[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]నా[/dropcap]కు రెండవసారి అమెరికా ప్రయాణం చేసే అవకాశం, మా తమ్ముడు లాంటి డొక్కా ఫణి వల్ల వచ్చింది. అతను అప్పటి ‘నాటా’ కల్చరల్ ఛైర్‌గా వున్న మాధవ్ దుర్బాకి చెప్పడం వల్ల మాధవ్ నాకు ఫోన్ చేసి నన్ను అట్లాంటాలో జరగనున్న నాటా మహాసభలకి ఇన్వైట్ చేస్తున్నట్లు చెప్పగానే చాలా ఆనందం కలిగింది. వీసా కూడా పదేళ్ళకి వుంది కదా, 2008లో వెళ్ళొచ్చాను, మళ్ళీ 2010లో వెళ్ళగలిగే అదృష్టం లభించింది.
మా అశ్విన్ తన కాన్వకేషన్ అయిన మరునాడే “అమ్మా, నేను ఇండియా తిరిగొచ్చేస్తాను” అన్నాడు. నేను “నీ ఇష్టం నాన్నా. We are here to support you” అన్నాను.
పిల్లలు అమెరికా వెళ్ళేది చదువుకోడానికే అని నమ్మాను కానీ, డాలర్ గుడ్లు పొదగడానికని నేనూ, మా ఆయనా ఎప్పుడూ అనుకోలేదు! వాడి ఈ నిర్ణయం వల్ల నా బంధువులూ, దగ్గర మిత్రులూ నన్ను చాలా సూటీపొటీ మాటలు అన్నారు. “‘అమ్మకూచి’లా తయ్యారు చేసావు, అందుకే వాడు వచ్చేస్తా అంటున్నాడు” అన్నారు.
నాకు తెలుసు! చిన్నప్పటి నుండీ నా పిల్లలకి నేను “మీకు ఇష్టమైనదే చదవాలి, ఇష్టమైనట్టే బ్రతకాలి, లోకుల మాటలు పట్టించుకోవద్దు” అని చెప్పాను. నేనూ అదే చేస్తాను. వాళ్ళు నన్ను చూసి అలాగే పెరిగారు. మా అబ్బాయి నాతో “ఏం సాధించాలి అమ్మా? అమెరికాలో వుండి పెళ్ళి చెసుకుని పిల్లల్ని కన్నాక, వాళ్ళకి ఈ దేశం పౌరసత్వం వస్తుంది. ఇంక కదలలేం, తల్లిదండ్రులకి నా పిల్లలని స్కైప్‌లో చూపించాలి, వాళ్ళకి ఏ అనారోగ్యం వచ్చినా, డబ్బులు పంపి ఎవరి సాయమో అర్థించాలి! తీరా సంపాదించేది ఏవైనా కోట్లా? తిరిగొచ్చాకా స్వదేశంలో ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్, ఇవన్నీ ఇక్కడా చెయ్యగలను… దానికి నేను దేశాన్నీ, ఫ్యామిలీనీ, నా చిన్ననాటి స్నేహితులనీ, జీవితాన్నీ పణం పెట్టాలా?” అన్నాడు.
