[dropcap]ఆ[/dropcap]న్షిలు:
పెద్ద చదువులు చదివి తమను ఉద్ధరింతురని
వేలు ఖర్చుచేసి చదివింతురు తమ బిడ్డలను,
తల్లిదండ్రుల ఆశలు అడియాశలు చేయరాదు
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
పిల్లల భవిష్యత్తు కోరి పొదుపుచేయుదురు పెద్దలు
అవగాహనలేని పిల్లలు ఖర్చులకు వెనుకాడరు …
తల్లిదండ్రుల త్యాగము తెలుసుకో నీవు బుద్ధెరిగి
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
పొదుపు మాట వినిన పిసినారి అందురు కదా!
పొదుపులేని ఇంట పెరుగును అప్పుల పంట..
పొదుపు విలువ తెలిసి మసలుకో మానవా…
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
సుఖము మరిగి దండిగా అప్పు చేయుటేలా ..
సౌఖ్యమెరిగి బ్రతుకును బయటికీడ్చుటేలా ..
ఆర్థిక క్రమశిక్షణ లేక ఆరిపోవు బ్రతుకులు కొన్ని
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
గొప్పలకుపోయి బ్రతుకును కుప్పకూల్చకోయి
ఉన్నదానితోనే తృప్తిపడి హాయిగా బ్రతకవలెనోయి!
తళుకుబెళుకుల బ్రతుకు తాత్కాలికమని తెలుసుకో
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
పెద్దవాళ్ళసంపదతో నీకెప్పుడూ పోలిక పనికిరాదు,
చిన్నవాళ్ళ పోలికలతో నిన్నునీవు ఘనపరుచుకో
అత్యాశతో బ్రతుకు అల్లకల్లోల మయిపోవు కదా… !
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
కష్టపడి స్వయముగా సంపదను పెంచుకొనవచ్చును
తృప్తిగా వారు జీవితమును కొనసాగించవచ్చును
శక్తికి మించిన ఆశలు చెడుదారులకు రహదారులు
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము … !!