Site icon Sanchika

జీవన రమణీయం-10

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఇ[/dropcap]లా చెప్పుకుంటూ పోతే తాతయ్యా అమ్మమ్మ గురించి ఎన్ని కథలైనా చెప్పొచ్చు. అవన్నీ ‘లీడర్’ పుస్తకంలో వారి లక్నో యాత్ర మజిలీలుగా రాశాను. చంటి పిల్లతో, భర్తని అనుసరించి తన పంథొమ్మిదవ ఏట అమ్మమ్మ సూరంపూడి రమణమ్మ మిగతా ఎనమండుగురు మగవాళ్ళతో కలిసి, ఐదు నెలల పదిహేను రోజులు నిరవధికంగా నడిచి కాంగ్రెస్ మీటింగ్‌కి లక్నో చేరింది.

అక్కడ గాంధీజీ, నెహ్రూ గారూ (కమలా నెహ్రూ పొయిన కొత్త), అన్నిబీసెంట్‌లను కలసి, స్టేజ్ దగ్గర డ్యూటీ వేయించుకుని, కస్తూరి బా తో మాట్లాడి పులకరించిపోయిందట.

తాతయ్య అక్కడ కాంగ్రెస్ ఆఫీసులో కరెస్పాండెన్స్, టైపింగ్ వర్క్ మీద సభ అయ్యాక కూడా చాలా రోజులు ఉండిపోయారుట.

ఆవిడ జీవితమంతా ఆయనతో కలసి రంగులరాట్నమే! ఓ సారి ఓ అడవి మనిషిని పట్టుకొచ్చారట… అతను అతి కష్టం మీద కదిలే రైల్లో కూర్చున్నాడట. రైలు దిగగానే ఆకలి తట్టుకోలేక, పండ్ల దుకాణంలో వేలాడదీసిన పండ్లు పీక్కొని తినేసాడుట. వెనకాలే వస్తున్న తాతయ్య డబ్బులు ఇచ్చారుట. వాళ్ళు కొట్లాడ్తుంటే ఏదీ తెలిసేది కాదుట… అటువంటి వాడిని తెచ్చి అమ్మమ్మ దగ్గర పెడ్తే కూడా ఆవిడ సహనంతో భరించింది పాపం! ఆయనే వాడికి బట్టలేసి బడికి పంపి నాగరికత నేర్పడం, పక్షిని పంజరంలో పెట్టడం లాంటిదని తోచి మళ్ళీ తీసుకెళ్ళి వదిలేసి వచ్చారుట!

తాతయ్య ఎంత మొండి మనిషంటే, ఓ సారి తన తమ్ముడూ, తోడల్లుడూ అయిన వడ్డాది శేషగిరిరావుతో, మా అమ్మనీ వాళ్ళిద్దరి పిల్లలనీ తీసుకుని సుద్దకొండ అనే వూరుకి కార్లో వెళ్ళి వస్తుండగా, ఆ డ్రైవర్ నిద్రపోతూ కారుని చెట్టుకు గుద్దేసాడుట. డోర్ తెరుచుకుని తాతయ్య, చెట్టంత మనిషి అవతల పడ్డారుట. డ్రైవర్ ఆన్ ద స్పాట్ పోయాడుట.

పిల్లలు చీకట్లో ఏమయ్యారో తెలీదు… చిన్న తాతయ్యకి అద్దాలు పగిలి ఒళ్ళంతా గుచ్చుకుపోయాయిట. తాతయ్య పిల్లల పేర్లు బిగ్గరగా “పాపాయీ (మా అమ్మ), బాబూ (చిన తాతయ్య కొడుకు), పెద్ద పిల్లా (ఆయన కూతురే) అని పిలుస్తూ, లేవలేక చూసుకుంటే తొడ ఎముక బయటకి పొడుచుకు వచ్చిందట. దాన్ని ఒక్క గుద్దుతో లోపలికి తోసి, స్పృహ తప్పి పడిపోయారుట. శ్రీహరిరావు అంటే సింహం అనేవారుట ఆ రోజుల్లో.

చిన్న తాతయ్య మొండితనంలోనూ తాతయ్యకి తమ్ముడే. లేచి పిల్లల్ని వెతికితే, గడ్డిమేటులో పడి సురక్షితంగా ఉన్నప్పటికి, భయానికి బిగ్గరగా ఏడుస్తున్నారట. పాపం, అంతా పదేళ్ళ లోపు పసి పిల్లలు!

ఆయన అందరిలోకి చిన్నదాన్ని భుజాన వేసుకుని, మిగతావాళ్ళని నడిపిస్త్తూ కథలు చెప్తూ, దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్ళి, “మా అన్నయ్య ఫలాన చోట స్పృహ తప్పి వున్నాడు… ఏక్సిడెంట్ అయింది… చూసుకోండి” అని చెప్పి ఆంబులెన్స్ పంపించి, తను ఐదు మైళ్ళు నడుస్తూ తెల్లారేసరికి ఇంటికొచ్చి “వదినా” అని తలుపు తట్టి, ఆవిడ తలుపు తియ్యగానే పడిపోయాడుట! తాతయ్యని వాళ్ళు ఆస్పత్రిలో చేర్పించారు.

