Site icon Sanchika

జీవన రమణీయం-103

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను కాస్త ఆలస్యంగానే నిద్ర లేచాను. కింద కలకలంగా వుంది. బాత్‌రూమ్‌కి వెళ్ళి, రాత్రి ఇన్సిడెంట్ గుర్తొచ్చి, బయట వైపునున్న గడియ లాక్ చేసుకుని, బ్రష్ చేసుకుని, బయటకి రాగానే, కింద నాలుగు బర్నర్ల మీద యుద్ధ ప్రాతిపదిక మీద వంట అవుతోంది. “రమణీ గారూ… నన్ను గుర్తు పట్టారా?” అంది ఒకావిడ, సాంబారులో ఇంగువ పోపు దట్టిస్తూ. నేను ఒకసారి జీవితంలో కలిసిన వాళ్ళని సాధారణంగా మరిచిపోను! కాస్త ఆలోచించాల్సొచ్చింది…

ఆవిడ సుజాతా ఈమని. స్వరూప్ భార్య. ఈ స్వరూప్ ఎవరంటే, మా ‘బాబాయ్ హోటల్’, ‘బోయ్ ఫ్రెండ్’ సినిమాల్లో హీరో, సాయికృష్ణకి ఫ్రెండ్. ఇతను ఇంజనీరు, గ్రాఫిక్ డిజైనింగ్‍లో స్పెషలైజ్ చేసాడు. నేను వీరేంద్రనాథ్ గారి గెస్ట్‌హౌస్ కపాడియా లైన్‌లో వుండేది, అమృత్ అపార్ట్‌మెంట్స్‌లో అని చెప్పాగా! అప్పుడు సాయికృష్ణా వాళ్ళూ ఆ పైన ఫ్లోర్‌లో వుండేవారు. అప్పుడు వాళ్ళకి ఈ స్వరూప్, సుజాతా నైబర్స్. వాళ్ళకి అప్పట్లో ఓ పాపే వుండేది. మా సాయిని చూసి, “నా బోయ్ ఫ్రెండ్” అనేది. ఆ స్వరూప్‌ని సాయి తీసుకెళ్ళి, మా ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావుగారి క్రియేటివ్ కమర్షియల్స్‌లో, గ్రాఫిక్ డిజైనర్‌గా వుద్యోగం ఇప్పించాడు. సాయి వాళ్ళమ్మగారు అలివేలు గారికి నేను పెద్ద కూతురితో సమానం. అలాగే ఈ సుజాత కూడా సాయి చెల్లెలు బీనాకీ, ఆంటీకీ క్లోజ్! అంత బాదారాయణ సంబంధం వుంది ఈ సుజాతా ఈమనితో నాకు! సాధారణంగా నాకు తెలీని వాళ్ళు ప్రపంచంలో వుండరని మా కిరణ్ ప్రభ గారు అంటూ వుంటారు.

