Site icon Sanchika

జీవాధార లయ

[dropcap]జీ[/dropcap]వి ప్రాణం
చలన లయ స్పందన
లయ తప్పిందా
జీవ శక్తి మౌన అచలనం

అనేక దుఃఖాలూ దారిలో
సకల సంతోషాలూ దరిలోనే
జీవన అనుభవాలన్నీ
నదీ ప్రవాహాల ఆటు పోట్లే

చిత్తడి నేలలో కష్టాలు
వర్షించని మేఘాలు కన్నీరైనవి
ఎద సొదల మనిషి కథ
కలలో తేలిన ఆశలనిరాశే

మైదానాల క్రీడలు
విశ్వాసంలేని ప్రపంచ క్రీనీడలు
నవ నాగరికత జీవించింది
అనాగరిక అనామక సంతకాలుగా

కవిత్వాన్ని జీవం తూచింది
తత్వంలో బరువైతే ఉన్నది
జీవధార అక్షరమైంది
లయ పరుగెత్తిన పద్యంలో

నేను ఊపిరి గాలిని
ఉచ్ఛ్వాస నిశ్వాసాలే నా పని
హృదయం సడిలో ఉదయించే
ప్రాణం కదిలింది కర్తవ్య సాధనలో

అచ్చంగా నేనే అద్దంలోని సృజన
అనువాద రచనలో జీవరాశి ఉంది
కలం బలమే రాసే నది ప్రాణం
నేను మాత్రం నేర్చుకునే విద్యార్థినే

చెప్పడమంటే బోధించడమేగా
వినడం ఓ మహా కళని తెలిదేమో
నేర్పిన చదువు పుస్తకాలు తెరిగేస్తే
తేనెల తెలుగు విశ్వ గవాక్షాల మీటే

అమ్మన్నా అమ్మ భాషన్నా గొప్పే
హాలికుని జీవద్భాష మన ప్రాణం
రాసేది జీవ పదార్థం నిజమే
సాగింది జీవనదిలా కవిత్వతత్త్వమై

అక్షరాల రక్షణలో నడకుంది
అభివ్యక్తీ శైలీ శిల్పం బాగున్న
వస్తువులో దాగుంది నవ్య స్ఫూర్తి
సమాజ చైతన్యమే కవిత్వశాస్త్రం

కవిత్వం
సరళ సుందర భావోద్వేగాల అల్లిక
తమాషా కాదు కవిత్వం రాయడం
ఎంతో శ్రమ సాధనలో మొలకైనది

మనసులోని భావ చిత్రికే
గాలికి ఊగీ ఎగిరొచ్చే పతంగి
మూగ మనసులో ధ్వని మౌన భాష
తీయనైన బాధే కవిత్వం జీవధార

 

Exit mobile version