అమ్మమ్మ తక్కువదా? అతని ఒంటి నుండి కార్తున్న రక్తాన్ని శుభ్రపరిచి, పిల్లల ద్వారా జరిగిన విషయం విని, ఆయన్ని బోర్లా పడుకోపెట్టి, పంటితో లాంతరు వెలుగులో ఆ గాజు పెంకులన్నీ పీకి, పసుపూ, సున్నం పెట్టిందట. వాళ్ళు ఏం తిని, ఏ పాలు తాగి అంతంత మొండి ధైర్యంతో ఉన్నారో కానీ మమ్మల్ని మా అత్తగారింట్లో “ఏం మొండితనాలే? ఎక్కడి నుండొచ్చాయి?” అంటే ఇవన్నీ గుర్తొచ్చి కిసుక్కున నవ్వొస్తుంది!

“మేం పులి పాలతో పెరిగాం” అని మా ఆయనకి చెప్తూ ఉంటాను.

మా అమ్మమ్మ చెల్లెలు సత్యవతిని కూడా మేనరికమే ఇచ్చారు. అమ్మమ్మకి అందుకే మరిది కూడా చిన్నప్పటి నుండీ చనువే! వడ్డాది సత్యవతి అనబడే మా చిన్నమ్మమ్మ ‘రెన్ అండ్ మార్టిన్’ ఇంగ్లీషు గ్రామర్ క్లిష్టంగా వుందని, పిల్లల కోసం ఓ గ్రామర్ బుక్ సరళ శైలిలో రాసేసింది. అప్పటి ఆంగ్ల పరిజ్ఞానం, వాళ్ళు చదివిన చదువులూ అలాంటివి!

అమ్మమ్మ దగ్గర కొన్నాళ్ళు ఆవిడ మరిది సూరంపూడి జగ్గారావు ఉండేవాడుట. తాతయ్యతో ఓనాడు “నీళ్ళకి చాలా దూరం వెళ్ళాల్సొస్తోందండీ… ఎద్దడిగా ఉంది” అనగానే, తాతయ్య చేస్తున్న పని ఆపి, “జగ్గా! పలుగూ పారా పట్రా… బావి తవ్వుదాం” అని పెరట్లో  బావి తవ్వడం మొదలెట్టారుట.

అమ్మమ్మ లబలబలాడి “అయ్యో సోద్యం… పనివాళ్ళని పిలిపించండి” అంటే వినలేదుట. చేసేది లేక ఆవిడా గోచీ పోసిన చీర పైకి ఎగ్గట్టి మట్టి ఎత్తి పోస్తూ వుంటే, తెల్లారేసరికీ జలజలమని తియ్యటి నీరు పడిందట!

అప్పుడు కుమ్మరిని పిలిచి ఒరలు పెట్టించారుట తాతయ్య. ఆ బావి వీళ్ళకే కాదు, రామచంద్రాపురంలో చాలామందికి ఉపయోగపడిందిట.

మా తాతయ్యకి చెయ్యే కాదు నాలికా వాడే! మిత్రుడు మినిస్టర్ అయ్యాకా, ఓసారి హైదరాబాదొచ్చి, అతని నివాసానికెళ్ళారుట…

అతను “శ్రీహరిరావ్… నువ్వొచ్చావు… సంతోషం. కానీ గెస్ట్ రూమ్ ఖాళీ లేదు… ఎక్కడుంటావ్?” అన్నాడుట.

తాతయ్య పెద్దగా నవ్వి, “ఓరోరి… ముక్కామలలో వున్నప్పుడు మూడు గదుల ఇల్లు పుష్పక విమానంలా వుండేది… మినిస్టర్ అయి ఇన్ని గదులున్న బంగ్లా ఇచ్చాకా దరిద్రం పట్టిందేరా?” అనేసి వచ్చారుట.

తాతయ్య మొండితనం వల్ల అమ్మమ్మ చాలా బాధలు పడింది… కానీ ఆవిడ ఒప్పుకునేది కాదు.

లక్నో నుండొచ్చేసాకా శ్రీదేవీ, సత్యవతీ పుట్టారు. దుర్గాసావిత్రి కన్నా ముందు ఆవిడకి ఒకటి రెండు అబార్షన్‌లు కూడా అయ్యాయి. గర్భసంచి పుండు పడి, అప్పుడప్పుడూ నొప్పి వస్తుండేదిట. తాతయ్యకి లోకల్ డాక్టరు మదరాసు ‘ఎగ్మోర్’ హాస్పటల్‌లో చూపించమని సలహా ఇచ్చారుట.

