Site icon Sanchika

జయించాలి జీవితం

[dropcap]కా[/dropcap]శీపతికి జీవితం మీద విరక్తి పుట్టింది. ఎందుకంటే ఉన్న ఉద్యోగం కొన్ని కారణాల వలన ఊడిపోయింది! భార్యకు జబ్బు చేసి చనిపోయింది.

ఇక ఈ జీవితం బాగు పడదని అనుకుని ఆత్మహత్య చేసుకోవాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

అందుకే కాశీపతి ఓ కొండ పైకెక్కి కిందకు దూకి ప్రాణం తీసుకోవాలని అనుకున్నాడు! అలా అనుకుంటూ కాశీపతి ఆ కొండ ఎక్కసాగాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఓ పెద్దరాయి వెనుకనుండి ఒక వ్యక్తి కాశీపతి వద్దకు వచ్చాడు, ఆ వ్యక్తిని చూసి కాశీపతి ఆశ్చర్యపోయాడు.

“ఎందుకు నాయనా ఈ కొండ ఎక్కుతున్నావు? కాలు జారితే జారి ఆ లోయలో పడిపోగలవు. పడితే ప్రాణాలు పోగలవు” అని చెప్పాడు ఆయన.

“అయ్యా, తమరు ఈ కొండ మీద ఎందుకున్నారు? తమరు ఎవరు?” అని కాశీపతి అడిగాడు.

“నాయనా, నా పేరు వీరభద్రం. ఈ కొండ మీదకు అప్పుడప్పుడూ వచ్చి సేద తీరుతుంటాను” అని చెప్పాడు.

“నా పేరు కాశీపతి, నాకు సంభవించిన కష్టాల వలన ఈ కొండపై నుండి లోయలోకి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకొంటూన్నాను” అని కళ్ళలో నీళ్ళు నింపుకొని చెప్పాడు.

“చాలా తప్పు చేస్తున్నావు కాశీపతీ, ఈ జీవితం దేముడిచ్చిన వరం, ఎన్ని కష్టాలు వచ్చినా జీవితాన్ని అంతం చేసుకో కూడదు, కష్టాలు ఎదుర్కోవాలి, ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు, ప్రయత్నిస్తే అవకాశాలు వస్తాయి. కష్టాలు దూరంగా పారిపోతాయి. అదిగాక ఆ దేవుడు సృష్టించిన అందాలు, ఆనందాల్ని తనివి తీరా చూడాలి, అలా ఆ మహత్తర సృష్టిని చూస్తున్నప్పుడు కూడా మన కష్టాల్ని రూపు మాపే అవకాశాలు లభించవచ్చు, ఆలోచించు” అని చెప్పాడు వీరభద్రం.

వీరభద్రం మాటలు కాశీపతిని ఆలోచింప చేశాయి.

“అయితే, నేనేం చేయాలి?” అడిగాడు కాశీపతి.

“మొదట వెళ్ళి కొండకింద ఉన్న రంగమ్మ హోటల్లో కారం దోసెలు తిను, నిజంగా అవి చాలా రుచికరమైనవి, అటువంటివి ఎక్కడా దొరకవు. అవి తిన్నాక అక్కడికి కొంత దూరంలో ఉన్న సుబ్బన్న తోట చూడు, అందులో అందమైన పూలు పండ్లు చూడు, స్వచ్ఛమైన ప్రాణవాయువును అనుభవించు. నీకు హాయిగా బతకడానికి మంచి ఆలోచనలు, అవకాశం రావొచ్చు” చెప్పాడు వీరభద్రం.

వీరభద్రం మాటలు కాశీపతిలో స్ఫూర్తి నింపాయి.

కాశీపతి జేబులో చూసుకుంటే ఐదు రూపాయలు ఉన్నాయి. వీరభద్రానికి నమస్కారం పెట్టి వెంటనే కొండ దిగి రంగమ్మ హోటల్‌కి వెళ్ళి కారం దోశలు రెండు తిన్నాడు, చాలా రుచిగా ఉన్నాయి. ఇటువంటి దోశలు తినకపోతే జీవితం వృథా అనుకున్నాడు. ఇంకొక దోశ తినాలంటే కాశీపతి దగ్గర డబ్బులు లేవు! ఇక సబ్బన్న తోట చూడాలనుకుని తోట వద్దకు వెళ్ళాడు. తోట అందమైన పూలతో, పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా ఉంది! తోట సువాసన, పచ్చదనం కాశీపతిలో జీవితం మీద ఆశలు నింపాయి! ఇంతలో అక్కడికి ఆ తోట తోటమాలి వచ్చి కాశీపతిని చూసి “ఎవరు మీరు?” అని అడిగాడు.

“నేను ఈ ఊరికి కొత్త, నా అనే వాళ్ళెవరూ లేరు. పని కోసం చూస్తున్నాను” అని చెప్పాడు.

“అయితే, మా తోట యజమాని సబ్బన్న దగ్గరికి తీసుక వెళతాను, ఆయనకు మరో తోట ఉంది, దానికి తోటమాలి కావాలి, చేరుతావా?” అడిగాడు తోటమాలి.

కొండమీద వీరభద్రం చెప్పిన మాట నిజమైంది, కష్టాలలో ఉన్న తనకు తోటమాలి ఉద్యోగం దొరికింది. సబ్బన్న ఇచ్చిన ఆ ఉద్యోగాన్ని ఆనందంగా స్వీకరించాడు కాశీపతి.

అలా ఒక రోజు దోశలు తినటానికి రంగమ్మ హోటల్‌కి వెళ్ళాడు కాశీపతి, అక్కడ గోడమీద ఒక ఫోటో దానికి పూలమాల వేసి ఉంది, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వీరభద్రం! 

కాశీపతి ఆశ్చర్య పోయి,”అదేమిటి ఆయన ఎప్పుడు చనిపోయారు?” అని రంగమ్మను అడిగాడు.

రంగమ్మ కళ్ళలో నీళ్ళు నింపుకుని ఈ విధంగా చెప్పింది “వాడు నా కొడుకు వీరభద్రం నాయనా. సరైన ఉద్యోగం రాలేదని సంవత్సరం క్రితం కొండమీదనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, అనాలోచితంగా ఈ పని చేశాడు” చెప్పింది రంగమ్మ.

“అదేమిటి, నాకు ఐదు రోజుల క్రితం కొండ మీద కనుపించి, నేను ఆత్మహత్య చేసుకోబోతుంటే నన్ను ఆపి మంచి విషయాలు చెప్పి నన్ను మార్చాడు”

“వాడు ఆత్మహత్య చేసుకోవడం వలన వాడి ఆత్మ మనిషి రూపంలో ఆ కొండ మీద ఉన్నట్టు నాకు కొంత మంది చెప్పారు, వాడు చేసిన తప్పు మరొకరు చేయకుండా కాపాడుతున్నట్లు కూడా తెలిసింది, నేను కొండ మీదకు వెళితే ఎందుకో వాడు నాకు కనబడలేదు” చెప్పింది రంగమ్మ దిగులుగా. తనకు బతుకు మీద ఆశ కల్పించి ఒక దారి చూపించిన వీరభద్రం ఫోటోకి నమస్కారం పెట్టి తోటకి వెళ్ళి పోయాడు.

Exit mobile version