మా స్నేహితుల్లో ఒకతను ఆర్డినరీ బి.కాం చదివి, ఆ రోజుల్లోనే అమెరికా వెళ్ళిపోవాలని కలలు కంటూ వుండేవాడు. ఆ కల సాకారం చేసుకోవడానికి అప్పట్లో అతను ఎంచుకున్న మార్గం, గ్రీన్‌కార్డ్ వున్న స్త్రీని వివాహం చేసుకోవడం, వెళ్ళి నానా తిప్పలు పడి అక్కడే సెటిల్ అయ్యాడు. ఆమెని పెళ్ళిలో చూసి, ఇతను చెప్పే కబుర్లకీ, అతని జీవిత భాగస్వామికీ పోలిక లేదని ఆశ్చర్యపోతే, అతను “కుచ్ పానా హైతో కుచ్ ఖోనా హై” అని జవాబిచ్చాడు! అదే ఇక్కడ మా అబ్బాయి రివర్స్‌లో చెప్పాడు, “కొన్ని కావాలి అనుకుంటే, కొన్ని వదులులోవాలి” కాదు, కొన్ని వదులుకుంటేనే కొన్ని దొరుకుతాయి… మొదట వదులుకోవడం నేర్చుకోవాలి లైఫ్‌లో… అన్ని అమెరికా సదుపాయాలు వదులుకుని ఇండియా వచ్చేసి, లక్ష రూపాయల జీతంలో కాకుండా, ఇరవై వేల శాలరీతో జీవితం మొదలుపెట్టాడు… ఇప్పుడు టాప్ పొజిషన్‌లో వున్నాడు. భార్యా, పిల్లాడూ, అటు అత్తగారూ, మావగారు… ఇటు అమ్మా నాన్నల మధ్య గారాబం, అన్నీ సౌకర్యవంతంగా వున్నాయి… కేవలం ఆ రోజు కాన్వకేషన్ మరునాడు ఆ డెసిషన్ తీసుకుని ‘అమ్మానాన్నలతో వుంటాను’ అనుకోవడం వల్ల.
నేను రెండవసారి అమెరికా వెళ్తున్నప్పుడు మాధవ్, “మీతో గరిపాటి నరసింహారావు గారూ, భువనకృతి అనే చిన్న పిల్లా, వేణుమాధవ్, ఏ.వి.ఎస్, గుండు హనుమంతరావూ, హేమా, శ్రీనివాసరెడ్దీ, స్వాతీ సోమనాథ్ వస్తారని చెప్పాడు. నేను గరికపాటిగారి పేరు విని, ఆయనకి ఎక్సైట్‌మెంట్‌తో ఫోన్ చేసా, ఆయన నాతో చాలా బాగా మాట్లాడారు. “ప్రయాణంలో ఇంకా చాలా మాట్లాడుకుందాం అమ్మా” అన్నారు. ఇందాక చెప్పినవాళ్ళలో స్వాతీ సోమనాథ్ నాకు డిగ్రీలో కస్తూరిబా గాంధీ కాలేజ్‌లో క్లాస్‌మేట్. మిగతా ఆర్టిస్టులు అందరూ మా సినిమాల్లో చేసినవాళ్ళే! మా అబ్బాయి ఫ్రెండ్ శ్యామా అనేవాడు, “నా ఫ్రెండ్ సృజలకృతి చెల్లెలు భువనకృతి అనే సింగర్, జీటీవీ సారెగమాపాలో పాడిన అమ్మాయి కూడా నాటాకి వెళ్తోంది, మీరు కొంచెం చూసుకోవాలి అంటీ” అని చెప్పాడు. ఆ తరువాత ఆ భువనకృతి నాన్నగారు గోపాలరావు గారు కూడా, మా తోటికోడలు డా. గీతాశర్మకి కొలీగ్, ఉస్మానియా యూనివర్సిటీలో మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ అని తెలిసింది.
ఈసారి అట్లాంటాకి కిరణ్ ప్రభ దంపతులు కూడా వస్తున్నట్టు తెలిసింది, కాలిఫోర్నియా నుండి. నేను చాలా ఆనందపడ్డాను. ఆ తరువాత వాళ్ళతో కలసి కాలిఫోర్నియా రావలసిందే. “అమెరికా ఎప్పుడొచ్చినా, మా ఇంటికి రాకుండా వెళ్ళకూడదు, ఇది మీ పుట్టిల్లు” అని కాంతిగారు చెప్పడంతో, నేను కిరణ్ ప్రభ గారికి డబ్బు పంపి, వాళ్ళతో బాటు అట్లాంటా నుండి రిటర్న్ టికెట్ ఓక్‌లాండ్ ఎయిర్‌పోర్ట్‌కి కొనిపించుకున్నాను.
