[dropcap]హై[/dropcap]దరాబాద్- కోకాపేటలోని ‘ది రిట్రీట్’ లో అక్టోబర్ 20న తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘జీవనరాగాలు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది.
జీవితంలోని ఒడిదుడుకులను సైతం ఒక ప్రక్క ఎంతో చమత్కారంగా ప్రస్తావిస్తూనే, సమస్యల వలయాలను ఎలా చేధించవచ్చన్నది మరో ప్రక్క విశ్లేషిస్తూ రచయిత తుర్లపాటి నాగభూషణ రావు తన జీవనరాగాలు పుస్తకంలో ఎన్నో సంఘటనలను పొందుపరిచారు. ఒక్కో చాప్టర్ చదువుతుంటే ఎన్నో జీవిత సత్యాలు కళ్ల ముందు నిలబెట్టినట్లుంది వారి రచన. అంతే కాదు, ప్రతి చాప్టర్ ఓ సరదా సరదా సంఘటనతో మొదలు పెట్టినా రచనలో వ్యక్తిత్వ వికాస సూత్రాలను చక్కగా మిళితం చేశారని ‘కళారత్న’, బహుగ్రంథ రచయిత, ప్రముఖ చిత్రకారులు బ్నిం అన్నారు.
‘జీవనరాగాలు పుస్తకావిష్కరణ – ఆత్మీయ సమ్మేళనం’లో బ్నిం మాట్లాడుతూ, ఈ పుస్తకానికి కవర్ పేజీ డిజైన్ చేయమని రచయిత తనను కోరారనీ, వారు మీడియాలోని అనేక రంగాల్లో పనిచేయడంతో వీణ వాయిస్తున్నట్లుగా చిత్రీకరించాననీ, ఇది వారికెంతో నచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకంలో కొన్ని జీవనరాగాలే మనల్ని కదిలించినా, ఇంకా ఎన్నో ఉన్నాయనీ, అందుకే రెండవ భాగం పుస్తకంగా త్వరలోనే తీసుకువస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
‘సంచిక’ – డైనమిక్ వెబ్ వార పత్రికలో వారంవారం వస్తున్న ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ రచనలోని కొన్ని భాగాలను ఈ జీవనరాగాలు పుస్తకంలో పొందుపరిచి రచయిత పాఠకులకు అందించారనీ, ఈ తరహా రచనలు ఎవరు వ్రాసినా ప్రశంసలు అందుతాయని ‘సంచిక’ సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు.
అరవైఏళ్లు దాటిన వారికేమో, ఈ జీవనరాగాల పుస్తకం, జ్ఞాపకాల దొంతర కదలించినట్లు కనబడుతుంటే, మధ్య వయస్కులకేమో జీవనపోరాటం, సాఫల్య – వైఫల్యాలు కనిపిస్తాయి. అదే నేటి పిల్లలు చదివితే 50 ఏళ్ల క్రిందట తాతలు ఎలాంటి పరిస్థితుల్లో జీవించారో, ఎలా పని చేశారో తెలుసుకో గలుగుతారు. ఇలా మూడు జనరేషన్లకీ ఓ చక్కటి వారధిలా ఈ రచన ఆద్యంతం చదివించేలా ఉందని సాహితీ విశ్లేషకులు పరకాల రాజేశ్వర రావు అభిప్రాయపడ్డారు. వీరు, పుస్తకాన్ని పరిచయం చేస్తూ, జీవనరాగాలు చదువుతుంటే ఇదేదో కేవలం ఒక వ్యక్తి స్వీయచరిత్రలాగా అనిపించదనీ, మనందరీ కథలాగానే రచయిత చాలా హృద్యంగా వ్రాశారని అన్నారు. ‘ఎలుక పుట్టింది’ అంటూ రచనకు శ్రీకారం చుట్టి, అదే ‘ఎలుక’ ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తన జీవనాన్ని ఓ సాఫల్య యాత్రగా మార్చుకున్న తీరు నేటి యువతరానికి ఆదర్శంగా, స్ఫూర్తి దాయకంగా ఉంటుందని పరకాల అన్నారు.
తుర్లపాటి – స్వతహాగా హాస్య ప్రియులు కావడంతో సీరియస్ మేటర్ ప్రస్తావనలో సైతం హాస్యపు జల్లులు కురిసేలా చేశారని ఆంధ్ర లయోల కాలేజీ (విజయవాడ) లో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్న కస్తల విజయబాబు అన్నారు. తుర్లపాటిని నాగరాజు అని కూడా పిలిచేవారమనీ, నందిగామ, అడవిరావుల పాడు నేపథ్యంలో అనేక బాల్య స్మృతులను వారు వివరించిన తీరు ప్రశంసనీయమనీ, చదువుతుంటూ 60, 70వ దశకాల్లోకి వెళ్ళిపోయినట్లే అనిపించిందని అన్నారు.
