పుల్వామా ఘటనలో అసువులు బాసిన సైనిక సోదరుల ప్రాణత్యాగానికి కన్నీటి నివాళిగా ఈ చిరు కుసుమాంజలి!
1.ఆ.వె.
మండుటెండలోన మంచువానల యందు
భయము లేక జనని నయము గాను
శత్రు బారినుండి చక్కగా కాచునే
జీవితమును తాను చెల్లుజేసి!
2.ఆ.వె.
స్వార్థమును విడచియు చాన బిడ్డల వీడి
దేశ హద్దునందు దివ్యమూర్తి
మాత రక్ష సలుప మరువలేనియటుల
కాచునెపుడు తాను కమ్మగాను!
3.ఆ.వె.
తిండి నిదుర మాని, తిమిర సమయమున
ముష్కరులను దునిమి మోహరించి
తల్లి ఋణము తాను తన్మయముగ దీర్ప
సైనికుడు నిలచును సమరభూమి!
4.ఆ.వె.
అట్టి దివ్య సైన్యమతులిత రీతిని
పూజ్యులిలను మహిత పుణ్య ఘనులు…
కరుణ దయయు లేని కర్కశ రిపులులే
దొంగ దెబ్బ తీసె దుష్టులకట!
5.ఆ.వె.
ఒక్కసారిగాను పెక్కువీరులు వీడె
ప్రాణములను తల్లి పదములందు
కంట నీరు పొంగె మింటికేగిన వారి
స్మృతిని వగచె మది, మతిని దప్పె!
6.ఆ.వె.
దైవ సమము సుమ్మి ధన్యవీరులు వారు
భయము లేక జనులు బాళి నిలువ
త్యాగ శీలురు కద తనువు పణమిడగ
ప్రజలు వెరపు వీడి బతుకగాను!
7.ఆ.వె.
దివికి తరలినట్టి దేవదూతలకును
భార హృదుల తోడ వందనములు…
జన్మభూమి రక్ష సలుపగా నిలచిన
సైనికులకునిదియె జయనివాళి!