ఈ సారి కూడా నేను ఫీనిక్స్ ప్రయాణం పెట్టుకున్నాను, మా మావయ్య కొడుకు శీను అక్కడ లేడు, డల్లాస్ వెళ్ళిపోయాడు. కానీ మా బాబాయ్ కొడుకు హరీష్ అక్కడ వుండడం వల్ల, హరీష్‌తో నేను ఏ డేట్‌కి వాడి దగ్గరకు వస్తానో ఫోన్‌లో చెప్పాను. హరీష్ మా బావ కూతురు సింధూర తేజనే పెళ్ళి చేసుకోవడంతో నాకు ఇద్దరూ చనువే!
వెళ్ళే రోజు వచ్చింది. అమ్మ మామూలుగానే మా ఇంట్లో వుండడానికి వచ్చింది. మా వారు జహీరాబాద్‌లో మహీంద్రాలో పని చేస్తారు కాబట్టి, వారానికి ఒక రోజు వస్తుండేవారు. నన్ను మా అబ్బాయీ, మా మేనల్లుడు శరత్ వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దింపారు. అప్పటికే అక్కడకొచ్చి వున్న భువనకృతి తల్లిదండ్రులూ, ఆమే కలిసారు. నాకు వారి అమ్మాయిని అప్పగించారు. జీ సారెగమపా లో కంటెస్ట్ చేసినప్పుడు భువనకృతి పాటలు నేను విన్నాను. ఆ తర్వాత, లోపలికెళ్తే, మా వాళ్ళంతా కనిపించారు. ఎటు చూసినా టాలీవుడ్ కమేడియన్సే! గరికపాటి గారు ప్రేమగా మాట్లాడారు. స్వాతి తప్ప మిగతా అంతా నాతో చాలా క్లోజ్‌గానే మెసిలారు.
నేను నడుముకి బెల్ట్ వలనా, నా బ్యాక్ ఏక్ వలనా, వీల్ ఛైర్ ఫెసిలిటి తీసుకున్నాను. భువనకృతి కూడా నాతో బాటే వుండొచ్చు! ఈ కారణాన మేం సెక్యూరిటీ లైన్స్‌లో వేణుమాధవ్, ఏ.వి.ఎస్.ల కామెడీ మిస్ అయ్యాం. గుండు హనుమంతరావు గారు నిమిషానికో పేరడీ కవిత్వం చెప్పేవారు.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో వేణుమాధవ్ వాళ్ళ అమ్మగారు పంపిన గారెలూ, అల్లం పచ్చడీ అందరూ తిన్నారట. నేనూ, భువనకృతీ సెపరేట్ సెక్యూరిటీ చెకిన్‌లో, లిఫ్ట్‌లో వెళ్ళడం వలన, అవి తినడం మిస్ అయ్యాం అని బాధపడ్డాడు వేణు. ఫ్లయిట్‌లో కూడా పైకి కిటికీలోంచి చూస్తూ, “నాన్నా… దగ్గరలో వున్నా, కానీ ఈసారి మీట్ అవడానికి కుదరదు… నెక్స్ట్ టైమ్ పక్కా నీ దగ్గరకి వస్తా…” అన్నాడు. “ఎవరితో?” అని నేను అడిగితే, “మా నాన్నతో” అన్నాడు.