జీవనరాగాలు పుస్తక రచయిత తుర్లపాటి నాగభూషణ రావు కుమారుడు టి. రాజేష్ కృష్ణ సాయి యుకెలోని బేసింగ్ స్టోక్‌లో ఉండటంతో సందేశం పంపుతూ – “యూట్యూబ్, ఫేస్ బుక్, ఐప్యాడ్, టీవీ, ఫోన్, ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇవేవీ లేని ప్రపంచం ఉండేదని మా ఏడేళ్ల అబ్బాయికి చెప్తే.. ఓ.. అదా.. నాకు తెలుసుగా.. ‘Stone Age’ (రాతి యుగం) అని ఠక్కున చెప్పాడు.. కాదురా.. అని చెప్తుండగానే.. ‘give me a clue.. ఆ కాలంలో డైనోసార్‌లు ఉండేవి కదా..’ అన్నాడు… డైనోసారు కాదు.. మీ తాతగారు ఉండేవారు.. టివిలు, ఫోన్లు, ఇంటర్నెట్‌లు లేకుండానే ఎంతో హాపీగా ఉండేవారు.. తెలుసా..” అని చెప్తే “how is that possible? వాళ్ళేమైనా అవతార్ సినిమాలో చూపించినట్టు పండోరా గ్రహంలో ఉన్నారా ఏమిటి.. హ హ హ” అంటూ నవ్వేశాడు. అవును పండోరానే.. మా నాన్న రాసిన ‘జీవన రాగాలు’ పుస్తకం చదివితే.. 60, 70, 80 దశకాల్లో జీవనం.. ఆ అవతార్ లోని పండోరాకి ఏ మాత్రం తీసిపోదనిపించింది. ఆ అందమైన ప్రపంచం.. అందులో నాన్న ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా.. ఆర్గానిక్‌గా.. అద్భుతంగా ఉంది. నాన్న ఈ వయసులో (68) కూడా ఎప్పటికప్పుడు కొత్త గా వచ్చిన టెక్నాలజీ లని నేర్చుకుంటూ వాటిని తన మీడియా బ్రెయిన్‌కి జోడించి ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.. అవి చూసినప్పుడల్లా అసలు నాన్న ఈ జనరేషన్‌లో పుట్టుంటే ఇంకా ఎన్ని అద్భుతాలు చేసుండేవారో అనిపించేది.. కానీ, నాన్న రాసిన ‘జీవన రాగాలు’ పుస్తకం చదివాక నేనే ఆ జనరేషన్‌లో పుట్టి ఉంటే బాగుండేది అనిపించింది. మా జనరేషన్.. ముఖ్యంగా మా పిల్లల జనరేషన్ చదివి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ జీవనరాగాలు పుస్తకంలో. మరో నాలుగు పుస్తకాలకి సరిపడా మాటర్ అయితే నాన్న దగ్గర ఉందని నాకు తెలుసు.. సో.. త్వరలో సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నా” – అంటూ రాజేష్ తన సందేశంలో పేర్కొన్నారు.
‘తానా’ పూర్వ అధ్యక్షులు, ‘తానా’ ప్రపంచ సాహితీ వేదిక కన్వీనర్ తోటకూర ప్రసాద్ ఈ పుస్తకానికి ముందుమాట వ్రాస్తూ, తుర్లపాటి జీవనరాగాలు పుస్తకం భావి తరాల వారి జీవితాన్ని ఉన్నత స్థితిలో నిలిపే అంశాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.
టివీ 5 జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) చల్లగుల్ల హర్ష మాట్లాడుతూ, పనిలో చూపే ఏకాగ్రతే తుర్లపాటి విజయ రహస్యమని అన్నారు.
రచయిత కుమార్తె శ్రీపతి పండితారాధ్యుల దివ్యశ్రావణి లండన్ నుంచి ఒక సందేశం పంపుతూ, ఈ ‘జీవన రాగాలు’ పుస్తకం ద్వారా రచయిత తాను పరిచయం చేసిన వ్యక్తులు (పాత్రలు) ఈ సమ్మేళనానికి కదలి రావడం, వారు ఆత్మీయంగా మాట్లాడంతో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఓ ప్రత్యేకతను సంతరించుకున్నదని అన్నారు. చరిత్ర, దేశకాల పరిస్థితులు, వర్క్ కల్చర్, సాంకేతిక పరివర్తన, మిత్రలాభం, జంతుప్రేమ, చిన్ననాటి సరదాలు ఇలా ఎన్నో ఈ తరం పిల్లలను కూడా చదివించేలా రచన సాగింది. ఈ రచనలో హాస్యచతురత దాదాపుగా ప్రతి పేజీలోనూ చోటుచేసుకోవడంతో పాఠకుల మనస్సులు తేలికపడతాయని చెప్పారు.
వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ICERE- IWST- Bangalore) డైరెక్టర్‌గా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్న శాస్త్రవేత్త డాక్టర్ కానూరి సత్యనారాయణ రావు ఈ పుస్తకం చదివి స్పందిస్తూ, దీన్ని కేవలం స్వీయచరిత్రగా భావించకూడదనీ, అంతకు మించి అనేక అంశాలు అదనంగా ఉన్నాయని అన్నారు. జీవితాన్ని తాను కోరుకున్నట్లు మలుచుకోవడంలో రచయిత సాగించిన అవిశ్రాంత కృషి ఫలితమే సాఫల్య ఫలాలను వీరికి అందించిందని అభినందించారు. కృషి, పట్టుదల ఉంటే ఎక్కడో పల్లెటూరులో ఎలుక పిల్లలా పుట్టిన ఓ బలహీన పిల్లాడు, క్రమంగా ఎదుగుతూ నేడు ప్రపంచ స్థాయి ప్రశంసలు అందుకోవడం, అందుకు అనుసరించిన విధానాలు నేటి యువతకీ, పిల్లలకు స్ఫూర్తి దాయకం అని చెప్పారు.
ఆకాశవాణి న్యూస్ రీడర్ పోణంగి బాలభాస్కర్ మాట్లాడుతూ, తనతో పాటు తుర్లపాటి కూడా న్యూస్ రీడర్‌గా పనిచేశారనీ, రేడియో పట్ల ఉన్న ఆసక్తితోనే వారు ఆన్ లైన్ రేడియో స్టేషన్ తరంగాలో ప్రొగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేశారని గుర్తుచేశారు.
ఛానెల్ 5ఏం ద్వారా ఔత్సాహిక కళాకారులను ఎందరినో తుర్లపాటి ప్రోత్సహించారని వి.వి.ఎన్. విజయకుమార్ అన్నారు.
‘జీవన రాగాలు’ పుస్తకం తెరిస్తే చాలు, చిన్ననాటి సంఘటనలు మన కళ్లముందు కదలాడతాయని ఫిల్మ్ జర్నలిస్ట్ పి. ఇందిరాదేవి గారు చెప్పారు.
ఈనాడులో పాత్రికేయునిగా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్న జంధ్యాల శరత్ బాబు తమ సందేశంలో, తుర్లపాటి తానూ ఒకే సారి ఈనాడులో చేరామని, ఆయన అటుపైన తన కెరీర్ ని భిన్న కోణాల్లో కొనసాగించి ప్రపంచ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. వారి రచనలు మొదటి నుంచీ పాఠకులను ఆకర్షించేవిగానే ఉండటాన్ని గుర్తు చేశారు. వీరు చీకటి వెలుగులు రెండింటినీ చూసినవారు. పుట్టినప్పుడు చీపురు పుల్లే అయినా పెరిగి పెద్ద అయ్యాక. రచన పరంగా మహాబలుడయ్యారని జంధ్యాల ప్రశంసించారు.
టి. విశ్వనాథ్ మాట్లాడుతూ, ఈ పుస్తకం కవర్ పేజీని రెండు నెలల క్రితం నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య గారి చేతుల మీదగా ఆవిష్కరించడాన్ని గుర్తుచేస్తూ, తనలో ఊపిరి ఉన్నంత కాలం తెలుగు భాషా వికాసానికి తోడ్పడతానని తుర్లపాటి గారు ఆ రోజున అనడం మా యువతరానికి ఓ స్ఫూర్తిదాయక సందేశంగా నిలిచిందని అన్నారు.
విజయవాడలో హోమియో వైద్యునిగా ఉన్న డాక్టర్ ఎం. విష్ణు వర్ధన్ రావు, ఈనాడు పాత్రికేయుడు జంధ్యాల శరత్ బాబు, సీనియర్ జర్నలిస్ట్ చొప్పరపు వెంకట కృష్ణారావు, సౌదీ రిటర్న్‌డ్ కరీముద్దీన్, మన్నవ మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
(ఈ పుస్తకం ధర రూ. 295, కాపీలను రచయిత తుర్లపాటి నాగభూషణ రావు (9885292208) నుంచి లేదా నవోదయ బుక్ హౌస్, సుల్తాన్ బజార్, కోఠి, హైదరాబాద్ నుంచి పొందవచ్చు.)