Site icon Sanchika

జీవన ధర్మం..!!

[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘జీవన ధర్మం..!!’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]కాశం చిక్కబడింది,
మేఘాలు చినుకు ముత్యాలతో-
సందడి చేశాయి..!
ఆ ముత్యపు జల్లులు ,
ఆనందాతిశయంతో-
భూమిని తడిపేశాయి!
మురిసిన మట్టి,
సుగంధభరితమైంది.
మైమరచిన చిరుగాలి
వెదురును వేణువును చేసి,
తీయని రాగమాలపించింది!
భూమ్యాకాశాల అనురాగానికి,
కొండలు కోనలు పరవశించి,
కో..అంటే, కో..అంటూ,
ప్రతిధ్వనించాయి..!
కొండలపై నుండి చినుకు చుక్కలు,
ధారలై జలధారలై ఉరికి ఉబికి,
ప్రవాహాలై పరుగందుకున్నాయి!
ఈ ప్రవాహపు హోరు,
కొంటె గాలికలిసి,
యుగళగీతమైంది..!
వెన్నెల వెలుగులో, కొండ గాలి,
ఈల పాటలో-
మది మురిసే క్షణాలు-
ఏ హృదయానికీ అందని,
అనిర్వచనీయ,
అతీత సౌందర్యాలు!
ఈ ప్రకృతి క్షణాలకు
ఊపిరి పోసిందా..?
నాలో జీవం నింపిందా..
తేలదు ఎప్పటికీ..!!

Exit mobile version