నేనూ భువనకృతీ మధ్యలో వుండే నాలుగు సీట్లలో కూర్చున్నాం. మా పక్కన కూర్చుని ప్రయాణం చేసినావిడ, ఒకప్పటి ప్రముఖ సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి గారి అమ్మాయట. ఆవిడకి ఒక చెవ్వే వినిపిస్తుందని చెప్పింది. కమేడియన్స్‌లో శ్రీనివాసరెడ్డిని చూసి అమె చాలా ఆనందించింది! భువనకృతికి టీవీ పనిచెయ్యలేదు. తను తెచ్చుకున్న టాబ్ తోనే కాలక్షేపం చేసింది. మంచి పిల్ల. నేను నడుము నెప్పి వలన చాలా బాధపడ్డాను. ఉచితంగా నాటా వాళ్ళు టికెట్ పంపినా, నేను అప్‌గ్రేడ్ చేయించుకుని, బిజినెస్ క్లాస్ కొనుక్కోవచ్చు అన్న జ్ఞానం నాకు అప్పట్లో లేకపోయింది. నేను నడుం నొప్పి వలన ‘అనవసరంగా వచ్చాను’ అని విసుక్కుంటే, వేణుమాధవ్ నాతో “అమెరికా వెళ్ళడం… అదీ ఎవరో మనని గౌరవించి, ఉచితంగా టికెట్ పంపి, సగౌరవంగా ఆహ్వానించడం, ఎంత మందికి దక్కే అదృష్టం అండీ?… ఆనందించాలి కానీ, ఇలా రండి, ఆ సీట్లో నేను శ్రీనివాసరెడ్డీ అడ్జస్ట్ అవుతాం” అని నలుగురు కూర్చునే సీట్లో ఒక సీట్ ఖాళీ వుండడంతో, తనూ శ్రీనివాసరెడ్డి ఇటు మారి, నన్ను వాళ్ళిద్దరే కూర్చునే సీట్లో కాసేపు నడుం వాల్చే ఏర్పాటు చేసాడు.
ఇప్పుడు వేణు మాధవ్, ఏ.వి.ఎస్., గుండు హనుమంతరావు గార్లు లేరు. ఆ జ్ఞాపకాలు మిగిలాయి!
ఎందుకోగాని మధ్యలో మమ్మల్ని సామాను చెకిన్ చేసి, మళ్ళీ చెకౌట్ చెయ్యమన్నారు. వీల్ ఛైర్ కాబట్టి నాకు ఆ వీల్ ఛైర్ ఎటెండరీ అన్నీ తర్వత్వరగా చేయించాడు. నాతో బాటు భువనకృతికి కూడా. సరిగ్గా చేసాడో లేదో అని నాకు భయం వేసింది.
భువనకృతి తెచ్చుకున్న పెరుగన్నం, ఇమ్మిగ్రేషన్ లోపల తను పారెయ్యకపోవడంతో, కొంచెం దాని టెస్టింగూ, మాగాయ వల్ల వచ్చిన పై పొర వల్ల ఆ పెరుగన్నంలో బ్యాక్టీరియా వల్ల అనుమానాలతో కాసేపు మమ్మల్ని టెర్రరిస్టులని చూసినట్టు చూసారు! చివరకి ఆ బ్రూ సీసాలో వాళ్ళమ్మ గారిచ్చిన ‘మాగాయా పెరుగన్నం’ ట్రాష్‌బిన్‌లో పారేసి, లోపలికి పంపించారు!
ఇమ్మిగ్రేషన్‌లో నన్ను “ఎందుకు వెళ్తున్నారు?” అంటే, తెలుగు లిటరసీ సింపోజియం, అని ఆహ్వాన పత్రం చూపించాను. భువనకృతిని అడిగితే “సింగింగ్‌కి” అంది. అక్కడున్న అబ్బాయి, “ఏదో ఒక పాట పాడు” అనగానే, “నే తొలిసారిగా… నిను చూసినా…” అని అందుకోగానే… “ఇనఫ్… వెరీ గుడ్” అని నవ్వాడు. స్వాతి… “ఇంకా నయం… నన్ను ఆడమనీ, నిన్ను ఓ సినిమా కథ చెప్పమనీ అడగలేదు” అంది.
మా సూట్‌కేసులు మాత్రం అట్లాంటా రాలేదు. మా అందరికీ, టీ షర్టులూ, బ్రష్‌లూ, సాక్స్ చేతిలో పెట్టి ‘రేపొస్తాయి’ అన్నారు.
(సశేషం)