[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘జీవాత్మ – పరమాత్మ’ అనే రచనని అందిస్తున్నాము.]
శ్రీ భగవానువాచ:
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః।
న చైవ న భవిష్యమః సర్వే వాయమతః పరమ్॥
(భగవద్గీత 2వ అధ్యాయం, 12వ శ్లోకం)
[dropcap]ఓ[/dropcap] అర్జునా, నేను కానీ, నీవు కానీ, ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు; ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము అని పై శ్లోకం యొక్క అర్ధం. ‘నేను’ అని మనము అనుకునేది నిజానికి ఆత్మ అని, ఈ భౌతిక శరీరము కాదని, ఇది భగవంతుని వలె సనాతనమైనదని పరమాత్మ మానవాళికి ఈ శ్లోకం ద్వారా సూచిస్తున్నాడు.
మట్టి కుమ్మరి యొక్క కృషి ఫలితంగా ఒక రూపాన్ని ధరించినందున దాన్ని ‘కుండ’ అంటున్నాం. రూపాన్ని ధరించక ముందు అది మట్టి మాత్రమే. కుండ పగిలి ముక్కలైనాక అది ఏ మట్టి నుంచి వచ్చిందో అందులోనే కలిసిపోతుంది. జీవాత్మ కూడా అంతే. పరమాత్మ నుండి విడిపడి ఈ భూమికి వచ్చి ఒక ఆకారం ధరించిన జీవాత్మ, తన శారీరక ప్రయాణం ముగిసిన తర్వాత తిరిగి శరీరాన్ని విసర్జించి ఆ పరమాత్మలో కలిసిపోతుంది. మానవ దేహంలో ప్రవేశపెట్టబడిన పరమాత్మాంశ మాయ కారణంగా తనను తాను పరమాత్మకు భిన్నంగా భావించుకొని, తన ఇచ్ఛానుసారం వర్తించడం మొదలుపెడుతుంది. ఈ కారణంగా ఏర్పడిన సంచిత ప్రారబ్ధాలను అనుభవించడమే మానవ జీవనం. పరమాత్మ ప్రతిబింబమే అలా పదార్థంతో ఏకమైన జీవాత్మ తన నిజమైన ఉనికిని మరచి, దేహాన్నే తానని భ్రమించి, దేహాలను మార్చుకుంటూ గమ్యాన్ని మరిచి పరిభ్రమిస్తూ తిరుగుతుంది. జీవాత్మ మానవ జన్మ ఎత్తి తన నిజతత్వాన్ని గురువుల బోధనలతో అర్థం చేసుకొని, భౌతికమైన మానసికమైన బంధాల నుంచి కఠోర సాధనల ద్వారా తెంచుకొని పరమాత్మలో తన ఉనికిని స్థిరం చేసుకోవడాన్నే మోక్షం అని శాస్త్రం చెబుతోంది. జీవాత్మ తిరిగి పరమాత్మలో ఐక్యం చెందడమే జీవాత్మ – పరమాత్మల సంయోగం. కాబట్టి వ్యక్తి మరియు పరమాత్మ రెండు వేర్వేరు అస్తిత్వాలు కాదు, కానీ ఒక్కటే. జన్మరహితమూ, శాశ్వతమూ అయిన ఆత్మ నిత్యం. మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టేసి కొత్తబట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృశించిన శరీరాలను వదలి కొత్త దేహాలు పొందుతుంది. ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు తడుపలేదు. కాబట్టి ఒకే ఆత్మ వివిధ కాలాలలో వివిధ శరీరాలను ధరిస్తుంది. పై శ్లోకంలో శ్రీ కృష్ణ పరమాత్మ ఆత్మ యొక్క శాశ్వతత్వం గురించే నర్మగర్భంగా వివరించాడు. కాబట్టి మనం నిత్యం ఆత్మతత్త్వంలోనే ఉంటూ మన ప్రాపంచిక వ్యవహారాలు నిర్వర్తించుకోవాలి. సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి మరియు మననం చేసుకుంటూ వుండాలి.
మరొక శ్లోకంలో పరమాత్మ “అర్జునా! మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. నీవు వాటిని మరిచిపోయావు. కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి” అంటూ తాను అర్జునుడి ముందు మానవ రూపంలో నిల్చుని ఉన్నంత మాత్రమున తనను మానవులతో సమానంగా పరిగణించవద్దు అని వివరించాడు.