నేను కిందకి దిగొచ్చి “వాట్ ఏ సర్‌ప్రైజ్?” అని సుజాతని కౌగిలించుకున్నాను. “ఇంకో సర్‌ప్రైజ్ ఇవ్వనా?” అంది సుజాత. “ఏమిటీ?” అన్నాను. “ఉమ… అదే దోనేపూడి బ్రహ్మయ్య గారి అమ్మాయి, నీకు క్లోజ్ ఫ్రెండ్‌గా, f.b.లో చూసాను. అదీ నేను మెడ్రాస్‌లో క్లాస్‌మేట్స్‌మి!” అంది. “World is so small కదా!” అన్నాను. మా ఉమా, విజయా దోనేపూడి బ్రహ్మయ్యగారనే ప్రముఖ నిర్మాత పిల్లలు. అ విజయ కూతురే పి.వి. సింధూ, మన దేశ కీర్తి కిరీటం అని చెప్పుకున్నాంగా! ఈ సుజాత, గాయత్రి ఆఫీస్‌కి వెళ్తే పాపని చూసేదట. బాగా ఫ్రెండ్స్‌ట. స్వరూప్‌ని వీళ్లు సతీష్ అని పిలుస్తున్నారు. అతనేం మారలేదు. సన్నగా, పొడుగ్గా, కళ్ళద్దాలతో అలాగే వున్నాడు. సుజాత మాత్రం నాలాగే లావు అయింది. ఇంక సుజాత అయితే గాయత్రి కన్నా కబుర్ల పోగు! రక్తకన్నీరు నాగభూషణం గారి రెండవ భార్య సీతగారి అమ్మాయి భువనేశ్వరి, మా కెమెరామెన్ కమ్ డైరక్టర్ మీర్ హుస్సేన్‌గారి భార్య కదా! ఆ భువన కూడా ఈ సుజాతకి మెడ్రాస్‌లో బాల్య స్నేహితురాలు. హైదరాబాద్‌లో కూడా మీర్ గారూ, భువనా సుజాతా వాళ్ళుండే అమృత్ అపార్ట్‌మెంట్స్‌లోనే వుండేవారు! అసలు సినిమా ఫీల్డులో ఆనాటి నటుల ఫ్యామిలీస్ గురించి సుజాతకి తెలీని విషయం లేదు! అందరూ తెలుసంటుంది…

కిరణ్ ప్రభ దంపతులు, ఫణి డొక్కా, గాయత్రిగార్లతో రచయిత్రి

వంట చేస్తూ మధ్య మధ్యలో వచ్చి గాయత్రి, “అక్కా, I love gossips… సినీ ఫీల్డు గురించి చెప్పవా?” అనేది. పల్లవి అయితే అప్పుడే వస్తున్న బన్నీ సినిమాలు దేశముదురు లాంటివి చూసి ఫ్యాన్ అయిపోయిందట. “రమణీ ఆంటీ, విల్ యూ షో మీ అల్లు అర్జున్?” అని అడగడం మొదలుపెట్టింది. నేను అరవింద్ గారికి ఈ విషయం ఫోన్‌లో చెప్తే, “పాప వచ్చినప్పుడు తప్పకుండా బన్నీని కలిపిద్దాం” అన్నారు. ఆ ప్రామిస్ ఇంకా నేను నెరవేర్చలేదు! పల్లవి ఓ సారి వచ్చి వెళ్ళింది కానీ, హైద్రాబాద్ రాలేదు.

వీళ్ళంతా యుద్ధ ప్రాతిపదిక మీద వంట ఎందుకు చేస్తున్నారంటే, చాలా మంది భోజనానికొస్తున్నారు అని తెలిసింది.  నేను గాయత్రితో రాత్రి ఇన్సిడెంట్ చెప్పి, “ఎవరావిడ?” అని అడిగాను. గాయత్రి చాలా సిగ్గుపడిపోయి, “సారీ అక్కా… అలా జరుగుతుందని అనుకోలేదు. మా వారి తాలుకూ బంధువు ఆవిడ. దగ్గరలోనే ఉంటారు. మేరియట్ ఇచ్చారు ఎకామిడేషన్‌కి… కాని మేం వున్నాం అని ఓ పూట ముందొచ్చారు, పైగా శీనుతో బాటు ఆవిడా పాట పాడ్తున్నారు, ఆ రిహార్సల్స్ కోసం” అంది. ఆవిడ అక్కడ దగ్గర్లో వూర్లో బ్యాంక్‌లో పని చేస్తుందిట.

ఆవిడ భర్త చాలా సూట్స్ హేంగర్స్‌కి వేసి, మెట్లు ఎక్కి తీసుకెళ్తుంటే, నేను గాయత్రితో, “ఆర్ యూ ష్యూర్? ఒక్క పూటే వుంటారా?” అంటే, గాయత్రి చాలా నవ్వింది.

