదు అనే ఆలోచన తీవ్రంగా ప్రేక్షకుడిలోకి నాటుకొనకపోతే ఆ సందర్భం, ఆ అవసరం, ఆ వ్యవహారం, దాని విలువ పట్ల స్పందన ఎవరిలోనూ కలుగదు. ఇది దర్శకుడు గమనించవలసిన అంశం.
సినిమా కోసం ఎంచుకున్న అంశాలు కథనం వలన చిల్లరగా మారవచ్చు. లేదా ఎందరినో ఆలోచింపజేయవచ్చు. సైఫ్ పాత్రకు గతంలోని వ్యవహారం, ప్లాష్‌బాక్ కనుక ఎంచుకున్న ఇతివృత్తానికి జోడించినట్లయితే మగవాడి వెర్రితనానికి, అర్థం లేని స్వేచ్ఛకు ఒక కోణం అంది వుండేది. ఎంతో లోతు గల విషయాన్ని ఎంచుకున్నప్పుడు సమపాళ్లల్లో పాత్రోచితంగా తీర్చిదిద్దటం అవసరమవుతుంది.
ఉదాహరణకు స్త్రీ యొక్క మనోవిజ్ఞానం, ధైర్యం ఫోకస్ లోకి రావలసి ఉంటుంది (1975 – క్లెయిర్ జాన్‌స్టన్, 1975 లారా ముల్వే).
జేమ్స్ డీన్ ఫ్రెంచ్ చిత్రాలలో (1950లో) చేసిన పాత్రలు గుర్తుకొస్తాయి. సమాజంలో మగవాడు వైయక్తికంగా ఒక పూర్తి పురుషుడి పాత్రను నిర్వహించ లేకపోవటాన్ని, దానికి గల కారణాలను ఎంత ఆలోచనాత్మకంగా ప్రదర్శిస్తాడు. దాని మరో మెట్టు ‘కన్వర్షన్ హీస్టీరియా’ – ఈ రోజు మన దేశంలో అతి పెద్దగా అందరినీ బాధిస్తున్న మనో వైజ్ఞానికపరమైన సమస్య.
‘ఈడిపల్ ట్రాజెక్టరీ’ అంటే ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒక పురషుడి పాత్ర ఒక సమస్య నుండి ఒక సామాజిక సుస్థిరమైన వ్యవస్థవైపు విజయవంతంగా లేక ఒక్కసారి వైఫల్యంతో చేసే ప్రయాణాన్ని ఈ ట్రాజక్టరీగా చెపుతారు.
ఇటవంటి చిత్రాలలో ఇతివృత్తం కోసం వాడుకున్న పొట్టి పొట్టి వస్తాలు, విచ్చలవిడితనం, ఎట్టి పరిస్థితులలోనైనా స్వేచ్ఛతో పాటు మహత్వాకాంక్ష కోరుకునే నైజం, అడ్డుగీతలను, అడ్డుగోడలను మరింతగా ప్రశ్నించే దుర్భుద్ధి… ఇలాంటివెన్నో కుర్రాళ్ల మనసులలోకి తాకకుండానే కరోనాలా ప్రవేశిస్తాయి – కథనంలోని ట్రాజక్టరీని సరిగ్గా అందుకోనలేకపోతే! మరి దర్శకులకు ఆ ఆలోచన అవసరమా లేదా అన్నది ఆలోచించవలసిన విషయం!