తాతయ్య ఆఖరి పిల్ల సత్యవతినీ, అమ్మమ్మనీ తీసుకుని తిన్నగా ఎగ్మోర్ ఆస్పత్రికెళ్ళి, ఆవిడని ఎడ్మిట్ చేసి టంగుటూరి ప్రకాశం పంతులుగారు ట్రావెలర్స్ బంగ్లాలో ఉంటే ఆయన దగ్గర సత్యవతిని వదిలి చూస్తుండమని, ఏదో లాకప్ డెత్ కేసుందని తిరుపతి రేణిగుంట నుంచి వర్తమానం వస్తే అక్కడికి వెళ్ళిపోయారుట.

పిల్లకి ప్రకాశం పంతులుగారు అంగరంగ వైభవం జరిపించారు ముద్దు చేసి, బాగానే వుంది! అక్కడ అమ్మమ్మకి మూడు రోజులు ఆస్పత్రి వాళ్ళు భోజనం పెట్టారు. పెద్ద డాక్టరొచ్చి చూసి, ‘ఆపరేషన్ టుమారో’ అని రాసి వెళ్ళాకా, ఆస్పత్రి భోజనం నిలిపి వేసి, ఆపరేషన్ చేసేసారు.

ఆవిడకి తెలివొచ్చి చూసుకుంటే, లోపల పావడా మీద ఓణీలా ఖద్దరు తువ్వాలు కప్పి ఉంది! భాష రాదు… “మా ఆయన వచ్చాడా?” అంటే సైగలతో, “రాలేదు” అని చెయ్యి తిప్పి చూపించింది నర్స్. వంటి మీద చీర లేదు! తన పెట్టె ఎక్కడ పెట్టారో తెలీదు. ఆపరేషన్ అయ్యాకా గది మార్చేసారు! భోజనం లేదు… ఇంటి నుంచి పథ్యం తెస్తారని ఆస్పత్రి వాళ్ళు పెట్టలేదు! ఏం అడగాలో… ఎలా అడగాలో తెలీదు! ఆవిడ తన ఇష్టదైవమైన శ్రీరాముడ్ని ధ్యానిస్తూ కన్నీళ్ళతో గడిపిందట. నర్స్ ఒక రోజు మొత్తం చూసి, “నీ భర్త భోజనం తేలేదా?” అని తమిళంలో అడిగి, ఆవిడ ‘లేదు’ అంటే, తనే ఇడ్లీ తెప్పించి పెట్టిందట.

ఇడ్లీ తిని రమణమ్మ మంచినీళ్ళ కోసం పంపు దగ్గరికి నడిచి, నీళ్ళు తాగి కిటికీ లోంచి కిందకి చూస్తే తమతో బాటు లక్నో మజిలీలకి వచ్చిన మిత్రుడు గంజి సుబ్రమణ్యం కింద వెళ్తూ కనిపించాడుట!

ఈవిడకి ప్రాణాలు లేచి వచ్చి, “సుబ్రమణ్యం… సుబ్రమణ్యం” అని అరుస్తూ చప్పట్లు కొడితే, ఆయనకి వినిపించలేదు. కానీ చౌకీదార్ చూసి, ఆయన్ని గేట్ దగ్గర ఆపి, “ఆ పై అంతస్తు కిటికీలో ఓ స్త్రీ మిమ్మల్ని పిలుస్తోంది” అని చెప్పాడుట!

ఆయన పైకి చూసి గుర్తు పట్టకపోయినా, వెతుక్కుంటూ “ఎవరా?” అని వచ్చి చూస్తే అమ్మమ్మ వెక్కివెక్కి ఏడ్చేసిందట.

సుబ్రహ్మణ్యం “రమణమ్మా… ఈ పంతులు ఎంత పని చేసాడూ? నాకో మాట చెప్పొద్దూ వచ్చే ముందు? ఈయన దేశానికే కానీ నీకు పనికి రాడమ్మా… ఉండు!” అని తమిళంలో మాట్లాడి ఆవిడ పెట్టే, బట్టలూ తెప్పించి, భోజనం క్యారేజ్‌లో తెచ్చి ముందు కడుపు నిండా పెట్టాడుట. తర్వాత ట్రావెలర్స్ బంగ్లాకి వెళ్ళి పంతులు గారు అర్జెంట్ మీటింగ్‌కి వెళ్ళారని తెలుసుకుని, పాపాయిని తీసుకుని అమ్మమ్మ దగ్గరకొచ్చి చూపిస్తే, ఆవిడ పిల్లని కౌగిలించుకుని “భగవంతుడు నిన్ను పంపించాడు” అని ఏడ్చిందట.

తాతయ్య సుబ్రమణ్యం ఆస్పత్రిలో ఇచ్చిన అడ్రెస్ ప్రకారం అమ్మమ్మని వెతుక్కుంటూ వస్తే, “ఏం పని చేశావు పంతులూ?” అని సుబ్రమణ్యం కోపగిస్తే, “ఆ శ్రీరాముడిని ధ్యానించాను… నిన్ను పంపించాడుగా సమయానికి” అన్నారుట తాతయ్య!

ఇంకేం మాట్లాడుతారు ఎవరు మాత్రం?

(సశేషం)

Exit mobile version