ఫణీ, రాధికగారూ రిహార్సల్స్‌కి వెళ్ళి వచ్చారు. ఈలోగా నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి కొన్ని ఫోటోలు తీసుకున్నాను. వీళ్ళు పాడే పాటలకి మ్యూజిక్ చేసిన శీనీ ప్రభల గారూ, వాళ్ళ ఆవిడా వచ్చారు. ఆ అమ్మాయి తల్లి సుభద్ర గారని నాకు ‘రాగసప్తస్వరం’ ఆర్గనైజేషన్‌లో కోమెంబర్‌గా పరిచయం. ఆవిడ కూడా నాటా చూడ్డానికి భారతదేశం నుండి వచ్చారని వాళ్ళ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి వీడియో తీసి ఎడిట్ చేస్తాను అని చెప్పింది, మా లిటరరీ ప్రోగ్రాం మొత్తం. ముఖ్యంగా గరికపాటి వారి అవధానం. అందులో మా ఫణి అసందర్భం కూడానూ.

ఇంతలో మాధవ్, అపర్ణా పిల్లలని తీసుకుని వచ్చారు. అపర్ణ గారెలు, దోసకాయ పచ్చడితో పాటు అరిసెలు తీసుకొచ్చి “మీ వదినగారు, లక్ష్మీపార్వతిగారు తెచ్చారు” అని చెప్పింది.

లక్ష్మీపార్వతిగారు, కాంతి గారితో రచయిత్రి

లక్ష్మీపార్వతి గారిని నేను ‘వదినా’ అని పిలుస్తాను. నేను అటుగా వెళ్తున్నాను అని తెలిస్తె, భోజనం పెట్టకుండా పంపదు! మా స్నేహితులు డా. మోహనవంశీని కూడా నేనే వాళ్ళింటికి తీసుకెళ్ళి పరిచయం చేసాను. అతనికి NTR అంటే విపరీతమైన భక్తి. ఆయన కూర్చుని భోం చేసిన డైనింగ్ టేబుల్, పడుకున్న మంచం లాంటివి చూసి ఆనందంతో ‘కళ్ళు చెమర్చాయి’ ఆయనకి. ఆ రోజు లక్ష్మీపార్వతి ఆయన్ని “మా అబ్బాయి కోటీశ్వర ప్రసాద్ కూడా డాక్టరే, ఆర్థోపిడీషియన్, మీ దగ్గర ఒమెగాలో పెట్టుకోండి బాబూ” అని రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మా డాక్టర్ వంశీ దగ్గరే పని చేస్తున్నాడు. ఆవిడకి నావల్ల వుపకారం జరిగిందని నేనంటే ప్రేమ. నన్ను పిలిచి ఆడపడుచని చీరలు కూడా పెడ్తూ వుంటుంది.

గాయత్రికి ‘అమ్మాస్ కిచెన్’ అని ఓ కల్పవృక్షం వుంది అట్లాంటాలో. అక్కడి నుండి పనసపొట్టు కూరా, గుత్తి వంకాయ కురా, పులిహోరా, పాయసం, బొబ్బట్లూ తెప్పించింది. తను సాంబారూ, అన్నం, పెరుగూ రెడీ చేసింది. అపర్ణ తెచ్చిన దోసకాయ పచ్చడీ, కొత్తావకాయా, గారెలు, అరిసెలతో విందు చాలా పసందుగా జరిగింది. మాధవ్, నేనూ, ఫణీ సమాన స్థాయిలో హాస్యంగా మాట్లాడుకుంటూ, విట్లు పేల్చుకుంటూ, మధ్యలో రాధిక గారొస్తే… “మీరే బూత్‌లో రిజిస్టర్ చేసారు?” అని ఫణి అడిగాడు. పెళ్ళి సంబంధాలకీ, మిగతా ఫోరమ్స్‌కి బూతులు పెట్టారు. “I don’t like jokes” అందావిడ. నేను తగు జాగ్రత్తల్లో మెసిలాను. ఆవిడతో జోక్ వెయ్యలేదు! ఆ ట్రిప్‌లో నేను ఫణి ఇంట్లో వున్నది ఒకటే పూట కానీ, గాయత్రీ, పల్లవీ కూడా నాకు ఎన్నో ఏళ్ళుగా పరిచయంలా అయిపోయారు!

(సశేషం)

Exit mobile version