జీరాడుతున్న గోడలు…

1
2

[box type=’note’ fontsize=’16’] “గోడంటే నీ అంతరంగ నీడలను ముద్రించుకొనే క్యాన్వాసు; తరతరాలుగా, పొరలుపొరలుగా జీరాడుతున్న వీటిని కూల్చేది ఎప్పుడో” అంటున్నారు సి.హెచ్. ఉషారాణిజీరాడుతున్న గోడలు...” కవితలో. [/box]

 

[dropcap]నీ[/dropcap]కు తెలుసా….
మా గోడలు పుల్లగా వుండేవి – ఉసిరి పిందెల్లా,
అమ్మ గోరు ముద్దలను,
చందమామతో కబుర్లను వింటూ కునుకుపాట్లు పడేది.
ఎప్పుడైనా పిండేసిన తేనెపట్టు మరకలుగా తీయనైయ్యేది.
ధాన్యం బస్తాలను కాపుగాసి గోడ తనబలం చాటింపు వేసుకునేది.
ఎంతకీ అందని మొగ్గలు, సాయం సంధ్యకల్లా గోడమీద పరిమళంగా,
మల్లెతీగను చుట్టు కొని ముసిముసిగా నవ్వేది.
రోజూ నృత్య ప్రదర్శనిచ్చి వెళుతుంటాయి…. కొన్ని పిచ్చుకలు, మరికొన్ని పావురాలు.
రంగుల్ని కలల్లో అద్ది, చిత్రాలుగా మలచి తృప్తిని భుజాన వేసుకొనిపోతాడు ఒక కళాకారుడు.
అజ్ఞాతంగా తమ ఆశల్ని- ఆశయాల్ని నినాదాలు చేసి నిత్యచైతన్యాన్ని ప్రదర్శించే వారిని చేరదీస్తుంది మా గోడ.
గోడంటే నీ అంతరంగ నీడలను ముద్రించుకొనే క్యాన్వాసు.
నీకు తెలుసా…
నా బురఖాకంటే బలమైన గోడలున్నాయి… అంటుంది అమీనా.
ఊరి చివరవున్నా, ఊరిమధ్య కొచ్చినా, మనసు పొరలలో ఇంకిన అంతరాల మాటేమిటంటావ్…
చూపుల్ని నియంత్రిస్తూ, ఆలోచనలపై కూడా జండర్ అద్దకాలు వేసుకున్న మేలిముసుగు మాటేమిటంటావ్.
తరతరాలుగా, పొరలుపొరలుగా జీరాడుతున్న వీటిని “బెర్లిన్” గోడల్లా కూల్చేది ఎప్పుడంటావ్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here